లేఖనములు
2 నీఫై 12


12వ అధ్యాయము

యెషయా కడవరి దిన దేవాలయమును, ఇశ్రాయేలు సమకూడికను, వెయ్యేళ్ళ తీర్పును, సమాధానమును చూచును—గర్విష్ఠులు మరియు దుష్టులు రెండవ రాకడ యందు అణిచివేయబడుదురు—యెషయా 2 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి—

2 అంత్యదినములలో ప్రభువు మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త జనములు దానిలోనికి వచ్చెదరు.

3 ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి ప్రభువు వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు ప్రభువు పర్వతమునకు మనము వెళ్ళుదము రండి; ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.

4 ఆయన జనముల మధ్య తీర్పుతీర్చును మరియు అనేకమంది జనులను గద్దించును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదరు—జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును.

5 యాకోబు వంశస్థులారా రండి, మనము ప్రభువు వెలుగులో నడుచుకొందము; రండి, ఏలయనగా మీరందరు త్రోవ తప్పి, ప్రతివాడు తన దుష్టమార్గములకు తొలిగెను.

6 ఓ ప్రభువా, యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొనియున్నారు, వారు ఫిలిష్తీయుల వలే సోదెగాండ్రను ఆలకించుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు.

7 వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది; వారి నిధులకు మితిలేదు; వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది; వారి రథములకు మితిలేదు.

8 వారి దేశము విగ్రహములతో నిండియున్నది; వారు తమ చేతి పనిని, తాము వ్రేళ్ళతో చేసిన దానిని ఆరాధింతురు.

9 అల్పుడు తలవంచడు, ఘనుడు తనను తాను తగ్గించుకొనడు, కాబట్టి వారిని క్షమించకుము.

10 దుష్టులైన మీరు, బండ సందులోనికి ప్రవేశించుడి మంటిలో దాగియుండుడి, ఏలయనగా ప్రభువు యొక్క భయము, ఆయన ప్రభావమాహాత్మ్యము మిమ్ములను కొట్టును.

11 అప్పుడు నరుని అహంకార దృష్టి తగ్గించబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును, ఆ దినమున ప్రభువు మాత్రమే ఘనత వహించును.

12 జనములన్నిటిపైకి సైన్యములకధిపతియగు ప్రభువు దినము త్వరలో వచ్చును, అనగా ప్రతివానిపైకి, ముఖ్యముగా గర్విష్ఠులు అహంకారులపైకి, హెచ్చించుకొను ప్రతివానిపైకి వచ్చును మరియు అతడు అణగద్రొక్కబడును.

13 అహంకారాతిశయము గల లెబానోను దేవదారు వృక్షములు, బాషాను సింధూర వృక్షములన్నిటిపైకి;

14 ఎత్తైన పర్వతములు, కొండలు, గర్విష్ఠులైన జనములన్నిటిపైకి, ప్రతి ఒక్కరిపైకి;

15 ఎత్తైన ప్రతి గోపురము, ప్రతి కోట గోడపైకి;

16 సముద్రపు ఓడలు, తర్షీషు ఓడలు, రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటిపైకి ప్రభువు యొక్క దినము వచ్చును.

17 అప్పుడు నరుని అహంకారము తగ్గించబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును; ఆ దినమున ప్రభువు మాత్రమే ఘనత వహించును.

18 విగ్రహములను ఆయన పూర్తిగా నాశనము చేయును.

19 ఆయన భూమిని గజగజ వణికింప లేచునప్పుడు, వారు కొండల గుహలలో, నేల బొరియలలో దూరుదురు, ఏలయనగా ప్రభువు యొక్క భయము వారిపై వచ్చును, ఆయన ప్రభావమాహాత్మ్యము వారిని కొట్టును.

20 ఆ దినమందు ఒక మనుష్యుడు తాను ఆరాధించుటకు చేసుకొనిన వెండి విగ్రహములను బంగారు విగ్రహములను అడవి ఎలుకలకు గబ్బిలములకు పారవేసి,

21 కొండల గుహలలోను బండ సందులలోను దూరవలెనని ఆశించును; ఏలయనగా, ఆయన భూమిని గజగజ వణికింప లేచునప్పుడు, ప్రభువు యొక్క భయము వారిపై వచ్చును, ఆయన ప్రభావమాహాత్మ్యము వారిని కొట్టును.

22 తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగియున్న నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును?