లేఖనములు
2 నీఫై 8


8వ అధ్యాయము

జేకబ్ యెషయా గ్రంథము నుండి చదువుటను కొనసాగించును: అంత్యదినములలో ప్రభువు సీయోనును ఆదరించి, ఇశ్రాయేలును చేరదీయును—విమోచింపబడిన వారు గొప్ప ఆనందముతో సీయోనుకు వచ్చెదరు—యెషయా 51 మరియు 52:1–2 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి, మీరు ఏ గుంటనుండి త్రవ్వబడితిరో దాని ఆలోచించుడి.

2 మీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించుడి, మిమ్ములను కనిన శారాను గూర్చి ఆలోచించుడి; నేను అతడిని మాత్రమే పిలిచి, ఆశీర్వదించితిని.

3 ప్రభువు సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు, దాని యెడారి భూములు ప్రభువు తోటవలెనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును.

4 నా ప్రజలారా, నా మాట ఆలకించుడి; నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి; ఉపదేశము నాయొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును.

5 నేను ఏర్పరచు నా నీతి సమీపముగా నున్నది; నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు.

6 ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి; అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలే పాతగిలిపోవును; అందలి నివాసులు అటువలె చనిపోవుదురు. కానీ నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు.

7 నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి. నా చట్టమును మీ హృదయమందు నాచేత వ్రాయబడియున్న జనులారా, ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులుపడకుడి.

8 వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మెట వారిని కొరికివేయును, బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును.

9 ప్రభువు యొక్క బాహువా, లెమ్ము లెమ్ము! బలము తొడుగుకొమ్ము; పూర్వపుకాలములలో లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? ఘటసర్పమును పొడిచినవాడవు నీవే గదా?

10 అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా? విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా?

11 ప్రభువు విమోచించిన వారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు; నిత్యసంతోషము, పరిశుద్ధత వారి తలలమీద ఉండును; వారు సంతోషానందము గలవారగుదురు; దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

12 నేను అనగా నేనే మిమ్మునోదార్చువాడను. ఇదిగో నీవు చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు?

13 బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు, ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన నీ సృష్టికర్తయైన ప్రభువును మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయెను?

14 క్రుంగబడినవాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు.

15 కానీ, నేను నీ దేవుడనైన ప్రభువును, కెరటములు ఘోషించునట్లు చేయువాడను, సైన్యముల కధిపతియగు ప్రభువు అని నాకు పేరు.

16 నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును, నా జనము నీవేయని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను.

17 యెరూషలేమా, లెమ్ము లెమ్ము. ప్రభువు క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.

18 ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారిచూప గలవాడెవడును లేకపోయెను; ఆమె పెంచిన కుమారులందరిలో ఆమె చేయిపట్టుకొను వాడెవడును లేకపోయెను.

19 ఈ ఇద్దరు కుమారులు నీయొద్దకు వచ్చియున్నారు, నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు మరియు ఖడ్గము నీకు ప్రాప్తించెను, నేను నిన్నెట్లు ఓదార్చుదును?

20 ఈ ఇద్దరు తప్ప, నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు; దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు; ప్రభువు క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు.

21 ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము:

22 నీ ప్రభువైన దేవుడు, తన జనులనిమిత్తము వ్యాజ్యెమాడు నీ ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఇదిగో తూలిపడజేయు పాత్రను నా క్రోధపాత్ర యొక్క మడ్డిని నీ చేతిలో నుండి తీసివేసియున్నాను. నీవికను దానిలోనిది త్రాగవు.

23 కానీ, నిన్ను బాధపరచువారిచేతిలో దానిని పెట్టెదను; మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా.

24 సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము; పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము; ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

25 ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసుకొనుము.