లేఖనములు
2 నీఫై 11


11వ అధ్యాయము

జేకబ్ తన విమోచకుని చూచెను—మోషే ధర్మశాస్త్రము క్రీస్తును సూచించును మరియు ఆయన వచ్చునని ఋజువు చేయును. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఇప్పుడు జేకబ్, నా జనులతో ఆ సమయమున ఇంకా అనేక విషయములు మాట్లాడెను; అయినప్పటికీ, నేను ఈ విషయములు మాత్రమే వ్రాయబడునట్లు చేసితిని, ఏలయనగా నేను వ్రాసియున్న విషయములు నాకు చాలును.

2 ఇప్పుడు నీఫైయను నేను, యెషయా మాటలను ఎక్కువగా వ్రాయుదును. ఏలయనగా, నా ఆత్మ అతని మాటలయందు ఆనందించును. నేను అతని మాటలను నా జనులతో పోల్చెదను, వాటిని నా సంతానమంతటికి పంపెదను. ఏలయనగా నేను నా విమోచకుడిని చూచినట్లే, అతడు కూడా నిశ్చయముగా ఆయనను చూచెను.

3 నేను ఆయనను చూచినట్లే, నా సహోదరుడు జేకబ్ కూడా ఆయనను చూచెను; అందువలన, నా మాటలు నిజమని వారికి ఋజువు చేయునట్లు నేను వారి మాటలను నా సంతానమునకు పంపెదను; ముగ్గురు సాక్ష్యుల మాటల ద్వారా నేను నా మాటను స్థిరపరిచెదనని దేవుడు చెప్పెను; అయినప్పటికీ, దేవుడు ఎక్కువమంది సాక్షులను పంపి, ఆయన వాక్యములన్నిటిని ఋజువు చేయును.

4 క్రీస్తు రాకడను గూర్చి నా జనులకు ఋజువు చేయుటలో నా ఆత్మ ఆనందించుచున్నది; ఏలయనగా ఈ ఉద్దేశ్యము నిమిత్తమే మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడినది; మరియు లోకము ఆరంభమైనప్పటి నుండి మనుష్యునికి దేవునిచేత ఇవ్వబడియున్న సమస్తము ఆయనకు సూచనగా ఉన్నవి.

5 ప్రభువు మన పితరులతో చేసియున్న నిబంధనల యందు కూడా నా ఆత్మ ఆనందించుచున్నది; ముఖ్యముగా నా ఆత్మ ఆయన కృపయందు, ఆయన న్యాయమందు, శక్తి కనికరములందు, మరణము నుండి విడుదల యొక్క గొప్ప మరియు నిత్యప్రణాళికయందు ఆనందించుచున్నది.

6 క్రీస్తు రాని యెడల మనుష్యులందరు నశించవలెనని నా జనులకు ఋజువు చేయుటలో నా ఆత్మ ఆనందించుచున్నది.

7 ఏలయనగా క్రీస్తు లేని యెడల దేవుడు లేడు; దేవుడు లేని యెడల మనము లేము, సృష్టి జరిగియుండేది కాదు. కానీ దేవుడున్నాడు, ఆయనే క్రీస్తు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చును.

8 ఇప్పుడు, నా జనులలో ఈ మాటలను చూచువారు తమ హృదయములను పైకెత్తుకొని ఆనందించునట్లు మనుష్యులందరి కొరకు నేను యెషయా మాటలలో కొన్నింటిని వ్రాయుచున్నాను. ఇవే ఆ మాటలు, వాటిని మీరు మీతో మరియు మనుష్యులందరితో పోల్చుకొనవచ్చును.