లేఖనములు
1 నీఫై 12


అధ్యాయము 12

నీఫై దర్శనమందు వాగ్దానదేశమును, దాని నివాసుల నీతి, దుష్టత్వము మరియు పతనమును, వారి మధ్య దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క రాకను, పండ్రెండుగురు శిష్యులు మరియు పండ్రెండుగురు అపోస్తలులు ఇశ్రాయేలును తీర్పుతీర్చు విధానమును, విశ్వాసమందు క్షీణించిపోవు వారి యొక్క అసహ్యమైన, మలినమైన స్థితిని చూచును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 ఆ దేవదూత నాతో—చూడుము, నీ సంతానమును మరియు నీ సహోదరుల సంతానమును చూడుమనెను; నేను చూచి, వాగ్దానదేశమును వీక్షించితిని; సముద్రపు ఇసుక వలె అధిక సంఖ్యలో గల జన సమూహములను నేను చూచితిని.

2 సమూహములు ఒక దానికి వ్యతిరేకముగా మరొకటి యుద్ధము చేయుటకు కూడియుండుట చూచితిని; యుద్ధములు, యుద్ధములను గూర్చిన వదంతులను, ఖడ్గము చేత గొప్ప సంహారములను నా జనుల మధ్య చూచితిని.

3 ఈవిధముగా ఆ దేశములో అనేక తరములు యుద్ధములు, వివాదములందు గతించిపోవుట నేను చూచితిని; అంతేకాకుండా, లెక్కించలేనన్ని పట్టణములను కూడా చూచితిని.

4 వాగ్దానదేశముపై ఒక అంధకారపు పొగమంచును చూచితిని; మెరుపులను చూచితిని; ఉరుములను, భూకంపములను, అన్ని రకములైన కలకలములతో కూడిన శబ్దములను వింటిని; భూమిని, రాళ్ళను, అవి బీటలు వారుటను చూచితిని; పర్వతములు ముక్కలై దొర్లుటను చూచితిని; భూ మైదానములను, అవి విరిగిపోవుటను చూచితిని; అనేక పట్టణములు మునిగిపోవుటను చూచితిని; అనేకులు అగ్నితో కాల్చబడుటను చూచితిని; మరియు భూమి కంపించుటను బట్టి, దాని పైకి అనేకమంది దొర్లిపడుటను చూచితిని.

5 నేను ఈ దృశ్యములను చూచిన తరువాత, ఆ అంధకారపు ఆవిరి భూముఖము నుండి దూరముగా కదలిపోవుటను చూచితిని; ప్రభువు యొక్క అత్యంత తీవ్రమైన తీర్పును బట్టి పతనము కాని అనేక సమూహములను చూచితిని.

6 పరలోకములు తెరువబడుటను, దేవుని గొఱ్ఱెపిల్ల పరలోకము నుండి దిగి వచ్చుటను చూచితిని; ఆయన క్రిందికి దిగివచ్చి, తనను వారికి ప్రత్యక్షపరచుకొనెను.

7 పరిశుద్ధాత్మ పండ్రెండుగురు ఇతరులపై పడుట కూడా నేను చూచి సాక్ష్యమిచ్చితిని; వారు దేవునిచేత నియమింపబడి, ఎన్నుకోబడిరి.

8 అప్పుడు ఆ దేవదూత నాతో ఇట్లనెను: గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు శిష్యులను చూడుము, వీరు నీ సంతానమునకు పరిచర్య చేయుటకు ఎన్నుకోబడిరి.

9 మరియు అతడు నాతో చెప్పెను: గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు అపొస్తలులు నీకు జ్ఞాపకమున్నారా? ఇశ్రాయేలు వంశపు పన్నెండు గోత్రములకు తీర్పు తీర్చు వారు వీరే; అందువలన నీ సంతానము యొక్క పండ్రెండుగురు సేవకులు వారిచే తీర్పు తీర్చబడుదురు. ఏలయనగా మీరు ఇశ్రాయేలు వంశస్థులు.

10 నీవు చూచుచున్న ఈ పండ్రెండుగురు సేవకులు నీ సంతానమునకు తీర్పు తీర్చుదురు. వారు నిరంతరము నీతిమంతులుగా ఉందురు. ఏలయనగా, దేవుని గొఱ్ఱెపిల్ల యందు వారి విశ్వాసమును బట్టి వారి వస్త్రములు ఆయన రక్తమందు తెల్లగా చేయబడినవి.

11 మరియు ఆ దేవదూత నాతో చెప్పెను: చూడుము! నేను చూచి, మూడు తరములు నీతియందు గడచిపోవుట వీక్షించితిని; వారి వస్త్రములు దేవుని గొఱ్ఱెపిల్లవలే తెల్లగా ఉండెను: ఆ దేవదూత నాతో ఇట్లనెను: ఆయన యందు వారి విశ్వాసమును బట్టి వీరు గొఱ్ఱెపిల్ల యొక్క రక్తమునందు తెల్లగా చేయబడిరి.

12 నీఫైయను నేను, నాలుగవ తరము వారిలో నీతియందు గతించిపోయిన అనేకులను చూచితిని.

13 మరియు భూ సమూహములు కూడియుండుట నేను చూచితిని.

14 ఆ దేవదూత నాతో ఇట్లనెను: నీ సంతానమును, నీ సహోదరుల సంతానమును చూడుము.

15 నేను చూచి, నా సంతానము నా సహోదరుల సంతానమునకు వ్యతిరేకముగా సమూహములలో కూడియుండుట వీక్షించితిని; వారు యుద్ధమునకై కూడియుండిరి.

16 ఆ దేవదూత నాతో ఇట్లనెను: నీ తండ్రి చూచిన మురికి నీటి ఊటను చూడుము; ముఖ్యముగా అతడు చెప్పిన నదిని చూడుము; దాని లోతులు నరకపు లోతులైయున్నవి.

17 ఆ అంధకారపు పొగమంచులు అపవాది శోధనలు. అవి కన్నులకు గృడ్డితనమును కలుగజేయును; మనుష్య సంతానపు హృదయాలను కఠినపరచును; మరియు వారు నశించి, తప్పిపోవునట్లు వారిని విశాలమైన దారులలోనికి నడిపించును.

18 నీ తండ్రి చూచిన ఆ పెద్ద విశాలమైన భవనము మనుష్య సంతానపు వ్యర్థమైన ఊహలు మరియు గర్వమైయున్నది. అతి భయంకరమైన అగాధమొకటి వారిని వేరుచేయును. ముఖ్యముగా, దేవుని గొఱ్ఱెపిల్ల అయిన మెస్సీయ, ఎవరిని గూర్చి పరిశుద్ధాత్మ లోకము ప్రారంభమైనప్పటి నుండి ఈ సమయము వరకు, మరియు ఈ సమయము నుండి మొదలుకొని నిరంతరము సాక్ష్యమిచ్చుచున్నాడో ఆ నిత్యదేవుని న్యాయవాక్యము వారిని వేరుచేయును.

19 ఆ దేవదూత ఈ మాటలు చెప్పుచున్నప్పుడు నేను దృష్టి నిలుపగా, ఆ దేవదూత మాటప్రకారము నా సహోదరుల సంతానము నా సంతానమునకు వ్యతిరేకముగా పోరాడుచుండుట చూచితిని; నా సంతానము యొక్క గర్వము మరియు అపవాది శోధనలను బట్టి నా సహోదరుల సంతానము నా సంతానమును ఓడించుట చూచితిని.

20 నేను చూచి, నా సహోదరుల సంతానము నా సంతానమును అధిగమించుటను వీక్షించితిని; వారు భూముఖముపై సమూహములుగా సంచరించిరి.

21 వారు సమూహములుగా కూడియుండుటను నేను చూచితిని; వారి మధ్య యుద్ధములు, యుద్ధములను గూర్చిన వదంతులను చూచితిని; మరియు యుద్ధములు, యుద్ధములను గూర్చిన వదంతులలో అనేక తరములు గతించిపోవుట నేను చూచితిని.

22 ఆ దేవదూత నాతో—వీరు విశ్వాసమందు క్షీణించి పోవుదురనెను.

23 వారు విశ్వాసమందు క్షీణించిపోయిన తరువాత, వారొక నల్లని అసహ్యకరమైన, మలినమైన, సోమరితనముతో సకల విధముల హేయక్రియలతో నిండిన జనముగా మారుట నేను చూచితిని.