సర్వసభ్య సమావేశము
కోవిడ్-19 మరియు దేవాలయాలు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


కోవిడ్-19 మరియు దేవాలయాలు

మీ దేవాలయ నిబంధనలు మరియు ఆశీర్వాదాలను మీ మనస్సులలో మరియు హృదయాలలో ప్రధానంగా ఉంచండి. మీరు చేసిన నిబంధనలకు కట్టుబడి ఉండండి.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము నిజంగా గొప్ప ఆత్మీయ జ్ఞానాన్ని పొందాము. సమావేశమంతటి యొక్క ప్రార్థనలు, సందేశాలు మరియు సంగీతానికి నేను ఎంతో కృతజ్ఞుడను. మీరు ఎక్కడ ఉన్నా మాతో చేరినందుకు మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

గత సంవత్సరం ప్రారంభంలో, కోవిడ్-19 మహమ్మారి మరియు మంచి ప్రపంచ పౌరులు కావాలనే మన కోరిక కారణంగా, అన్ని దేవాలయాలను తాత్కాలికంగా మూసివేయడానికి మేము కష్టమైన నిర్ణయం తీసుకున్నాము. తరువాతి నెలల్లో, చాలా జాగ్రత్తతో కూడిన విధానం ద్వారా దేవాలయాలను క్రమంగా తిరిగి తెరవడానికి మేము ప్రేరణ పొందాము. దేవాలయాలు ఇప్పుడు తెరువబడుతున్నాయి మరియు స్థానిక ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ఆదేశాలకు కట్టుబడి నాలుగు దశల్లో పనిచేస్తున్నాయి.

మొదటి దశలో ఉన్న దేవాలయాలలో, గతంలో తమ స్వంత వరము పొందిన అర్హతగల జంటలు భార్యాభర్తలుగా ముద్రింపబడవచ్చు.

2వ దశలో ఉన్న దేవాలయాలలో, ఒకరి స్వంత వరం, భార్యాభర్తలుగా మరియు పిల్లలు తల్లిదండ్రులతో ముద్ర వేయబడుటతో సహా సజీవుల కొరకు అన్ని విధులు నిర్వహించబడతాయి. మేము ఇటీవల 2వ దశ యొక్క నిబంధనలను సవరించాము మరియు ఇప్పుడు మన యువత, క్రొత్త సభ్యులు మరియు ఇతరులను పరిమిత-వినియోగ సిఫారసుతో వారి పూర్వీకుల కోసం ప్రాతినిధ్య బాస్మీస్మములలో పాల్గొనడానికి అనుమతిస్తున్నాము.

3వ దశలో ఉన్న దేవాలయాలలో, ముందుగా నియామకాలు ఉన్నవారు సజీవుల కొరకైన విధులలో మాత్రమే కాకుండా, మరణించిన పూర్వీకుల కోసం గల ప్రాతినిధ్య విధులన్నిటిలో కూడా పాల్గొనవచ్చు.

4వ దశలో, పూర్తిగా క్రమమైన దేవాలయ కార్యకలాపాలకు తిరిగి రావడం.

ఈ మారుతున్న మరియు సవాలుతో కూడిన కాలంలో మీ సహనానికి, అంకితభావ సేవకు మేము కృతజ్ఞులము. దేవాలయంలో ఆరాధించి, సేవ చేయాలనే మీ కోరిక గతంలో కంటే మరింత బలంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

ఇప్పుడు, మీరు ఎప్పుడు దేవాలయానికి తిరిగి రాగలరని ఆలోచిస్తూ ఉండవచ్చు. జవాబు: స్థానిక ప్రభుత్వ నిబంధనలు అనుమతించినప్పుడు మీ దేవాలయం తెరువబడుతుంది. మీ ప్రాంతంలో కోవిడ్-19 మహమ్మారి సురక్షిత పరిమితుల్లో ఉన్నప్పుడు, మీ దేవాలయం తిరిగి తెరువబడుతుంది. మీ దేవాలయ అవకాశాలు పెరిగేలా మీ ప్రాంతంలో కోవిడ్ సంఖ్యలను తగ్గించడంలో సహాయపడడానికి మీరు చేయగలిగినదంతా చేయాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

ఈలోగా, మీ దేవాలయ నిబంధనలు మరియు ఆశీర్వాదాలను మీ మనస్సులలో మరియు హృదయాలలో ప్రధానంగా ఉంచండి. మీరు చేసిన నిబంధనలకు కట్టుబడి ఉండండి.

భవిష్యత్తు కోసం మనము ఇప్పుడు నిర్మిస్తున్నాము! నలభై ఒకటి దేవాలయాలు ప్రస్తుతం నిర్మాణంలో లేదా పునర్నిర్మాణంలో ఉన్నాయి. గత సంవత్సరం, మహమ్మారి ఉన్నప్పటికీ, 21 క్రొత్త దేవాలయాలకు శంకుస్థాపన జరిగింది!

వారి పరిస్థితులు అనుమతించినంత తరచుగా దేవాలయానికి హాజరయ్యే పవిత్రమైన హక్కు వారికి లభించే విధంగా ప్రభువు గృహాన్ని మన సభ్యులకు మరింత దగ్గరగా తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము.

మరో 20 దేవాలయాల నిర్మాణానికి మా ప్రణాళికలను నేను ప్రకటించినప్పుడు, ఈ చరిత్రను రూపొందించడానికి పవిత్ర జీవితాలు సహాయపడిన గత మరియు ప్రస్తుత మార్గదర్శకులను గూర్చి నేను ధ్యానిస్తున్నాను మరియు ప్రశంసిస్తున్నాను. క్రింది చెప్పబడిన ప్రతి ప్రదేశంలో ఒక కొత్త దేవాలయం నిర్మించబడుతుంది: ఓస్లో, నార్వే; బ్రస్సెల్స్, బెల్జియం; వియన్నా, ఆస్ట్రియా; కుమాసి, ఘనా; బీరా, మొజాంబిక్; కేప్ టౌన్, దక్షిణాఫ్రికా; సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్; బెలో హారిజోంటే, బ్రెజిల్; కాలి, కొలంబియా; క్వెరాటారో, మెక్సికో; టోర్రెన్, మెక్సికో; హెలెనా, మోంటానా; కాస్పర్, వ్యోమింగ్; గ్రాండ్ జంక్షన్, కొలరాడో; ఫార్మింగ్టన్, న్యూ మెక్సికో; బర్లీ, ఐడాహో; యూజీన్, ఓరిగన్; ఎల్కో, నెవాడా; యోర్బా లిండా, కాలిఫోర్నియా; మరియు స్మిత్‌ఫీల్డ్, యూటా.

యేసు క్రీస్తు యొక్క సువార్త దాని సంపూర్ణతలో పునఃస్థాపించబడడంలో దేవాలయ కార్యము ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన భాగం. దేవాలయ విధులు మన జీవితాలను మరే విధంగా లభించని బలంతో మరియు శక్తితో నింపుతాయి. ఆ దీవెనల కొరకు మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

మేము ఈ సమావేశాన్ని ముగిస్తుండగా, మీ కొరకు మా ప్రేమను మళ్ళీ వ్యక్తం చేస్తున్నాము. మీలో ప్రతి ఒక్కరిపై దేవుడు తన ఆశీర్వాదాలను మరియు శ్రద్ధాసక్తులను క్రుమ్మరించాలని మేము ప్రార్థిస్తున్నాము. కలిసి, మనమందరము ఆయన పవిత్ర సేవలో నిమగ్నమై ఉన్నాము. ధైర్యంతో, మనమందరం ప్రభువు యొక్క మహిమాన్వితమైన కార్యములో ముందుకు సాగుదాం! ఈ సంగతుల గురించి యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.