సర్వసభ్య సమావేశము
క్రీస్తులో ఎక్కువగా అగుట: వాలు యొక్క ఉపమానం
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


క్రీస్తులో ఎక్కువగా అగుట: వాలు యొక్క ఉపమానం

ప్రభువు సమయములో, మనం ఎక్కడ ప్రారంభించామన్నది కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామనేది చాలా ముఖ్యమైనది.

చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు, నాకు గొప్ప ఆకాంక్షలు ఉండేవి. ఒక రోజు పాఠశాల ముగిసిన తర్వాత నేను ఇలా అడిగాను: “అమ్మా, నేను పెద్దవాడినైనప్పుడు ఏమి అవ్వాలి: వృత్తిపరమైన బాస్కెట్‌బాల్ ఆటగాడినా లేదా ప్రఖ్యాత గాయకుడినా?” దురదృష్టవశాత్తు, ఏ ప్రతిభలు లేని క్లార్క్ భవిష్యత్తు క్రీడాకారుడిగా లేదా సంగీత వైభవంగల వ్యక్తిగా ఏ సూచనలను చూపించలేదు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, నా పాఠశాల అధునాతన విద్యా కార్యక్రమానికి ప్రవేశం పలుమార్లు నిరాకరించబడింది. చివరకు నా ఉపాధ్యాయులు నేను ప్రామాణిక తరగతి గదికి కట్టుబడి ఉండాలని సూచించారు. కాలక్రమేణా, నష్టపరిహార అధ్యయన అలవాట్లను నేను అభివృద్ధి చేసుకున్నాను. కానీ జపాన్‌లో సువార్తసేవ చేసే వరకు నా మేధోపరమైన మరియు ఆత్మీయ అవకాశాలు కనిపించడం ప్రారంభించాయని నేను భావించలేదు. నేను కష్టపడి పనిచేయడం కొనసాగించాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా, నేను నా అభివృద్ధిలో దేవుని సహాయాన్ని క్రమపద్ధతిలో తీసుకొన్నాను మరియు అది నాలో మార్పుకు కారణమయింది.

చిత్రం
యువకునిగా ఎల్డర్ గిల్బర్ట్
చిత్రం
సువార్తికునిగా ఎల్డర్ గిల్బర్ట్

సహోదర సహోదరీలారా, ఈ సంఘములో మనము దేవుని పిల్లలందరి యొక్క దైవిక సామర్థ్యాన్ని మరియు క్రీస్తులో మరింతగా మారగల మన సామర్థ్యాన్ని నమ్ముతాము. ప్రభువు సమయములో, మనం ఎక్కడ ప్రారంభించామన్నది కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామనేది చాలా ముఖ్యమైనది.1

ఈ సూత్రాన్ని ప్రదర్శించడానికి, నేను కొంత ప్రాథమిక గణితాన్ని ఉపయోగిస్తాను. ఇప్పుడు, సర్వసభ్య సమావేశంలో గణితం అనే పదాన్ని విన్నప్పుడు భయపడవద్దు. అనుభవము లేనివారు కూడా ఈ ముఖ్యాంశాన్ని గ్రహించగలరని మా బివైయు–ఐడహో గణిత అధ్యాపకులు నాకు హామీ ఇచ్చారు. ఒక రేఖ యొక్క సూత్రముతో ఇది మొదలవుతుంది. ఇప్పుడు మన ఉపయోగము నిమిత్తము అంతరఖండం మన రేఖ యొక్క ఆరంభము అనుకోండి. అంతరఖండం అధిక లేదా తక్కువ ప్రారంభ స్థానాన్ని కలిగియుండవచ్చు. రేఖ యొక్క వాలు అప్పుడు సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు.

చిత్రం
Slopes and intercepts

మనమందరం జీవితంలో వేర్వేరు అంతరఖండాలను కలిగి ఉన్నాము—మనం వివిధ ప్రదేశాలలో విభిన్న ప్రతిభలు మరియు జీవిత వరాలతో ప్రారంభిస్తాము. కొందరు మంచి ఆరోగ్యముతో మరియు సఫలము కావడానికి తగినన్ని అవకాశాలతో జన్మించారు. ఇతరులు సవాలుగా మరియు అన్యాయంగా అనిపించే ప్రారంభ పరిస్థితులను ఎదుర్కొంటారు.2 అప్పుడు మనం వ్యక్తిగత అభివృద్ధి యొక్క వాలు వెంట పురోగమిస్తాము. మన భవిష్యత్తు మన ప్రారంభ స్థానం ద్వారా చాలా తక్కువగా నిర్ణయించబడుతుంది మరియు మన వాలు ద్వారా చాలా ఎక్కువగా నిర్ణయించబడుతుంది. మనం ఎక్కడ ప్రారంభించినప్పటికీ, యేసు క్రీస్తు మన దైవిక సామర్థ్యాన్ని చూస్తారు. ఆయన దానిని బిచ్చగాడు, పాపి, మరియు వైకల్యము గలవానిలో చూసారు. ఆయన దానిని జాలరి, పన్ను వసూలు చేసే వ్యక్తి మరియు అత్యుత్సాహవంతుడిలో కూడా చూసారు. మనం ఎక్కడ మొదలుపెట్టినప్పటికీ, మనకు ఇవ్వబడిన దానితో మనం ఏమి చేస్తామో అని క్రీస్తు పరిశీలిస్తారు.3 ప్రపంచం మన అంతరఖండంపై దృష్టి పెడుతుండగా, దేవుడు మన వాలుపై దృష్టి పెడతారు. ప్రభువు ఉపయోగించే గణాంక విధానములో, మన వాలులను పరలోకం వైపు మళ్ళించడంలో ఆయన మనకు తనవంతు సహాయాన్ని చేస్తారు.

ఈ సూత్రం కష్టపడేవారికి ఓదార్పునివ్వాలి మరియు అన్ని ప్రయోజనాలు ఉన్నట్లు అనిపించే వారికి విరామం ఇవ్వాలి. పేదరికం, విద్యకు పరిమిత ప్రవేశము, సవాలుతో కూడిన కుటుంబ పరిస్థితులు వంటి కష్టతరమైన ప్రారంభ పరిస్థితులతో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడడం ద్వారా నేను ప్రారంభిస్తాను. ఇతరులు శారీరక సవాళ్ళు, మానసిక ఆరోగ్య పరిమితులు లేదా బలమైన జన్యుపరమైన పూర్వ వైఖరిని ఎదుర్కొనవచ్చు.4 కష్టమైన ప్రారంభ పరిస్థితులతో పోరాడుతున్న వారెవరైనా సరే, మన పోరాటాలు రక్షకుడికి తెలుసు అని దయచేసి గుర్తించండి. “… ఆయన ప్రేగులు కనికరముతో నిండవలెనని, [మన] బలహీనతలను బట్టి [మనల్ని] ఎట్లు ఆదరించవలెనో … ఆయన ఎరుగునట్లు ఆయన [మన] బలహీనతలను తనపైన [తీసుకొనెను].” 5

కష్టతరమైన ప్రారంభ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ప్రోత్సాహాన్ని అందించే రెండు పరిధులను నన్ను పంచుకోనివ్వండి. మొదట, మీరు ఎక్కడ ప్రారంభించారో అనేదానిపైన కాకుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారనే దానిపై దృష్టి పెట్టండి. మీ పరిస్థితులను విస్మరించడం తప్పు—అవి వాస్తవమైనవి మరియు వాటిని పరిష్కరించవలసిన అవసరం ఉంది. కానీ కష్టమైన ప్రారంభ బిందువుపై ఎక్కువ దృష్టి పెట్టడం వలన అది మిమ్మల్ని నిర్వచించగలదు మరియు ఎంచుకునే మీ సామర్థ్యాన్ని కూడా అడ్డుకోగలదు. 6

చిత్రం
బోస్టన్‌లో యువకులు

అనేక సంవత్సరాల క్రితం, నేను మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో అంతర్-నగర యువ బృందంతో పనిచేసాను, వారికి సువార్త మరియు సంఘము యొక్క అంచనాలు చాలా క్రొత్తగా ఉన్నాయి. వారి పరిస్థితి పట్ల నా సానుభూతి మరియు ఆందోళన దేవుని ప్రమాణాలను తగ్గించాలనే కోరికతో నన్ను శోధించేదిగా ఉన్నది.7 నా అంచనాలను ఎన్నటికీ తగ్గించకుండా ఉండడమే నా ప్రేమను చూపించడానికి గల అత్యంత శక్తివంతమైన మార్గం అని నేను చివరికి గ్రహించాను. ఏమి చేయాలోనని నాకు తెలిసినదంతా కూడగట్టుకొని, మేము వారి సామర్థ్యంపై దృష్టి పెట్టాము మరియు వారిలో ప్రతి ఒక్కరు సానుకూల దిశలో పురోగతి సాధించడం ప్రారంభించారు. సువార్తలో వారి పెరుగుదల క్రమంగా, స్థిరంగా ఉంది. నేడు, వారు సువార్తసేవ చేసారు, కళాశాల నుండి పట్టభద్రులయ్యారు, దేవాలయంలో వివాహం చేసుకున్నారు మరియు అద్భుతమైన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలను గడుపుతున్నారు.

చిత్రం
బోస్టన్‌ యువకులు పెరిగి పెద్దవారైయ్యారు

రెండవది, సానుకూల దిశలో పురోగతి సాధించే ప్రక్రియలో ప్రభువును చేర్చండి. ప్రపంచవ్యాప్త బివైయు–పాథ్‌వే అధ్యక్షునిగా పనిచేస్తున్నప్పుడు, పెరూలోని లిమాలో ఎల్డర్ కార్లోస్ ఎ. గొడోయ్ ప్రసంగీకునిగా ఉన్న పెద్ద భక్తికూడికలో కూర్చోవడం నాకు గుర్తుంది. ఆయన జనసమూహాన్ని చూసినప్పుడు, చాలామంది నమ్మకమైన మొదటి తరం విశ్వవిద్యాలయ విద్యార్థులను చూసి ఆయన భావోద్వేగానికి లోనైయ్యారు. బహుశా అలాంటి పరిస్థితులగుండా ప్రయాణించిన తన స్వంత త్రోవ గురించి ఆలోచిస్తూ, ఎల్డర్ గొడోయ్ భావోద్వేగంతో ఇలా చెప్పారు: “మీకు మీరు సహాయం చేసుకోగల దానికంటే ప్రభువు ఎక్కువ సహాయం చేస్తారు.” [కాబట్టి] ఈ ప్రక్రియలో ప్రభువును చేర్చండి.”8 ప్రవక్తయైన నీఫై ఇలా బోధించారు “సమస్తము చేసిన తర్వాత కూడా మనము కృప చేతనే రక్షింపబడియున్నాము.”9 మనం మన వంతు కృషి చేయాలి,10 కానీ ఆయన దయ ద్వారా మాత్రమే మన దైవిక సామర్థ్యాన్ని సాధించగలం.11

చిత్రం
పెరులోని లిమాలో బివైయు-పాథ్‌వే భక్తికూడిక
చిత్రం
పెరులోని లిమాలో మాట్లాడుతున్న ఎల్డర్ గొడోయ్

చివరగా, మరిన్ని అవకాశాలున్న పరిస్థితుల్లో జన్మించిన వారికి రెండు పరిధుల కొరకు సలహాను నన్ను పంచుకోనివ్వండి. మొదట, మనకు మనం సృష్టించియుండని పరిస్థితుల కోసం కొంత వినయాన్ని చూపించగలమా? బివైయు మాజీ అధ్యక్షులు రెక్స్ ఇ. లీ తన విద్యార్థులకు ఉదహరించినట్లుగా, “మనమంతా మనము త్రవ్వని బావుల నుండి త్రాగాము మరియు మనం వేయని మంటల ద్వారా వెచ్చదనాన్ని పొందాము.”12 మునుపటి అగ్రగాములు నిర్మించిన విద్యా బావులను తిరిగి ఇచ్చి, అభివృద్ధి చేయమని తరువాత అధ్యక్షులు లీ తన విద్యార్ధులకు పిలుపునిచ్చారు. ఇతరులు నాటిన పొలాలలో తిరిగి విత్తనాలు వేయడంలో వైఫల్యం, వృద్ధిలేకుండా ప్రతిభను తిరిగి ఇవ్వడంతో సమానం.

రెండవది, మరిన్ని అవకాశాలున్న పరిస్థితుల్లో జన్మించడంపై దృష్టి పెట్టడం వలన మనం అభివృద్ధి చెందుతున్నామనే భావన తరచుగా మనల్ని చిక్కుల్లో పడేలా చేస్తుంది. వాస్తవానికి, మన అత్మీయాభివృద్ధి వృద్ధిలేకుండా నిశ్చలంగా ఉండవచ్చు. చాలా విజయవంతమైన వ్యక్తులు అత్యంత వినయము గలవారని, ఎందుకంటే వారు సరిదిద్దబడడానికి మరియు ఎవరినుండి అయినా నేర్చుకోవడానికి తగినంత ఆత్మవిశ్వాసంతో ఉంటారని హార్వర్డ్ ఆచార్యులు క్లేటన్ ఎం. క్రిస్టెన్‌సెన్ బోధించారు.13 “దిద్దుబాటును అంగీకరించడానికి మరియు కోరడానికి కూడా ఇష్టపూర్వకంగా మార్గాలను కనుగొనమని”14 ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ మనకు సలహా ఇచ్చారు. అంతా సవ్యంగా జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ, మనం ప్రార్థనాపూర్వకమైన విజ్ఞాపన ద్వారా మెరుగుపరచుకొనే అవకాశాలను వెదకాలి.

మనం కష్టతరమైన లేదా సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో ప్రారంభించినప్పటికీ, దేవుడిని మన భాగస్వామిగా చేసినప్పుడు మాత్రమే మన అంతిమ సామర్థ్యాన్ని సాధించగలమని మనము గ్రహిస్తాము. బివైయు–పాథ్‌వే విద్యార్థుల విజయం గురించి విచారణ చేస్తున్న జాతీయ స్థాయి ప్రముఖ విద్యావేత్తతో నేను ఇటీవల సంభాషించాను. అతడు తెలివైనవాడు మరియు అతని విచారణ నిజాయితీగా ఉంది, కానీ అతను స్పష్టంగా లౌకిక ప్రతిస్పందనను కోరుకున్నాడు. మా కొనసాగింపు కార్యక్రమాలు మరియు మార్గదర్శక ప్రయత్నాలను నేను అతనితో పంచుకున్నాను. కానీ నేను ఇలా చెప్పి ముగించాను, “ఇవన్నీ మంచి పద్ధతులు, కానీ మా విద్యార్థులు అభివృద్ధి చెందడానికి అసలైన కారణం వారి దైవిక సామర్థ్యాన్ని మేము వారికి బోధించడమే. మీ జీవితమంతా, మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్పినట్లయితే ఎలా ఉంటుందో ఊహించండి. తరువాత మీరు దైవిక సంభావ్యత కలిగిన దేవుని కుమారుడు లేదా కుమార్తె అని బోధించడం వలన కలిగే ప్రభావాన్ని పరిగణించండి.” అతడు ఒక్క క్షణం ఆగిన తరువాత, “అది శక్తివంతమైనది” అని సమాధానమిచ్చాడు.

సహోదర సహోదరీలారా, ప్రభువు యొక్క సంఘంలోని అద్భుతాలలో ఒకటి ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరు క్రీస్తులో ఎక్కువ కావచ్చు. సేవ చేయడానికి, తిరిగి ఇవ్వడానికి, పశ్చాత్తాపపడడానికి మరియు మంచి వ్యక్తులుగా మారడానికి తన సభ్యులకు మరిన్ని అవకాశాలను ఇచ్చే మరే ఇతర సంస్థ గురించి నాకు తెలియదు. మనం కష్టతరమైన లేదా సమృద్ధిగా ఉన్న పరిస్థితులలో ప్రారంభించినప్పటికీ మన దృష్టిని, అభివృద్ధిని పరలోకమువైపు కొనసాగిద్దాము. మనం అలా చేసినప్పుడు, క్రీస్తు మనలను ఉన్నత స్థానానికి హెచ్చిస్తారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. క్లార్క్ జి. గిల్బర్ట్, “The Mismeasure of Man” (BYU–Pathway Worldwide devotional, Jan. 12, 2021), byupathway.org/speeches చూడండి. ఈ సందేశంలో, ప్రపంచం తరచుగా మానవ సామర్థ్యాన్ని ఎలా తప్పుగా అంచనా వేస్తుందో నేను అన్వేషించాను. గ్రిట్ (ఏంజెలా డక్‌వర్త్) మరియు గ్రోత్ మైండ్‌సెట్ (కరోల్ ఎస్. డ్వెక్) భావనలను సమర్ధించే ప్రముఖ మనస్తత్వవేత్తలు కూడా వారు నేర్చుకున్న నమూనాలపై మాత్రమే ఆధారపడేటప్పుడు మరియు క్రీస్తులో మన దైవిక సామర్థ్యాన్ని విస్మరించినప్పుడు నిజమైన మానవ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తారు.

  2. Dale G. Renlund, “Infuriating Unfairness,” Liahona, May 2021, 41–45 చూడండి.

  3. మత్తయి 25:14-30 చూడండి. తలాంతుల ఉపమానంలో, ప్రతి దాసుడు తమ యజమాని నుండి విభిన్న సంఖ్యలో తలాంతులను పొందాడు. వారు పొందిన దానిచేత తీర్పు నిర్ణయించబడలేదు, కానీ అది ఎలా నిర్వహించబడిందనే దానిపై ఆధారపడి తీర్పుతీర్చబడింది. ఆ వృద్ధియే ప్రభువు “భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిమీద నియమించెదను” అని చెప్పుటకు నడిపించింది (మత్తయి 25:21).

  4. మోషైయ 3:19 చూడండి. విభిన్న జన్యు పూర్వ స్థితులను బట్టి ప్రకృతి సంబంధియైన మనుష్యుని ప్రభావానికి మనం గురికావడం భిన్నంగా ఉండవచ్చు. మనలో ప్రతి ఒక్కరికి వేర్వేరు వరములు ఇవ్వబడినట్లుగా, మనము కూడా వివిధ శారీరక, మానసిక మరియు భావోద్వేగ సవాళ్ళను కలిగియున్నాము, వీటిని మనం సంభాళించడం మరియు అధిగమించడం తప్పక నేర్చుకోవాలి.

  5. ఆల్మా 7:11–12. పశ్చాత్తాపం ద్వారా మన పాపాలను జయించడానికి మనకు సహాయం చేయడమే కాకుండా, మన జీవిత కష్టాలలో మనల్ని ఎలా ఓదార్చాలో క్రీస్తుకు తెలుసు, ఎందుకంటే ప్రాయశ్చిత్తం ద్వారా ఆయన మానవ బాధలన్నింటినీ అధిగమించారు.

  6. మనకు మనమే ప్రతినిధులమని మరియు మనకై మనం వ్యవహరించాలని ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గుర్తు చేస్తున్నారు. ప్రపంచం ఇచ్చే బిరుదుల ద్వారా మనల్ని మనం నిర్వచించుకున్నప్పుడు, మన దైవిక సామర్థ్యాన్ని పరిమితం చేస్తాము, మరియు అలా చేయడంలో, ఎంచుకునే మన సామర్థ్యాన్ని పరిమితం చేస్తాము. (David A. Bednar, “And Nothing Shall Offend Them,” Liahona, Nov. 2006, 89–92 చూడండి.)

  7. Russell M. Nelson, “The Love and Laws of God” (Brigham Young University devotional, Sept. 17, 2019), speeches.byu.edu చూడండి. ఈ బివైయు భక్తికూడికలో, అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారురు, దేవుడు మరియు ఆయన కుమారుడు మనల్ని ప్రేమిస్తున్నారు గనుక, వారు మనకు సహాయపడే చట్టాలు మరియు అంచనాలను ఇచ్చారు. “దేవుని చట్టాలు మనలో ప్రతి ఒక్కరి పట్ల ఆయన పరిపూర్ణ ప్రేమను ప్రతిబింబిస్తాయి. ఆయన చట్టాలు మనల్ని ఆధ్యాత్మికంగా సురక్షితంగా ఉంచుతాయి మరియు శాశ్వతంగా అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి.”(2వ పేజీ).

  8. Carlos A. Godoy, BYU–Pathway Connections Conference, Lima, Peru, May 3, 2018.

  9. 2 నీఫై 25:23.

  10. నా తల్లిదండ్రులు “మీవంతు కృషి చేయండి” అని గిల్బర్ట్ ఉమ్మడి కుటుంబ నినాదాన్ని స్థాపించారు. వాలు యొక్క దృష్టాంతాన్ని రూపొందించడానికి మరొక విధానము ఏమిటంటే, మనం మన వంతు కృషి చేస్తే, దేవుడు ముందుకు వచ్చి వ్యత్యాసాన్ని పూరిస్తారని మనం నమ్మగలము.

  11. Clark G. Gilbert, “From Grit to Grace” (BYU–Pathway Worldwide devotional, Sept. 25, 2018), byupathway.org/speeches చూడండి. కష్టపడి పనిచేయడం మరియు క్రమశిక్షణ యొక్క ప్రభావవంతమైన నమూనాలను అభివృద్ధి చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, యేసు క్రీస్తులో మన నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడం కోసం మనం ఆయన కృపను పొందడం నేర్చుకోవాలనే ఆలోచనను ఈ సందేశంలో నేను పరిశోధించాను.

  12. Rex E. Lee, “Some Thoughts about Butterflies, Replenishment, Environmentalism, and Ownership” (Brigham Young University devotional, Sept. 15, 1992), 2, speeches.byu.edu; ద్వితీయోపదేశకాండము 6:11 కూడా చూడండి.

  13. See Clayton M. Christensen, “How Will You Measure Your Life?,” Harvard Business Review, July–Aug. 2010, hbr.org చూడండి. ఈ సందేశం వాస్తవానికి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేషన్‌తో ముడిపడి ఉన్న క్లాస్ డే ఉపన్యాసంగా ఇవ్వబడింది. తన సందేశంలో, ఆచార్యులు క్రిస్టెన్‌సెన్ తన విద్యార్థులను వినయం నుండి విశ్వాసాన్ని వేరుచేయకూడదని హెచ్చరించారు. జీవితాంతం పురోగతిని కొనసాగించడానికి వారు దిద్దుబాటు కోరడానికి మరియు ఇతరుల నుండి నేర్చుకోవడానికి తగినంత వినయంగా ఉండాలని వారికి గుర్తు చేశారు.

  14. D. Todd Christofferson, “As Many as I Love, I Rebuke and Chasten,” Liahona, May 2011, 97