సర్వసభ్య సమావేశము
సమాధికి విజయము లేదు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


సమాధికి విజయము లేదు

యేసు క్రీస్తు యొక్క విమోచించు ప్రాయశ్చిత్తము మరియు మహికరమైన పునరుత్థానము ద్వారా విరిగిన హృదయాలు స్వస్థపరచబడగలవు, వేదన సమాధానంగా మారగలదు, దుఃఖము నిరీక్షణగా మారగలదని నేను సాక్ష్యమిస్తున్నాను.

మహిమకరమైన ఈ ఈస్టరు ఆదివారం నాడు, “అందమైన వసంతకాలంలో యేసు క్రీస్తు లేచి సమాధిని విడిచిపెట్టారు; మరణబంధకాలను త్రెంచారు,” అని సంతోషంగా మా పిల్లలు పాడతారు.1

యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మాకున్న జ్ఞానం కొరకు మేము కృతజ్ఞులం. అయినప్పటికీ, మనం బాగా ప్రేమించేవారిని కోల్పోయినప్పుడు మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో మనం బాధను అనుభవించాలని ఆశించబడింది. ప్రస్తుత ప్రపంచవ్యాప్త మహమ్మారి వలన మనలో చాలామంది ప్రియమైన వారిని—కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను కోల్పోయారు.2 అటువంటి నష్టానికి బాధపడుతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు:

“వయస్సుతో సంబంధం లేకుండా, ఆ ప్రియమైన వారు మరియు కోల్పోబడిన వారి కొరకు మేము దుఃఖిస్తున్నాము. దుఃఖము అనేది స్వచ్ఛమైన ప్రేమ యొక్క గాఢమైన వ్యక్తీకరణలలో ఒకటి.

“అంతే కాకుండా, ఇప్పుడు బాధాకరమైన ఎడబాటు లేకుండా మరణం తర్వాత సంతోషకరమైన కలయికను మనం పూర్తిగా అభినందించలేము. మరణం నుండి దుఃఖాన్ని వేరు చేయగల ఏకైక మార్గం ప్రేమను జీవితం నుండి తీసివేయడం.””3

చిత్రం
శిష్యురాండ్రు యేసును గూర్చి దుఃఖించారు.

ఆయనను వెంబడించి, ఆయనకు పరిచర్య చేసిన యేసు యొక్క శిష్యులు4 ఆయన మరణాన్ని చూసి ఎలా భావించియుంటారో మనం ఊహించగలము.5 వారు “దుఃఖపడి, ఏడ్చిరి” అని మనకు తెలుసు.6 ఆదివారం ఏం జరుగుతుందో తెలియక, వారి ప్రభువు లేకుండా వారెలా ముందుకెళ్ళగలరని ఆశ్చర్యపడుతూ, శిలువ వేయబడిన రోజు దుఃఖం చేత ముంచివేయబడినట్లు వారు తప్పక భావించియుండవచ్చు. అయినప్పటికీ, మరణంలో కూడా ఆయనకు పరిచర్య చేయడాన్ని వారు కొనసాగించారు.

యేసు దేహమును తనకిమ్మని అరిమతయియ యోసేపు పిలాతును అడిగాడు. అతడు ఆయనను శిలువ పైనుండి దింపి, నారబట్టతో చుట్టి, తన స్వంత నూతన సమాధిలో పరుండబెట్టి, ఆ సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించాడు.7

నీకోదేము సుగంధ ద్రవ్యములు తీసుకువచ్చాడు. దేహమును తీసుకువచ్చి, దానికి సుగంధ ద్రవ్యములు పూసి, నారబట్టలు చుట్టడానికి అతడు యోసేపుకు సహాయం చేసాడు.8

మగ్దలేనే మరియ మరియు ఇతర స్త్రీలు యోసేపు, నీకోదేములను వెంబడించి, వారు యేసు దేహమును ఎక్కడ ఉంచిరో గమనించి, దానిని అభిషేకించడానికి సుగంధ ద్రవ్యములు, తైలములు సిద్ధం చేసారు.9 శనివారం విశ్రాంతిదినం కాబట్టి, ఆనాటి కఠినమైన చట్టాల ప్రకారం దేహాన్ని అభిషేకించి, ఇంకా సిద్ధపరచడానికి వారు వేచియున్నారు.10 తర్వాత, ఆదివారం తెల్లవారుజామున వారు సమాధి వద్దకు వెళ్ళారు. రక్షకుని దేహం అక్కడ లేదని తెలుసుకున్న తర్వాత, యేసు యొక్క అపొస్తలులైన శిష్యులకు చెప్పడానికి వారు వెళ్ళారు. అపొస్తలులు వారితో పాటు సమాధి వద్దకు వచ్చి, అది ఖాళీగా ఉండడం చూసారు. రక్షకుని దేహానికి ఏమైందో అని ఆశ్చర్యపడుతూ మగ్దలేనే మరియ తప్ప మిగిలిన వారందరు క్రమక్రమంగా వెళ్ళిపోయారు.11

మగ్దలేనే మరియ ఒక్కతే సమాధి వద్ద ఉండిపోయింది. కేవలం రెండు రోజుల క్రితం, ఆమె తన స్నేహితుడు, బోధకుని యొక్క ఘోరమైన మరణాన్ని చూసింది. ఇప్పుడు ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయన ఎక్కడున్నాడో ఆమెకు తెలియదు. ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు మరియు ఆమె రోదించింది. ఆ క్షణంలో, పునరుత్థానుడైన రక్షకుడు ఆమె వద్దకు వచ్చి, ఆమె ఎందుకు రోదిస్తున్నది మరియు ఆమె ఎవరిని వెదుకుతున్నదని అడిగారు. తోటమాలి తనతో మాట్లాడాడని అనుకొని, అతడు తన ప్రభువు దేహాన్ని తీసుకువెళ్ళినట్లయితే అది ఎక్కడ ఉందో తనకు చెప్పమని, తాను తెచ్చుకుంటానని ఆమె అడిగింది.12

చిత్రం
మగ్దలేనే మరియ

మగ్దలేనే మరియ దుఃఖపడి, తన బాధను వ్యక్తపరచడానికి ప్రభువు అనుమతించియుండవచ్చని నేననుకుంటున్నాను.13 తరువాత ఆయన ఆమెను పేరుపెట్టి పిలువగా, ఆమె ఆయన వైపు చూచి ఆయనను గుర్తుపట్టింది. ఆమె పునరుత్థానుడైన క్రీస్తును చూసింది మరియు మహిమకరమైన ఆయన పునరుత్థానానికి సాక్షి అయ్యింది.14

వారి ప్రభువు మరణించినందుకు వారు దుఃఖిస్తున్నప్పుడు మగ్దలేనే మరియ, ఆమె స్నేహితులు భావించిన వేదనకు మీలాగే నేను ఏదో ఒక విధంగా సంబంధము కలిగియుండగలను. నేను తొమ్మిదేళ్ళ వయస్సున్నప్పుడు, భారీ భూకంపంలో నా అన్నయ్యను కోల్పోయాను. అనుకోకుండా అలా జరగడం వలన, జరిగిన దానిని అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. బాధతో నా గుండె పగిలింది మరియు నన్ను నేను ప్రశ్నించుకొనేదాన్ని, “నా అన్నయ్యకు ఏం జరిగింది? అతను ఎక్కడున్నాడు? అతను ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ నేనతన్ని చూస్తానా?

అప్పటికింకా దేవుని రక్షణ ప్రణాళిక గురించి నాకు తెలియదు మరియు మనం ఎక్కడి నుండి వచ్చాము, జీవితం యొక్క ఉద్దేశ్యమేమిటి, మరణించిన తర్వాత మనకేమి జరుగుతుంది అని తెలుసుకోవాలనే కోరిక నాకు ఉండేది. మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు లేదా మన జీవితాల్లో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, మనమందరం ఆ ఆసక్తిని కలిగియుండమా?

కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక ప్రత్యేక విధానంలో నేను నా అన్నయ్య గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అతను మా తలుపు తట్టినట్లు నేను ఊహించుకొనేదానిని. నేను తలుపు తెరిచినప్పుడు అతనక్కడ నిలబడి, “నేను చనిపోలేదు. నేను బ్రతికే ఉన్నాను. నేను నీ దగ్గరకు రాలేకపోయాను, కానీ ఇప్పుడు నేను నీతో ఉంటాను, మళ్ళీ ఎప్పుడూ విడిచివెళ్ళను,” అని నాతో చెప్తాడు. కలలాంటి ఆ ఊహ అతన్ని కోల్పోయినందుకు నేను పడుతున్న బాధ నుండి కోలుకోవడానికి నాకు సహాయపడింది. అతను నాతో ఉంటానన్న ఆలోచన మళ్ళీ మళ్ళీ నా మనస్సులో మెదిలింది. కొన్నిసార్లు, అతను తలుపు తడితే నేను మళ్ళీ అతన్ని చూస్తానని ఆశిస్తూ నేను తలుపు వైపు చూసేదానిని.

సుమారు 40 సంవత్సరాల తర్వాత, ఈస్టరు సమయంలో, నేను యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ధ్యానిస్తూ, నా అన్నయ్య గురించి ఆలోచించసాగాను. ఆ క్షణంలో, నా మనస్సులో ఏదో ఆలోచన వచ్చింది. అతను నన్ను చూడడానికి వస్తున్నట్లు ఊహించుకోవడాన్ని నేను గుర్తుచేసుకున్నాను.

కష్టసమయంలో ఆత్మ నాకు ఓదార్పునిచ్చిందని ఆ రోజు నేను తెలుసుకున్నాను. నా అన్నయ్య ఆత్మ చనిపోలేదని, అతను బ్రతికే ఉన్నాడని నేనొక సాక్ష్యాన్ని పొందాను. తన నిత్య ఉనికిలో అతడింకా పురోగమిస్తున్నాడు. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము మూలంగా మనమందరం పునరుత్థానం చెందే ఆ దివ్యమైన క్షణంలో “(నా) సహోదరుడు మరలా లేచును”15 అని ఇప్పుడు నాకు తెలుసు. అదనంగా, ఆయనతో పరిశుద్ధ నిబంధనలు చేసి, పాటించడానికి మనం ఎన్నుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో కుటుంబాలు తిరిగి ఏకమవ్వడాన్ని మరియు నిత్య సంతోషాన్ని కలిగియుండడాన్ని ఆయన మనందరి కోసం సాధ్యం చేసారు.

అధ్యక్షులు నెల్సన్ బోధించారు:

“మరణము అనేది మన నిత్య ఉనికికి ఆవశ్యకమైన అంశము. అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ దేవుని యొక్క గొప్ప సంతోష ప్రణాళికకు అది ఆవశ్యకమైనది. ప్రభువు యొక్క ప్రాయశ్చిత్తానికి కృతజ్ఞతలు, క్రమమైన పునరుత్థానమనేది వాస్తవము మరియు నిత్య జీవితమనేది మానవాళి అంతటికి సాధ్యము. …

“… వదిలివేయబడి బాధపడుతున్న ప్రియమైన వారికొరకు … క్రీస్తునందు స్థిరమైన విశ్వాసం, పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ, దేవుని ప్రేమ, మనుష్యులందరి ప్రేమ మరియు వారికి సేవచేయాలనే గాఢమైన కోరిక చేత మరణపు ముల్లు శాంతింపజేయబడింది. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, ఆ ప్రేమ దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి రావడానికి మరియు మన నిత్య సహవాసులు, కుటుంబాలతో పాటు శాశ్వతంగా ఆయనతో నివసించడానికి మనల్ని అర్హులుగా చేస్తుంది.”16

చిత్రం
తోట సమాధి

“సమాధికి ఎట్టి విజయము లేకుండునట్లు, మరణమునకు ఎట్టి ముల్లు లేకుండునట్లు క్రీస్తు మృతుల నుండి లేచియుండని యెడల లేదా మరణబంధకములను త్రెంచియుండని యెడల పునరుత్థానము ఉండేది కాదు.

“కానీ పునరుత్థానమున్నది మరియు మరణము యొక్క ముల్లు క్రీస్తు నందు మ్రింగి వేయబడినది; కావున సమాధికి విజయము లేదు.

“ఆయన లోకమునకు వెలుగును, జీవమునైయున్నాడు; ముఖ్యముగా అంతములేని, ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు మరియు అంతములేని, ఇక ఏ మాత్రము మరణముండని ఒక జీవమైయున్నాడు,” అని నేను సాక్ష్యమిస్తున్నాను.17

చిత్రం
పునరుత్థానుడైన రక్షకుడు

“పునరుత్థానమును, జీవమును నేనే: నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును,” అని యేసు క్రీస్తు తనకుతాను ప్రకటించారు.18

యేసు క్రీస్తు యొక్క విమోచించు ప్రాయశ్చిత్తము మరియు మహికరమైన పునరుత్థానము ద్వారా విరిగిన హృదయాలు స్వస్థపరచబడగలవు, వేదన సమాధానంగా మారగలదు, దుఃఖము నిరీక్షణగా మారగలదని నేను సాక్ష్యమిస్తున్నాను. మనలో ప్రతిఒక్కరిని ఓదారుస్తూ, అధికారమిస్తూ, స్వస్థపరుస్తూ ఆయన తన కరుణా బాహువులలో మనల్ని హత్తుకోగలరు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.