లేఖనములు
2 నీఫై 27


27వ అధ్యాయము

అంధకారము, విశ్వాస భ్రష్టత్వము అంత్యదినములలో భూమిని కప్పివేయును—మోర్మన్‌ గ్రంథము ఉనికిలోనికి వచ్చును—ముగ్గురు సాక్షులు ఆ గ్రంథమును గూర్చి సాక్ష్యమిచ్చెదరు—ముద్రవేయబడిన గ్రంథమును నేను చదువలేనని అక్షరములు తెలిసినవాడు చెప్పును—ప్రభువు ఒక ఆశ్చర్యకార్యమును, అద్భుతమును చేయును—యెషయా 29 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 కానీ ఇదిగో అంత్యదినములందు లేదా అన్యజనుల దినములందు—అన్యజనుల మరియు యూదుల యొక్క సమస్త జనములు, ఈ దేశములోకి వచ్చువారు, ఇతర దేశములలోనున్న వారు, అంతేకాకుండా భూమి యొక్క సమస్త దేశములలో ఉన్నవారు దుష్టత్వముతోను, సమస్త విధములైన హేయక్రియలతోను మత్తులైయుందురు—

2 ఆ దినము వచ్చినప్పుడు వారు సైన్యములకధిపతియగు ప్రభువు ద్వారా ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుఫానులతోను దహించు అగ్నిజ్వాలతోను దర్శింపబడుదురు.

3 సీయోనుకు వ్యతిరేకముగా పోరాడి, ఆమెను కష్టపెట్టు జనములన్నియు రాత్రి కన్న స్వప్నము వలె ఉండును; ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును, దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొనియున్నట్లును, సీయోను కొండకు విరోధముగా యుద్ధము చేయు జనముల సమూహమంతటికి ఆలాగు సంభవించును.

4 ఇదిగో దోషము చేయు మీరందరూ తేరిచూచి విస్మయమొందుడి, ఏలయనగా మీరు అరచి మొర పెట్టుదురు, ద్రాక్షారసము లేకయే మీరు మత్తులైయుందురు; మద్యపానము చేయకయే తూలుదురు.

5 ప్రభువు మీమీద గాఢనిద్రాత్మను క్రుమ్మరించియున్నాడు. ఏలయనగా మీరు కన్నులు మూసుకొని ప్రవక్తలను తిరస్కరించితిరి; మీ అధిపతులను, దీర్ఘదర్శులను మీ దుర్నీతి నిమిత్తము ఆయన కప్పివేసెను.

6 ప్రభువైన దేవుడు మీకు ఒక గ్రంథము యొక్క వాక్యములను బయలుపరచును, అవి నిద్రించిన వారి మాటలైయుండును.

7 ఆ గ్రంథము ముద్రవేయబడి యుండును; మరియు ఆ గ్రంథమునందు లోకారంభము నుండి దాని అంతము వరకు దేవుని నుండి ఇవ్వబడిన ఒక బయల్పాటు ఉండును.

8 అందువలన, ముద్ర వేయబడిన కారణముగా ఆ విషయములు జనుల దుష్టత్వము మరియు హేయక్రియల దినమందు ఇవ్వబడవు; కావున ఆ గ్రంథము వారి నుండి దూరముగా ఉంచబడును.

9 కానీ ఆ గ్రంథము ఒక మనుష్యునికి ఇవ్వబడును, అతడు ధూళిలో నిద్రించిన వారి మాటలైన ఆ గ్రంథపు వాక్యములను మరొకరికి ఇచ్చును;

10 కానీ ముద్రవేయబడిన వాక్యములను లేదా ఆ గ్రంథమును అతడు ఇవ్వడు; ఏలయనగా ఆ గ్రంథము దేవుని శక్తి ద్వారా ముద్ర వేయబడును మరియు ముద్ర వేయబడిన బయల్పాటు ప్రభువు యొక్క యుక్తకాలమందు బయటకు వచ్చు వరకు ఆ గ్రంథమునందే ఉంచబడును; ఏలయనగా లోకము పునాది వేయబడినప్పటినుండి దాని అంతము వరకునున్న సమస్త విషయములను అవి బయలుపరచును.

11 ముద్ర వేయబడిన ఆ గ్రంథపు వాక్యములు ఇంటి పైకప్పుల మీద చదువబడు దినము వచ్చును; అవి క్రీస్తు యొక్క శక్తి ద్వారా చదువబడును; మనుష్యుల మధ్య జరిగియున్న మరియు లోకాంతము వరకు జరుగబోవు సమస్త విషయములు నరుల సంతానమునకు బయలుపరచబడును.

12 అందువలన ఆ దినమున నేను చెప్పిన ఆ మనుష్యునికి ఆ గ్రంథము ఇవ్వబడినప్పుడు, ఆ గ్రంథము ఇవ్వబడిన వానితో పాటు దేవుని శక్తి ద్వారా ముగ్గురు సాక్షులు తప్ప మరెవరూ దానిని చూడకుండునట్లు ఆ గ్రంథము లోకము యొక్క దృష్టి నుండి దాచబడును; వారు ఆ గ్రంథమును గూర్చి, అందులోని విషయముల యొక్క సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చెదరు.

13 దేవుని చిత్తానుసారము ఆయన వాక్యమును గూర్చి నరుల సంతానమునకు సాక్ష్యమిచ్చుటకు మరికొందరు తప్ప ఇతరులెవ్వరూ దానిని చూడలేరు; ఏలయనగా విశ్వాసుల మాటలు మృతుల నుండి వచ్చుచున్నట్లు మాట్లాడబడవలెనని ప్రభువు చెప్పియున్నాడు.

14 అందువలన, ప్రభువైన దేవుడు ఆ గ్రంథము యొక్క వాక్యములను జరిగించుటకు బయలుదేరును; ఆయనకు ఇష్టమనిపించినంతమంది సాక్షుల ద్వారా ఆయన తన వాక్యమును స్థాపించును; అయితే దేవుని వాక్యమును తిరస్కరించు వానికి ఆపద.

15 కానీ ప్రభువైన దేవుడు ఆ గ్రంథమును అప్పగించిన వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ముద్ర వేయబడని ఈ మాటలను తీసుకొనుము మరియు అతడు వాటిని అక్షరములు తెలిసినవానికి చూపి, దయచేసి దీనిని చదువుమని చెప్పునట్లు వాటిని ఇంకొకనికి ఇవ్వుము; మరియు అతడు—ఆ గ్రంథమును నా వద్దకు తెమ్ము, నేను చదివెదనని చెప్పును.

16 ఇప్పుడు లోకము యొక్క మహిమను లాభమును పొందుటకే వారు దీనిని చెప్పుదురు, కాని దేవుడిని మహిమపరచుటకు కాదు.

17 అప్పుడు ఆ మనుష్యుడు—ముద్ర వేయబడియున్నందున నేను ఆ గ్రంథమును తేలేనని చెప్పును.

18 అందుకు ఆ అక్షరములు తెలిసినవాడు—నేను దానిని చదువలేనని చెప్పును.

19 అందువలన ప్రభువైన దేవుడు తిరిగి ఆ గ్రంథమును మరియు అందులోనున్న వాక్యములను అక్షరములు తెలియని వానికి ఇచ్చును; మరియు అతడు—అక్షరములు నాకు తెలియవనును.

20 అప్పుడు ప్రభువైన దేవుడు అతనితో ఇట్లనును: అక్షరములు తెలిసినవారు వాటిని చదువలేరు, ఏలయనగా వారు వాటిని తిరస్కరించియున్నారు మరియు నేను నా స్వకార్యమును జరిగించుటకు సమర్థుడనైయున్నాను; అందువలన నేను నీకిచ్చుచున్న వాక్యములను నీవు చదివెదవు.

21 ముద్ర వేయబడిన వాక్యములను ముట్టకుము, వాటిని నేను నా యుక్త కాలమందు తెచ్చెదను; ఏలయనగా నా స్వకార్యమును చేయుటకు నేను సమర్థుడనైయున్నానని నరుల సంతానమునకు చూపెదను.

22 అందువలన నేను నీకాజ్ఞాపించిన వాక్యములను నీవు చదివి, నేను నీకు వాగ్దానము చేసిన సాక్షులను పొందినప్పుడు నీవు ఆ గ్రంథమును తిరిగి ముద్ర వేయవలెను మరియు నీవు చదువని వాక్యములను నరుల సంతానమునకు తెలియజేయుట సరియైనదని నా స్వంత జ్ఞానమునందు నేను చూచువరకు నేను వాటిని భద్రపరచునట్లు నా కొరకు నీవు వాటిని దాచియుంచవలెను.

23 ఇదిగో, నేను దేవుడను, అద్భుతములు చేయు దేవుడను; నేను నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాననియు వారి విశ్వాసమును బట్టి తప్ప నరుల సంతానము మధ్య ఏ కార్యమూ చేయననియు లోకమునకు చూపెదను.

24 అతనికి ఇవ్వబడు వాక్యములను చదువు వానితో ప్రభువు మరలా ఈలాగు సెలవిచ్చియున్నాడు:

25 ఈ ప్రజలు నోటిమాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కాని తమ హృదయములను నాకు దూరము చేసుకొనియున్నారు, వారు నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి.

26 కాగా నేను ఈ జనుల యెడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, అనగా ఒక ఆశ్చర్యకార్యమును అద్భుతమును జరిగింతును, ఏలయనగా వారి జ్ఞానుల, పండితుల జ్ఞానము వ్యర్థమగును మరియు వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును.

27 తమ ఆలోచనలు ప్రభువుకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయజూచువారికి శ్రమ! మమ్ము నెవరు చూచెదరు? మా పని యెవరికి తెలియును? అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించువారికి శ్రమ. వారు ఇంకను ఇట్లు చెప్పుదురు: కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? ఇదిగో, వారి క్రియలన్నిటినీ నేనెరుగుదునని నేను వారికి చూపించెదనని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏలయనగా చేయబడిన వస్తువు దాని చేసిన వానిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? లేదా రూపించబడిన వస్తువు రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా?

28 కానీ సైన్యములకధిపతియగు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని యెంచబడునని నేను నరుల సంతానమునకు చూపెదను.

29 ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గృడ్డివారు కన్నులారా చూచెదరు.

30 ప్రభువుయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు పరిశుద్ధుని యందు ఆనందించెదరు.

31 నిశ్చయముగా ప్రభువు జీవముతోడు బలాత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు దహించబడెదరు, కీడుచేయ ప్రయత్నించుచు;

32 ఒక్క వ్యాజ్యెమునుబట్టి యితరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించువానిని పట్టుకొనవలెనని ఉరి నొడ్డుచు, నీతిమంతులను పనికిరానివారిగా యెంచువారు నరకబడుదురు.

33 అందుచేత అబ్రాహామును విమోచించిన ప్రభువు యాకోబు కుటుంబమును గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఇకమీదట యాకోబు సిగ్గుపడడు ఇకమీదట అతని ముఖము తెల్లబారదు.

34 అతని సంతానము తమ మధ్య నేను చేయు కార్యమును చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు, యాకోబు పరిశుద్ధదేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు.

35 చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.