లేఖనములు
1 నీఫై 21


21వ అధ్యాయము

మెస్సీయ అన్యజనులకు ఒక వెలుగుగా ఉండును మరియు బంధీలను విడిపించును—కడవరి దినములలో ఇశ్రాయేలీయులు శక్తితో సమకూర్చబడుదురు—రాజులు వారిని పోషించు తండ్రులవలే ఉందురు—యెషయా 49 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 588–570 సం.

1 మరలా ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, నా జనుల కాపరుల యొక్క దుర్మార్గమును బట్టి త్రుంచివేయబడిన, తరిమివేయబడిన మీరందరు, అనగా వేరుచేయబడిన మీరందరు, ఇతర దేశములలో చెదరగొట్టబడిన, నా జనులైన ఓ ఇశ్రాయేలు వంశస్థులారా ఆలకించుడి. ఓ ద్వీపములారా నన్ను ఆలకించుడి, దూరముననున్న జనములారా వినుడి; ప్రభువు నన్ను గర్భమున పుట్టగానే పిలిచెను; నా తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను.

2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు; తన చేతినీడలో నన్ను దాచియున్నాడు; నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి, తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు.

3 ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను.

4 అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమియు లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచి ఉన్నాననుకొంటిని; నాకు న్యాయకర్త ప్రభువే, నా బహుమానము నా దేవునియొద్దనే ఉన్నది.

5 ఇంకను ఇశ్రాయేలీయులు సమకూర్చబడనప్పటికీ ప్రభువు దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను, కాగా తనకు సేవకుడనైయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు నన్ను గర్భమున పుట్టించిన ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—

6 నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలీయులలో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవైయుండుట ఎంతో స్వల్ప విషయము; భూదిగంతములవరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై నీవు అన్యజనులకు వెలుగైయుండునట్లు నేను నిన్ను నియమించెదనని ఆయన చెప్పెను.

7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధుడునగు ప్రభువు, మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ప్రభువు నమ్మకమైనవాడని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు.

8 ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఓ సముద్ర ద్వీపములారా అనుకూల సమయమందు నేను మీ మొరను ఆలకించితిని; రక్షణ దినమందు మిమ్ములను ఆదుకొంటిని; దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై మిమ్ములను కాపాడి, ప్రజలకు నిబంధనగా నా సేవకుడిని నియమించెదను;

9 తద్వారా బయలువెళ్ళుడి అని బంధింపబడిన వారితోను; బయటకు రండి అని చీకటిలోనున్న వారితోను మీరు చెప్పవచ్చును. మార్గములలో వారు మేయుదురు; చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును.

10 వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటిబుగ్గల యొద్ద వారిని నడిపించును; కాబట్టి వారికి ఆకలియైనను దప్పికయైనను కలుగదు, ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.

11 నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును.

12 అప్పుడు ఓ ఇశ్రాయేలు వంశస్థులారా చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు; వీరు ఉత్తర దిక్కు నుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు; వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు.

13 ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము; భూమీ సంతోషించుము; ఏలయనగా, తూర్పునందున్న వారి పాదములు స్థాపించబడును; పర్వతములారా ఆనందధ్వని చేయుడి; ఏలయనగా, వారు ఇకపై కొట్టబడరు; శ్రమనొందిన తన జనులయందు జాలిపడి ప్రభువు తన జనులను ఓదార్చియున్నాడు.

14 అయితే సీయోను—ప్రభువు నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది—కానీ, అలా చేయలేదని ఆయన చూపును.

15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని, ఓ ఇశ్రాయేలు వంశమా నేను నిన్ను మరువను.

16 చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా యెదుటనున్నవి.

17 నిన్ను నాశనము చేయువారికి వ్యతిరేకముగా నీ కుమారులు త్వరపడెదరు; నిన్ను పాడుచేసిన వారు నీలోనుండి బయలు వెళ్ళెదరు.

18 కన్నులెత్తి నలుదిశల చూడుము; వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చెదరు. నా జీవముతోడు నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

19 నివాసులు విస్తరించినందున పాడైన నీ ప్రదేశములు, నిర్జన స్థలములు మరియు నాశనము చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును; నిన్ను మ్రింగివేసిన వారు దూరముగా ఉందురు.

20 మొదటి సంతానమును నీవు పోగొట్టుకొనిన తరువాత నీకు కలుగు సంతానము—ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది; ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.

21 అప్పుడు నీవు—నేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, బంధీనై ఇటు అటు తిరుగులాడుచుండగా వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో అనుకొందువు.

22 ప్రభువైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేను అన్యజనుల తట్టు నా చేయియెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను; వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు.

23 రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు; వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళిని నాకెదరు; అప్పుడు నేను ప్రభువుననియు, నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానమునొందరనియు నీవు తెలుసుకొందువు.

24 బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము తీసుకొనగలవాడెవడు, లేదా న్యాయముగా చెరపట్టబడినవాడు విడిపించబడునా?

25 కానీ ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపించబడుదురు, భీకరుల చేతిలోనుండి కొల్లసొమ్ము విడిపించబడును; ఏలయనగా నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను.

26 నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసమును తినిపించెదను; క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తముచేత వారు మత్తులగుదురు; ప్రభువునైన నేనే నీ రక్షకుడననియు యాకోబు యొక్క బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరు ఎరుగుదురు.