లేఖనములు
2 నీఫై 16


16వ అధ్యాయము

యెషయా ప్రభువును చూచును—యెషయా పాపములు క్షమించబడును—అతడు ప్రవచించుటకు పిలువబడును—క్రీస్తు బోధలను యూదులు తిరస్కరించుటను గూర్చి అతడు ప్రవచించును—ఒక శేషము తిరిగి వచ్చును—యెషయా 6 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 రాజైన ఉజ్జియా మృతిచెందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.

2 ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను; ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.

3 వారు—సైన్యములకధిపతియగు ప్రభువు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.

4 వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమముతో నిండెను.

5 అప్పుడు నేను—అయ్యో, నాకు ఆపద; నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్య నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు ప్రభువును నేను కన్నులారా చూచితిననుకొంటిని.

6 అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరివచ్చి,

7 నా నోటికి దానిని తగిలించి—ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను.

8 అప్పుడు—నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను—చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా,

9 ఆయన ఇట్లనెను: నీవు పోయి ఈ జనులతో మీరు నిజముగా వినుడి అని చెప్పుము గాని వారు గ్రహింపకుందురు; మీరు నిజముగా చూడుడి అని చెప్పుము గాని వారు తెలుసుకొనకుందురు.

10 వారు కన్నులతోచూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుము.

11 అప్పుడు ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేనడుగగా ఆయన ఇట్లనెను: నివాసులులేక పట్టణములును, మనుష్యులులేక ఇండ్లును పాడగువరకును దేశము బొత్తిగా బీడగువరకును;

12 ప్రభువు మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగువరకును ఆలాగున జరుగును.

13 ఇంకను పదియవ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర, మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలెనుండును; అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.