సర్వసభ్య సమావేశము
క్రీస్తునందు నిరీక్షణ
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


క్రీస్తునందు నిరీక్షణ

ఒంటరిగా ఉన్నట్లు లేదా సంఘమునకు చెందనివారిగా భావించే వారందరికీ సహాయం చేయడానికి మేము ఆశపడుతున్నాము. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నవారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనివ్వండి.

సహోదర సహోదరీలారా, ఈ ఈస్టర్ సమయంలో మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన పునరుత్థానంపై మనం దృష్టి పెడతాము. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును” అనే ఆయన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మనము గుర్తుచేసుకుంటాము.

“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” 1

తన దగ్గరకు రావాలనే రక్షకుడి ఆహ్వానం ఆయన వద్దకు రావడమే కాదు, ఆయన సంఘానికి చెందాలని కూడా అందరికీ ఇవ్వబడిన ఒక ఆహ్వానం.

ఈ ప్రేమపూర్వక ఆహ్వానానికి ముందు ఉన్న వచనంలో, యేసు తనను అనుసరించాలని కోరుకోవడం ద్వారా ఇది ఎలా జరుగుతుందో బోధించెను. “తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు”2 అని ఆయన ప్రకటించెను.

దేవుడు ప్రేమగల పరలోక తండ్రి అని మనం తెలుసుకోవాలని యేసు కోరుచున్నాడు.

మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం మనం ఎవరో తెలుసుకోవడానికి మరియు మనము ఆయన గొప్ప నిత్య కుటుంబానికి చెందినవారమని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

మాయో వైద్య సంస్థ ఇటీవల ఇలా పేర్కొంది: “చెందిన భావన కలిగి ఉండటం చాలా ముఖ్యం. … మన జీవితంలో దాదాపు ప్రతి అంశం ఏదో ఒకదానికి చెందియుండడం అనేదాని చుట్టూ ఏర్పాటుచేయబడింది.” “మన శారీరక మరియు మానసిక ఆరోగ్యం నుండి చెందియుండడం అనే భావన యొక్క ప్రాముఖ్యతను మనము వేరు చేయలేము”3అని ఈ నివేదిక జతచేస్తుంది — మరియు మన ఆత్మీయ ఆరోగ్యాన్ని దానికి నేను జోడిస్తాను.

గెత్సేమనేలో ఆయన బాధ మరియు సిలువపై మరణానికి ముందు సాయంత్రం, రక్షకుడు తన శిష్యులతో ప్రభు రాత్రి భోజనం కోసం కలుసుకొనెను. ఆయన వారితో, “లోకములో మీకు శ్రమ కలుగును: అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.”4 మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందు, యేసు క్రీస్తు బాధను అనుభవించి “మన పాపముల నిమిత్తము [సిలువపై] మృతిబొందెను.”5

సూర్యుడు అస్తమించడంతో, చీకటి మరియు భయం వారిని చుట్టుముట్టడంతో ఆయనను అనుసరించిన నమ్మకమైన స్త్రీలు మరియు పురుషులు యెరూషలేములో ఎంత ఒంటరిగా భావించియుండవచ్చోనని నేను ఆశ్చర్యపోతున్నాను.6

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాచీన శిష్యుల మాదిరిగానే, మీలో చాలామంది కూడా ఎప్పటికప్పుడు ఒంటరిగా భావిస్తూ ఉండవచ్చు. రెండేళ్ళ క్రితం నా అమూల్యమైన భార్య బార్బరా మరణించినప్పటి నుండి ఈ ఒంటరితనాన్ని నేను అనుభవించాను. కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహచరులు చుట్టూ ఉన్నప్పటికీ ఒంటరిగా భావించడం అంటే ఏమిటో నాకు తెలుసు—ఎందుకంటే నా జీవితపు ప్రేమ ఇకపై నా ప్రక్కన ఇక్కడ లేదు.

కోవిడ్-19 మహమ్మారి చాలా మందికి ఈ ఏకాంతవాసము మరియు ఒంటరితనం యొక్క భావాన్ని స్పష్టంగా తెలియజేసింది. జీవితంలో మనం సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ, నిరీక్షణ కొరకు మరియు చెందియున్న భావాన్ని పొందుటకు ప్రభువు తట్టు మనం తిరిగినప్పుడు ఆ మొదటి ఈస్టర్ ఉదయం వలె, క్రీస్తులో క్రొత్త మరియు అద్భుతమైన అవకాశాలతో మరియు క్రొత్త వాస్తవాలతో క్రొత్త జీవితానికి మేల్కొనవచ్చు.

చెందియున్న భావన లేనివారి బాధను నేను వ్యక్తిగతంగా భావిస్తాను. నేను ప్రపంచం నలుమూలల నుండి వార్తలు చూస్తున్నప్పుడు, ఈ ఒంటరితనం అనుభవిస్తున్నట్లు అనిపించే చాలా మందిని నేను చూస్తున్నాను. చాలామందికి, వారు పరలోక తండ్రి చేత ప్రేమించబడుతున్నారని మరియు మనమందరం ఆయన నిత్య కుటుంబానికి చెందినవారమని తెలియకపోవడమే దీనికి కారణం అని నేను అనుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మరియు మనం ఆయన పిల్లలమని నమ్మడం ఓదార్పును, అభయమును ఇస్తుంది.

మనము దేవుని ఆత్మ పిల్లలము కాబట్టి, ప్రతి ఒక్కరికి దైవిక మూలం, స్వభావం మరియు సామర్థ్యం ఉన్నాయి. మనలో ప్రతి ఒక్కరు “పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన ఆత్మ కుమారుడు లేదా కుమార్తెయైయున్నారు.”7 ఇదే మన గుర్తింపు! ఇదే మన అసలైన ఉనికి!

జాతి, సాంస్కృతిక లేదా జాతీయ వారసత్వంతో సహా మన అనేక మర్త్య గుర్తింపులను అర్థం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ గుర్తింపు మెరుగుపడుతుంది.

ఈ ఆత్మీయ మరియు సాంస్కృతిక గుర్తింపు, ప్రేమ మరియు చెందియున్నామనే భావన యేసు క్రీస్తు పట్ల నిరీక్షణను మరియు ప్రేమను ప్రేరేపిస్తుంది.

నేను క్రీస్తునందు నిరీక్షణ కలిగియుండుట గురించి మాట్లాడుతున్నాను, కానీ ఆశజనకమైన ఆలోచన గురించి మాట్లాడడం లేదు. బదులుగా, తప్పక నెరవేరే ఆపేక్ష వంటి నిరీక్షణ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతికూలతను అధిగమించడానికి, ఆత్మీయ స్థితిస్థాపకతను మరియు బలాన్ని పెంపొందించడానికి మరియు మన నిత్య తండ్రి చేత మనం ప్రేమించబడ్డామని, మనము ఆయన కుటుంబానికి చెందిన ఆయన పిల్లలమని తెలుసుకోవడానికి అలాంటి నిరీక్షణ చాలా అవసరం.

మనకు క్రీస్తులో నిరీక్షణ ఉన్నప్పుడు, మనం పవిత్రమైన నిబంధనలను చేసుకొని, పాటించవలసిన అవసరం ఉన్నందున, మన ఇష్టమైన కోరికలు మరియు కలలు ఆయన ద్వారా నెరవేరగలవని మనము తెలుసుకుంటాము.

ఒంటరిగా భావించేవారు లేదా చెందియుండలేదని భావించే వారందరికీ ఎలా సహాయం చేయాలో అర్థం చేసుకోవాలనే ఆత్రుతతో పన్నెండు అపొస్తలుల సమూహము కలిసి ప్రార్థనా స్ఫూర్తితో ఆలోచన చేసారు. ఈ విధంగా భావించే వారందరికి మేము సహాయము చేయాలని ఆశపడుతున్నాము. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నవారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనివ్వండి.

సహోదర సహోదరీలారా, ఈ రోజు సంఘములో సగానికి పైగా పెద్దలు వితంతువులు, విడాకులు తీసుకున్నవారు లేదా వివాహం చేసుకోనివారు. దేవుని ప్రణాళికలో మరియు సంఘములో తమ అవకాశాలు మరియు స్థానం గురించి కొందరు ఆశ్చర్యపోతున్నారు. నిత్యజీవము కేవలం ప్రస్తుత వైవాహిక స్థితి ఏమిటన్నది కాదు, కానీ శిష్యత్వం మరియు “యేసు సాక్ష్యమందు శూరులుగా”8 ఉండడం అని మనం అర్థం చేసుకోవాలి. ఒంటరిగా ఉన్న వారందరి నిరీక్షణ ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘములో సభ్యులందరి నిరీక్షణతో సమానమైనది, అదేమనగా “సువార్త నియమములకు, విధులకు విధేయత చూపుట”9 ద్వారా క్రీస్తు కృపను పొందడం.

మనం అర్థం చేసుకోవలసిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయని నేను సూచిస్తున్నాను.

మొదటిది, సువార్త నిబంధనలను పాటించడంలో విశ్వాసపాత్రులైన ప్రతి ఒక్కరికి ఉన్నతస్థితి పొందే అవకాశం ఉందని లేఖనాలు మరియు కడవరి-దిన ప్రవక్తలు ధృవీకరిస్తున్నారు. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “ప్రభువు యొక్క సొంత విధానంలో మరియు సమయములో, ఆయన నమ్మకమైన పరిశుద్ధుల నుండి ఎటువంటి ఆశీర్వాదం నిలిపివేయబడదు. ప్రభువు ప్రతి వ్యక్తిని వారి హృదయపూర్వక కోరికలతో పాటు క్రియల ప్రకారం తీర్పు తీర్చును.”10

రెండవది, ఉన్నతస్థితి యొక్క దీవెనలను ప్రసాదించే ఖచ్చితమైన సమయం మరియు విధానం అన్నీ వెల్లడించబడలేదు, అయితే అవి మనకు హామీ ఇవ్వబడ్డాయి.11 అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఇలా వివరించారు, “మర్త్యత్వము యొక్క కొన్ని పరిస్థితులు వెయ్యేండ్ల పరిపాలనలోనే సరిచేయబడతాయి, ఇది మన తండ్రి యొక్క యోగ్యులైన పిల్లలందరికీ గొప్ప సంతోషకర ప్రణాళికలో అసంపూర్తిగా ఉన్నవన్నీ నెరవేర్చడానికి సమయం.”12

ప్రతి దీవెన వెయ్యేండ్ల పరిపాలన వరకు వాయిదా వేయబడిందని దీని అర్థం కాదు; కొన్ని ఇప్పటికే పొందబడ్డాయి మరియు మరికొన్ని ఆ రోజు వరకు పొందబడతాయి.13

మూడవది, ప్రభువునందు వేచి ఉండడం ఆయన పట్ల నిరంతర విధేయతను, ఆత్మీయ పురోగతిని సూచిస్తుంది. ప్రభువునందు వేచి ఉండడం అనేది ఒకరి అనుకూల సమయాన్ని సూచించదు. మీరు వేచియుండే గదిలో ఉన్నట్లు ఎప్పుడూ భావించకూడదు.

ప్రభువునందు వేచి ఉండడం క్రియను సూచిస్తుంది. మనం ఇతరులకు సేవ చేసినప్పుడు క్రీస్తుపై మన నిరీక్షణ పెరుగుతుందని నేను కాలక్రమేణా నేర్చుకున్నాను. యేసు సేవ చేసినట్లు సేవ చేసినప్పుడు, సహజంగానే ఆయనయందు మన నిరీక్షణను పెంచుకుంటాము.

ప్రభువునందు మరియు ఆయన వాగ్దానాల కొరకు వేచియున్నప్పుడు ఒకరు సాధించగల వ్యక్తిగత వృద్ధి, మనలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రణాళిక యొక్క అమూల్యమైన, పవిత్రమైన అంశము. భూమిపై సంఘాన్ని నిర్మించడంలో మరియు ఇశ్రాయేలును సమకూర్చడంలో సహాయపడటానికి మనం ఇప్పుడు చేయగలిగే సహాయాలు చాలా అవసరము. ఒకరి సేవా సామర్థ్యానికి వైవాహిక స్థితితో సంబంధం లేదు. సహనం మరియు విశ్వాసంతో సేవచేసి, తన కొరకు వేచియుండు వారిని ప్రభువు ఘనపరచును.14

నాల్గవది, దేవుడు తన పిల్లలందరికీ నిత్యజీవమును అందించును. మర్త్యత్వములో నిత్యజీవము యొక్క అన్ని లక్షణాలను మరియు పరిపూర్ణతలను సాధించలేకపోయినప్పటికీ, రక్షకుని పశ్చాత్తాపం యొక్క బహుమానమును అంగీకరించి, ఆయన ఆజ్ఞలను గైకొనిన వారందరూ దానిని పొందుతారు. “ఎంత తరచుగా నా జనులు పశ్చాత్తాపపడుదురో అంత తరచుగా నాకు వ్యతిరేకముగా వారు చేసిన అతిక్రమములను నేను క్షమించెదను”15 అని ఆయన అభయమిచ్చెను గనుక, పశ్చాత్తాపపడేవారు క్షమించడానికి ప్రభువు యొక్క సంసిద్ధతను అనుభవిస్తారు.

అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకున్నప్పుడు, నిత్య దీవెనలకు అర్హతతో సహా స్వతంత్రత మరియు ఎంపిక విషయాలలో ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం, కోరికలు మరియు అవకాశాలు ప్రభువు మాత్రమే తీర్పు తీర్చగల విషయాలు.

ఐదవది, ఈ హామీలపై మన విశ్వాసం యేసు క్రీస్తుపై మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, ఆయన కృప ద్వారా మర్త్యత్వమునకు సంబంధించిన అన్ని విషయాలు సరి చేయబడతాయి.16 వాగ్దానం చేయబడిన అన్ని దీవెనలు ఆయన ద్వారా సాధ్యం చేయబడ్డాయి, ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా “అన్నిటికంటే క్రిందకు వచ్చి”17 “లోకాన్ని జయించెను.”18 ఆయన “నరుల సంతానముపై కలిగియున్న కనికరపు హక్కులను తండ్రి నుండి పొందుటకు … దేవుని కుడిచేతి ప్రక్కన కూర్చుండెను; అందువలన ఆయన నరుల సంతానము యొక్క హేతువును వాదించును.”19 చివరికు, “క్రీస్తుతోడి వారసులుగా”20 “పరిశుద్ధులు ఆయన మహిమతో నింపబడుదురు మరియు వారి స్వాస్థ్యమును పొందెదరు.”21

ఈ సూత్రాలు అందరికీ క్రీస్తుపై నిరీక్షణ పెరగడానికి మరియు చెందియున్నామనే భావనను పొందడానికి సహాయపడాలన్నదే మా కోరిక.

నీవు ఇప్పుడు మరియు ఎప్పుడూ మన నిత్య తండ్రియైన దేవుని బిడ్డవని ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, సంఘమునకు మీరు కావాలి మరియు మీ అవసరమున్నది. అవును, మాకు మీరు కావాలి! మీ స్వరాలు, ప్రతిభలు, నైపుణ్యాలు, మంచితనం మరియు నీతి మాకు అవసరం.

చాలా సంవత్సరాలుగా, మేము “ఒంటరి యువజనులు,” “ఒంటరి పెద్దలు” మరియు “పెద్దలు” గురించి మాట్లాడాము. ఆ హోదాలు కొంతవరకు పరిపాలనాపరంగా సహాయపడతాయి, కానీ అనుకోకుండా కొన్ని సమయాల్లో అవి మనం ఇతరులను ఎలా చూస్తామో అనేదానిని మార్చవచ్చు.

మనల్ని ఒకరినుండి మరొకరిని వేరు చేయగల ఈ మానవ ధోరణిని నివారించడానికి ఏదైనా ఒక మార్గం ఉన్నదా?

మనల్ని మనం యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యులుగా సూచించాలని అధ్యక్షులు నెల్సన్ కోరారు. అది మనందరినీ సూచిస్తున్నట్లు అనిపిస్తుంది, కదా?

యేసు క్రీస్తు సువార్తకు మనలను ఏకం చేసే శక్తి ఉంది. మనం భిన్నంగా ఉన్నదానికంటే ఎక్కువగా చివరికి మనం ఒకేలా ఉంటాము. దేవుని కుటుంబ సభ్యులుగా, మనము నిజంగా సహోదర సహోదరీలము. “[దేవుడు] యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించెను”22 అని పౌలు ప్రకటించెను.

స్టేకు అధ్యక్షులు, బిషప్పు‌లు మరియు యాజకత్వ సమూహము మరియు సహోదరి నాయకులను మీ స్టేకు, వార్డు, యాజకత్వ సమూహము లేదా సంస్థలోని ప్రతి సభ్యుడిని, సభ్యురాలిని పిలుపులలో సహకరించగల, సేవ చేయగల మరియు అనేక విధాలుగా పాల్గొనే సభ్యులుగా పరిగణించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.

మన సమూహములలో, సంస్థలలో, వార్డులు మరియు స్టేకులలో ఉన్న ప్రతి సభ్యునికి దేవుడు ఇచ్చిన బహుమతులు మరియు ప్రతిభలు ఉన్నాయి, అవి ఇప్పుడు ఆయన రాజ్యాన్ని నిర్మించడంలో సహాయపడగలవు.

సేవ చేయడానికి, లేవనెత్తడానికి మరియు బోధించడానికి ఒంటరిగా ఉన్న మన సభ్యులను పిలుద్దాం. వారు చెందినవారు కారని లేదా సేవ చేయలేరని ఒంటరితనం యొక్క భావాలకు కొన్నిసార్లు అనుకోకుండా దోహదం చేసిన పాత భావనలు మరియు ఆలోచనలను విస్మరించండి.

ఈస్టర్ వారాంతంలో మన రక్షకుడైన యేసు క్రీస్తు గురించి, నాకు మరియు ఆయన నామాన్ని విశ్వసించే వారందరికీ ఆయన ఇచ్చే శాశ్వతమైన నిరీక్షణ గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని నేను వినయముగా ఆయన పరిశుద్ధ నామములో అనగా యేసు క్రీస్తు నామములో ఇస్తున్నాను, ఆమేన్.