లేఖనములు
2 నీఫై 7


7వ అధ్యాయము

జేకబ్ యెషయా గ్రంథము నుండి చదువుటను కొనసాగించును: యెషయా, మెస్సీయ వలె మాట్లాడును—మెస్సీయ జ్ఞానుల భాషను కలిగియుండును—కొట్టు వారికి ఆయన తన వీపునిచ్చును—ఆయన సిగ్గుపడడు—(యెషయా 50 తో పోల్చుము.) సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను నిన్ను విడిచిపెట్టితినా, లేదా నేను నిన్ను శాశ్వతముగా వదిలివేసితినా? ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నేను నిన్ను ఎవని కొరకు విడిచిపెట్టితిని లేదా నా అప్పులవారిలో ఎవనికి మిమ్ములను అమ్మివేసితిని? అవును, ఎవనికి నేను మిమ్ములను అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మిమ్ములను మీరు అమ్మివేసుకొంటిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను.

2 నేను వచ్చినప్పుడు, అక్కడ మనుష్యుడెవడును లేడు; నేను పిలిచినప్పుడు, అక్కడ సమాధానమిచ్చు వాడెవడును లేడు; ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, నా చేయి విమోచింపలేనంత కురచయైపోయెనా? లేదా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును; నదులను ఎడారిగా చేయుదును; నీళ్ళు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును.

3 ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను. వాటికి గోనెపట్ట ధరింపజేయుచున్నాను.

4 ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, కాలానుగుణముగా నేను మీతో మాట్లాడు జ్ఞానము నాకు కలుగునట్లు జ్ఞానులకు తగిన భాషను ప్రభువైన దేవుడు నాకు దయచేసియున్నాడు. మీరు అలసియున్నప్పుడు, జ్ఞానులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నా చెవికి విను బుద్ధి పుట్టించును.

5 ప్రభువైన దేవుడు నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు.

6 కొట్టు వానికి నా వీపును, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని. అవమానపరచువారికిని ఉమ్మివేయువారికిని నా ముఖము దాచుకొనలేదు.

7 ప్రభువైన దేవుడు నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకొంటిని.

8 నన్ను నిర్దోషిగా యెంచువాడు ఆసన్నుడైయున్నాడు. నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము. నా ప్రతివాది ఎవడు? అతడిని నా యొద్దకు రానిమ్ము, నేను అతడిని నా నోటి శక్తితో కొట్టుదును.

9 ప్రభువైన దేవుడు నాకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువారందరు వస్త్రము వలే పాతగిలిపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును.

10 మీలో ప్రభువుకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు, వెలుగులేకయే చీకటిలో నడుచు వాడెవడు?

11 ఇదిగో, అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదనగలవారై పండుకొనెదరు.