లేఖనములు
2 నీఫై 14


14వ అధ్యాయము

సీయోనుయు ఆమె కుమార్తెలును వెయ్యేళ్ళ పరిపాలనలో విమోచింపబడి శుద్ధి చేయబడుదురు—యెషయా 4 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని—మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు.

2 ఆ దినమున ప్రభువు చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును.

3 సీయోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

4 తీర్పుతీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు,

5 సీయోను కొండలోని ప్రతి నివాస స్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును ప్రభువు కలుగజేయును; సీయోను మహిమ అంతటి మీద కాపుదల ఉండును.

6 పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను గుడారమొకటి యుండును.