సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించండి


“శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించండి,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించండి,” రక్షకుని విధానములో బోధించుట

చిత్రం
పేతురును తుఫాను నీళ్ళ నుండి బయటకు లాగుతున్న యేసు

విశ్వాసానికి ముగింపుకర్త, జే. ఆలన్ బ్యారెట్ చేత

శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించండి

రక్షకుడు నీటిపై నడవడాన్ని చూడడం ఖచ్చితంగా విస్మయాన్ని కలిగిస్తుంది. కానీ పేతురుకు అది సరిపోలేదు. రక్షకుడు ఏమి చేసెనో దానినే చేయాలని, ఆయన ఉన్న చోటనే ఉండాలని మరియు అదే అనుభవాన్ని తాను పొందాలని అతడు కోరుకున్నాడు. “నీళ్ళమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము” అని అతడు అడిగాడు. “రమ్ము” అని రక్షకుడు ఒక సాధారణ ఆహ్వానంతో ప్రతిస్పందించారు. దానితో, పేతురు పడవలోని భద్రత నుండి దూకి, శిష్యత్వం అనేది నిష్క్రియాత్మకమైన అనుభవం కాదని మనకు చూపించాడు (మత్తయి 14:24–33 చూడండి). దానికి క్రీస్తుపై విశ్వాసం మరియు శ్రద్ధగల కృషి అవసరం. కానీ అది రక్షకునితో నడిచే గొప్ప బహుమతిని కూడా తెస్తుంది.

“రమ్ము.” “వచ్చి చూడుడి.” “వచ్చి నన్ను వెంబడింపుము.” “వెళ్ళి ఆలాగు చేయుము” (మత్తయి 14:29; యోహాను 1:39; లూకా 18:22; 10:37). తన పరిచర్య ప్రారంభం నుండి, రక్షకుడు తాను అందించిన సత్యాలను, శక్తిని మరియు ప్రేమను స్వయంగా అనుభవించమని తన అనుచరులను ఆహ్వానించెను. నిజమైన అభ్యాసమంటే ఇదే గనుక ఆయన దీనిని చేసెను. దీని అర్థము వినుట లేదా చదువుట మాత్రమే కాదు; మారుట, పశ్చాత్తాపపడుట మరియు అభివృద్ధిచెందుట కూడా. రక్షకుని మాటలలో, అభ్యాసం “అధ్యయనము ద్వారా మరియు విశ్వాసము ద్వారా” వస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:118; వివరణ చేర్చబడింది). విశ్వాసములో మనంతట మనం పని చేయుట ఇమిడి ఉంటుంది గాని కేవలం మనపై పని చేయబడుట కాదు (2 నీఫై 2:26 చూడండి).

రక్షకుని మాదిరిని మనం అనుసరించినప్పుడు, అడగడానికి, వెదకడానికి మరియు తట్టడానికి, తరువాత కనుగొనడానికి మనం బోధించే వారిని మనం ఆహ్వానిస్తాము (మత్తయి 7:7–8 చూడండి). మరియు ఆ ఆహ్వానాన్ని మనకు మనముగా అంగీకరిస్తాము. కలిసి, క్రీస్తునందు మన స్వంత విశ్వాసం మరియు శ్రద్ధగల ప్రయత్నం ద్వారా, ఆయనతో నడవడం అంటే ఏమిటో మనం స్వయంగా తెలుసుకుంటాము.

శ్రద్ధగల అభ్యాసాన్ని ఆహ్వానించుటకు

  • అభ్యాసకులు తమ అభ్యాసానికి బాధ్యత వహించడంలో సహాయపడండి.

  • అనుదినము సువార్తను అధ్యయనం చేయడం ద్వారా రక్షకుని గురించి తెలుసుకునేలా అభ్యాసకులను ప్రోత్సహించండి.

  • నేర్చుకొనుటకు సిద్ధపడమని అభ్యాసకులను ఆహ్వానించండి.

  • వారు నేర్చుకుంటున్న సత్యాలను పంచుకునేలా అభ్యాసకులను ప్రోత్సహించండి.

  • వారు నేర్చుకుంటున్న వాటిని జీవించడానికి అభ్యాసకులను ఆహ్వానించండి.

వారి అభ్యాసానికి బాధ్యత వహించుటకు రక్షకుడు ఇతరులకు సహాయము చేసెను

మహాసముద్రాలను సురక్షితంగా దాటగల పడవలను నిర్మించడం ఎవరికైనా కష్టమైన పనే. జెరెడ్‌ యొక్క సహోదరుడు “ప్రభువు యొక్క హస్తము చేత నిరంతరము నిర్దేశింపబడుచూ” (ఈథర్ 2:6), పడవల ఆకృతి గురించి మరియు వాటికిలోకి ఏవిధంగా గాలిని ప్రసరింపజేయాలనే దాని గురించి సూచనలను అందుకున్నాడు. అయితే వెలుతురు అందించడం గురించి జెరెడ్‌ యొక్క సహోదరుడు అడిగినప్పుడు ప్రభువు ఎలా ప్రతిస్పందించారనే దాని గురించి మీరు ఏమి గమనించారు? (ఈథర్ 2:22–25 చూడండి). ఈ విధంగా తన విశ్వాసాన్ని సాధన చేయుటకు వచ్చిన ఆహ్వానం ద్వారా జెరెడ్‌ యొక్క సహోదరుడు ఎలా దీవించబడ్డాడు? (ఈథర్ 3:1–16 చూడండి).

అభ్యాసకులు తెలుసుకోవాలని మీరు భావించే అన్ని విషయాలను వారికి చెప్పడం సులభంగా అనిపించవచ్చు. అయితే, ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా సలహా ఇచ్చారు: “మన ఉద్దేశ్యం ‘నేను వారికి ఏమి చెప్పగలను?’ అని కాదు. బదులుగా, మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలు ఏమిటంటే ‘నేను వారిని ఏమి చేయమని ఆహ్వానించగలను? వారు ప్రతిస్పందించడానికి ఇష్టపడితే, వారి జీవితాలలోకి పరిశుద్ధాత్మను ఆహ్వానించడం ప్రారంభించే ఏ ప్రేరేపిత ప్రశ్నలను నేను అడుగగలను?’” (evening with a General Authority, Feb. 7, 2020, broadcasts.ChurchofJesusChrist.org).

వారి అభ్యాసానికి బాధ్యత వహించడానికి మీరు అభ్యాసకులను ఎలా ఆహ్వానించవచ్చో పరిగణించండి. ఉదాహరణకు, వారి స్వంత ప్రశ్నలు అడుగుటకు, సమాధానాల కొరకు శోధించుటకు, ధ్యానించుటకు మరియు వారి ఆలోచనలు, భావాలను పంచుకొనుటకు లేదా వ్రాయుటకు మీరు వారిని ఆహ్వానించవచ్చు. వారు ఆవిధంగా చేస్తున్నప్పుడు, వారు తమ విశ్వాసాన్ని బలపరుస్తారు, దేవుని వాక్యంలో సత్యాలను కనుగొంటారు మరియు ఆ సత్యాలతో వారి స్వంత అనుభవాలను కలిగి ఉంటారు. మన స్వంత అభ్యాసానికి బాధ్యత వహిస్తున్నప్పుడు, జోసెఫ్ స్మిత్ చేసినట్లుగా, “నాయంతట నేను తెలుసుకొనియున్నాను” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:20) అని మనం చెప్పగలము.

ధ్యానించవలసిన ప్రశ్నలు: అభ్యాసకులు తమ అభ్యాసంలో నిష్క్రియాత్మకంగా కాకుండా చురుకుగా ఉండడం ఎందుకు ముఖ్యం? వారి అభ్యాసానికి బాధ్యత వహించుటకు మీరు వారికి ఎలా సహాయపడగలరు? దీనిని చేయుటకు బోధకులు మీకు ఎలా సహాయం చేసారు? వారంతట వారు నేర్చుకోమని లేఖనములలో జనులు ఆహ్వానించబడిన ఏ ఉదాహరణలు మీరు ఆలోచించగలరు? మీరు బోధించే విధానాన్ని ఈ ఉదాహరణలు ఎలా ప్రభావితం చేస్తాయి?

లేఖనముల నుండి: 1 నీఫై 11; సిద్ధాంతము మరియు నిబంధనలు 9:7–8; 58:26–28; 88:118–125; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:11–20

తన వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆయన గురించి తెలుసుకోమని రక్షకుడు ఇతరులను ప్రోత్సహించెను

కడవరి దినములలో రక్షకుడు తన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటుచేసే సమయం వచ్చినప్పుడు, ఆయన తన సేవకులతో, “వ్రాయబడిన సంగతులపై ఆధారపడుము” అని చెప్పెను (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:3). నిజానికి, వారు దాదాపుగా అనువదించడం పూర్తి చేసిన మోర్మన్ గ్రంథములో, బాప్తిస్మము ఎలా ఇవ్వాలి, సంస్కారము ఎలా నిర్వహించాలి మరియు ఇతర విలువైన వివరాలతో సహా ఆ పనికి సంబంధించిన సహాయక సూచనలు ఉన్నాయి. అయితే రక్షకుడు తన బయల్పాటులను ఆయనను వినుటకు మరియు ఆయనను మరింత లోతుగా తెలుసుకునే అవకాశంగా తన సేవకులు చూడాలని కోరెను. “వాటిని మీకు చెప్పునది నా స్వరమే; …అందువలన, నా స్వరమును వింటిరని, నా మాటలు తెలియునని మీరు సాక్ష్యము చెప్పగలరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:35–36) అని ఆ బయల్పాటులోనే ఆయన వారికి చెప్పెను.

మీరు బోధించే వ్యక్తుల గురించి ఆలోచించండి. వారు లేఖన అధ్యయనాన్ని ఎలా చూస్తారు? ఆ విషయంలో, మీరు దానిని ఎలా చూస్తారు? ఇది రోజువారీ బాధ్యత కంటే ఎక్కువా? మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, రక్షకుడు మీతో నేరుగా మాట్లాడుచున్నట్లు మీకు అనిపిస్తుందా? అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “ఆయనను వినడానికి మనము ఎక్కడికి వెళ్ళగలము? మనం లేఖనాలకు వెళ్ళవచ్చు. … ప్రత్యేకించి ఉపద్రవం పెరుగుతున్న ఈ రోజుల్లో, ఆధ్యాత్మిక మనుగడకు దేవుని వాక్యంలో రోజువారీ నిమగ్నత చాలా ముఖ్యమైనది. మనం రోజూ క్రీస్తు మాటలను విందారగిస్తున్నప్పుడు, మనం ఎదుర్కోవలసి వస్తుందని మనం ఎప్పుడూ అనుకోని ఇబ్బందులకు ఎలా స్పందించాలో క్రీస్తు మాటలు మనకు చెబుతాయి” (“ఆయనను వినుము,” లియహోనా, మే 2020, 89). మీరు బోధిస్తున్నప్పుడు, రక్షకుడిని కనుగొనే ఉద్దేశ్యంతో లేఖనాలను అధ్యయనం చేయమని అభ్యాసకులను ప్రోత్సహించండి—ఆయన గురించి వచనాలు లేదా వాస్తవాలను కనుగొనడం మాత్రమే కాదు, ఆయనను కనుగొనాలనే ఉద్దేశ్యంతో కూడా. లేఖనాలలో అనుదినము ప్రభువు స్వరాన్ని వినుట అనేది జీవితకాలము శ్రద్ధతో, స్వతంత్రంగా సువార్తను నేర్చుకొనుటకు పునాది వంటిది.

ధ్యానించవలసిన ప్రశ్నలు: మీ స్వంత లేఖన అధ్యయన అలవాట్లను పరిగణించండి. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ఆయనతో మీ సంబంధాన్ని ఎలా బలోపేతం చేసింది? మీ అధ్యయనాన్ని మెరుగుపరచుకొనుటకు మీరు ఏమి చేయగలరు? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మరియు క్రమంగా అధ్యయనం చేయడానికి మీరు ఇతరులను ఎలా ప్రేరేపిస్తారు? ఆవిధంగా చేసినప్పుడు వారు ఎలాంటి దీవెనలను పొందుతారు?

లేఖనముల నుండి; యెహోషువ 1:8; 2 తిమోతి 3:15–17; 2 నీఫై 32:3; జేకబ్ 2:8; 4:6; సిద్ధాంతము మరియు నిబంధనలు 33:16

నేర్చుకొనుటకు సిద్ధపడమని రక్షకుడు ఇతరులను ఆహ్వానించెను

శ్రేష్ఠమైన విత్తనాలు కూడా గట్టి, రాతి లేదా ముళ్ళ నేలపై పెరగవు. అదేవిధంగా, అత్యంత విలువైన మరియు విశ్వాసాన్ని ప్రోత్సహించే సిద్ధాంతం కూడా దానిని స్వీకరించడానికి సిద్ధంగా లేని హృదయాన్ని మార్చే అవకాశం లేదు. అది విత్తేవాడు, విత్తనాలు మరియు వివిధ పరిస్థితుల నేల గురించి రక్షకుని ఉపమానం యొక్క సందేశంలో భాగం. అటువంటి “మంచి నేలలో”—మృదువుగా చేయబడి, ఆత్మీయ రాళ్ళు మరియు ముళ్ళ నుండి తొలగించబడిన హృదయములో—దేవుని వాక్యం జీవాన్ని ఇచ్చే ఫలాలను ఇస్తుంది (మత్తయి 13:1–9, 18–23 చూడండి).

ఆత్మీయ సిద్ధపాటు మీకు మరియు మీరు బోధించే వ్యక్తులకు ముఖ్యమైనది. కాబట్టి మన హృదయాలను దేవుని వాక్యానికి “మంచి నేల”గా సిద్ధం చేయుటలో మనం ఎలా సహాయం చేస్తాము? ఈ క్రింది సిద్ధపాటు సూత్రాలను పరిగణించండి, వీటిని మీరు మీ జీవితంలో అన్వయించుకోవచ్చు మరియు మీరు బోధించే వారి జీవితాలలో ప్రోత్సహించవచ్చు. మీరు ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుచున్నారో తెలుసుకొనుటకు ప్రార్థించండి. మీ జీవితంలో ఆయన ఉనికిని ఆహ్వానించే విధంగా జీవించండి. అనుదినము పశ్చాత్తాపపడండి. హృదయపూర్వక ప్రశ్నలు అడగడం ద్వారా నేర్చుకోవాలనే మీ కోరికను పెంపొందించుకోండి. దేవుడు మిమ్మల్ని సమాధానాలకు నడిపిస్తారనే విశ్వాసంతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి. ఆయన మీకు ఏది బోధిస్తారో దానికి మీ హృదయాన్ని తెరవండి.

అభ్యాసకులు ఈ విధంగా నేర్చుకునేందుకు సిద్ధపడినప్పుడు, వారు చూడడానికి ఆత్మీయ కన్నులను మరియు వారు ఏమి తెలుసుకోవాలని ప్రభువు కోరుచున్నారో దానిని వినడానికి చెవులను కలిగియుంటారు (మత్తయి 13:16 చూడండి).

ధ్యానించవలసిన ప్రశ్నలు: నేర్చుకొనుటకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొనుటకు మీరు ఏమి చేస్తారు? మీరు దేవుని వాక్యాన్ని చూసే, వినే మరియు అర్థం చేసుకునే విధానాన్ని మీ సిద్ధపాటు ఎలా ప్రభావితం చేస్తుంది? నేర్చుకొనుట కొరకు సిద్ధపడుటకు మీరు ఇతరులను ఎలా ప్రేరేపించగలరు? వారు సువార్త సత్యాలను ఎలా స్వీకరిస్తారనే దానిలో అది ఏ మార్పును కలుగజేయగలదు?

లేఖనముల నుండి; ఈనస్ 1:1–8; ఆల్మా 16:16–17; 32:6, 27–43; 3 నీఫై 17:3

చిత్రం
తరగతిలో లేఖనాలు చదువుతున్న బిడ్డ

అభ్యాసకులు తాము నేర్చుకుంటున్న వాటిని ఒకరితో ఒకరు పంచుకునే అవకాశాల నుండి ప్రయోజనం పొందుతారు.

వారు నేర్చుకుంటున్న సత్యాలను పంచుకోమని రక్షకుడు ఇతరులను ప్రోత్సహించెను

సువార్త ప్రకటించడానికి ప్రభువు తనను పిలిచినప్పుడు “నేను నోటిమాంద్యము కలవాడను” అని హనోకు విలపించాడు. కానీ ప్రభువు సేవకుడికి వాక్చాతుర్యం ఎప్పుడూ అవసరం లేదు. బదులుగా, తన నోరు తెరవడానికి తగినంత విశ్వాసం ఉంటే, పదాలు వస్తాయని ప్రభువు హనోకుకు వాగ్దానం చేసారు. “నేను నీకు మాట్లాడు శక్తిని అనుగ్రహించెదను” అని ఆయన చెప్పారు (మోషే 6:31–32). హనోకు తన విశ్వాసాన్ని సాధన చేసాడు మరియు ప్రభువు అతడి ద్వారా చాలా శక్తివంతమైన మాటలు మాట్లాడగా, అవి ప్రజలను వణికిపోయేలా చేసాయి (మోషే 6:47 చూడండి). వాస్తవానికి, అవి భూమినే కంపించేలా చేసాయి. పర్వతములు తొలగిపోయెను; జలములుగల నదులు తమ గమనము నుండి తొలగిపోయెను; రాజ్యములు దేవుని జనులను గూర్చి మిక్కిలి భయపడెను, “హనోకు వాక్కు చాలా శక్తివంతముగానుండెను, దేవుడు అతనికిచ్చిన భాష యొక్క ప్రభావము బహు గొప్పదిగానుండెను” (మోషే 7:13).

ఆయన ప్రవక్తలే కాదు, కానీ మనమందరం ఆయన వాక్యాన్ని పలికే శక్తిని కలిగి ఉండాలని ప్రభువు కోరుచున్నారు. మీరు బోధించే వ్యక్తులతో సహా మనందరికీ అది కావాలని ఆయన కోరుచున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 1:20–21 చూడండి). మన మాటలు పర్వతాలను తొలగించకపోవచ్చు లేదా నదులను దారి మళ్ళించకపోవచ్చు, కానీ అవి హృదయాలను మార్చడంలో సహాయపడగలవు. అందుకే రక్షకుని గురించి మరియు ఆయన సువార్త గురించి వారు నేర్చుకుంటున్న వాటిని ఒకరితో ఒకరు పంచుకోవడానికి అభ్యాసకులకు అవకాశాలను ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వారికి బోధించబడిన సత్యాలను అంతర్గతీకరించడానికి మరియు వాటిని వ్యక్తపరచడానికి వారికి సహాయపడుతుంది. ఇతర స్థలాలలో సత్యాలను పంచుకునే వారి సామర్థ్యంపై నమ్మకాన్ని పొందడంలో కూడా ఇది వారికి సహాయపడుతుంది.

ధ్యానించవలసిన ప్రశ్నలు: మీరు ఎవరితోనైనా ఒక సువార్త సత్యం గురించి మాట్లాడిన సమయం గురించి ఆలోచించండి. ఈ అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? ఒకరు తమ ఆలోచనలు మరియు నమ్మకాలను పంచుకునే ధైర్యం కలిగి ఉన్నందుకు మీరు ఎప్పుడు కృతజ్ఞత కలిగియున్నారు? మీరు బోధించే వ్యక్తులు తాము నేర్చుకుంటున్న విషయాల గురించి మాట్లాడే అవకాశాల నుండి ఎలా ప్రయోజనం పొందుతారు? మీరు వారి కొరకు ఎలాంటి అవకాశాలను సృష్టించగలరు?

లేఖనముల నుండి; ఆల్మా 17:2–3; మొరోనై 6:4–6; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85; 88:122; 100:5–8

తాను బోధించిన దాని ప్రకారము జీవించమని రక్షకుడు ఇతరులను ఆహ్వానించెను

“వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” “మీ శత్రువులను ప్రేమించుడి.” “అడుగుడి మీకియ్యబడును.” “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి.” మత్తయి 5:16, 44; 7:7, 13. రక్షకుని యొక్క మొత్తం భూసంబంధమైన పరిచర్యలో అత్యంత స్పష్టమైన, చిరస్మరణీయమైన కొన్ని ఆహ్వానాలు గలిలయ సముద్రానికి ఎదురుగా ఉన్న పర్వతప్రాంతంలో తన శిష్యులకు బోధించినప్పుడు మాట్లాడబడ్డాయి. రక్షకుని ఉద్దేశ్యం జీవితాలను మార్చడమే, అది ఆయన ముగింపు ఆహ్వానం ద్వారా స్పష్టం చేయబడింది: “కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును” (మత్తయి 7:24 ; వివరణ చేర్చబడినది).

ప్రతీఒక్కరి జీవితంలో వాన కురిసి, వరదలు వస్తాయి మరియు గాలులు వీస్తాయి. అభ్యాసకులు వారు ఎదుర్కొనే అన్ని పరీక్షలను తట్టుకోవాలంటే సువార్త గురించి నేర్చుకోవడం సరిపోదు. అందుకే వారు నేర్చుకుంటున్న వాటిని ఎలా జీవించగలరో పరిశీలించడానికి అభ్యాసకులను ఆహ్వానించడానికి మనం వెనుకాడకూడదు. ఇతరుల స్వతంత్రత పట్ల గౌరవం కారణంగా, మన ఆహ్వానాలలో చాలా వరకు సాధారణమైనవిగా ఉంటాయి: “మీరు ఏమి చేయాలని మనస్సున ముద్రవేయబడ్డారు?” అప్పుడప్పుడు మన ఆహ్వానాలు మరింత నిర్దిష్టంగా ఉండవలసి రావచ్చు: “మీరు వృద్ధి చేయాలనుకొంటున్న రక్షకుని యొక్క ఒక లక్షణాన్ని ఎంచుకుంటారా?” మీరు పరిశుద్ధాత్మ నుండి ప్రేరణలను వినడానికి, గుర్తించడానికి మరియు పంచుకోవడానికి అభ్యాసకులకు అవకాశాలను కల్పించినప్పుడు, వారు తీసుకోవలసిన వ్యక్తిగత చర్యల గురించి ఆయన వారికి బోధిస్తారు. తాము నేర్చుకున్న దానిపై చర్య తీసుకున్నప్పుడు వచ్చే ఆశీర్వాదాలను పరిగణనలోకి తీసుకోవడంలో అభ్యాసకులకు సహాయపడండి మరియు కష్టంగా ఉన్నప్పుడు కూడా పట్టుదలగా ఉండేందుకు వారిని ప్రోత్సహించండి. సత్యాన్ని జీవించడం అనేది గొప్ప విశ్వాసం, సాక్ష్యం మరియు పరివర్తనకు వేగవంతమైన మార్గం. రక్షకుడు చెప్పినట్లుగా, తండ్రి యొక్క సిద్ధాంతాన్ని జీవించడమే మనమందరం నిజంగా సిద్ధాంతం సత్యమని తెలుసుకొనే మార్గం (యోహాను 7:17 చూడండి).

ధ్యానించవలసిన ప్రశ్నలు: ఎవరైనా ఇచ్చిన ఆహ్వానం కారణంగా చర్యతీసుకొనుటకు మీరు ఎప్పుడు ప్రేరేపించబడ్డారు? ఫలితంగా మీ జీవితం ఎలా మారింది? లేఖనాలలో మరియు సంఘ నాయకులచేత ఇవ్వబడిన ఆహ్వానాలను గమనించండి. చర్య తీసుకోమని మీరు ఇతరులను ఆహ్వానించినప్పుడు మీకు సహాయపడగలిగేలా మీరేమి నేర్చుకుంటారు? మీరు మీ ఆహ్వానాలను ఏయే మార్గాలలో గుర్తు చేయవచ్చు?

లేఖనముల నుండి; లూకా 10:36–37; యోహాను 7:17; యాకోబు 1:22; మోషైయ 4:9–10; సిద్ధాంతము మరియు నిబంధనలు 43:8–10; 82:10

మీరు నేర్చుకొనుచున్న దానిని అన్వయించుకొనుటకు కొన్ని మార్గాలు

  • పరిశుద్ధాత్మ వారికి బోధించిన ఒక అర్థవంతమైన లేఖన అంతరార్థము వంటి వాటిని పంచుకోవడానికి సిద్ధపడి రమ్మని ఇతరులను అడగండి.

  • పాఠంలో కొంత భాగాన్ని బోధించడానికి అభ్యాసకులకు అవకాశాలను ఇవ్వండి.

  • మీరు కలుసుకునే ముందు ఒక వీడియో, లేఖనము లేదా సందేశాన్ని సమీక్షించమని అభ్యాసకులను ప్రోత్సహించండి.

  • ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే ధోరణిని నిరోధించండి. సమాధానాలను వెదకుటలో ఇతరులను చేర్చుకోండి.

  • ఒక లేఖనము గురించి మీ అంతరార్థములు పంచుకునే ముందు, వారి స్వంత అంతరార్థములను పంచుకోమని అభ్యాసకులను అడగండి.

  • దేవుని వాక్యంలో సమాధానాలు కనుగొనేలా అభ్యాసకులను ప్రోత్సహించే ప్రశ్నలను అడగండి.

  • వారు నేర్చుకుంటున్న దాని గురించి వారి స్వంత ప్రశ్నలను అడగడానికి అభ్యాసకులను ఆహ్వానించండి.

  • అభ్యాసకులందరినీ సమాధానాలను పంచుకోమని అడిగే ముందు ఒక ప్రశ్న గురించి ఆలోచించడానికి వారికి సమయాన్ని ఇవ్వండి.

  • సముచితమైనప్పుడు, అభ్యాసకులను చిన్న చర్చా సమూహాలుగా విభజించడాన్ని పరిగణించండి.

  • అభ్యాసకులు అభివృద్ధి చెందడానికి సహాయపడుటకు స్పష్టమైన అంచనాలను వ్యక్తపరచండి.

  • అభ్యాసకులు వృద్ధి చెందుటను ప్రేరేపించే ఆహ్వానాలను ఇవ్వండి, కానీ అవి ముంచివేయబడినట్లుగా ఉండకూడదు. గుర్తు చేయండి మరియు వారి అనుభవాలను పంచుకోవడానికి అభ్యాసకులను ఆహ్వానించండి.

  • వీటి ద్వారా లేఖనాల నుండి నేర్చుకోవడంలో అభ్యాసకులకు సహాయం చేయండి:

    • కోరినట్లయితే, అర్థవంతమైన భాగాలపై గుర్తువేయడం.

    • ధ్యానించుట మరియు ప్రార్థించుట ద్వారా బయల్పాటును ఆహ్వానించడం.

    • ఆత్మీయ మనోభావాలను వ్రాయడం.

    • అధ్యయన దినచర్య పుస్తకమును వ్రాయడం.

    • వారు నేర్చుకున్నదానిపై పని చేయడానికి లక్ష్యాలను నిర్దేశించడం.