లేఖనములు
2 నీఫై 6


6వ అధ్యాయము

జేకబ్ యూదుల చరిత్రను మరలా చెప్పును: బబులోనీయులచే చెరపట్టబడుట మరియు తిరిగి వచ్చుట; ఇశ్రాయేలు పరిశుద్ధుని పరిచర్య మరియు సిలువ వేయబడుట; అన్యజనుల నుండి పొందిన సహాయము; యూదులు మెస్సీయ యందు విశ్వాసముంచినప్పుడు కడవరి దినములలో వారి పునఃస్థాపన. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 నీఫై సహోదరుడైన జేకబ్, నీఫై జనులతో పలికిన మాటలు:

2 నా ప్రియమైన సహోదరులారా, జేకబ్ అను నేను, దేవుని చేత పిలువబడిన వాడనై ఆయన పరిశుద్ధ క్రమము ప్రకారము నియమించబడి, మీరు రాజుగా లేదా సంరక్షకుడిగా చూచుచు, మీ క్షేమము కొరకు మీరు ఆధారపడియున్న నా సహోదరుడైన నీఫై చేత నియమించబడిన వాడనై, నేను మీతో అత్యధిక విషయములను మాట్లాడియున్నానని మీరెరుగుదురు.

3 అయినను, నేను మీతో మరలా మాట్లాడుదును; ఏలయనగా, నేను మీ ఆత్మల క్షేమమును ఆశించియున్నాను. మీ కొరకు నా ఆతురత గొప్పది; అది ఎల్లప్పుడు ఉండెనని మీకై మీరు ఎరుగుదురు. ఏలయనగా, నేను సమస్త శ్రద్ధతో మీకు ఉద్భోధించితిని; నా తండ్రి మాటలను నేను మీకు బోధించితిని; మరియు లోకము యొక్క సృష్టి నుండి వ్రాయబడిన విషయములను గూర్చి నేను మీకు చెప్పియున్నాను.

4 ఇదిగో, ప్రస్తుతమున్న మరియు రాబోవు విషయములను గూర్చి నేను మీతో మాట్లాడుదును; అందువలన, యెషయా వాక్యములను నేను మీకొరకు చదివెదను; నేను మీతో ఆ వాక్యములు చెప్పవలెనని నా సహోదరుడు ఆశించెను. మీరు నేర్చుకొని, మీ దేవుని నామమును మహిమపరచునట్లు మీ కొరకు నేను మాట్లాడెదను.

5 ఇప్పుడు, నేను చదువు వాక్యములు ఇశ్రాయేలు వంశస్థులందరిని గూర్చి యెషయా పలికినవి; మీరు ఇశ్రాయేలు వంశస్థులు గనుక అవి మీతో పోల్చబడవచ్చును. మరియు మీరు ఇశ్రాయేలు వంశస్థులైనందున యెషయా ద్వారా పలుకబడిన అనేక వాక్యములు మీతో పోల్చబడవచ్చును.

6 ఇప్పుడు ఆ వాక్యములు ఇవే: ప్రభువైన దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు: ఇదిగో, నేను నా హస్తమును అన్యజనులపై ఎత్తెదను మరియు జనుల కొరకు నా ధ్వజమును నిలుపుదును; వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు.

7 రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు; వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళిని నాకెదరు; అప్పుడు నేను ప్రభువుననియు, నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానమునొందరనియు నీవు తెలుసుకొందువు.

8 ఇప్పుడు, జేకబ్ అను నేను, ఈ మాటలను గూర్చి కొంత మాట్లాడెదను. ఏలయనగా, మనము విడిచివచ్చిన యెరూషలేములో ఉన్నవారు సంహరించబడి, చెరగా కొనిపోబడిరని ప్రభువు నాకు చూపెను.

9 అయినను, వారు తిరిగి రావలెనని ప్రభువు నాకు చూపెను; ప్రభువైన దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధుడు, శరీరము నందు తననుతాను వారికి ప్రత్యక్షపరచుకొనవలెనని కూడా ఆయన నాకు చూపెను; నాతో మాట్లాడిన దేవదూత మాటల ప్రకారము, ఆయన తనను ప్రత్యక్షపరచుకొనిన తరువాత వారు ఆయనను కొరడాతో కొట్టి, సిలువ వేయవలెను.

10 వారు ఇశ్రాయేలు పరిశుద్ధునికి వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొని తమ మెడలను బిరుసు చేసుకొనిన తరువాత, ఇశ్రాయేలు పరిశుద్ధుని తీర్పులు వారిపై వచ్చును; మరియు వారు కొట్టబడి, బాధించబడు దినము వచ్చును.

11 కావున, వారు అటు ఇటు తరుమబడిన తరువాత, అనేకులు శరీరమందు బాధింపబడుదురు; కానీ విశ్వాసుల ప్రార్థనల మూలముగా నశించిపోవుటకు అనుమతించబడరని దేవదూత చెప్పుచున్నాడు; వారు చెదరగొట్టబడి, కొట్టబడి, ద్వేషింపబడుదురు; అయినప్పటికీ, ప్రభువు వారిపట్ల కనికరముగానుండును. వారు తమ విమోచకుని గూర్చి తెలుసుకొనినప్పుడు, తిరిగి తమ స్వాస్థ్యమైన దేశములకు చేర్చబడుదురు.

12 ప్రవక్త ఎవరి గురించి వ్రాసియుండెనో ఆ అన్యజనులు ధన్యులైయున్నారు; ఏలయనగా, వారు పశ్చాత్తాపము పొంది సీయోనుకు వ్యతిరేకముగా పోరాడని యెడల, ఆ గొప్ప హేయకరమైన సంఘముతో చేరని యెడల, వారు రక్షింపబడుదురు; ప్రభువైన దేవుడు తన జనులకు ఆయన చేసిన నిబంధనలను నెరవేర్చును; ఈ కారణము నిమిత్తమే ప్రవక్త ఈ వాక్యములను వ్రాసియుండెను.

13 కావున, సీయోనుకు మరియు ప్రభువు యొక్క నిబంధన జనులకు వ్యతిరేకముగా పోరాడువారు వారి పాదముల ధూళిని నాకుదురు; ప్రభువు యొక్క జనులు అవమానమునొందరు. ఏలయనగా, ఆయన కొరకు కనిపెట్టువారే ప్రభువు యొక్క జనులైయున్నారు; వారు మెస్సీయ రాక కొరకు ఇంకను కనిపెట్టుచున్నారు.

14 ప్రవక్త యొక్క మాటల ప్రకారము, మెస్సీయ రెండవసారి వారిని దక్కించుకొనుటకు తనను సిద్ధపరచుకొనును; అందువలన, వారు ఆయన యందు విశ్వాసముంచు దినము వచ్చినపుడు, వారి శత్రువులు నాశనము చేయబడునట్లు ఆయన తననుతాను వారికి శక్తి మరియు గొప్ప మహిమయందు ప్రత్యక్షపరచుకొనును. ఆయన యందు విశ్వాసముంచు వారినెవ్వరిని ఆయన నాశనము చేయడు.

15 మరియు ఆయనయందు విశ్వాసముంచని వారు అగ్ని, తుఫాను, భూకంపములు, రక్తపాతములు, తెగుళ్ళు మరియు కరువు చేత నాశనము చేయబడుదురు. ప్రభువే దేవుడని, ఇశ్రాయేలు పరిశుద్ధుడని వారు తెలుసుకొందురు.

16 బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము తీసుకొనగలవాడెవడు, లేదా న్యాయముగా చెరపట్టబడినవాడు విడిపించబడునా?

17 కానీ ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపించబడుదురు, భీకరుల చేతిలోనుండి కొల్లసొమ్ము విడిపించబడును. ఏలయనగా, బలవంతుడైన దేవుడు తన నిబంధన జనులను విడిపించును; ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసెదను—

18 నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసమును తినిపించెదను; క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తముచేత వారు మత్తులగుదురు; ప్రభువునైన నేనే నీ రక్షకుడననియు యాకోబు యొక్క బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగుదురు.