లేఖనములు
2 నీఫై 17


17వ అధ్యాయము

ఎఫ్రాయిము మరియు సిరియా, యూదాకు వ్యతిరేకముగా యుద్ధము చేయుదురు—క్రీస్తు ఒక కన్యకకు జన్మించును—యెషయా 7 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వచ్చిరి గానీ అది వారి వలన కాకపోయెను.

2 అప్పుడు—సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.

3 అప్పుడు ప్రభువు యెషయాతో ఈలాగు సెలవిచ్చెను: ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయార్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి,

4 అతనితో ఈలాగు చెప్పుము: భద్రముసుమీ, నిమ్మళించుము; పొగరాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము.

5 సిరియాయు, ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయుటకు ఆలోచించుచు,

6 మనము యూదా దేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలనువాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి.

7 అయితే ప్రభువైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఆ మాట నిలువదు, జరుగదు.

8 దమస్కు సిరియాకు రాజధాని; దమస్కునకు రెజీను రాజు; మరియు అరువది అయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును.

9 సమరయ ఎఫ్రాయిమునకు రాజధాని; సమరయకు రెమల్యా కుమారుడు రాజు; మీరు నమ్మకుండిన యెడల స్థిరపడక యుందురు.

10 ప్రభువు ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను:

11 నీ దేవుడైన ప్రభువు వలన సూచన నడుగుము; అది పాతాళమంత లోతులలోనైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తులలోనైనను సరే.

12 ఆహాజు—నేను అడగను, ప్రభువును శోధింపనని చెప్పగా,

13 అతడు—ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా?

14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచనను మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

15 కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు వెన్న, తేనెను తినును.

16 కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడుచేయబడును.

17 ప్రభువు నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను, ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును; ఆయన అష్ఘూరు రాజును నీమీదికి రప్పించును.

18 ఆ దినమున ఐగుప్తు అంతమందున్న జోరీగలను, అష్షూరు దేశములోని కందిరీగలను ప్రభువు ఈలగొట్టి పిలుచును.

19 అవి అన్నియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్ళన్నిటిలోను దిగి నిలుచును.

20 ఆ దినమున ప్రభువు నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును; అది గడ్డమును కూడా గీసివేయును.

21 ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱెలను పెంచుకొనగా,

22 అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు వెన్న తినును. ఏలయనగా ఈ దేశములో విడువబడిన వారందరును వెన్న, తేనెలను తిందురు.

23 ఆ దినమున వెయ్యి వెండి నాణెముల విలువ గల వెయ్యి ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలురక్కసి చెట్లును పెరుగును.

24 ఆ దేశమంతయు గచ్చపొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు.

25 పార చేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న గచ్చపొదల భయముచేతను బలురక్కసి చెట్ల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది ఎడ్లను తోలుటకును గొఱ్ఱెలు త్రొక్కుటకును ఉపయోగమగును.