లేఖనములు
2 నీఫై 13


13వ అధ్యాయము

వారి అవిధేయతను బట్టి యూదా మరియు యెరూషలేము శిక్షింపబడును—ప్రభువు తన జనుల కొరకు వాదించి, వారికి తీర్పుతీర్చును—లోక సంబంధులగుట వలన సీయోను కుమార్తెలు శపించబడి బాధింపబడుదురు—యెషయా 3 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఆలకించుడి, ప్రభువును సైన్యములకధిపతియునగు ప్రభువు, పోషణమును పోషణాధారమును, అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు—

2 శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, వివేకవంతులను, పెద్దలను;

3 పంచదశాధిపతులను, ఘనత వహించినవారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగినవారిని, అనర్గళముగా మాట్లాడు వక్తలను యెరూషలేములో నుండియు యూదా దేశములో నుండియు తీసివేయును.

4 బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను మరియు పసిపిల్లలు వారిని ఏలెదరు.

5 ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని బాధించును; పెద్దవానిపైన బాలుడును, ఘనునిపైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.

6 ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని—నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివైయుందువు, ఈ పాడుస్థలము నీ వశమున ఉండనీయకుము అనును.

7 అతడు ఆ దినమున కేకవేసి—నేను సంరక్షణకర్తగా ఉండనొల్లను; నా ఇంట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు; నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.

8 యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను, ప్రభువు మహిమగల దృష్టికి కోపమురేపునంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉండెను.

9 వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును, తమ పాపమును మరుగుచేయక సొదొమ వారి వలే దాని బయలుపరచుదురు; తమకు తామే వారు కీడు చేసుకొనియున్నారు, వారికి శ్రమ!

10 మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము; వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.

11 దుష్టులకు శ్రమ, ఏలయనగా వారు నశించెదరు; వారి క్రియల ఫలము వారిపైయుండును.

12 మరియు నా జనులను పిల్లలు బాధించుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా జనులారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు, వారు మీ త్రోవల జాడలను చెరిపివేయుదురు.

13 ప్రభువు వాదించుటకు నిలువబడియున్నాడు; జనములను తీర్పుతీర్చుటకు లేచియున్నాడు.

14 ప్రభువు తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరు ద్రాక్షాతోటను, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్మును మీ ఇండ్లలోనే తినివేసితిరి.

15 నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు దేవుడు సెలవిచ్చుచున్నాడు.

16 మరియు ప్రభువు సెలవిచ్చినదేదనగా—సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడచుచు తమ కాళ్ళగజ్జలను మ్రోగించుచున్నారు—

17 కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, ప్రభువు వారి మానమును బయలుపరచును.

18 ఆ దినమున ప్రభువు గల్లుగల్లుమను వారి పాదభూషణముల సొగసును, సూర్యబింబ భూషణములను, చంద్రవంకలు అను భూషణములను;

19 గొలుసులను, కడియములను, ముసుగులను;

20 కుల్లాయీలను, కాళ్ళ గొలుసులను, ఒడ్డాణములను, పరిమళ ద్రవ్యపు బరిణెలను, కర్ణభూషణములను;

21 ఉంగరములను, ముక్కు కమ్ములను;

22 ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను;

23 చేతి అద్దములను, సన్నని నారతో చేసిన మేలిముసుగులను, పాగాలను, శాలువలను తీసివేయును.

24 అప్పుడు పరిమళద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును; నడికట్టుకు ప్రతిగా త్రాడును; చక్కగా అల్లిన జడకు ప్రతిగా బోడితలయు; ప్రశస్థమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు; అందమునకు ప్రతిగా వాతయును ఉండును.

25 ఖడ్గము చేత మనుష్యులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు.

26 పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును; ఆమె ఏమియు లేనిదై నేలపై కూర్చుండును.