సర్వసభ్య సమావేశము
సహాయం చేయడంలో త్వరపడండి, తీర్పు తీర్చడంలో నెమ్మదిగా ఉండండి
2026 అక్టోబరు సర్వసభ్య సమావేశము


8:16

సహాయం చేయడంలో త్వరపడండి, తీర్పు తీర్చడంలో నెమ్మదిగా ఉండండి

సహాయం చేయడానికి త్వరపడి, తీర్పు తీర్చడానికి నెమ్మదిగా ఉండడం అనేది మనలో ప్రతి ఒక్కరూ మన రక్షకుడిని మరింతగా పోలి ఉండేందుకు ఒక సరళమైన మరియు ఎంతో ప్రోత్సాహకరమైన మార్గం.

వ్యర్థమైన గుండీల ఉపమానం

“బాలుడు వాటిని తోలును.” చాలా సంవత్సరాల క్రితం, ఈ లేఖనంలోని మాటలు నిజంగా నా అనుభవంలోకి వచ్చాయి. ఇది వార్డు ప్రాథమిక కార్యక్రమం సందర్భంగా జరిగింది.

ఆ సబ్బాతు ఉదయం, నా యువ స్నేహితుడు జేమ్స్ కొత్త సూట్ ధరించి ఉన్నాడు. కార్యక్రమం ప్రారంభం కాగానే, జేమ్స్ తన కొత్త సూట్‌లోని కొన్ని ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తున్నాడు. అతని జాకెట్‌లోని రెండు అంశాలు అతని దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి. అతని జాకెట్ చేతులకు గుండీలు ఉన్నాయి, కానీ రంధ్రాలు లేవు. మరియు అతని జాకెట్ యొక్క ఎడమ కాలర్ మడతపై గుండీ రంధ్రం ఉంది, కానీ గుండీలు లేవు. గుండీలు గానీ, గుండీ రంధ్రం గానీ ఏ వాస్తవ ప్రయోజనాన్నీ నెరవేరుస్తున్నట్లు అనిపించలేదు.

అయితే, జేమ్స్ చాకచక్యంగా ఆ రెండింటికీ ఒక ప్రయోజనాన్ని కల్పించాడు. జేమ్స్ తన జాకెట్ కుడి చేతి గుండీని ఎడమ ‌కాలర్ మడతకు ఆనందంగా పెట్టుకుంటుండగా నేను ఆత్రుతగా చూశాను. తన గురించి తాను సంతోషపడుతున్న భావన కొద్దిసేపటికే భయాందోళనగా మారిపోయింది. ఎందుకంటే జేమ్స్ తన చేతిని ఛాతీ గుండీకి బిగించుకున్న తర్వాత, ప్రాథమిక పిల్లవాడికున్న మృదుత్వము ఉన్నప్పటికీ, ఆ బంధనం నుండి తనను తాను విడిపించుకోలేకపోయాడు. కానీ జేమ్స్ అనుకోకుండా, చాలా విజయవంతంగా, ఒక చేతికి బిగించే జాకెట్‌ను తయారు చేసుకున్నాడు.

జేమ్స్ మరింత ఎక్కువగా చిక్కుకుపోతుండగా, నాలో అసహనం అంతకంతకూ పెరిగిపోయింది. వ్యర్థమైన గుండీలను ఒక అసౌకర్యవంతమైన మరియు నాకైతే చికాకు కలిగించే ప్రయోజనం కోసం ఉపయోగించారు. జేమ్స్ ప్రసంగ పీఠం వద్దకు వెళ్ళబోతుండగా నేను నిరాశతో తల అడ్డంగా ఊపాను.

ఆ వెంటనే, జేమ్స్ పక్కన కూర్చున్న చిన్న అమ్మాయిని నేను గమనించాను. ఆమె కూడా జేమ్స్ యొక్క ఇబ్బందిని, అతనిలో పెరుగుతున్న ఆందోళనను చూసింది. కానీ, ఆమె కోపం తెచ్చుకోకుండా సహాయం చేయాలనుకుంది. ఏం చేయాలో త్వరగా గ్రహించి, ఆమె తీర్పు తీర్చని తన చిన్ని వ్రేళ్ళతో గుండీని రంధ్రం నుండి బయటకు తీసేసింది. జేమ్స్ రక్షించబడ్డాడు మరియు ప్రాథమిక కార్యక్రమం కాపాడబడింది!

నాకు ఉపశమనం కలిగింది, అయితే వినయభావం కూడా కలిగింది. తప్పుగా పెట్టిన గుండీ మరియు ఆ చిన్నారి వ్రేళ్లు, యేసును పోలి నడుచుకోవడానికి ప్రయత్నించమని నాకు గుర్తుచేస్తున్న నిశ్శబ్దమైన మందలింపుగా నేను గుర్తించాను. చిన్నదైనాగాని ఆ మహిమకరమైన క్షణం, ఎల్డర్ ప్యాట్రిక్ కీరన్ వర్ణించినట్లుగా, నా ఆత్మ యొక్క “సంపూర్ణ పునఃస్థాపనను” స్వీకరించడానికి నాకు సహాయపడింది. ఆ రోజు జరిగిన ప్రాథమిక కార్యక్రమం యొక్క అంశం నాకు గుర్తులేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందిన సందేశం నాలో ఒక ఆధ్యాత్మిక పునర్వ్యవస్థీకరణకు ప్రేరణనిచ్చింది. ఒక చిన్నపిల్లవాడు నాకు ఈ విషయాన్ని నేర్పించాడు: యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యుడు సహాయం చేయడానికి త్వరపడతాడు మరియు తీర్పు తీర్చడానికి ఆలస్యం చేస్తాడు.

రక్షకుడు బావి దగ్గర ఉన్న స్త్రీకి సహాయం చేస్తారు (మరియు ఆమెను తీర్పు తీర్చరు)

రక్షకుడు తన మర్త్య పరిచర్య ఆరంభం నుండే ఈ ప్రేమపూర్వక శిష్యరిక సూత్రాన్ని బోధించారు. యోహాను సువార్తలో, ఆయన ఒక సమరయ స్త్రీకి పరిచర్య చేస్తారు. మనకు ఆమె పేరు తెలియదు. మనము ఆమెను “బావి దగ్గర ఉన్న స్త్రీ” అని పిలుస్తూ వచ్చాము. ప్రభువైన యేసు క్రీస్తుతో ఆమెకు జరిగిన సంభాషణ ఎన్నో పాఠాలను నేర్పుతుంది. కృపను మరియు పరివర్తన కలిగించే సహాయాన్ని అందించడంలో రక్షకుడు ఎంత త్వరగా స్పందిస్తారనే విషయం ఒక కీలకమైన పాఠం.

సంభాషణ మొదలవగానే, యేసు అలసిపోయి ఉండి, ఊహించని విధంగా ఆ స్త్రీని దాహమునకు నీళ్లిమ్మని అడిగారు. ఆ రోజు వరకు—సరిగ్గా అదే సమయానికి, ఆ స్త్రీ ఎన్ని రోజులుగా ఆ బావి దగ్గరకు ఒంటరిగా వస్తూ ఉందో మనం కేవలం ఊహించగలము అంతే. యేసు ప్రత్యక్షమయ్యేంత వరకు—ఆమెకు, అది ఒక సాధారణ రోజుగానే ఉంది. తన సాధారణ రోజుల్లో, ఆమె ఎన్నో తీర్పుతీర్చు చూపులను భరించి ఉండవచ్చు కానీ, సహాయం చేసే చేతులు మాత్రం చాలా తక్కువ—ఈ రోజు వరకు.

ఈ స్త్రీ కేవలం తన చొక్కా చేతికి ఉన్న గుండీని కాలర్ మడత వరకు పెట్టుకోవడం కంటే, తీర్పుతీర్చుటకు అర్హత కలిగించేంత ఎక్కువ చేసి ఉండవచ్చు. తెలిసిన దాని ప్రకారం, ఆమెకు వరుసగా విఫలమైన సంబంధాలు ఉన్నాయి మరియు ఆ సమయంలో, ఆమె తన భర్త కాని ఒక వ్యక్తితో కలిసి జీవిస్తోంది. కానీ ఆమె పరిస్థితుల గురించి మనకు నిజంగా ఏమి తెలుసు? ఆమె వితంతువా? విడాకులు తీసుకుందా? విడిచిపెట్టబడిందా? మనకు తెలియదు. ఇప్పుడు, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆమె కథ చాలా ముఖ్యమైనది, కానీ ఇవి ఆమె ప్రయాణం గురించి మనం తెలుసుకోవలసిన విమర్శనాత్మక వివరాలు కావు.

దానికి బదులుగా క్రీస్తు దేనిపై దృష్టి సారించారు? సహాయం. “జీవజలం” యొక్క సమర్పణ. సర్వ మానవాళి యొక్క గొప్ప విమోచకునికి ఈ పేరులేని స్త్రీ గురించిన సమస్త విషయాలూ సంపూర్ణంగా తెలుసు మరియు జీవజలానికి సజీవ సాక్షిగా నిలిచేందుకు ఆయన ఆమె వద్దకు వచ్చారు. ఆయన ఆమెకు కృపను మరియు పరివర్తన కలిగించే సహాయాన్ని అందించారు.

ఆయన ఆ స్త్రీతో అవమానకరంగా కాకుండా, గౌరవంగా మాట్లాడారు. ఆయన ఆమె ప్రశ్నలను శ్రద్ధగా విని, ఎగతాళి చేయకుండా బోధనతో సమాధానమిచ్చారు. గతంలో జరిగిన వాటిని బట్టి ఆయన ఆమెను నిందించలేదు. ఆమె నిజాయితీపై నమ్మకంతో ఆయన సత్యాన్ని పంచుకున్నారు. ప్రజలు తమ జీవితాలను మార్చుకోవడానికి సహాయం చేయాలంటే, మనం వారి గతాన్ని మాత్రమే కాకుండా, భవిష్యత్తులో వారు చేయగలిగిన దానిని కూడా చూడాలని యేసు క్రీస్తు మనకు గుర్తుచేస్తున్నారు. ఆ రోజు ఆమె ఒక అంటరానిదానిలా బావి దగ్గరకు నడిచి వెళ్ళింది. ఆమె ఒక నిర్దిష్ట ఉద్దేశంతో బావి దగ్గరి నుండి నడిచి వెళ్ళిపోయింది. “సహాయం చేయడంలో త్వరపడడం, తీర్పు తీర్చడంలో నెమ్మదిగా ఉండడం” అంటే సరిగ్గా ఇలాగే ఉంటుంది.

సాధారణ రోజులలో స్నేహితులకు మరియు కొత్త సభ్యులకు తోడుగా నిలవడం

ప్రతిరోజూ, ప్రపంచవ్యాప్తంగా సువార్తికులు ఆధునిక బావుల వద్ద ప్రజలను కలుసుకుంటారు. వారు యేసే క్రీస్తు అని, ఘనమైన “ఉన్నవాడు” అని ప్రకటిస్తారు. తీర్పుకు భయపడినప్పటికీ సహాయం అవసరమైన వారిని వారు కనుగొని, వారికి బోధించి, బాప్తిస్మమిచ్చి, నిర్ధారిస్తారు. యేసు క్రీస్తు శిష్యులుగా, స్నేహితులకు మరియు కొత్త సభ్యులకు క్రీస్తును పోలిన రీతులలో మరింతగా సహాయం చేయడానికి మన ఆత్మలను పునఃస్థాపించుకోవాలని మనం ఆహ్వానించబడ్డాము. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్, “మన రక్షకుని వలె పరిశుద్ధంగా ఉండాలని కోరుకోమని” స్పష్టంగా మరియు సూటిగా మనల్ని ఆహ్వానించారు. సహాయం చేయడానికి త్వరపడి, తీర్పు తీర్చడానికి నెమ్మదిగా ఉండడం అనేది మనలో ప్రతి ఒక్కరూ మరింత పరిశుద్ధంగా ఉండటానికి, మన రక్షకునిలా మరింతగా మారడానికి, ఆయన నిజమైన శిష్యులుగా ఉండటానికి ఒక సరళమైన మరియు అత్యంత ప్రోత్సాహకరమైన మార్గం.

ఆధునిక కాలపు ఈ స్త్రీ పురుషులు మిమ్మల్ని, నన్ను బావి దగ్గర కలుసుకున్నప్పుడు, వారు “తమ స్వంత ఇంటికి చేరుకున్నామన్న” భావనను పొందేలా చూడమని నేను ప్రార్థిస్తున్నాను. జీవముగల, ప్రేమగల జలముతో వారిని నింపడానికి సిద్ధంగా ఉన్న, యేసు క్రీస్తు కొరకు ప్రయాసపడే శిష్యులను మీలోనూ, నాలోనూ వారు గుర్తిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. మనం ప్రజలను తీర్పు తీర్చకుండా, మన చిన్న మరియు సరళమైన మార్గాలలో ఒక్కొక్కరికి సహాయం చేసినప్పుడు, మనం యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నాము అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. యెషయా 11:6.

  2. జేమ్స్ మరియు అతని కుటుంబం అనుమతితో నేను ఈ కథను పంచుకుంటున్నాను.

  3. See “I’m Trying to Be like Jesus,” Children’s Songbook, 78–79.

  4. రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రభువైన యేసు క్రీస్తు మరలా వస్తారు,” లియహోనా, నవ. 2024, 121 చూడండి; రోనాల్డ్ ఎ. రాస్బాండ్, “మన కళ్ళ ముందు,” లియహోనా, మే 2025, 13–14, 17 కూడా చూడండి.

  5. ప్యాట్రిక్ కీరన్, “మిమ్మల్ని గృహానికి తీసుకురావడమే దేవుని ఉద్దేశం,” లియహోనా, మే 2024, 88.

  6. ఇతరులను తీర్పు తీర్చడంలో నెమ్మదిగా ఉండటం గురించి అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ ఈ క్రింది విధంగా బోధించారు: “మనం ప్రజల మీద తుది తీర్పులు ఇవ్వకుండా ఉండాలి, ఎందుకంటే అలా చేయడానికి మనకు జ్ఞానం మరియు వివేకం లేదు. … ప్రభువు యొక్క తుది తీర్పు విధానం ఏమిటంటే, ఒక వ్యక్తి పొందిన ధర్మశాస్త్రం గురించిన తన పరిపూర్ణ జ్ఞానాన్ని వర్తింపజేసి, ఆ వ్యక్తి యొక్క జీవితాంతం వారి పరిస్థితులు, ఉద్దేశాలు మరియు చర్యల ఆధారంగా తీర్పు తీర్చడం,” (“‘Judge Not’ and Judging,” Ensign, Aug. 1999, 8 చూడండి; మత్తయి 7:1–5; లూకా 6:37–42; 3 నీఫై 14:1–12; మోర్మన్ 8:20 కూడా చూడండి). అదేవిధంగా, ఇతరులకు సహాయం చేయడం మన శిష్యరికానికి ఒక ముఖ్య లక్షణంగా ఉండాలని యేసు నిరంతరం బోధించారు ( మత్తయి 5:38–47; మార్కు 10:45; లూకా 10:30–37 చూడండి). మోర్మన్ గ్రంథంలో, శిష్యరికపు ఈ లక్షణం అనేక లేఖన గద్యభాగాలలో బోధించబడింది; బాప్తిస్మమప్పుడు మనం చేసే నిబంధనను మనం ఏ విధంగా జీవించవచ్చో తెలిపే అందమైన వర్ణనలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ లేఖన గద్యభాగాలు మనం ఇతరులకు సహాయపడే మరియు సేవ చేసే అనేక మార్గాలను వివరిస్తాయి (మోషైయ 18:8–11 చూడండి; జేకబ్ 2:17–19; ఆల్మా 1:26–27; 3 నీఫై 13:1–4 కూడా చూడండి). యేసు క్రీస్తు నీఫైయులకు ప్రత్యక్షమై, “మరికొంతసేపు వారితో నిలిచియున్నప్పుడు”, తీర్పు తీర్చకుండా సహాయం చేయడంలో పరిపూర్ణమైన ఉదాహరణను మనకు చూపించారు (3 నీఫై 17:5). ఆయన ఏ విధమైన తీర్పునూ తీర్చకుండా, ప్రతి అవసరాన్ని తీర్చి, ప్రతి గాయాన్ని మాన్పారు, అది కేవలం ఆయన “కరుణ” మరియు “దయ”తో నిండియున్నందువల్లనే (3 నీఫై 17:6, 7).

  7. యోహాను 4:4-42 చూడండి. క్రొత్త నిబంధనలో రక్షకునితో ఒకరితో ఒకరు పరిచర్య సంభాషణలు జరిపిన ఇతరులలో ధనికుడైన యౌవనుడు ఉన్నాడు (మత్తయి 19:16–22 చూడండి), శిలువపై ఉన్న దొంగ ఉన్నాడు (లూకా 23:39–43 చూడండి), నికోదేము ఉన్నాడు ( యోహాను 3:1–21 చూడండి), బేతెస్ద కొలను వద్ద ఉన్న వ్యక్తి ఉన్నాడు (యోహాను 5:2–15 చూడండి), పొంతి పిలాతు ఉన్నాడు(యోహాను 18:33–38 చూడండి), మగ్దలేనే మరియ ఉంది (యోహాను 20:11–18 చూడండి) మరియు సీమోను పేతురు ఉన్నాడు (యోహాను 21:15–19 చూడండి). మోర్మన్ గ్రంథంలో, యేసు క్రీస్తు తన శిష్యులను “ఒకరి తరువాత ఒకరు చొప్పున అందరినీ” తాకి, వారిలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడారు (3 నీఫై 18:36; 28:1–3 కూడా చూడండి).

  8. రక్షకుడు బావి దగ్గర ఆ స్త్రీని కలుసుకునేనాటికి, యూదులకు మరియు సమరయులకు మధ్య సాంస్కృతిక, మతపరమైన శత్రుత్వం బాగా పాతుకుపోయింది. అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ సంగ్రహించినట్లుగా, సమరయులు “యూదులు వేరుచేసి, తృణీకరించిన సమూహానికి చెందినవారు” (“క్రీస్తునందు జీవము కలిగియుండుట,” లియహోనా, మే 2026, 85). అందువల్ల, యేసు తాను“సమరయ గుండా వెళ్ళాల్సిందే” అని నిర్ణయించుకోవడం ఎంతో అర్థవంతమైన విషయంగా ఉంది (యోహాను 4:4, కొత్త అంతర్జాతీయ అనువాదం; వివరణ చేర్చబడింది). ఉద్దేశపూర్వకంగా సమరయకు వెళ్లి, ఒక సమరయ స్త్రీతో మాట్లాడాలన్న ఆయన నిర్ణయం సామాజికంగా విప్లవాత్మకమైనది మరియు ఆధ్యాత్మికంగా గంభీరమైనది. 2026 ఏప్రిల్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు ఓక్స్ ఇంకా బోధించినదేమంటే, క్రీస్తునందు జీవము కలిగియుండుటలో సమాధానకర్తలుగా ఉండటం కూడా చేరి ఉంటుంది (“క్రీస్తునందు జీవము కలిగియుండుట,” 85–87 చూడండి). రక్షకుని భూలోక పరిచర్యలోని ప్రారంభ కార్యాలలో ఒకటి, బావి వద్ద ఉన్న స్త్రీతో సమాధానకర్తగా ఉండటం, అది ఎంత అద్భుతమైనదో, అంతే సహజమైనది కూడా.

  9. యోహాను 4:7 చూడండి. రక్షకుడు అలసిపోయి, దాహం తీర్చుకోవడానికి నీళ్ళు అడగడం ఇదే చివరిసారి కాదు. తన మర్త్య పరిచర్య ముగింపులో, తన బాధల వలన అలసిపోయి, సిలువపై వేలాడుతూ, యేసు మళ్ళీ త్రాగడానికి నీరు అడిగారు (యోహాను 19:28 చూడండి). బావి దగ్గర ఉన్న స్త్రీకి యేసు క్రీస్తు పరిచర్య చేయడాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మరలా అలసిపోయి, దాహంతో ఉండే భవిష్యత్ సమయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుందాం. సిలువ వేయబడిన లోక రక్షకుడు మరొకసారి సహాయం చేయడానికి త్వరపడతారు మరియు తీర్పు తీర్చడానికి నెమ్మదిగా ఉంటారు. ఆయన మనకోసం తన ప్రాణాన్ని అర్పిస్తారు (యోహాను 19:30 చూడండి).

  10. ఇంగ్లీషులో మరియు అనేక యూరోపియన్ భాషలలో “బావి దగ్గరకు ఎక్కువసార్లు వెళ్లకూడదు” అనే జాతీయం ఉంది. ఒక వ్యక్తి సహాయం కోసం ఒకే మూలాన్ని అతి తరచుగా ఆశ్రయించడం వల్ల, ఆ మూలం యొక్క విలువ క్రమంగా తగ్గిపోయి, చివరికి అది విఫలమయ్యే ప్రమాదం ఉందనే సూత్రాన్ని ఈ జాతీయం బోధించడానికి ప్రయత్నిస్తుంది (see The Free Dictionary, “go to the well too many times,” idioms.thefreedictionary.com). ఈ జాతీయం ప్రాపంచిక వనరులను వర్ణించడానికి ఉపయోగపడినప్పటికీ, యేసు క్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు ఇది వర్తించదు. ఆయనను కలుసుకోవడానికి మనం మన స్వంత బావి దగ్గరకు ఎన్నిసార్లు వెళ్ళినా తక్కువే అవుతుంది (మోషైయ 26:30 చూడండి). యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని పొందే మన ప్రయత్నం దాని ప్రభావాన్ని తగ్గించదు, ఎందుకంటే అది అనంతమైనది. యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తానికి మరియు క్యాన్సర్‌తో మరణిస్తున్న తన సోదరుడు పొందిన నిష్పక్షపాత సహాయానికి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని వివరిస్తూ, బిషప్పు డబ్ల్యు. క్రిస్టాఫర్ వాడెల్ ఇలా అన్నారు: “ఒక అవసరతను చూసి, విమర్శించకుండా, రక్షకుని వలే పరిచర్య చేసిన అద్భుతమైన స్త్రీ, పురుషుల కొరకు కృత్ఞజతలు, అది మైక్‌కు చాలా ఆలస్యము కాలేదు. … అది ఎప్పటికీ ఆలస్యము కాదని, దాని వ్యవధి, పరిధిలో అపరిమితమైన అంతములేని యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తఃము యొక్క దీవెనలు పొందలేని మార్గము నుండి చాలా దూరము ఎవ్వరూ ఎప్పటికీ తప్పిపోలేరని మనము జ్ఞాపకముంచుకోవాలి.” (“ఆయన చేసినట్లుగానే,” లియహోనా, మే 2019, 21; వివరణ చేర్చబడింది).

  11. యోహాను 4:10.

  12. సహాయం అందించే తన విధానంలో భాగంగా, ఒక బాధ్యతను స్వీకరించమని ఈ కొత్త శిష్యుడిని ఆహ్వానించడానికి రక్షకుడు ఏమాత్రం సంకోచించలేదు (యోహాను 4:7 చూడండి). యేసు అభ్యర్థనకు ఆ స్త్రీ వెంటనే సానుకూలంగా స్పందించకపోయినప్పటికీ, కాలక్రమేణా మరియు ఆయన వ్యక్తిగత ప్రోత్సాహంతో, చివరికి ఆ స్త్రీ అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యతను సంతోషంగా అంగీకరించింది: యేసే మెస్సీయ అని లోకానికి చెప్పింది. యేసు క్రీస్తుకు మరియు ఆయన మాదిరికి నిజమైన అనుచరులుగా, నిబంధన మార్గంలో వారి ప్రయాణంలో భాగంగా ఇతరులకు సేవ చేయడానికి మరియు సహాయం చేయడానికి ప్రజలను, ముఖ్యంగా కొత్త సభ్యులను ఆహ్వానించడానికి మనం భయపడకూడదు (మోషైయ 5:2 చూడండి; see also Dale G. Renlund, “Preserving the Heart’s Mighty Change,” Liahona, Nov. 2009, 99).

  13. కీర్తనలు 85:10 చూడండి.

  14. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు, మనలో సాధ్యమైనంత ఉత్తమమైన రూపాన్ని పొందే సామర్థ్యం ఉందని గుర్తిస్తారు (డేల్ జి. రెన్‌లండ్, “రక్షకుడిని కలుసుకోవడానికి వ్యక్తిగత సిద్ధపాటు,” లియహోనా, మే 2025, 44 చూడండి).

  15. యోహాను 4:29 చూడండి. రక్షకుడు అందించిన సహాయంలో ఆ స్త్రీని ఆమె క్లిష్టమైన జీవితం నుండి తొలగించడం గానీ, సవాలుతో కూడిన ఆమె పరిస్థితులను మార్చడం గానీ లేదు. దానికి బదులుగా, ఆయన సహాయం అందించడం వల్ల ఆమె ఒక కొత్త లక్ష్యంతో తన జీవితంలోకి తిరిగి అడుగుపెట్టగలిగింది. అప్పటి బ్రిగం యంగ్ విశ్వవిద్యాలయం-ఐడహో అధ్యక్షుడిగా ఉన్న డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు, “మీరు మరియు నేను మన వ్యక్తిగత జీవితాలలో ప్రాయశ్చిత్తం యొక్క శక్తిని అర్థం చేసుకుని, దానిని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, మన పరిస్థితులు మారాలని ప్రార్థించే బదులు, వాటిని మార్చుకోవడానికి అవసరమైన బలం కోసం మనం ప్రార్థిస్తాము మరియు దానిని కోరుకుంటాము” (“In the Strength of the Lord” [Brigham Young University devotional, Oct. 23, 2001], 4, speeches.byu.edu).

  16. తీర్పుకు బదులుగా సహాయం అవసరమైయుండి బావి దగ్గర ఉన్న మరో స్త్రీని మనం పరిగణించినప్పుడు, దైవిక స్వభావం యొక్క స్థిరత్వాన్ని మనం చూస్తాము. ఆదికాండము 16లో, తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణ తరువాత, హాగరు అబ్రాము మరియు శారయిల నుండి పారిపోయి అరణ్యంలో ఒంటరిగా ఉండిపోయింది. హాగరు ఒక బావి దగ్గర ఆగినప్పుడు ఆమెకు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యారు. ఆమెకు పరలోక ప్రోత్సాహం, అవగాహన మరియు ఆహ్వానం లభించిన తరువాత, హాగరు, “నన్ను చూసే దేవుడవు నీవే” అని ప్రకటించింది (13వ వచనం, కొత్త అంతర్జాతీయ అనువాదం). యెహోవా హాగరును వెదకిన బావికి “బెయేర్ లహాయిరోయి” అని పేరు పెట్టారు, దానికి “జీవించి నన్ను చూసే ఆయన బావి” అని అర్థం( ఆదికాండము 16:14, పాదవివరణ‌ బి). మన స్వంత పరిచర్య ప్రయత్నాలలో మనం మరింత పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, బహుశా మనం హాగరుకు పరిచర్య చేసిన దేవదూతను అనుకరించి, తమ అరణ్యంలో తమను పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నిజంగా చూస్తున్నారని ఎవరైనా తెలుసుకోవడానికి ఒక సాధనంగా ఉండగలము.

  17. ఆశ్చర్యకరంగా, ఆయన బావి దగ్గర ఉన్న స్త్రీతో సంభాషిస్తున్నప్పుడు, రక్షకుడు “సువార్తికుని ఉద్దేశ్యము” అని పిలువబడే దానికి ఒక ఉదాహరణగా నిలిచారు. నా సువార్తను ప్రకటించండి పుస్తకంలోని మొదటి అధ్యాయం, సువార్తికునిగా మీ ఉద్దేశ్యము, “యేసు క్రీస్తునందు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరమును పొందుట మరియు అంతము వరకు సహించుట ద్వారా పునఃస్థాపించబడిన సువార్తను పొందడానికి వారికి సహాయపడుట ద్వారా క్రీస్తునొద్దకు వచ్చుటకు ఇతరులను ఆహ్వానించడం” అని బోధిస్తుంది (నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి [2023], 1; వివరణ చేర్చబడింది). బావి వద్ద ఉన్న స్త్రీని యేసు తన వద్దకు రమ్మని ఆహ్వానించి, ఆ తర్వాత ఆమె అలా చేయడానికి సహాయపడతారు.

  18. నిర్గమకాండము 3:14; యోహాను 4:26 కూడా చూడండి.

  19. ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ నివేదించిన ప్రకారం, మూడు సంవత్సరాల కాలంలో, దాదాపు 900,000 మంది ప్రజలు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములోకి పరివర్తన చెంది నిబంధనలోకి వచ్చారు (“ప్రభువు తన కార్యమును వేగవంతం చేస్తున్నారు,” లియహోనా, నవ. 2025, 48). ఏదో ఒక సమయంలో, ఆ కొత్త సభ్యులలో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ఆ బావి దగ్గర ఉన్న పురుషుడు లేదా స్త్రీగా ఉన్నారు.

  20. యేసు క్రీస్తుతో ముఖాముఖి అనుభవాలు మనల్ని శాశ్వతంగా మారుస్తాయని అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ సాక్ష్యమిచ్చారు. అదేవిధంగా యేసు క్రీస్తు శిష్యులతో కలిగే పరిచయాలు కూడా జీవితాలను మార్చివేయాలని ఆయన బోధించారు (“ఖాళీ సమాధి వద్ద జరిగిన సమావేశం,” లియహోనా, మే 2026, 58–61 చూడండి).

  21. డాలిన్ హెచ్. ఓక్స్, “క్రీస్తునందు జీవము కలిగియుండుట,” 87.

  22. క్రీస్తు వంటి సహాయం ఆత్మీయ విశ్వాసంతో కూడిన శిష్యరికాన్ని ప్రోత్సహిస్తుంది. యేసు క్రీస్తు నుండి సహాయం పొందిన తరువాత, పేతురు పెద్ద మొత్తంలో తాను పట్టిన చేపలను వదిలి ఆయనను వెంబడించడానికి ధైర్యం పొందాడు (లూకా 5:11 చూడండి). అదేవిధంగా, రక్షకుని సహాయాన్ని పొందిన తర్వాత, బావి దగ్గర ఉన్న స్త్రీ మెస్సీయను గూర్చి అందరికీ చెప్పడానికి తన “నీటి కుండను” అక్కడే విడిచిపెట్టే ధైర్యాన్ని పొందింది (యోహాను 4:28 చూడండి).

  23. ఎల్డర్ క్లార్క్ జి. గిల్బర్ట్, “ఇంటికి రండి,” లియహోనా, మే 2026, 15–17 చూడండి.

  24. అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌‌డార్ఫ్ మనకు ఇలా గుర్తుచేశారు: “‘మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెను,’ అని యేసు చెప్పారు. ‘దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు’ [యోహాను 13:34–35, New King James Version]. చాలా తరచుగా, యేసు క్రీస్తు గురించి ఒక వ్యక్తి యొక్క మొదటి సాక్ష్యము అతను లేదా ఆమె యేసు క్రీస్తు యొక్క శిష్యుల మధ్య ప్రేమను అనుభూతి చెందినప్పుడు వస్తుంది” (“దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు,” లియహోనా, మే 2025, 51).

  25. జీవితాలను మార్చడానికి అవసరమైన సహాయాన్ని అందించే సాధారణ పనులను చేయడానికి, మన చిన్న, కొన్నిసార్లు గమనించబడని వరాలు మనకు ఎలా వీలు కల్పిస్తాయో అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ఈ విధంగా సంగ్రహించారు: “ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులలో నేను గమనించిన కొన్ని ఆధ్యాత్మిక బహుమానాలను మీతో పంచుకోవచ్చా? మీరు ఇటువంటి బహుమానాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొందారేమో ఆలోచించండి: కరుణ చూపడం. నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తులను గమనించడం. … నిజాయితీగా మెచ్చుకోవడం. … విషయాలను సరళంగా వివరించడం. … వారు చెందియున్నారని తెలుసుకోవడంలో ఇతరులకు సహాయపడడం. … [ఈ బహుమానాలు] ప్రభువు పనికి ఎంత విలువైనవో మరియు మీ బహుమానాల ద్వారా మీరు దేవుని పిల్లలలో ఒకరిని ఎలా స్పృశించి, ఆశీర్వదించి లేదా రక్షించి ఉండవచ్చో మీరు చూడగలరని నేను ఆశిస్తున్నాను”(“మీ వంతును మీరు మనస్ఫూర్తిగా చేయండి,” లియహోనా, నవ. 2025, 23 చూడండి; గెరిట్ డబ్ల్యు. గాంగ్, “ఎవరూ ఒంటరిగా కూర్చోకూడదు,” లియహోనా, నవ. 2025, 40–43 కూడా చూడండి). సిద్ధాంతము మరియు నిబంధనల యొక్క 46వ ప్రకరణములో, మన ఆత్మీయ వరాలు పెద్దవైనా లేదా చిన్నవైనా వాటి యొక్క నిజమైన ఉద్దేశ్యం పరలోక తండ్రి పిల్లలకు సహాయం చేయడమేనని ప్రభువు నొక్కిచెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:8–10, 26 చూడండి).

  26. అధ్యక్షులు డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ ఇలా బోధించారు: “క్రీస్తు స్వభావాన్ని స్వీకరించడం అనేది మన వ్యక్తిగత సిద్ధపాటుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రభువు రాకడకు మరియు ఆయన మహిమాన్వితమైన వెయ్యేళ్ల పాలనకు ప్రపంచాన్ని సిద్ధం చేయడంలో ప్రాథమిక అంశం. లోకంలో క్రీస్తువంటి వ్యక్తుల ప్రభావాన్ని మనం తక్కువగా అంచనా వేస్తాము, కానీ ఒకరి తర్వాత ఒకరితో పనిచేయడం అనేది ఎల్లప్పుడూ సమాజాన్ని మార్చడానికి మరియు తన రాజ్యాన్ని స్థాపించడానికి యేసు అవలంబించిన విధానం” (“క్రీస్తు యొక్క స్వభావము,” లియహోనా, మే 2026, 91).