లేఖనములు
1 నీఫై 9


9వ అధ్యాయము

నీఫై రెండు రకముల వృత్తాంతములను చేయును—ఆ రెండు నీఫై పలకలని పిలువబడును—పెద్ద పలకలు లౌకిక చరిత్రను కలిగియుండును; చిన్నవి ముఖ్యముగా పవిత్రమైన విషయములను గూర్చి తెలుపును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 లెముయెల్ లోయలో ఒక గుడారములో నివసించుచుండగా నా తండ్రి ఈ విషయములన్నింటిని చూచి, విని, మాట్లాడి, ఈ పలకలపై వ్రాయబడలేని అనేక గొప్ప విషయములను చెప్పెను.

2 ఇప్పుడు, ఈ పలకలను గూర్చి నేను చెప్పినట్లుగా అవి నా జనుల చరిత్ర యొక్క పూర్తి వృత్తాంతమును వ్రాయుచున్న పలకలు కావు; ఏలయనగా నా జనుల యొక్క పూర్తి వృత్తాంతమును వ్రాయుచున్న పలకలకు నేను నీఫైయను పేరు పెట్టియున్నాను; అందువలన, నా స్వంత పేరును బట్టి అవి నీఫై పలకలని పిలువబడినవి; అయితే ఈ పలకలు కూడా నీఫై పలకలని పిలువబడినవి.

3 అయినప్పటికీ, నా జనుల పరిచర్య వృత్తాంతము చెక్కబడవలెనన్న ప్రత్యేక ఉద్దేశ్యము చేత ఈ పలకలను చేయవలెనని ప్రభువు నుండి నేనొక ఆజ్ఞను పొందితిని.

4 ఇతర పలకలపై రాజుల పరిపాలన, యుద్ధములు మరియు నా జనుల వివాదముల యొక్క వృత్తాంతములు చెక్కబడవలెను; కానీ, ఈ పలకలలో అధికభాగము పరిచర్యను గూర్చి; ఆ ఇతర పలకలలో అధికభాగము రాజుల పరిపాలన, యుద్ధములు మరియు నా జనుల వివాదములను గూర్చి చెక్కబడవలెను.

5 అందువలన, ఆయనయందొక వివేకమైన ఉద్దేశ్యము నిమిత్తము ఈ పలకలను చేయవలెనని ప్రభువు నన్నాజ్ఞాపించెను, ఆ ఉద్దేశ్యమేమిటో నేనెరుగను.

6 కానీ, ఆది నుండి అన్ని విషయములను ఎరిగిన ప్రభువు మనుష్యసంతానము మధ్య తన కార్యములన్నిటినీ సాధించుటకు ఒక మార్గమును సిద్ధపరచును; ఏలయనగా, తన మాటలన్నిటినీ నెరవేర్చుటకు ఆయన సమస్త శక్తిని కలిగియున్నాడు. ఆలాగునే జరుగును గాక, ఆమేన్‌.