లేఖనములు
1 నీఫై 19


19వ అధ్యాయము

నీఫై లోహపు పలకలను చేసి, తన జనుల చరిత్రను నమోదు చేయును—లీహై యెరూషలేమును విడిచిపెట్టిన సమయము నుండి ఆరు వందల సంవత్సరములకు ఇశ్రాయేలు దేవుడు వచ్చును—ఆయన బాధలను, సిలువ వేయబడుటను గూర్చి నీఫై చెప్పును—కడవరి దినములలో వారు ప్రభువు వద్దకు తిరిగివచ్చు వరకు యూదులు తృణీకరింపబడి, చెదరగొట్టబడుదురు. సుమారు క్రీ. పూ. 588–570 సం.

1 ప్రభువు నన్ను ఆజ్ఞాపించినందువలన, నేను నా జనుల వృత్తాంతమును వాటిపై చెక్కగలుగునట్లు లోహపు పలకలను చేసితిని. నేను చేసిన ఆ పలకలపై నా తండ్రి వృత్తాంతమును, అరణ్యములో మా ప్రయాణములను, నా తండ్రి ప్రవచనములను మరియు నా స్వంత ప్రవచనములను కూడా చెక్కితిని.

2 నేను వాటిని చేసిన సమయమున, ఈ పలకలను చేయవలెనని ప్రభువు చేత ఆజ్ఞాపించబడుదునని నేనెరుగను; అందువలన, నా తండ్రి వృత్తాంతము, అతని పితరుల వంశావళి మరియు అరణ్యములో సమస్త వ్యవహారముల యొక్క అధిక భాగము నేను చెప్పియున్న ఆ మొదటి పలకలపై చెక్కబడెను; కావున నేను ఈ పలకలను చేయుటకు ముందు జరిగిన కార్యములు యథార్థముగా, మరింత వివరముగా మొదటి పలకల మీద ప్రస్తావించబడెను.

3 ఆజ్ఞానుసారముగా నేను ఈ పలకలను చేసిన తరువాత, పరిచర్య మరియు ప్రవచనములు, వాటిలో స్పష్టమైన, విలువైన భాగములు ఈ పలకలపై వ్రాయబడవలెనని నీఫైయను నేను ఒక ఆజ్ఞను పొందితిని; వ్రాయబడిన విషయములు ఈ దేశమును స్వాధీనపరచుకొను నా జనుల ఉపదేశము కొరకు మరియు ప్రభువు యెరిగియున్న ఇతర వివేకమైన ఉద్దేశ్యముల కొరకు భద్రపరచబడవలెను.

4 అందువలన నీఫైయను నేను, ఇతర పలకల మీద నా జనుల యుద్ధములు, వివాదములు మరియు నాశనములను గూర్చిన వృత్తాంతమునిచ్చు లేదా వివరణాత్మక వృత్తాంతమునిచ్చు గ్రంథమును చేసితిని. దీనిని చేసి, నేను మరణించిన తరువాత నా జనులు ఏమి చేయవలెనో వారికాజ్ఞాపించితిని; ప్రభువు మరికొన్ని ఆజ్ఞలిచ్చువరకు ఈ పలకలు ఒక తరము నుండి ఇంకొక తరమునకు లేదా ఒక ప్రవక్త నుండి ఇంకొక ప్రవక్తకు అప్పగించబడవలెను.

5 నేను ఈ పలకలు చేయుటను గూర్చిన వృత్తాంతమును ఇకపై ఇచ్చెదను; తరువాత నేను చెప్పిన దానిని బట్టి కొనసాగెదను; మిక్కిలి పవిత్రమైన విషయాలు నా జనుల జ్ఞానము నిమిత్తము భద్రపరచబడునట్లు నేనిది చేయుచున్నాను.

6 అయినప్పటికీ, పవిత్రమైనదని నేను తలంచినది తప్ప, మరి దేనిని పలకలపైన వ్రాయను. ఇప్పుడు, నేను పొరపాటు చేసిన యెడల, పూర్వకాలము వారు కూడా పొరపాటు చేసియున్నారు; ఇతర మనుష్యులను బట్టి నన్ను నేను సమర్థించుకొనుట లేదు, కాని శరీర సంబంధముగా నాయందున్న బలహీనతను బట్టి నన్ను నేను సమర్థించుకొందును.

7 ఏలయనగా, శరీరము మరియు ఆత్మ రెండింటికి గొప్ప విలువైనవిగా కొందరు మనుష్యులు భావించు విషయములను, ఇతరులు తృణీకరించి వారి పాదముల క్రింద త్రొక్కుదురు. అంతేకాకుండా ఇశ్రాయేలు యొక్క నిజమైన దేవుడిని కూడా మనుష్యులు తమ పాదముల క్రింద త్రొక్కుదురు; వారి పాదముల క్రింద త్రొక్కుదురు, అనగా ఆయనను తృణీకరించి, ఆయన సలహాలను ఆలకించరని నేను చెప్పుచున్నాను.

8 దేవదూత మాటల ప్రకారము నా తండ్రి యెరూషలేమును విడిచిపెట్టిన సమయము నుండి ఆరు వందల సంవత్సరములకు ఆయన వచ్చును.

9 వారి దుష్టకార్యములను బట్టి లోకము ఆయనను పనికిరాని వస్తువుగా తీర్పు తీర్చును; అందువలన, వారు ఆయనను కొరడాతో బాధించినా ఆయన సహించును, ఆయనను కొట్టినా ఆయన సహించును. వారు ఆయనపై ఉమ్మి వేసినా నరుల సంతానము యెడల ఉన్న ఆయన కృపాతిశయము మరియు దీర్ఘశాంతమును బట్టి ఆయన సహించును.

10 ఐగుప్తులో నుండి, దాస్యము నుండి బయటకు నడిపించబడి అరణ్యములో ఆయనచేత కాపాడబడిన మన పితరుల యొక్క దేవుడు, అనగా అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల యొక్క దేవుడు, దేవదూత మాటల ప్రకారము తననుతాను అర్పించుకొనును. జీనక్ మాటల ప్రకారము పైకెత్తబడుటకు ఒక నరునిగా దుర్మార్గులైన నరుల హస్తములలోనికి వెళ్ళును. నేయూమ్ మాటల ప్రకారము సిలువ వేయబడును, జీనన్‌ మాటల ప్రకారము సమాధిలో పాతిపెట్టబడును. అతడు చెప్పిన విధముగా మూడు దినముల అంధకారము ఆయన మరణమునకు సూచనగా సముద్ర ద్వీపములలో నివసించువారికి, అనగా ఇశ్రాయేలు వంశస్థులకు ఇవ్వబడును.

11 ఏలయనగా, ప్రవక్త ఈ విధముగా పలికెను: ప్రభువైన దేవుడు ఆ దినమున ఇశ్రాయేలు వంశస్థులందరిని తప్పక దర్శించును, వారి నీతిని బట్టి కొందరిని వారి గొప్ప ఆనందము మరియు రక్షణార్థము దర్శించును, ఇతరులను తన శక్తి ద్వారా ఉరుములతోను, మెరుపులతోను, తుఫానుతోను, అగ్నితోను, పొగతోను, అంధకారపు ఆవిరితోను, భూమి తెరువబడుటచేత మరియు పైకెత్తబడు పర్వతములచేత నిశ్చయముగా దర్శించును.

12 ఈ కార్యములన్నియు నిశ్చయముగా జరుగవలెనని ప్రవక్త జీనన్‌ చెప్పుచున్నాడు. భూమి పైనున్న బండలు ముక్కలు కావలెను; భూమి యొక్క మూలుగులను బట్టి దేవుని ఆత్మ ద్వారా సముద్ర ద్వీపముల రాజులనేకులు ప్రకృతి యొక్క దేవుడు వేదనపడుచున్నాడని కేకవేయునట్లు చేయబడుదురు.

13 యెరూషలేములోనున్న వారు జనులందరిచేత శిక్షింపబడుదురని ప్రవక్త చెప్పుచున్నాడు, ఏలయనగా, వారు ఇశ్రాయేలు దేవుడిని సిలువ వేయుదురు, మరియు సూచకక్రియలను, ఆశ్చర్యకార్యములను, ఇశ్రాయేలు దేవుని శక్తి మరియు మహిమను తిరస్కరించుచూ తమ హృదయములను కఠినపరచుకొందురు.

14 వారు తమ హృదయములను కఠినపరచుకొని ఇశ్రాయేలు పరిశుద్ధుని తృణీకరించినందున, వారు శరీరమందు తిరుగులాడుచూ నశించుదురు; వారు సామెతగాను, హేళనగాను మారి, సమస్త జనములందు ద్వేషింపబడుదురని ప్రవక్త చెప్పుచున్నాడు.

15 అయినప్పటికీ, వారు ఇక మీదట ఇశ్రాయేలు పరిశుద్ధునికి వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొనని దినము వచ్చినప్పుడు, వారి పితరులకు ఆయన చేసిన నిబంధనలను ఆయన జ్ఞాపకము చేసుకొనునని ప్రవక్త చెప్పుచున్నాడు.

16 అప్పుడు ఆయన సముద్ర ద్వీపములను జ్ఞాపకము చేసుకొనును; ప్రవక్త జీనన్‌ మాటల ప్రకారము, ఇశ్రాయేలు వంశస్థులైన జనులందరినీ భూమి యొక్క నలుమూలల నుండి నేను సమకూర్చుదునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

17 సమస్త భూమి ప్రభువు యొక్క రక్షణను చూచునని ప్రవక్త చెప్పుచున్నాడు. ప్రతి జనము, వంశము, భాష మరియు ప్రజలు ఆశీర్వదింపబడుదురు.

18 వారు తమ విమోచకుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనునట్లు, బహుశా నేను వారిని ఒప్పించ గలుగుదునేమోనని నీఫైయను నేను, ఈ విషయములను నా జనుల కొరకు వ్రాసియుంటిని.

19 అందువలన, ఈ విషయములను వారు పొందినట్లైతే నేను ఇశ్రాయేలు వంశస్థులందరితో మాట్లాడెదను.

20 యెరూషలేములోనున్న వారి కొరకు నా కీళ్ళన్నియు బలహీనమగునంతగా నన్ను అలసిపోజేయునట్లు ఆత్మీయ భావోద్రేకములను నేను కలిగియున్నాను. ఏలయనగా, ప్రాచీన కాలపు ప్రవక్తలకు చూపినట్లుగా వారిని గూర్చి నాకు చూపుటకు ప్రభువు కనికరము కలిగియుండని యెడల, నేను కూడా నశించియుండెడివాడను.

21 వారిని గూర్చిన విషయములన్నీ ప్రాచీన కాలపు ప్రవక్తలకు ఆయన నిజముగా చూపెను; మా గురించి కూడా అనేకమందికి ఆయన చూపెను; ఆ విషయములు కంచు పలకలపై వ్రాయబడియున్నందున వారిని గూర్చి మేము తెలుసుకొనుట అవసరము.

22 ఇప్పుడు నీఫైయను నేను, ఈ విషయములను నా సహోదరులకు బోధించితిని; ప్రాచీన కాలపు జనుల మధ్య ఇతర దేశములలో ప్రభువు కార్యములను గూర్చి వారు తెలుసుకొనవలెనని, కంచు పలకలపై చెక్కబడియున్న అనేక విషయములను నేను వారికి చదివి వినిపించితిని.

23 మోషే గ్రంథములలో వ్రాయబడిన అనేక విషయములను నేను వారికి చదివి వినిపించితిని; వారి విమోచకుడైన ప్రభువు నందు వారు విశ్వాసముంచుటకు నేను వారిని ఒప్పించునట్లు ప్రవక్తయైన యెషయా వ్రాసిన దానిని వారికి చదివి వినిపించితిని; ఏలయనగా, అవి మాకు ప్రయోజనకరముగా ఉండునట్లు మరియు మేము నేర్చుకొనునట్లు లేఖనములన్నిటినీ మాతో పోల్చితిని.

24 అందువలన, నేను వారితో ఇట్లంటిని: వేరుచేయబడిన కొమ్మ అయిన ఇశ్రాయేలు ఇంటి యొక్క శేషమైన మీరు, ప్రవక్త మాటలను ఆలకించుడి; మీరు విడిచి వచ్చిన మీ సహోదరుల వలే, మీరు కూడా నిరీక్షణ కలిగియుండునట్లు ఇశ్రాయేలు వంశస్థులందరి కొరకు వ్రాయబడిన ప్రవక్త మాటలను ఆలకించుడి మరియు వాటిని మీతో పోల్చుకొనుడి; ఏలయనగా, ఈ విధముగా ప్రవక్త వ్రాసియుండెను.