లేఖనములు
2 నీఫై 19


19వ అధ్యాయము

యెషయా, మెస్సీయ వలె మాట్లాడును—చీకటిలోనున్న జనులు గొప్ప వెలుగును చూచెదరు—మనకు శిశువు పుట్టెను—అతడు సమాధానకర్తయగు అధిపతియై దావీదు సింహాసనముపై పరిపాలించును—యెషయా 9 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువ లేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన యొర్దానుకు ఆవలనున్న ఎఱ్ఱసముద్రపు తీరమును, అన్యజనులు నివసించు గలిలయను మహిమగల దానిగా చేయుచున్నాడు.

2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచ్ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును.

3 నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు; కోతకాలమున మనుష్యులు సంతోషించునట్లు, దోపుడు సొమ్ము పంచుకొనువారు సంతోషించునట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు.

4 వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు, వాని మెడను కట్టుకర్రను, వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

5 యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును, రక్తములో పొర్లింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.

6 ఏలయనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను; ఆయన భుజము మీద రాజ్యభారముండును; ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

7 ఇది మొదలుకొని మితిలేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును, రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు ప్రభువు ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును.

8 ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చియున్నది.

9 అది ఎఫ్రాయిముకును సమరయ నివాసులకును ప్రజలందరికి తెలియవలసియున్నది;

10 వారు—ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్ళతో కట్టుదము రండి; రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి, గర్వముతో చెప్పుకొనుచున్నారు.

11 కాబట్టి, ప్రభువు వాని మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు;

12 ముందు సిరియనులు, వెనుక ఫిలిష్తీయులు నోరు తెరచి ఇశ్రాయేలును మ్రింగి వేయవలెనని యున్నారు; ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

13 అయినను జనులు తమను కొట్టినవాని తట్టు తిరుగుట లేదు, సైన్యములకధిపతియగు ప్రభువును వెదుకుట లేదు.

14 కావున ప్రభువు ఇశ్రాయేలులో నుండి తలను తోకను, తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును.

15 పెద్దలు తలవలె, కల్లలాడు ప్రవక్తలు తోకవలెనున్నారు.

16 ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు; వారిని వెంబడించువారు వారి చేత మ్రింగివేయబడుదురు.

17 కావున, ప్రభువు వారి యవ్వనస్థులను చూచి సంతోషింపడు, వారిలో తల్లిదండ్రులు లేని వారియందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు; ఏలయనగా వారందరు వేషధారులును దుర్మార్గులునై యున్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

18 దుష్టత్వము అగ్నివలే మండుచున్నది; అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజుకొనును, అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును.

19 సైన్యములకధిపతియగు ప్రభువు ఉగ్రత వలన దేశము కాలిపోయెను, జనులు అగ్నికి కట్టెలవలె నున్నారు, వారిలో ఒకరినొకరు కరుణింపరు.

20 కుడి ప్రక్కన ఉన్నదానిని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొని యుందురు; ఎడమ ప్రక్కన ఉన్నదానిని భక్షించుదురు గాని ఇంకను తృప్తిపొందక యుందురు; వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును—

21 మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును; వీరిద్దరు ఏకీభవించి యూదా మీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.