లేఖనములు
మోషైయ 2


2వ అధ్యాయము

రాజైన బెంజమిన్ తన జనులతో మాట్లాడును—తన పరిపాలన యందున్న ధర్మము, న్యాయము, ఆత్మీయతను అతడు వివరించును—వారి పరలోక రాజును సేవించవలెనని అతడు వారికి సలహా ఇచ్చును—దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయువారు ఆరని అగ్నివంటి వేదనను అనుభవించెదరు. సుమారు క్రీ. పూ. 124 సం.

1 మోషైయ తన తండ్రి ఆజ్ఞాపించినట్లు చేసి దేశమంతటా ఒక ప్రకటన చేసిన తరువాత, రాజైన బెంజమిన్ వారితో చెప్పబోవు మాటలను వినుటకు దేవాలయమునకు వెళ్ళునట్లు దేశమంతటి నుండి జనులు సమకూడుకొనిరి.

2 వారు లెక్కపెట్టలేనంత అధిక సంఖ్యలో జనులు అక్కడ ఉండిరి; ఏలయనగా వారు అధికముగా విస్తరించి, దేశమందు బాగా వృద్ధిచెందిరి.

3 వారు మోషే ధర్మశాస్త్రము ప్రకారము బలులను, దహనబలులను అర్పించునట్లు వారి మందల యొక్క తొలిచూలు పిల్లలను కూడా తీసుకువచ్చిరి.

4 వారిని యెరూషలేము దేశము నుండి బయటకు తీసుకొనివచ్చి వారి శత్రువుల చేతులలోనుండి విడిపించి, వారి బోధకులుగా ఉండుటకు నీతిమంతులైన మనుష్యులను నియమించిన ప్రభువుకు మరియు జరహేమ్ల దేశమందు సమాధానమును స్థాపించి, వారు ఆనందించునట్లు మరియు దేవుని యెడల, సమస్త మనుష్యుల యెడల ప్రేమతో నిండియుండునట్లు దేవుని ఆజ్ఞలను గైకొనుటను వారికి బోధించిన నీతిమంతుడైన ఒక మనుష్యుని వారి యొక్క రాజుగా ఉండుటకు నియమించిన ఆ ప్రభువైన దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించుటకు వచ్చిరి.

5 వారు దేవాలయమునకు వచ్చినప్పుడు, ప్రతి కుటుంబము ఒక దాని నుండి మరియొకటి వేరుగా ఉండి ప్రతి మనుష్యుడు తన భార్య, కుమారులు, కుమార్తెలు మరియు వారి కుమారులు, కుమార్తెలతో కూడిన తన కుటుంబము చొప్పున పెద్దవాని నుండి చిన్నవాని వరకు దేవాలయము చుట్టూ తమ గుడారములను వేసుకొనిరి.

6 వారు తమ గుడారములలో నిలిచియుండి రాజైన బెంజమిన్ వారితో చెప్పే మాటలను వినగలుగునట్లు, ప్రతి మనుష్యుడు తన గుడారపు ద్వారము దేవాలయము వైపు ఉండునట్లు తమ గుడారములను దేవాలయము చుట్టూ వేసుకొనిరి;

7 ఆ సమూహము మిక్కిలి గొప్పదగుట వలన రాజైన బెంజమిన్ వారందరికి దేవాలయము లోపల బోధించలేకపోయెను, కావున అతడు వారితో చెప్పే మాటలను తన జనులు వినగలుగునట్లు అతడు ఒక గోపురము నిర్మించబడునట్లు చేసెను.

8 అతడు ఆ గోపురముపై నుండి తన జనులతో మాటలాడుట ప్రారంభించెను; వారు గొప్ప సమూహమగుట వలన అందరూ అతని మాటలను వినలేకపోయిరి; కావున అతడు, తాను పలికిన మాటలు వ్రాయబడునట్లు చేసి తన స్వరము వినబడనంత దూరములో ఉన్న వారి మధ్యకు పంపించెను.

9 మరియు అతడు చెప్పుచూ వ్రాయబడునట్లు చేసిన మాటలు ఇవి: ఈ దినమున నేను మీతో చెప్పుబోవు మాటలను వినుటకు ఇక్కడకు సమకూడి వచ్చిన నా సహోదరులారా, నేను పలుకు మాటలను అలక్ష్యము చేయుటకు నేను మిమ్ములను ఇక్కడకు రమ్మని ఆజ్ఞాపించలేదు, కాని మీరు నన్ను ఆలకించవలెనని మీరు వినునట్లు మీ చెవులను, మీరు గ్రహించునట్లు మీ హృదయములను, మీ దృష్టి యందు దేవుని మర్మములు విశదమగునట్లు మీ మనస్సులను తెరువవలెనని ఆజ్ఞాపించితిని.

10 నన్ను చూసి మీరు భయపడవలెనని లేదా నేను ఒక మర్త్య మనుష్యునికన్నా ఎక్కువైన వాడనని మీరు తలంచవలెనని చెప్పుటకు మీరు ఇక్కడకు రావలెనని నేను మిమ్ములను ఆజ్ఞాపించియుండలేదు.

11 నేను కూడా శరీరమునందు, మనస్సునందు అన్ని విధములైన బలహీనతలకు లోనైన మీవంటివాడను; అయినప్పటికీ నేను ఈ జనుల ద్వారా ఎన్నుకొనబడి, నా తండ్రి చేత ప్రతిష్ఠింపబడి, ఈ జనులపైన ఒక అధిపతిగాను రాజుగాను ఉండుటకు ప్రభువు చేత అనుమతించబడితిని; ప్రభువు నాకు దయచేసిన పూర్ణ శక్తి, మనస్సు మరియు బలముతో మీకు సేవ చేయుటకు ఆయన సాటిలేని శక్తి ద్వారా భద్రపరచబడి, కాపాడబడితిని.

12 ఈ సమయము వరకు కూడా నా దినములన్నియు మీ సేవలో గడుపుటకు నేను అనుమతించబడితినని, బంగారము, వెండి లేదా మరేవిధమైన సంపదను మీ నుండి నేను కోరలేదని మీతో చెప్పుచున్నాను;

13 మీరు చెరసాలలో బంధింపబడుటకు, ఒకరినొకరు బానిసలుగా చేసుకొనుటకు, నరహత్య చేయుటకు, దోచుకొనుటకు, దొంగిలించుటకు, వ్యభిచరించుటకు లేదా మీరు ఏ విధమైన దుష్టత్వము జరిగించుటకు నేను అనుమతించియుండలేదు మరియు ఆయన మిమ్ములను ఆజ్ఞాపించిన విషయములన్నిటిలో ప్రభువు ఆజ్ఞలను మీరు గైకొనవలెనని మీకు బోధించియున్నాను—

14 నేను మీకు సేవ చేయునట్లు, మీపై పన్నుల భారము పడకుండునట్లు, భరించుటకు కష్టమైనదేదియు మీపై రాకుండునట్లు నా స్వహస్తములతో నేను శ్రమించియున్నాను—నేను పలికియున్న ఈ విషయములన్నిటికి ఈ దినమున మీకు మీరే సాక్షులైయున్నారు.

15 అయినను నా సహోదరులారా, నేను గొప్పలు చెప్పుకొనుటకు ఈ క్రియలను చేసియుండలేదు లేదా వాటిని బట్టి మిమ్ములను నిందించుటకు నేను ఈ విషయములను చెప్పుట లేదు; కానీ, నేడు దేవుని యెదుట ఒక స్పష్టమైన మనస్సాక్షితో నేను సమాధానమివ్వగలనని మీరు తెలుసుకొనవలెనని నేను ఈ విషయములు మీతో చెప్పుచున్నాను.

16 మీ సేవలో నా దినములు గడిపియున్నానని నేను మీతో చెప్పిన దానిని బట్టి నేను గొప్పలు చెప్పుకొనగోరను, ఏలయనగా నేను కేవలము దేవుని సేవలో ఉన్నానని మీతో చెప్పుచున్నాను.

17 మీరు జ్ఞానమును సంపాదించునట్లు; మీ తోటి ప్రాణుల సేవలో మీరున్న యెడల, మీరు మీ దేవుని సేవలోనే ఉన్నారని నేర్చుకొనునట్లు ఈ విషయములను నేను మీకు చెప్పుచున్నాను.

18 మీరు నన్ను మీ రాజు అని పిలిచితిరి; మరియు రాజు అని పిలువబడుచున్న నేను మీకు సేవ చేయుటకు శ్రమపడిన యెడల, మీరు ఒకరికొకరు సేవ చేసుకొనుటకు శ్రమపడవద్దా?

19 అంతేకాక, మీచేత రాజు అని పిలువబడుచు మీ సేవలో నా దినములు గడుపుచు ఇంకను దేవుని సేవలో ఉన్న నేను మీ కృతజ్ఞతలకు యోగ్యుడనైన యెడల, మీ పరలోక రాజుకు మీరెంతగా కృతజ్ఞతలు చెల్లించవలసియున్నారు!

20 నా సహోదరులారా నేను మీతో చెప్పుచున్నాను, మిమ్ములను సృష్టించి, భద్రపరచి, కాపాడి, మీరు ఆనందించునట్లు చేసి, మీరు ఒకరితోనొకరు సమాధానమందు నివసించునట్లు చేసిన ఆ దేవునికి మీ పూర్ణాత్మ కలిగియుండగలిగినంత శక్తి చేత మీరు సమస్త కృతజ్ఞతాస్తుతులను చెల్లించిన యెడల—

21 ఆది నుండి మిమ్ములను సృష్టించి, అనుదినము మిమ్ములను కాపాడుచూ, మీరు జీవించి, సంచరించి, మీ స్వంత చిత్తమును బట్టి నడుచుకొనుటకు మీకు ఊపిరినిచ్చుచు, అనుక్షణము మీకు సహయపడుచూ ఉన్న ఆయనను మీరు సేవించిన యెడల—మీ పూర్ణాత్మతో మీరు ఆయనను సేవించినప్పటికి, ఇంకనూ మీరు నిష్‌ప్రయోజకులైన దాసులైయుందురని నేను మీతో చెప్పుచున్నాను.

22 ఆయన మీ నుండి కోరునదంతయు ఆయన ఆజ్ఞలను గైకొనుటయే; మీరు ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల, మీరు దేశమందు వర్ధిల్లుదురని ఆయన మీకు వాగ్దానము చేసియున్నాడు; ఆయన చెప్పియున్న దాని నుండి ఆయన ఎన్నడూ తొలగడు; కావున మీరు ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల, ఆయన మిమ్ములను ఆశీర్వదించి వర్థిల్లజేయును.

23 మొదట, ఆయన మిమ్ములను సృష్టించి మీ జీవితములను మీకు అనుగ్రహించియున్నందుకు మీరు ఆయనకు ఋణపడియున్నారు.

24 తరువాత, ఆయన మిమ్ములను ఆజ్ఞాపించినట్లుగా మీరు చేయవలెనని ఆయన కోరుచున్నాడు; మీరు దానిని చేసిన యెడల ఆయన వెంటనే మిమ్ములను ఆశీర్వదించును; అందువలన ఆయన మీకు చెల్లించియున్నాడు. మీరు ఇంకనూ ఆయనకు ఋణపడియుంటిరి, ఉన్నారు, ఎప్పటికి మరియు నిరంతరముండెదరు; కాబట్టి గొప్పలు చెప్పుకొనుటకు మీకు ఏమున్నది?

25 ఇప్పుడు మిమ్ములను గూర్చి మీరు ఏమైనా చెప్పగలరా అని నేనడుగుచున్నాను? లేదు, అని నేను జవాబిచ్చుచున్నాను. మీరు ధూళివంటి వారని కూడా మీరు చెప్పలేరు; అయినను మీరు ధూళి నుండి సృష్టించబడియున్నారు; కానీ అది మిమ్ములను సృష్టించిన ఆయనకే చెందును.

26 మీరు మీ రాజు అని పిలుచుచున్న నేను కూడా మీ కంటే ఏమియు ఎక్కువ కాదు; ఏలయనగా నేను కూడా ధూళి నుండి వచ్చినవాడను. నేను ముసలివాడనని, ఈ మర్త్య శరీరమును నేల తల్లికి అప్పగించబోవుచున్నానని మీరు చూచుచున్నారు.

27 కాబట్టి దేవుని యెదుట ఒక నిర్మలమైన మనస్సాక్షితో నడుచుచూ నేను మీకు సేవ చేసియున్నానని మీతో చెప్పియున్నట్లుగా, మిమ్ములను గూర్చి ఆయన నాకు ఆజ్ఞాపించియున్న విషయములను బట్టి దేవుని చేత తీర్పుతీర్చబడుటకు నేను నిలబడునప్పుడు నేను నిర్దోషిగా కనబడునట్లు, మీ రక్తము నాపై రాకుండునట్లు ఈ సమయమున మీరు సమకూడుకొనునట్లు నేను చేసియుంటిని.

28 నేను, నా సమాధిలోనికి పోబోవుచున్న ఈ సమయమున నేను సమాధానముతో పోవునట్లు మరియు అమర్త్యమైన నా ఆత్మ న్యాయవంతుడైన దేవుని స్తుతులు గానము చేయుటలో పైనున్న గాయకులతో చేరునట్లు, మీ రక్తము నుండి నా వస్త్రములను శుద్ధిచేసుకొనుటకు మీరు సమకూడి వచ్చునట్లు చేసియుంటినని నేను మీతో చెప్పుచున్నాను.

29 ఇకపై నేను ఏ మాత్రము మీకు ఉపదేశకునిగా లేదా మీ రాజుగా ఉండలేనని మీకు ప్రకటించుటకు మీరు సమకూడి వచ్చునట్లు చేసియున్నానని నేను మీతో చెప్పుచున్నాను.

30 ఏలయనగా ఈ సమయమున కూడా మీతో మాట్లాడుటకు ప్రయత్నించుచుండగా నా శరీరమంతా అధికముగా వణుకుచున్నది; కానీ ప్రభువైన దేవుడు నాకు సహాయము చేయుచు మీతో మాట్లాడుటకు నన్ను అనుమతించియున్నాడు మరియు నా కుమారుడైన మోషైయను మీ రాజుగా, అధిపతిగా ఈ దినమున నేను మీకు ప్రకటించవలెనని నన్ను ఆజ్ఞాపించియున్నాడు.

31 ఇప్పుడు నా సహోదరులారా, మీరింతవరకు చేసియున్నట్లుగానే చేయవలెనని నేను కోరుచున్నాను. మీరు నా ఆజ్ఞలను, నా తండ్రి ఆజ్ఞలను గైకొని, వర్థిల్లి, మీ శత్రువుల చేతులలో పడకుండా ఉంచబడినట్లే నా కుమారుని ఆజ్ఞలను లేదా అతని ద్వారా మీకు ఇవ్వబడు దేవుని ఆజ్ఞలను కూడా మీరు గైకొనిన యెడల, మీరు దేశమందు వర్ధిల్లుదురు, మీ శత్రువులు మీపై ఎట్టి అధికారము కలిగియుండరు.

32 కానీ, ఓ నా జనులారా, మీ మధ్య కలహములు పుట్టకుండా, నా తండ్రియైన మోషైయ ద్వారా పలుకబడిన దురాత్మకు లోబడుటకు మీరు కోరుకొనకుండా జాగ్రత్తపడుడి.

33 ఏలయనగా ఆ ఆత్మకు లోబడుటకు కోరుకొను వానిపై ఒక శాపము ప్రకటించబడియున్నది; దానికి లోబడుటకు కోరుకొని, తన పాపముల యందు నిలిచి మరణించిన వాడు తన స్వంత ఆత్మకు శిక్షను పానము చేయును; ఏలయనగా తన స్వంత జ్ఞానమునకు వ్యతిరేకముగానున్న దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించినవాడై అతడు తన జీతముగా శాశ్వత శిక్షను పొందును.

34 మీ చిన్న పిల్లలు తప్ప, ఈ విషయములను గూర్చి బోధింపబడని వారు మీలో ఎవరును లేరని నేను మీతో చెప్పుచున్నాను, మీరు కలిగియున్నదంతయు ఆయనకు సమర్పించునట్లు మీ పరలోక తండ్రికి నిత్యము మీరు ఋణపడియున్నారని మీకు తెలియును. మన పితరుడైన లీహై, యెరూషలేమును వదిలి వచ్చిన సమయము వరకు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలుకబడియున్న ప్రవచనములను కలిగియున్న గ్రంథములను గూర్చి కూడా మీరు బోధించబడియున్నారు.

35 ఇప్పటి వరకు మన పితరుల ద్వారా పలుకబడినదంతయు కూడా మీరు బోధించబడియున్నారు. ప్రభువు ద్వారా వారికి ఆజ్ఞాపించబడిన వాటిని వారు పలికినందున అవి న్యాయమైనవి, సత్యమైనవి.

36 ఇప్పుడు నా సహోదరులారా, నేను మీతో చెప్పుచున్నాను—మీరు ఈ విషయములన్నియు తెలుసుకొని, బోధింపబడియున్న తరువాత మీరు వాటిని అతిక్రమించి, పలుకబడిన దానికి వ్యతిరేకముగా వెళ్ళిన యెడల మీరు ప్రభువు యొక్క ఆత్మ నుండి మిమ్ములను దూరము చేసుకొందురు, మీరు దీవించబడి, వర్థిల్లి, రక్షింపబడునట్లు మిమ్ములను జ్ఞాన మార్గములలో నడిపించుటకు ఆ ఆత్మకు మీ యందు స్థానము లేకపోవును—

37 దీనిని చేయు మనుష్యుడు దేవునికి వ్యతిరేకముగా బాహాటముగా తిరుగుబాటులోనికి వచ్చునని నేను మీతో చెప్పుచున్నాను; కావున అతడు దురాత్మకు లోబడుటకు కోరుకొని సమస్త నీతికి శత్రువగును; కావున ప్రభువుకు అతని హృదయములో ఎట్టి స్థానము లేదు, ఏలయనగా ఆయన అపవిత్రమైన ఆలయములలో నివసించడు.

38 కాబట్టి ఆ మనుష్యుడు పశ్చాత్తాపపడకుండా దేవునికి శత్రువుగా నిలిచి మరణించిన యెడల, దైవిక న్యాయము యొక్క అక్కరలు అమర్త్యమైన అతని ఆత్మను అతని స్వంత దోషము యొక్క సజీవమైన భావమునకు మేలుకొల్పును, అది అతడిని దేవుని సన్నిధి నుండి కృంగిపోవునట్లు చేసి, అతని మనస్సును దోషము, బాధ మరియు వేదనతో నింపును, అది ఆరని అగ్ని వలే ఉండి దాని జ్వాల నిరంతరము ఆరోహణమగును.

39 ఇప్పుడు ఆ మనుష్యునిపై కనికరము ఎట్టి హక్కు కలిగియుండదని నేను మీతో చెప్పుచున్నాను; కాబట్టి చివరికి అతని గతి ఇక ఎన్నటికి అంతమొందని వేదన భరించుటయైయున్నది.

40 మీరు గ్రహించగలుగునట్లు నేను మీతో సరళముగా మాట్లాడియున్నందున నా మాటలను గ్రహించగలిగిన ముసలివారు, యౌవనస్థులు మరియు చిన్న పిల్లలు అందరు అతిక్రమములో పడియున్న వారి భయంకరమైన స్థితి యొక్క జ్ఞాపకమునకు మేలుకొనవలెనని నేను ప్రార్థించుచున్నాను.

41 అంతేకాక దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా వారు ఐహికమైన మరియు ఆత్మ సంబంధమైన విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉన్న యెడల, వారు పరలోకములోనికి చేర్చుకొనబడి దేవునితో ఎన్నడూ అంతముకాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు. జ్ఞాపకముంచుకొనుడి, ఈ విషయములు సత్యమని జ్ఞాపకముంచుకొనుడి; ఏలయనగా ప్రభువైన దేవుడు దానిని పలికియున్నాడు.