లేఖనములు
1 నీఫై 5


5వ అధ్యాయము

1 లీహైకి వ్యతిరేకముగా శరయ ఫిర్యాదు చేయును—వారి కుమారులు తిరిగి వచ్చుటను బట్టి ఇరువురు ఆనందించుదురు—వారు బలులనర్పించుదురు—కంచు పలకలు మోషే మరియు ప్రవక్తల రచనలను కలిగియున్నవి—ఆ పలకలు లీహైని యోసేపు వంశస్థునిగా గుర్తించును—లీహై తన సంతానమును గూర్చి, ఆ పలకల భద్రతను గూర్చి ప్రవచించును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 మేము అరణ్యములోనున్న మా తండ్రి యొద్దకు వచ్చినప్పుడు అతడు ఆనందముతో నింపబడెను, నా తల్లి శరయ కూడా మిక్కిలి సంతోషించెను, ఏలయనగా ఆమె నిజముగా మా నిమిత్తము సంతాపపడెను.

2 మేము అరణ్యములో నశించితిమని తలంచి నా తండ్రికి వ్యతిరేకముగా ఫిర్యాదు కూడా చేసెను; అతడు దర్శనములు చూచువాడని చెప్పుచూ ఇట్లనెను: ఇదిగో, నీవు మమ్ములను మా స్వాస్థ్యమైన దేశము నుండి బయటకు నడిపించితివి, నా కుమారులు ఇక లేరు మరియు మనము అరణ్యములో నశించెదము.

3 ఈ విధమైన భాషలో నా తల్లి, నా తండ్రికి వ్యతిరేకముగా ఫిర్యాదు చేసెను.

4 అప్పుడు నా తండ్రి ఆమెతో మాట్లాడి ఇట్లనెను: నేను దర్శనములు చూచువాడనని నేనెరుగుదును; దేవుని క్రియలను దర్శనము నందు చూసియుండని యెడల, దేవుని మంచితనమును ఎరుగకయుండి, యెరూషలేమునందే నిలిచి నా సహోదరులతోపాటు నశించియుండేవాడిని.

5 కానీ, నేనొక వాగ్దానదేశమును పొందితిని, ఆ విషయముల యందు నేను ఆనందించుచున్నాను; ప్రభువు నా కుమారులను లేబన్‌ చేతులలో నుండి విడిపించునని, వారిని అరణ్యములోనికి తిరిగి మన వద్దకు తీసుకొనివచ్చునని నేనెరుగుదును.

6 మేము యూదుల వృత్తాంతమును పొందుటకు యెరూషలేము దేశమునకు అరణ్యములో ప్రయాణము చేయుచుండగా, ఈ విధమైన భాషతో నా తండ్రి లీహై మా గురించి నా తల్లి శరయను ఓదార్చెను.

7 మేము నా తండ్రి గుడారమునకు తిరిగి వచ్చినప్పుడు, వారి ఆనందము సంపూర్ణమాయెను మరియు నా తల్లి ఓదార్చబడెను.

8 ఆమె ఇట్లనుచూ మాట్లాడెను: ప్రభువు నా భర్తను అరణ్యములోనికి పారిపొమ్మని ఆజ్ఞాపించియున్నాడని ఇప్పుడు నేను నిశ్చయముగా ఎరుగుదును; ప్రభువు నా కుమారులను రక్షించెనని, లేబన్‌ చేతులలోనుండి వారిని విడిపించెనని, ప్రభువు వారికి ఆజ్ఞాపించిన కార్యమును నెరవేర్చుటకు వారికి శక్తినిచ్చియున్నాడని నిశ్చయముగా నేనెరుగుదును. మరియు ఈ విధమైన భాషలో ఆమె మాట్లాడెను.

9 తరువాత వారు మిక్కిలి ఆనందించి ప్రభువుకు బలిని, దహనబలులను అర్పించిరి; ఇశ్రాయేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి.

10 వారు ఇశ్రాయేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత, నా తండ్రి లీహై కంచు పలకలపై చెక్కబడిన వృత్తాంతములను తీసుకొని, వాటిని మొదటి నుండి పరిశోధించెను.

11 అవి లోకము యొక్క సృష్టిని గూర్చి, మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలను గూర్చిన వృత్తాంతమునిచ్చు మోషే యొక్క ఐదు గ్రంథములను;

12 ఆది నుండి యూదా రాజైన సిద్కియా పరిపాలన ఆరంభము వరకు గల యూదుల వృత్తాంతమును;

13 ఆది నుండి సిద్కియా పరిపాలన ఆరంభము వరకు గల పరిశుద్ధ ప్రవక్తల ప్రవచనములను; యిర్మియా నోటి ద్వారా పలుకబడిన అనేక ప్రవచనములను కూడా కలిగియుండుట అతడు చూసెను.

14 నా తండ్రి లీహై, ఆ కంచు పలకలపైన తన పితరుల వంశావళిని కూడా కనుగొనెను; దానిని బట్టి ఐగుప్తులోనికి అమ్మబడి తన తండ్రి యాకోబును, అతని కుటుంబమంతటిని కరువులో నశించకుండా కాపాడుటకు ప్రభువు హస్తము చేత రక్షింపబడిన యాకోబు కుమారుడైన ఆ యోసేపు వంశస్థుడని అతడు తెలుసుకొనెను.

15 వారు కూడా తమను కాపాడిన ఆ దేవుని చేతనే చెర నుండి మరియు ఐగుప్తు దేశము నుండి బయటకు నడిపించబడిరి.

16 ఆ విధముగా నా తండ్రి లీహై, తన పితరుల వంశావళిని కనుగొనెను. లేబన్‌ కూడా యోసేపు వంశస్థుడైయుండుటవలన అతడు, అతని పితరులు ఆ వృత్తాంతములను భద్రపరచిరి.

17 ఇప్పుడు నా తండ్రి ఈ విషయములన్నిటినీ చూచినప్పుడు, అతడు ఆత్మతో నింపబడి తన సంతానమును గూర్చి—

18 ఈ కంచు పలకలు అతని సంతానమైన సమస్త జనములు, వంశములు, భాషలు, ప్రజల యొద్దకు వెళ్ళవలెనని ప్రవచించుట మొదలు పెట్టెను.

19 అందువలన, ఈ కంచు పలకలు ఎన్నడును నాశనము కారాదని; కాలముతో పాటు ఇకపై అవి కాంతివిహీనము కారాదని చెప్పుచూ అతని సంతానమును గూర్చి అనేక విషయములను అతడు ప్రవచించెను.

20 ఇంతవరకు నేను మరియు నా తండ్రి ప్రభువు మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చితిమి.

21 ప్రభువు మాకు ఆజ్ఞాపించిన వృత్తాంతములను మేము సంపాదించి, వాటిని పరిశోధించి, అవి కోరదగినవని కనుగొంటిమి; అంతేకాక అవి మాకు అత్యంత విలువైనవి, ఏలయనగా మేము వాటి ద్వారా మా పిల్లల కొరకు ప్రభువు ఆజ్ఞలను భద్రపరచగలము.

22 అందువలన, అరణ్యములో వాగ్దానదేశము వైపు ప్రయాణము చేయుచుండగా, వాటిని మాతో తీసుకొనిపోవుట ప్రభువు నందు వివేకమైయుండెను.