సర్వసభ్య సమావేశము
చర్య తీసుకోవడానికి మరియు కావడానికి అవసరమైన విశ్వాసము
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


చర్య తీసుకోవడానికి మరియు కావడానికి అవసరమైన విశ్వాసము

ప్రార్థన, లేఖన అధ్యయనము మరియు చర్య తీసుకోవడం ద్వారా మనం పరలోక దీవెనలను పొందగలము మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఉత్తమమైన శిష్యులం కాగలము.

ప్రధాన అధికార డెబ్బదిగా సేవ చేయడానికి నేను పిలువబడిన కొంతకాలానికి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారితో కొద్దిసేపు సమయం గడిపే అవకాశం నాకు కలిగింది. ఫలహారశాలలో అనుకోకుండా మేము కలుసుకున్నాము. ఎల్డర్ ఎస్. మార్క్ పామర్‌ను, నన్ను ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆయన దయతో ఆహ్వానించారు.

“భోజన సమయంలో ప్రవక్తతో మేము దేని గురించి మాట్లాడతాము?” అనే ఆలోచన నా మనస్సులో వచ్చింది. కాబట్టి, నా పిలుపును నేను ఇప్పుడే మొదలుపెట్టబోతున్నందున నా కోసం ఆయన ఏదైనా సలహా లేదా సూచనను కలిగియున్నారేమోనని అధ్యక్షులు నెల్సన్‌ను అడగాలని నేను నిర్ణయించుకున్నాను. ఆయన సమాధానం చాలా మామూలుగా, సూటిగా ఉంది; ఆయన నా వైపు చూసి, “ఎల్డర్ ష్మైల్, మీరు కాగల దాని కోసం మీరు పిలువబడ్డారు,” అని చెప్పారు. ఆ అనుభవం ఫలితంగా, నేను ఏమి కావాలని ప్రభువు కోరుతున్నారనే దాని గురించి నేను ధ్యానించసాగాను. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక మంచి భర్తగా, తండ్రిగా, కొడుకుగా మరియు మంచి సేవకునిగా కావాలని ఆయన నన్ను కోరుతున్నారని గ్రహించాను. రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మంచి శిష్యునిగా కావడానికి నేను ప్రయత్నించినప్పుడు ఇదంతా సాధ్యం కాగలదని అప్పుడు నేను తెలుసుకున్నాను.

గత సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు నెల్సన్ చెప్పారు, “దేనినైనా మంచిగా చేయడానికి ప్రయత్నం అవసరము. యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు కావడం దానికి మినహాయింపు కాదు.”1 యేసు క్రీస్తు యొక్క ఉత్తమమైన శిష్యులుగా కావడానికి కష్టపడి పనిచేయమని అధ్యక్షులు నెల్సన్ మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఎక్కువగా రక్షకునిలా కావడానికి, ఇతర విషయాలతో పాటుగా అడగడం, చర్య తీసుకోవడం మరియు అధ్యయనం చేయడం ద్వారా మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలని ఆయన మనకు చెప్పారు.

1. అడగండి

ఆయనిలా చెప్పారు, “సహాయం కొరకు యేసు క్రీస్తు నామములో మీ పరలోక తండ్రిని అడగండి.”2 యేసు క్రీస్తు యొక్క ఉత్తమమైన శిష్యులుగా కావడమెలాగో తెలుసుకోవడానికి ముఖ్యమైన వాటిలో ఒకటి, ప్రార్థన ద్వారా అడగడం.

అమెరికాలో నీఫైయుల మధ్య తన పరిచర్య యొక్క ముగింపులో యేసు క్రీస్తు పరలోకానికి ఆరోహణుడయ్యారు. తర్వాత ఆయన శిష్యులు కలిసి సమకూడి, “బలమైన ప్రార్థనయందు, ఉపవాసమందు ఏకమయిరి. యేసు మరలా వారికి తననుతాను కనబరచుకొనెను, ఏలయనగా వారు ఆయన నామమందు తండ్రికి ప్రార్థన చేయుచుండిరి.”3 యేసు మరలా తననుతాను తన శిష్యులకు ఎందుకు కనబరచుకున్నారు? ఎందుకంటే వారు ప్రార్థిస్తున్నారు; వారు అడుగుతున్నారు.

తరువాత ఆయన ఇలా అన్నారు:

“ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళ్ళెదను. మరియు నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా, నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినను అది మీకు అనుగ్రహింపబడును.

“కావున, అడుగుడి మీకియ్యబడును; తట్టుడి మీకు తీయబడును; అడుగు ప్రతివాడును పొందును; తట్టువానికి తీయబడును.”4

ప్రభువు యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం విశ్వాసంతో అడగాలి మరియు మనకేది మంచిదో ప్రభువుకు తెలుసని అంగీకరించాలి.

2. చర్య తీసుకోవడం

అధ్యయనం చేయడమనేది యేసు క్రీస్తు యొక్క ఉత్తమమైన శిష్యులుగా కావడానికి ఆవశ్యకమైన మరొక విషయం. మనం చర్య తీసుకున్నప్పుడు, ఆయన నడిపింపునిస్తారు మరియు మనం చేయవలసిన విషయాలను తెలుసుకొనేలా చేస్తారు. లేబన్ నుండి ఇత్తడి పలకలను ఎలా తీసుకురావాలో తెలుసుకోవడానికి నీఫై కూడా ప్రభువు నుండి నడిపింపును వెదికాడని నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ అతడు, అతని సహోదరులు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ వారు చర్య తీసుకుంటున్నారు మరియు వారి ప్రయత్నంలో ప్రభువు వారిని నడిపిస్తున్నారు. చివరికి, మూడవసారి నీఫై సఫలమయ్యాడు. “నేను చేయవలసిన కార్యములను ముందుగా ఎరుగనివాడనై ఆత్మ చేత నడిపించబడితిని,” అని అతడు గుర్తుచేసుకున్నాడు.5

ఏమి చేయాలనేది మనకు స్పష్టంగా తెలియనప్పటికీ మనం ప్రయత్నించి, చర్య తీసుకున్నప్పుడు ప్రభువు ఈ విధంగా పనిచేస్తారు. ఏమి చేయాలో ప్రభువు నీఫైకి చెప్పారు: వెళ్ళి, పలకలు తీసుకురండి. కానీ ఎలా చేయాలో ఆయన నీఫైకి చెప్పలేదు. ఎలా చేయాలో తెలుసుకోమని మరియు ప్రభువు సహాయాన్ని కోరమని ఆ విషయాన్ని ఆయన నీఫైకే వదిలేసారు—మన జీవితాల్లో తరచు ప్రభువు ఇలాగే పనిచేస్తారు. మనము విశ్వాసంతో చర్య తీసుకున్నప్పుడు ప్రభువు మనకు నడిపింపునిచ్చి, దారి చూపిస్తారు.

3. అధ్యయనం చేయడం

సంఘం యొక్క పేరు గురించి జనుల మధ్య తగాదాలున్నాయని 3వ నీఫైలో శిష్యులు రక్షకునితో చెప్తారు. దానికి జవాబుగా, “లేఖనములను వారు చదువలేదా?”6 అని అడుగుతూ రక్షకుడు ఒక ముఖ్యమైన సూత్రాన్ని బోధించారు. అధ్యయనం చేయడమనేది యేసు క్రీస్తు యొక్క మంచి శిష్యులుగా కావడానికి ఆవశ్యకమైన మరొక విషయం. ప్రార్థన మరియు లేఖన అధ్యయనము చాలా దగ్గరి సంబంధం కలిగియున్నాయి. మన మేలు కొరకు అవి కలిసి పనిచేస్తాయి. ఇది ప్రభువు ఏర్పాటుచేసిన ప్రక్రియ. “క్రీస్తు యొక్క మాటలను విందారగించుడి; ఏలయనగా క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు తెలుపును.”7

మనం లేఖనాలను అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా, ఆయన నీఫైయులకు చేసి చూపినట్లుగా వాటినుండి బోధించాలని కూడా రక్షకుడు బోధించారు: “వారు వ్రాసిన లేఖనములన్నిటినీ యేసు ఒకేసారి వివరించిన తరువాత, ఆయన వారికి వివరించిన విషయములను వారు బోధించవలెనని ఆయన వారిని ఆజ్ఞాపించెను.”8

నీఫై వెనక్కి వెళ్ళి, ఇత్తడి పలకలను తీసుకురావడం అతనికి అంత ముఖ్యమవడానికి ఇదీ ఒక కారణం: వారు వాగ్దానదేశానికి ప్రయాణించడంలో వారికి సహాయపడేందుకు మాత్రమే కాకుండా వారి పిల్లలకు బోధించడంలో సహాయపడేందుకు కూడా అతని కుటుంబానికి లేఖనాలు అవసరము. మన ప్రయాణం కోసం మనం కూడా లేఖనాల నుండి నడిపింపును వెదకాలి మరియు మన ఇళ్ళలో, సంఘ పిలుపులలో వాటినుండి తప్పక బోధించాలి.

4. కావడానికి చర్య తీసుకోవడం

చాలాసార్లు ప్రార్థనకు జవాబులు వెంటనే రావు. కానీ కొనసాగడానికి మనకు తప్పకుండా విశ్వాసం ఉండాలి, నీతిగా చర్య తీసుకోవాలి మరియు ఇత్తడి పలకలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీఫై ఉన్నట్లుగా పట్టుదలతో ఉండాలి. మనం చేయవలసిన దానిని ప్రభువు కొద్దికొద్దిగా చూపిస్తారు; మనం లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు, ప్రభువు మనకు జవాబులను లేదా మరొక్క రోజు, మరొక్క వారం, మరొక్కసారి ప్రయత్నించడానికి కావలసిన బలాన్ని ఇస్తారు. ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ ఇలా చెప్పారు: “కొన్నిసార్లు ఆ జవాబు రావడానికి ముందు చాలాకాలం మనం శ్రమపడడానికి ప్రభువు అనుమతిస్తున్నందుకు కృతజ్ఞతగా ఉండండి. అది మీ విశ్వాసం పెరిగేలా మరియు మీ స్వభావం ఎదిగేలా చేస్తుంది.”9

ప్రార్థన మరియు లేఖన అధ్యయనము ద్వారా ఎల్లప్పుడు ప్రభువు నాకు చర్య తీసుకోవడానికి మరియు మరొక్క రోజు, మరొక్క వారం సహించడానికి, మరోసారి ప్రయత్నించడానికి బలాన్నిచ్చారు. చాలాసార్లు జవాబులు వెంటనే రాలేదు. ఇప్పటికీ జవాబులు రాని ప్రశ్నలు నాకున్నాయి, కానీ నేను అడుగుతూ, అధ్యయనం చేస్తూ ఉన్నాను. నేను జవాబుల కోసం ఎదురుచూస్తుండగా, చర్య తీసుకోవడానికి ప్రభువు నాకు బలాన్నివ్వడం కొనసాగిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను.

ఎల్డర్ స్కాట్ కూడా ఇలా చెప్పారు, “విశ్వాసాన్ని సాధన చేస్తూ అనిశ్చితి యొక్క సంధ్యవెలుగు లోనికి మీ గ్రహింపు యొక్క సరిహద్దుకు మీరు నడిచినప్పుడు, మరొకరకంగా మీరు పొందలేని పరిష్కారాలను కనుగొనడానికి మీరు నడిపించబడతారు.”10

రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మంచి శిష్యులు కావడమనేది జీవితకాలపు ప్రయాణం మరియు మనమందరం వేర్వేరు వేగాలతో ప్రయాణిస్తూ వివిధ స్థాయిల్లో ఉన్నాము. ఇది ఒక పోటీ కాదని, మనం ప్రేమించడానికి, ఒకరికి ఒకరం సహాయం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నామని మనం తప్పక గుర్తుంచుకోవాలి. మన జీవితాల్లో మనతో పనిచేయడానికి రక్షకుడిని అనుమతించేందుకు మనం చర్య తీసుకోవాలి.

సిడ్నీ రిగ్డన్‌తో మాట్లాడుతూ ప్రభువు ఇలా చెప్పారు: “నిన్నును, నీ కార్యములను నేను చూచియున్నాను. నేను నీ ప్రార్థనలను విని, మరింత గొప్ప కార్యమునకు నిన్ను సిద్ధపరచియున్నాను.”11 ప్రభువు మన ప్రార్థనలు విని జవాబిస్తారని, ఆయనకు మనం తెలుసని, మనలో ప్రతిఒక్కరి కోసం ఆయన గొప్ప కార్యాన్ని కలిగియున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ప్రార్థన, లేఖన అధ్యయనము మరియు చర్య తీసుకోవడం ద్వారా మనం పరలోక దీవెనలను పొందగలము మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఉత్తమమైన శిష్యులం కాగలము.

“అంతిమ తీర్పు అనేది మనం చేసిన మంచి చెడుల మొత్తానికి విలువ కట్టడం మాత్రమే కాదు. మన చర్యలు మరియు ఆలోచనలు—మనం ఏమి అయ్యాము అనేదాని యొక్క అంతిమ ప్రభావాన్ని ఒప్పకోవడం,”12 అని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ బోధించారు.

ప్రవక్తలు, దీర్ఘదర్శులు, బయల్పాటుదారుల కొరకు నేను కృతజ్ఞుడిని; వారు గోపురంపై నున్న కావలివారు. మనం చూడని విషయాలను వారు చూస్తారు. వారి మాటల ద్వారా మనం రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మంచి శిష్యులం కాగలమని, మన సామర్థ్యాన్ని సాధించగలమని నేను సాక్ష్యమిస్తున్నాను. క్రీస్తు సజీవుడని, వ్యక్తిగతంగా మనలో ప్రతిఒక్కరిని ఎరుగునని నేను సాక్ష్యమిస్తున్నాను. ఇది ఆయన సంఘము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.