విధులు మరియు ప్రకటనలు
బాప్తిస్మము


బాప్తిస్మము

ఒక వ్యక్తి సంఘములో సభ్యునిగా మారడానికి మరియు పరిశుద్ధాత్మను పొందడానికి అధికారం ఉన్న వ్యక్తి చేత నీటిలో ముంచబడడం ద్వారా బాప్తిస్మము అవసరం. ఉన్నతస్థితిని కోరుకునే వారందరూ ఈ విధులను పొందడం ద్వారా రక్షకుని మాదిరిని అనుసరించాలి.

బాప్తిస్మము యొక్క విధి ఒక యాజకుడు లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్న వారి ద్వారా నిర్వహించబడుతుంది.

అధ్యక్షత్వం వహించే నాయకునిచే ఆమోదించబడిన ఇద్దరు సాక్షులు, ప్రతీ బాప్తిస్మము సరిగ్గా నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవడానికి గమనిస్తారు. పిల్లలు మరియు యువతతో సహా బాప్తిస్మము పొందిన సంఘ సభ్యులు సాక్షులుగా పని చేయవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:73 లో ఇవ్వబడినట్లుగా పదాలు సరిగ్గా పలుకబడనట్లయితే బాప్తిస్మమును పునరావృతం చేయాలి. వ్యక్తి యొక్క శరీరం, వెంట్రుకలు లేదా దుస్తులు పూర్తిగా మునగకపోతే కూడా దానిని పునరావృతం చేయాలి.

బాప్తిస్మము యొక్క విధిని నిర్వహించడానికి ఒక యాజకుడు లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు:

  1. బాప్తిస్మము పొందుతున్న వ్యక్తితో పాటు నీటిలో నిలబడతాడు.

  2. వ్యక్తి యొక్క కుడి మణికట్టును అతని ఎడమ చేతితో పట్టుకుంటాడు (సౌలభ్యం మరియు భద్రత కోసం). బాప్తిస్మము పొందుతున్న వ్యక్తి తన ఎడమ చేతితో యాజకత్వమును కలిగియున్న వ్యక్తి యొక్క ఎడమ మణికట్టును పట్టుకుంటాడు.

  3. తన కుడిచేతిని లంబకోణాకారములో పైకెత్తుతాడు.

  4. వ్యక్తి యొక్క పూర్తి పేరును పేర్కొంటూ, “యేసు క్రీస్తు చేత నియమించబడియుండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క మరియు పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆమేన్‌” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:73) అంటాడు.

  5. వ్యక్తిని తన ముక్కును కుడి చేతితో పట్టుకోమని చెప్తాడు (సౌలభ్యం కోసం); తర్వాత అతని కుడి చేతిని వ్యక్తి వెనుకభాగంలో ఉంచి, దుస్తులతో సహా వ్యక్తిని పూర్తిగా ముంచుతాడు.

  6. వ్యక్తి నీటిలో నుండి పైకి రావడానికి సహాయపడతాడు.