లేఖనములు
2 నీఫై 29


29వ అధ్యాయము

అన్యజనులు అనేకులు మోర్మన్‌ గ్రంథమును తిరస్కరించెదరు—మాకు మరొక బైబిలు అవసరం లేదని వారు చెప్పుదురు—ప్రభువు అనేక జనములతో మాట్లాడును—గ్రంథములయందు వ్రాయబడిన దానిని బట్టి ఆయన లోకమును తీర్పుతీర్చును. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 కానీ అక్కడ అనేకులుందురు—నేను వారి మధ్య ఒక ఆశ్చర్యకార్యమును చేయుటకు ముందుకుసాగు దినమున నరుల సంతానమునకు నేను చేసియున్న నా నిబంధనలను జ్ఞాపకము చేసుకొనునట్లు ఇశ్రాయేలు వంశస్థులైన నా జనులను తిరిగి సంపాదించుటకు రెండవ పర్యాయము తిరిగి నా చేయిని నేను ముందుకు చాపెదను;

2 మీ సంతానమును జ్ఞాపకము చేసుకొందుననియు నా నోటినుండి వెలువడి మీ వంశస్థులచే వ్రాయబడిన మాటలు మీ సంతానము కొరకు ముందుకు వెళ్ళవలెననియు నా మాటలు ఇశ్రాయేలు వంశస్థులైన నా జనులకు ఒక ధ్వజముగా ఉండుటకు భూమి అంచుల వరకు తీక్షణముగా వెళ్ళుననియు నీఫైయను నీకు మరియు నీ తండ్రికి కూడా నేను చేసిన వాగ్దానములను నేను జ్ఞాపకముంచుకొందును;

3 నా మాటలు తీక్షణముగా వెళ్ళుట వలన—అన్యజనులనేకులు ఇట్లు చెప్పుదురు: బైబిలు! బైబిలు! మేము ఒక బైబిలును కలిగియున్నాము, మరొక బైబిలు ఉండజాలదు.

4 కానీ ప్రభువైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: మూర్ఖులారా, వారు ఒక బైబి‌లును కలిగియుందురు; అది నా ప్రాచీన నిబంధన జనమైన యూదుల నుండి బయలుదేరును. వారి నుండి పొందియున్న బైబిలు నిమిత్తము వారు యూదులకు ఏమి కృతజ్ఞత తెలియజేసిరి? అన్యజనుల ఉద్దేశ్యమేమి? వారు యూదుల వేదనలు, శ్రమలు, బాధలను మరియు అన్యజనులకు రక్షణ తెచ్చుటలో నా యెడల వారి శ్రద్ధను జ్ఞాపకము చేసుకొనుచున్నారా?

5 ఓ అన్యజనులారా, మీరు నా ప్రాచీన నిబంధన జనమైన యూదులను జ్ఞాపకము చేసుకొనియున్నారా? లేదు; కానీ మీరు వారిని శపించి, ద్వేషించితిరి మరియు వారిని పునఃస్థాపించుటకు ప్రయత్నించలేదు. కానీ ఇదిగో, నేను వీటన్నిటిని మీపైకి వచ్చునట్లు చేసెదను; ఏలయనగా ప్రభువైన నేను నా జనులను మరచిపోలేదు.

6 బైబిలు, ఒక బైబిలును మేము కలిగియున్నాము, మాకు మరొక బైబిలు అవసరం లేదు అని చెప్పు మూర్ఖులారా, యూదుల ద్వారా కాని యెడల మీరు బైబిలును ఎట్లు పొందితిరి?

7 ఒకటి కంటే ఎక్కువ జనములున్నవని మీరెరుగరా? నేను, మీ దేవుడనైన ప్రభువును మనుష్యులందరినీ సృష్టించితిననియు సముద్ర ద్వీపములపై ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొందుననియు పైన పరలోకములందు, క్రింద భూమి యందు పరిపాలన చేయుదుననియు నరుల సంతానమునకు, అనగా భూమి యొక్క సమస్త జనములకు నా వాక్యమును తెచ్చెదననియు మీరెరుగరా?

8 నా వాక్యమును ఎక్కువగా పొందబోవుచున్నందుకు మీరు సణుగుచున్నారా? నేనే దేవుడనని రెండు జనముల సాక్ష్యము మీకు ఒక నిదర్శనమని, నేను ఒక జనము వలే మరియొక జనమును జ్ఞాపకము చేసుకొందునని మీరెరుగరా? అందువలన నేను ఒక జనముతో మాట్లాడిన విధముగానే మరియొక దానితో మాట్లాడుదును. రెండు జనములు కలిసినప్పుడు రెండు జనముల సాక్ష్యము కూడా కలియును.

9 నేను నిన్న, నేడు మరియు నిరంతరము ఒకే రీతిగా ఉన్నానని అనేకులకు ఋజువు చేయుటకు నేనిది చేయుచున్నాను; నా ఇష్ట ప్రకారము నేను మాట్లాడుదును. నేను ఒక మాటను పలికియున్న కారణంగా మరియొకటి మాట్లాడనని మీరు అనుకొనరాదు; ఏలయనగా నా పని ఇంకను పూర్తి కాలేదు, మనుష్యుని అంతము వచ్చువరకు కూడా పూర్తి కాదు, ఆ సమయము నుండి మొదలుకొని ఎన్నటికీ పూర్తి కాదు.

10 కావున మీరు ఒక బైబిలును కలిగియున్నందున అది నా మాటలన్నింటిని కలిగియున్నదని అనుకొనరాదు; లేదా నేను ఎక్కువగా వ్రాయబడునట్లు చేయలేదని మీరు అనుకొనరాదు.

11 ఏలయనగా నేను వారితో పలుకు మాటలను వ్రాయవలెనని తూర్పున, పశ్చిమమున, ఉత్తరమున, దక్షిణమున మరియు సముద్ర ద్వీపముల యందు ఉన్న మనుష్యులందరిని నేను ఆజ్ఞాపించెదను. ఏలయనగా గ్రంథముల యందు వ్రాయబడు వాటిని బట్టి లోకమునకు నేను తీర్పు తీర్చెదను, వ్రాయబడిన దాని ప్రకారము వారి క్రియలను బట్టి ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చెదను.

12 నేను యూదులతో మాట్లాడుదును, వారు దానిని వ్రాయుదురు; నేను నీఫైయులతో మాట్లాడుదును, వారు దానిని వ్రాయుదురు; నేను దూరముగా నడిపించియున్న ఇశ్రాయేలు వంశము యొక్క ఇతర గోత్రములతో మాట్లాడుదును, వారు దానిని వ్రాయుదురు; నేను భూమి యొక్క సమస్త జనములతో కూడా మాట్లాడుదును, వారు దానిని వ్రాయుదురు.

13 అప్పుడు నీఫైయుల మాటలను యూదులు, యూదుల మాటలను నీఫైయులు కలిగియుందురు; నీఫైయులు మరియు యూదులు ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గోత్రముల యొక్క మాటలను, ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గోత్రముల వారు యూదులు మరియు నీఫైయుల మాటలను కలిగియుందురు.

14 ఇశ్రాయేలు వంశస్థులైన నా జనులు వారి స్వాస్థ్యములైన దేశములలోనికి చేర్చబడుదురు; నా మాటలు ఒక్కటిగా సమకూర్చబడును; నా మాటకు మరియు ఇశ్రాయేలు వంశస్థులైన నా జనులకు వ్యతిరేకముగా పోరాడు వారికి నేను దేవుడనైయున్నానని, అతని సంతానమును నిత్యము జ్ఞాపకము చేసుకొందునని అబ్రాహాముతో నేను నిబంధన చేసియున్నానని చూపెదను.