లేఖనములు
2 నీఫై 24


24వ అధ్యాయము

ఇశ్రాయేలు సమకూర్చబడును మరియు వెయ్యేళ్ళు సమాధానమును అనుభవించును—లూసిఫరు తిరుగుబాటు నిమిత్తము పరలోకము నుండి వెళ్ళగొట్టబడెను—ఇశ్రాయేలు బబులోను (లోకము) పై గెలుపొందును—యెషయా 14 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఏలయనగా ప్రభువు యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును; పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు.

2 జనములు వారిని భూమి అంచులనుండి అయినట్లుగా దూరము నుండి తీసుకొనివచ్చి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు; వారు తమ వాగ్దానదేశములకు తిరిగి వచ్చెదరు. ఇశ్రాయేలు వంశస్థులు ప్రభువు దేశములోని వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచుకొందురు, వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి, తమ్మును బాధించిన వారిని ఏలుదురు.

3 ఆ దినమున నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయించబడిన కఠినదాస్యమును కొట్టివేసి ప్రభువు నిన్ను విశ్రమింపజేయును.

4 ఆ దినమందు నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు: బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? బంగారు పట్టణము ఎట్లు నాశనమాయెను?

5 దుష్టుల దుడ్డుకర్రను, ఏలికల రాజదండమును ప్రభువు విరుగగొట్టియున్నాడు.

6 విడువకుండా క్రూరముగా కొట్టినవాడు, జనములను కోపముతో ఏలినవాడు హింసించబడుచున్నాడు, మరియు ఎవడును అడ్డగించడు.

7 భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది; జనములు పాడసాగుదురు.

8 నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును.

9 నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది; అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది; భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులందరిని వారి వారి సింహాసనముల మీదనుండి లేపుచున్నది.

10 వారందరు నిన్ను చూచి—నీవును మావలే బలహీనుడవైతివా? నీవును మాబోటి వాడవైతివా? అందురు.

11 నీ మహాత్మ్యము పాతాళమున పడవేయబడెను; నీ స్వర మండలముల స్వరము వినబడలేదు; నీ క్రింద పురుగు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును.

12 తేజోపుత్రుడవైన ఓ లూసిఫరు, నీవెట్లు పరలోకము నుండి పడితివి? జనములను బలహీనపరచిన నీవు నేలమట్టము వరకు నరకబడితివా?

13 నేను ఆకాశమున కెక్కిపోయెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము మీద కూర్చుందును.

14 మేఘ మండలము మీదికెక్కుదును; మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

16 నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు: భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా?

17 లోకమును అరణ్యముగా చేసి దాని పట్టణములను నాశనము చేసినవాడు మరియు తాను చెరపట్టిన వారిని తమ నివాసస్థలమునకు పోనియ్యనివాడు ఇతడేనా?

18 జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు.

19 నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె ఉన్నావు. ఖడ్గము చేత పొడువబడి, చచ్చినవారి శవములతో కప్పబడిన వాడవైతివి; త్రొక్కబడిన పీనుగు వలెనైతివి; బిలము యొక్క రాళ్ళ యొద్దకు దిగుచున్న వాని వలెనున్నావు;

20 నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి, నీవు సమాధిలో వారితోకూడా కలిసియుండవు; దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు.

21 వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి.

22 సైన్యములకధిపతియగు ప్రభువు వాక్కు ఇదే—నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును, శేషమును, కుమారుడిని, మేనల్లుడిని కొట్టివేసెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

23 నేను దానిని తుంపొడిపక్షికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును; నాశనమను చీపురుకట్టతో దానిని తుడిచివేయుదునని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

24 సైన్యములకధిపతియగు ప్రభువు ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును; నేను యోచించినట్లు స్థిరపడును—

25 నా దేశములోనికి అష్షూరును తెచ్చెదను మరియు నా పర్వతముల మీద వానిని నలుగద్రొక్కెదను; అప్పుడు వాని కాడి నా జనుల మీదనుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగిపోవును.

26 సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే; జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే.

27 ఏలయనగా సైన్యములకధిపతియగు ప్రభువు దానిని నియమించియున్నాడు. రద్దుపరచగల వాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దానిని త్రిప్పగలవాడెవడు?

28 రాజైన ఆహాజు మరణించిన సంవత్సరమందు వచ్చిన దేవోక్తి—

29 ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషించకుము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును మరియు దాని ఫలము భయంకరమైన ఎగిరే సర్పము.

30 అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు; నేను కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును.

31 గుమ్మమా ప్రలాపించుము, పట్టణమా అంగలార్చుము; ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయియున్నావు; ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది; వచ్చువారి పటాలములలో వదిలివేయబడినవాడు ఒకడును లేడు.

32 జనముల దూతల కియ్యవలసిన ప్రత్యుత్తరమేది? ప్రభువు సీయోనును స్థాపించియున్నాడు మరియు ఆయన జనులలో బీదవారు దానిని ఆశ్రయింతురు అని చెప్పవలెను.