సర్వసభ్య సమావేశము
ఓ మా దేవా, బాధపడుచున్న నీ పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొనుము
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


ఓ మా దేవా, బాధపడుచున్న నీ పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొనుము

నిబంధనలు పాటించుట శ్రమననుభవిస్తున్న మీకు బలమును మరియు ఆనందమును అందించుటకు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము యొక్క శక్తికి ద్వారములు తెరుస్తుంది.

పరలోక తండ్రి యొక్క సంతోషకర ప్రణాళిక మర్త్య అనుభవాన్ని కలిపియున్నది, అక్కడ ఆయన పిల్లలందరూ పరీక్షించబడి, శ్రమలను ఎదుర్కొంటారు.1 ఐదు సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. శస్త్రచికిత్సలు, రేడియేషన్ చికిత్సలు మరియు మందుల దుష్ప్రభావాల నుండి నేను శారీరక నొప్పులను అనుభవించాను మరియు ఇంకా అనుభవిస్తున్నాను. హింసించే నిద్రలేని రాత్రులందు మానసిక ప్రయాసలను నేను అనుభవించాను. బహుశా నాకు సర్వస్వం అని భావించిన ఒక కుటుంబాన్ని విడిచి, నేను ఎప్పటికీ ఊహించని దానికంటె ముందుగా మర్త్యత్వమును విడిచి వెళ్తానని వైద్య గణాంకాలు సూచించాయి.

మీరు ఎక్కడ జీవిస్తున్నప్పటికీ, అనేక రకాల పరీక్షలు మరియు మర్త్య బలహీనతలతో శారీరక లేదా భావోద్వేగ బాధలు మీ జీవితంలో ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, లేదా ఏదో ఒకరోజు మీ జీవితంలో భాగం అవుతాయి.

శారీరక బాధ సహజంగా వృద్ధాప్యము నుండి, ఊహించని వ్యాధులు, మరియు యాదృచ్ఛిక ప్రమాదాలనుండి, ఆకలి లేదా నిరాశ్రయత లేదా హింస, క్రూరమైన చర్యలు మరియు యుద్ధము నుండి రావచ్చు.

ఆందోళన లేదా కృంగిపోవుట నుండి భావోద్వేగ బాధ తలెత్తవచ్చు; జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా విశ్వసనీయ నాయకుడు చేసిన ద్రోహం; ఉపాధి లేదా స్టాకు మార్కెట్‌లో డబ్బును కోల్పోవటం; ఇతరుల అన్యాయమైన తీర్పు; స్నేహితులు, పిల్లలు, లేదా ఇతర కుటుంబ సభ్యుల ఎంపికలు; అనేక రూపాల్లో హింస; వివాహం లేదా పిల్లల గురించి నెరవేర్చబడని కలలు; ప్రియమైనవారి అనారోగ్యం లేదా మరణం; లేదా అనేక ఇతర వనరుల వలన కావచ్చు.

మనలో ప్రతి ఒక్కరికి వచ్చే ప్రత్యేకమైన మరియు కొన్నిసార్లు బలహీనపరిచే బాధను మీరు ఎలా భరించగలరు?

కృతజ్ఞతపూర్వకంగా, యేసు క్రీస్తు సువార్తయందు నిరీక్షణ కనుగొనబడుతుంది మరియు నిరీక్షణ మీ జీవింతలో భాగముగా కూడా ఉండవచ్చు. ఈరోజు నేను లేఖనము, ప్రవచనాత్మక బోధనలు, అనేక పరిచర్య దర్శనాలు మరియు కొనసాగుతున్న నా స్వంత ఆరోగ్యపరమైన శ్రమ నుండి తీసుకోబడిన నిరీక్షణ యొక్క నాలుగు సూత్రములను పంచుకుంటాను. ఈ సూత్రాలు విస్తృతంగా అన్వయించబడేవి మాత్రమే కావు, అవి లోతుగా వ్యక్తిగతమైనవి కూడా.

ముందుగా, శ్రమను అనుభవించమంటే దేవుడు మీ జీవితం పట్ల అసంతృప్తి చెందారని కాదు. రెండు వేల సంవత్సరాల క్రితం, యేసు యొక్క శిష్యులు దేవాలయ ద్వారము వద్ద ఒక గ్రుడ్డి వానిని చూసారు మరియు “బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా?” అని అడిగారు.

పాపము ఫలితంగా జీవితంలో అన్ని కష్టాలు మరియు బాధ కలుగుతాయని మన కాలంలో జీవిస్తున్న అనేకమంది నమ్మినట్లుగా, ఆయన శిష్యులు తప్పుగా నమ్మినట్లు కనబడుతున్నారు. కానీ రక్షకుడు ఇలా జవాబిచ్చారు, “వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.”2

మనకు అమర్త్యత్వము మరియు నిత్యజీవమును తెచ్చుట దేవుని యొక్క కార్యము.3 కానీ పరీక్షలు మరియు బాధ—ప్రత్యేకంగా మరొక వ్యక్తి తన స్వతంత్రతను పాపకరంగా ఉపయోగించుట ద్వారా కలిగిన బాధ—చివరకు దేవుని యొక్క కార్యమును ఎలా ముందుకు తీసుకువెళ్తుంది?4

“నేను నిన్ను పుటము వేసితిని … ; ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని.”5 మీ బాధలకు కారణమేదైనప్పటికీ, మీ ప్రేమగల పరలోక తండ్రి మీ ఆత్మను శుద్ధి చేయడానికి వాటిని నిర్దేశిస్తారు.6 శుద్ధి చేయబడిన ఆత్మలు నిజమైన సాహానుభూతితో ఇతరుల భారములను భరించగలవు.7 “మహా శ్రమల నుండి” వచ్చిన శుద్ధి చేయబడిన ఆత్మలు దేవుని సన్నిధిలో శాశ్వతంగా సంతోషంగా జీవించడానికి సిద్ధపడియున్నారు, మరియు “దేవుడే వారి కన్నులనుండి ప్రతి భాష్పబిందువును తుడిచి వేయును.”8

రెండవది, పరలోక తండ్రి మీ బాధను సన్నిహితంగా ఎరుగును. శ్రమలలో ఉండగా, మనము దేవుడు దూరంగా ఉన్నాడని మరియు మన బాధను పట్టించుకోవడం లేదని మనము తప్పుగా ఆలోచిస్తాము. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కూడా తన జీవితంలో కష్ట సమయంలో ఈ భావనను వ్యక్తపరిచాడు. లిబర్టీ చెరసాలలో ఉండగా, వేలమంది కడవరి దిన పరిశుద్ధులు తమ గృహాలనుండి తరిమివేయబడినప్పుడు, జోసెఫ్ ప్రార్థన ద్వారా జ్ఞానమును వెదికాడు: “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు? “నిన్ను మరుగుపరచు స్థలమును కప్పియుంచు తెర ఎక్కడనున్నది?” ఈ మనవితో అతడు ముగించాడు: “ఓ మా దేవా, బాధపడుచున్న నీ పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొనుము.”9

ప్రభువు సమాధానం జోసెఫ్ మరియు బాధపడుతున్న వారందరికీ ఆభయమిచ్చింది:

“నా కుమారుడా, నీ ఆత్మకు శాంతి కలుగును గాక; నీ లేమి, నీ కష్టములు కొంతకాలమే ఉండును;

“దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించునును” 10

వారి శ్రమలందు దేవుని ప్రేమను వారు ఎలా అనుభవించారో బాధపడే అనేకమంది పరిశుద్ధులు నాతో పంచుకున్నారు. నా క్యాన్సర్ పోరాటంలో ఒకానొక సమయంలో కొంత తీవ్రమైన నొప్పికి కారణాన్ని వైద్యులు అప్పటికింకా గుర్తించని నా అనుభవాన్ని నేను స్పష్టంగా గుర్తుచేసుకున్నాను. మా మధ్యాహ్న భోజనాన్ని దీవించమని ఎప్పటిలాగే ప్రార్థించాలని ఉద్దేశిస్తూ, నేను నా భార్యతో కూర్చోన్నాను. బదులుగా, నేను చేయగలిగినదంతా, “పరలోక తండ్రి, దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను” అని మాత్రమే ఏడ్వగలిగాను. తరువాత 20 నుండి 30 సెకన్లు, నేను ఆయన ప్రేమతో చుట్టబడ్డాను. నా అనారోగ్యానికి ఎటువంటి కారణం నాకు ఇవ్వబడలేదు, అంతిమ ఫలితం సూచించబడలేదు మరియు నొప్పి నుండి ఉపశమనం ఇవ్వబడలేదు. నేను కేవలము ఆయన స్వచ్ఛమైన ప్రేమను అనుభవించాను మరియు అది నాకు సరిపోతుంది.

పిచ్చుక నేలను పడుట గమనించే మన పరలోక తండ్రి, మీ బాధను ఎరిగియున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను.11

మూడవది, మీ బాధను సహించడానికి కావలసిన బలము కలిగియుండుటలో మీకు సహాయపడటానికి యేసు క్రీస్తు తన తోడ్పడే శక్తిని ఇస్తున్నారు. ఈ తోడ్పడే శక్తి ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా సాధ్యము చేయబడింది.12 అనేకమంది సంఘ సభ్యులు కాస్త కఠినంగా ఉంటే వారి స్వంతంగా ఏ బాధనైనా భరించగలరని అనుకుంటున్నారని నేను విచారిస్తున్నాను. జీవించడానికి ఇది కష్టతరమైన మార్గం. మీ తాత్కాలిక క్షణిక బలము మీ ఆత్మను బలపరుచుటకు రక్షకుని యొక్క అంతములేని శక్తి సరఫరాతో ఎన్నడూ పోల్చబడదు.13

యేసు క్రీస్తు మనల్ని ఆదరించునట్లు మన బాధలు, రోగములు మరియు బలహీనతలను “తనపైన తీసుకొనును” అని మోర్మన్ గ్రంథము బోధిస్తున్నది.14 బాధపడే సమయాలలో మిమ్మల్ని ఆదరించి, బలపరచుటకు యేసు క్రీస్తు ఇచ్చే శక్తిని మీరు ఎలా పొందగలరు? అతి ముఖ్యమైనది, ఆయనతో మీరు చేసిన నిబంధనలను పాటించుట ద్వారా రక్షకునితో మిమ్మల్ని బంధించుకొనుట. మనము యాజకత్వపు విధులు పొందినప్పుడు ఈ నిబంధనలను మనము చేస్తాము.15

ఆల్మా యొక్క జనులు బాప్తీస్మపు నిబంధనలో ప్రవేశించారు. తరువాత వారు దాస్యమును అనుభవించారు మరియు బహిరంగంగా ఆరాధించుటకు లేక బిగ్గరగా ప్రార్థించడానికి కూడా నిషేధించబడ్డారు. అయినప్పటికీ, వారు తమ హృదయాలలో మౌనంగా ప్రార్థించుట ద్వారా తమ నిబంధనలను ఉత్తమంగా పాటించారు. ఫలితంగా, దైవిక శక్తి వచ్చింది. “వారి భారములను సునాయాసముగా భరించునట్లు ప్రభువు వారిని బలపరచెను.”16

“ప్రతి ఆలోచనలో నా వైపు చూడుడి; సందేహించవద్దు, భయపడవద్దు”17 అని మన కాలములో రక్షకుడు ఆహ్వానిస్తున్నారు. ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకుంటామని చేసిన మన సంస్కార నిబంధనను మనము పాటించినప్పుడు, ఆయన ఆత్మ మనతో ఎల్లప్పుడు ఉంటుందని ఆయన వాగ్దానము చేస్తున్నారు. శ్రమలను సహించడానికి మరియు మన స్వంతంగా చేయడానికి సాధ్యము కాని దానిని చేయడానికి ఆత్మ మనకు బలమిస్తుంది. “ఈ స్వస్థతలో కొంతభాగము మరొక లోకములో సంభవించును”18 అని అధ్యక్షులు జేమ్స్ ఈ. ఫౌస్ట్ బోధించినప్పటికీ, ఆత్మ మనల్ని స్వస్థపరచగలదు.

మనము దేవాలయ నిబంధనలు మరియు విధుల చేత కూడా దీవించబడ్డాము, అక్కడ “దైవత్వము యొక్క శక్తి ప్రత్యక్షపరచబడుతుంది.”19 ఒక భయంకరమైన ప్రమాదంలో యువ కుమార్తెను, తరువాత క్యాన్సర్‌తో తన భర్తను కోల్పోయిన ఒక స్త్రీని నేను దర్శించాను. ఆటువంటి నష్టమును మరియు బాధను ఆమె ఎలా భరించగలిగిందని నేను అడిగాను. క్రమంగా దేవాలయ ఆరాధనలో పొందిన నిత్య కుటుంబమును గూర్చిన ఆత్మీయ భరోసాల నుండి ఆ బలము వచ్చిందని ఆమె జవాబిచ్చింది. వాగ్దానమివ్వబడినట్లుగా, ప్రభువు మందిరము యొక్క విధులు ఆమెకు దేవుని శక్తితో సాయుధపరిచాయి.20

నాల్గవది, ప్రతిరోజు ఆనందాన్ని కనుగొనడానికి ఎంచుకోండి. బాధపడేవారు నొప్పి అంతము లేకుండా కొనసాగుతుందని మరియు ఉపశమనము ఎప్పటికీ రాదని తరచుగా భావిస్తారు. ఏడ్వటం తప్పేమి కాదు.21 అయినప్పటికీ, రాత్రంతా మిక్కిలి నొప్పితో మీరు బాధపడుతూ మిమ్మల్ని మీరు కనుగొంటే, విశ్వాసమును ఎంచుకోవడం ద్వారా మీరు సంతోషముగల ప్రకాశమైన ఉదయాలందు మేల్కొగలరు.22

ఉదాహరణకు, క్యాన్సర్‌కు చికిత్స పొందుచున్న ఒక యౌవన తల్లిని నేను సందర్శించాను, ఆమె జుట్టు లేకపోయినా, నొప్పిని లక్ష్యపెట్టకుండా తన కూర్చీలో చాలా అందంగా నవ్వుతున్నది. వారు పిల్లలను కనలేకపోయినప్పటికీ, యువతకు నాయకులుగా సంతోషంగా సేవ చేస్తున్న ఒక మధ్య వయస్సుగల దంపతులను నేను కలుసుకున్నాను. కొన్ని రోజులలో చనిపోయే ఒక ప్రియమైన స్త్రీ—యౌవన మామ్మ, తల్లి మరియు భార్యతో—నేను కూర్చోన్నాను; అయినప్పటికీ ఆ కుటుంబము యొక్క కన్నీళ్ళ మధ్య నవ్వులు మరియు సంతోషమైన జ్ఞాపకాలున్నాయి.

బాధపడుచున్న ఈ పరిశుద్ధులు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించిన దానికి మాదిరికరముగా ఉన్నారు:

“మనము అనుభవించు సంతోషము మన జీవితపు పరిస్థితులతో పెద్దగా సంబంధము లేదు మరియు మన జీవితముల యొక్క దృష్టితో పూర్తి సంబంధము కలిగియున్నది.

మన జీవితాల యొక్క దృష్టి అంతా దేవుని రక్షణ ప్రణాళిక పైన … యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పైన ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఏమి జరుగుతోంది—ఏమి జరగడం లేదు—అనేదానితో సంబంధం లేకుండా మనం ఆనందమును అనుభవించగలము.”23

బాధపడుతున్న తన పరిశుద్ధులను మన పరలోక తండ్రి జ్ఞాపకం చేసుకుంటారని, మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మరియు మిమ్మల్ని సన్నిహితంగా ఎరుగునని నేను సాక్ష్యమిస్తున్నాను.24 మీరు ఎలా భావిస్తున్నారో మన రక్షకుడు ఎరుగును. “నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను.”25 నిబంధనలు పాటించుట శ్రమననుభవిస్తున్న వారికి బలమును మరియు ఆనందమును అందించుటకు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము యొక్క శక్తికి ద్వారములు తెరచునని రోజువారీ గ్రహీతగా26 నేనెరుగుదును.

బాధపడు వారందరికి, “ఆయన కుమారునియందు ఆనందము ద్వారా మీ భారములు తేలికగునట్లు దేవుడు మీకు అనుగ్రహిస్తారని”27 నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.