సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
అభ్యాసకులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సహాయము చేయండి


“అభ్యాసకులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సహాయము చేయండి,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“అభ్యాసకులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సహాయము చేయండి,” రక్షకుని విధానములో బోధించుట

చిత్రం
పిల్లలతో కూర్చొనియున్న యేసు

యేసు క్రీస్తు సువార్త యొక్క బోధకులుగా ఆయన బోధనలు, శక్తి మరియు ప్రేమను ఇతరులు అర్థం చేసుకొని, వాటిపై ఆధారపడుటకు మనం సహాయము చేస్తాము.

అభ్యాసకులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు సహాయము చేయండి

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తులను తెలుసుకొని, వారి ప్రేమను అనుభవించడంలో అభ్యాసకులకు సహాయపడుట కంటే ఎక్కువగా ఒక బోధకునిగా మీరు చేసేదేదీ అభ్యాసకులను దీవించదు (యోహాను 17:3 చూడండి). పరలోక తండ్రిని మరియు రక్షకుడిని తెలుసుకొని, ప్రేమించడానికి మీకు సహాయపడిన అనుభవాల గురించి ఆలోచించండి. వారి లక్షణాలు, శక్తి మరియు ప్రేమ గురించి తెలుసుకొనుటకు మీరేమి చేసారు? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పట్ల మీకున్న ప్రేమ మీకు ఏవిధంగా ఆనందాన్ని తీసుకువచ్చింది? తరువాత, మీరు బోధించే ప్రతీ వ్యక్తి కొరకు వారి ప్రేమ మరియు శక్తి ఏమి చేయగలదో ఆలోచించండి. (ఆల్మా 26:16 ; మోషే 5:11 చూడండి.)

ఈ జీవితంలో మన అంతిమ లక్ష్యం మన పరలోక తండ్రిలా మారి, ఆయన యొద్దకు తిరిగి వెళ్ళడం. ఆ లక్ష్యాన్ని మనం యేసు క్రీస్తు యొద్దకు రావడం ద్వారా సాధిస్తాము. (యోహాను 14:6 చూడండి). ఈ కారణము చేత, నీఫై ప్రవక్త బోధించినట్లుగా, “మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము, క్రీస్తు నందు ఆనందించుచున్నాము” (2 నీఫై 25:26).

దేవుని యొక్క ప్రతీ బిడ్డకు రక్షకుని నుండి వచ్చే వెలుగు, సత్యము అవసరము మరియు దానికి ప్రతిస్పందించడానికి వారు ఎంపిక చేయగలరు. యేసు క్రీస్తు సువార్త యొక్క బోధకునిగా ఉండడమంటే అర్థము, ఆయన బోధనలు, విమోచన శక్తి మరియు పరిపూర్ణమైన ప్రేమను అర్థం చేసుకొని, వాటిపై ఆధారపడేలా ఇతరులకు సహాయపడడం. యేసు క్రీస్తును మరింత శ్రేష్ఠముగా తెలుసుకొని, ఆయనను అనుసరించేలా ఇతరులను ప్రేరేపించుటకు క్రింది ఉపాయములు మీకు ఎలా సహాయపడగలవో పరిశీలించండి.

వారి జీవితాలలో ప్రభువు యొక్క ప్రేమ, శక్తి మరియు దయను గుర్తించుటకు అభ్యాసకులకు సహాయము చేయండి

రక్షకుని ప్రేమ, శక్తి మరియు దయ గురించి తెలుసుకొనుట మంచిదే, కానీ మనం కూడా దానిని అనుభవించాలి. లేఖనాలలో ఆయన ప్రజలను ఏవిధముగా దీవించి, స్వస్థపరిచారో చూడడం, ఆయన మనలను దీవించగలరు మరియు స్వస్థపరచగలరనే గొప్ప విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, మనం ఉపమానముగా చెప్పబడిన మన స్వంత సింహాల గుహను ఎదుర్కొన్నప్పుడు ప్రభువును విశ్వసించేలా దానియేలు అనుభవాలు మనల్ని ప్రేరేపించకపోతే, వాటి గురించి తెలుసుకోవడం అసంపూర్ణంగా ఉంటుంది.

లేఖనాలలో మరియు వారి స్వంత అనుభవాలలో ప్రభువు యొక్క “మృదు కనికరములను” (1 నీఫై 1:20) గుర్తించడంలో మీరు అభ్యాసకులకు సహాయం చేసినప్పుడు, ప్రభువు వారితో ఉన్నారని మరియు ప్రేమతో వారికి అండగా నిలుస్తారని వారు అనుభూతి చెందుతారు మరియు తెలుసుకుంటారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:6 చూడండి). వారు తమ వ్యక్తిగత అవసరాలలో, పరిస్థితులలో ప్రభువు ప్రేమ మరియు దయ యొక్క వాస్తవికతను చూసి, అనుభూతి చెందుతారు.

చిత్రం
కొండమీది ప్రసంగము చేస్తున్న యేసు

రక్షకుని ప్రేమ, శక్తి మరియు దయను అనుభవించడానికి బోధకులు అభ్యాసకులకు సహాయపడగలరు.

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో వారి సంబంధాన్ని బలోపేతం చేసుకొనుటకు అభ్యాసకులకు సహాయము చేయండి

యేసు క్రీస్తును గూర్చి బోధించుట మరియు నేర్చుకొనుట యొక్క ఉద్దేశ్యమేమనగా, ప్రతీ వ్యక్తి ఆయనకు మరియు మన పరలోక తండ్రికి దగ్గరగుటలో సహాయము చేయుటయే. మీరు బోధించే వ్యక్తులు ఆ ఉద్దేశ్యమును ఎప్పటికీ మరిచిపోకుండా ఉండుటకు సహాయం చేయండి. లేఖనాలను అధ్యయనం చేయుట, నిరంతరం పశ్చాత్తాపపడుట, ప్రార్థనలో తండ్రితో మాట్లాడుట, తండ్రి మరియు కుమారుని గురించి సాక్ష్యమిచ్చుట ద్వారా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో వారి సంబంధాన్ని బలోపేతం చేసుకోమని వారిని ప్రోత్సహించండి. నిబంధనలను చేసి, పాటించడం మనల్ని వారితో ఎలా బంధిస్తుందో మాటల ద్వారా మరియు మాదిరి ద్వారా అభ్యాసకులకు నేర్పించండి. మనం వారికి ఎంత అమూల్యమైనవారమో మరియు ప్రియమైనవారమో తెలుసుకొనుటకు వారికి సహాయపడండి. తన పరిపూర్ణ ప్రాయశ్చిత్తం యొక్క సుగుణము ద్వారా యేసు క్రీస్తు మన తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళుటకు గల ఏకైక మార్గమనే వారి విశ్వాసాన్ని బలోపేతం చేయండి. “తండ్రి మరియు కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చు” పరిశుద్ధాత్మ నుండి సాక్ష్యాన్ని పొందేందుకు అభ్యాసకులకు అవకాశాలను కల్పించండి (మోషే 5:9).

ఉద్దేశపూర్వకంగా యేసు క్రీస్తు వలె ఎక్కువగా ఉండుటకు కృషి చేయడంలో అభ్యాసకులకు సహాయము చేయండి

చివరకు, యేసు క్రీస్తును గూర్చి తెలుసుకొనుట ఆయనలా మరింతగా మారుటకు మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ ఆయన మాదిరిని అనుసరించుటకు మరియు ఆయన కృపను పొందుటకు ఉద్దేశపూర్వకంగా ఎంపికలు చేస్తూ, తరగతిలో మరియు వెలుపల విశ్వాసంతో ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆయన వలె మారడం జరుగుతుంది. వారు రక్షకుని వలె మారగల మార్గాలను గుర్తించుటకు పరిశుద్ధాత్మ సహాయమును కోరమని అభ్యాసకులను ఆహ్వానించండి. అభ్యాసకులు ఆయన వలె ఉండాలనే తపనను జీవితకాల సాధనగా చేస్తున్నప్పుడు మార్గదర్శకత్వమును మరియు సహకారమును అందించండి.

“లోకము ఆరంభమైనప్పటి నుండి ఇవ్వబడియున్న సమస్తము” మనకు యేసు క్రీస్తును గూర్చి బోధించగలవని జేకబ్ బోధించెను (2 నీఫై 11:4). మీ బోధన అటువంటి వాటిలో ఒకటి కావచ్చు. ప్రతీ బోధన మరియు అభ్యాస అనుభవానికి కేంద్రంగా యేసు క్రీస్తును ఉంచండి. మీరు మరియు అభ్యాసకులు “క్రీస్తును గూర్చి మాట్లాడుచూ, … క్రీస్తు నందు ఆనందించుచూ, … క్రీస్తును గూర్చి బోధించుచున్నప్పుడు” (2 నీఫై 25:26), పరిశుద్ధాత్మ ప్రతీ వ్యక్తి మనస్సులో మరియు హృదయములో రక్షకుని యొక్క సాక్ష్యాన్ని లోతుగా నాటగలరు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి తమకైతాము తెలుసుకొనుటకు మీ అభ్యాసకులకు మీరు సహాయం చేసినప్పుడు, వారు తమ జీవితాలంతటా సహాయం, నిరీక్షణ మరియు స్వస్థత కోసం వారి వైపు తిరిగే అవకాశం ఉంటుంది.