లేఖనములు
3 నీఫై 23


23వ అధ్యాయము

యెషయా మాటలను యేసు ఆమోదించును—ప్రవక్తలను వెదుకవలెనని ఆయన జనులను ఆజ్ఞాపించును—పునరుత్థానమును గూర్చి లేమనీయుడైన సమూయేలు యొక్క మాటలు వారి వృత్తాంతములకు చేర్చబడును. సుమారు క్రీ. శ. 34 సం.

1 ఇప్పుడు మీరు ఈ విషయములను వెదుకవలెనని నేను మీతో చెప్పుచున్నాను. మీరు ఈ విషయములను శ్రద్ధగా వెదుకవలెనని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను; ఏలయనగా యెషయా మాటలు గొప్పవి.

2 ఏలయనగా ఇశ్రాయేలు సంతతి వారైన నా జనులను గూర్చి అన్ని విషయములను అతడు నిజముగా పలికెను; కావున, అన్యజనులనుద్దేశించి అతడు పలుకుట అవసరమైయున్నది.

3 అతడు పలికిన మాటల ప్రకారము, అతడు పలికిన సంగతులన్నియు ఉండెను మరియు ఉండును.

4 కావున, నా మాటలకు చెవియొగ్గుడి; నేను మీకు చెప్పిన విషయములను వ్రాయుడి; తండ్రి యొక్క సమయము మరియు చిత్తమును బట్టి అవి అన్యజనుల యొద్దకు వెళ్ళును.

5 నా మాటలను ఆలకించి పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొందిన వారెవరైనను రక్షింపబడుదురు. ప్రవక్తలను వెదకుడి, ఏలయనగా ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చిన వారు అనేకులుందురు.

6 ఇప్పుడు యేసు ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన తిరిగి వారితో ఇట్లనెను, వారు పొందిన లేఖనములన్నిటినీ వారికి వివరించిన తరువాత, ఆయన వారితో ఇట్లు చెప్పెను: మీరు కలిగియుండని ఇతర లేఖనములను మీరు వ్రాయవలెనని నేను కోరుచున్నాను.

7 మరియు నీవు వ్రాసిన వృత్తాంతమును తీసుకురమ్మని ఆయన నీఫైతో చెప్పెను.

8 నీఫై వృత్తాంతములను తీసుకువచ్చి ఆయన యెదుట ఉంచినప్పుడు, ఆయన వాటిని చూచి ఇట్లనెను:

9 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—తండ్రి తన నామమును నా యందు మహిమపరచు దినమున మృతులలో నుండి లేచి అనేకులకు కనబడి, వారికి పరిచర్య చేయు అనేకమంది పరిశుద్ధులుండిరని ఈ జనులకు అతడు సాక్ష్యమియ్యవలెనని నా సేవకుడు, లేమనీయుడైన సమూయేలును నేను ఆజ్ఞాపించితిని. ఆ విధముగా జరుగలేదా? అని ఆయన వారినడిగెను.

10 ఆయన శిష్యులు ఆయనకు జవాబిచ్చి—అవును ప్రభువా, మీ మాటల ప్రకారము సమూయేలు ప్రవచించెను మరియు అవన్నియు నెరవేరెనని చెప్పిరి.

11 మరియు యేసు వారితో—అనేకమంది పరిశుద్ధులు లేచి అనేకులకు కనబడి, వారికి పరిచర్య చేసిరను విషయమును మీరు వ్రాయకుండుట ఎట్లు జరిగినది? అనెను.

12 అప్పుడు ఈ విషయము వ్రాయబడలేదని నీఫై జ్ఞాపకము చేసుకొనెను.

13 మరియు అది వ్రాయబడవలెనని యేసు ఆజ్ఞాపించెను; కావున, ఆయన ఆజ్ఞాపించినట్లు అది వ్రాయబడెను.

14 వారు వ్రాసిన లేఖనములన్నిటినీ యేసు ఒకేసారి వివరించిన తరువాత, ఆయన వారికి వివరించిన విషయములను వారు బోధించవలెనని ఆయన వారిని ఆజ్ఞాపించెను.