పరిశుద్ధాత్మ వాగ్దానము చేత ముద్రవేయబడినది
(సిద్ధాంతము మరియు నిబంధనలు 132:7)
దేవుని చిత్తానికి అనుగుణంగా మన హృదయాలను, మనస్సులను మరియు జీవితాలను మలచుకునే “జీవితకాల అన్వేషణలో” యాజకత్వ విధులను స్వీకరించడం మరియు పవిత్ర నిబంధనలలోకి ప్రవేశించడం అత్యవసరమైన దశలు.
నేను చాలా సంవత్సరాల క్రితం అధ్యక్షులు బాయిడ్ కె. ప్యాకర్ గారి నుండి ఒక కీలకమైన పాఠం నేర్చుకున్నాను. ఆయన ఇలా చెప్పారు:
“పౌరసత్వం లేదా జాతి ఏదైనా, స్త్రీ అయినా పురుషుడైనా, వృత్తి ఏదైనా, చదువుతో సంబంధం లేకుండా, మనం ఏ తరంలో జీవిస్తున్నా, జీవితం మనందరికీ దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళే ఒక స్వదేశ ప్రయాణం.
“విధులు మరియు నిబంధనలు ఆయన సన్నిధిలోకి ప్రవేశించడానికి మన అర్హతలుగా మారతాయి. వాటిని యోగ్యంగా స్వీకరించడమే జీవితకాల అన్వేషణ; ఆ తర్వాత వాటిని పాటించడమే మర్త్యత్వము యొక్క సవాలు.”
పరలోక తండ్రి వద్దకు మన ప్రయాణానికి ఆధ్యాత్మిక అర్హతలుగా ఉన్న విధులు మరియు నిబంధనల ప్రాముఖ్యతను మనం పరిశీలిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరికీ ఉపదేశించి, జ్ఞానోదయం కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను.
పాస్‌పోర్ట్ ఉపమానం
నేను ఒక చిన్న కథతో మొదలుపెడతాను. ఒకప్పుడు ఒక వ్యక్తి దూర దేశంలో ఉన్న తన కుటుంబ సభ్యులను కలవాలనుకున్నాడు. అతను తన ప్రయాణానికి ప్రణాళిక వేసుకుని, సూట్‌కేసు సర్దుకుని, తన బంధువులు నివసించే నగరానికి విమానంలో ప్రయాణించాడు.
ఆ వ్యక్తి ఉత్సాహంగా విమానం నుండి బయటకు వచ్చి పాస్‌పోర్ట్ తనిఖీ కేంద్రం వైపు నడిచాడు. అతని దేశ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారిక సంస్థ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ అతని వద్ద ఉంది. అతను తన పాస్‌పోర్ట్‌ను ఒక సరిహద్దు అధికారికి చూపించగా, ఆ అధికారి అతని గుర్తింపు, జాతీయత మరియు ఆ దేశాన్ని సందర్శించడానికి గల కారణాలను ధృవీకరించారు. కానీ ఆ వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను జాగ్రత్తగా చూసుకోలేదు. వ్యక్తిగత సమాచార పేజీ మరకలతో పాడైపోయింది. మరియు చిరిగిన పేజీని టేపు మరియు జిగురుతో అనధికారిక పద్ధతిలో అతికించారు.
ఫలితంగా, సరిహద్దు అధికారి అతని పాస్‌పోర్ట్‌ను తిరస్కరించి, దేశంలోకి ప్రవేశించడానికి అవసరమైన ముద్రను వేయడానికి నిరాకరించాడు. ఆ వ్యక్తి నిరాశ చెంది, తరువాత ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురయ్యాడు.
ఈ కథలోని నీతి చాలా సరళమైనది: పాస్‌పోర్ట్ యొక్క సమగ్రతను కాలక్రమేణా కాపాడుకోవాలి. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉండటం ఆ వ్యక్తికి దేశంలోనికి ప్రవేశించే అవకాశాన్ని కల్పించింది, కానీ కేవలం పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన అతనికి దేశంలోనికి ప్రవేశించే అనుమతి లభిస్తుందనే హామీ లేదు.
అయితే, ఈ సరళమైన పోలికకు పరిమితులు ఉన్నాయి. భౌతిక పాస్‌పోర్ట్‌కు జరిగే నష్టంలా కాకుండా, మన తప్పేమీ లేకుండా మనం ఎదుర్కొనే ప్రతికూలతలు మరియు బాధలు, మన పట్ల దేవుని వాగ్దానాలను తగ్గించవు లేదా మన నిబంధనలను చెల్లుబాటు కాకుండా చేయవు.
నిబంధనలు, విధులు మరియు వాగ్దానం చేయబడిన దీవెనలు
యేసు క్రీస్తు శిష్యులుగా, దేవుని చిత్తానికి అనుగుణంగా మన హృదయాలను, మనస్సులను మరియు జీవితాలను మలచుకునే “జీవితకాల అన్వేషణలో” యాజకత్వ విధులను స్వీకరించడం మరియు పవిత్ర నిబంధనలలోకి ప్రవేశించడం అత్యవసరమైన దశలు.
నిబంధన అనేది ఒక పవిత్రమైన వాగ్దానం—దేవునికి మరియు ఆయన కుమారులకు, కుమార్తెలకు మధ్య ఉండే ఒక శాశ్వతమైన నిబద్ధత. దేవుడు సువార్త నిబంధనల షరతులన్నింటిని ఏర్పరుస్తారు మరియు ఆయన పిల్లలు, ఆయన చేయమని కోరేవాటి గురించి తెలుసుకోవడానికి మరియు వాటిని అంగీకరించడానికి తమ నైతిక కర్తృత్వమును వినియోగించుకుంటారు.
పవిత్రమైన విధుల ద్వారా నిబంధనలు స్వీకరించబడతాయి. విధి అనేది యాజకత్వం యొక్క అధికారం ద్వారా నిర్వహించబడే ఒక పవిత్రమైన కార్యం, దానికి ఆధ్యాత్మిక ప్రయోజనం మరియు నిత్య ప్రాముఖ్యత ఉంటాయి మరియు అది దేవుని చట్టాలకు, శాసనాలకు సంబంధించినది. విధులు మన జీవితాలలో మనం అంగీకరించే నిబంధనల స్వభావం గురించి కూడా మనకు బోధిస్తాయి.
రక్షకుని పునఃస్థాపించబడిన సువార్త యొక్క నిబంధనలు మరియు విధులు అనేవి మన జీవితాలలో దైవిక ఉద్దేశ్యం, మార్గదర్శకత్వం మరియు బలం పొందేందుకు పరలోకం యొక్క అవకాశాల ద్వారాలను విశాలంగా తెరవగల ఆధ్యాత్మిక అర్హతలు. యేసు క్రీస్తు సువార్త యొక్క నియమాలపట్ల మరియు విధులపట్ల విధేయతతో సహా, నిబంధనలను ఘనపరచినందుకు దేవుడు తన కుమారులకు మరియు కుమార్తెలకు ఉన్నతమైన దీవెనలను వాగ్దానం చేస్తున్నారు. ఆ అర్హతలు చెల్లుబాటు కావాలన్నా మరియు వాగ్దానం చేయబడిన దీవెనలు పొందాలన్నా నిరంతర విశ్వసనీయత అవసరం.
పరిశుద్ధాత్మయే పరిశుద్ధాత్మ వాగ్దానము
పరిశుద్ధాత్మ దైవసమూహములో మూడవ సభ్యుడు. ఆయన ఆత్మశరీరుడు, సమస్త సత్యమునకు సాక్ష్యమిచ్చువాడు మరియు తండ్రికి కుమారునికి సాక్షిగానూ, దూతగానూ ఉన్నవాడు.
లేఖనాలలో పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ వాగ్దానం అని కూడా వర్ణించారు, ఈయన తన పిల్లల నీతి కార్యాలను దేవునికి అంగీకారమైనవిగా ధృవీకరిస్తారు లేదా నిర్ధారిస్తారు. తుదకు, సువార్తకు సంబంధించిన అన్ని విధులు మరియు నిబంధనలు తప్పకుండా పరిశుద్ధాత్మ వాగ్దానం చేత ముద్రవేయబడాలి. ప్రభువు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు బయల్పరచినట్లుగా, “వాగ్దానము వలన చేయబడని, ప్రవేశింపని మరియు ముద్రింపబడని … అన్ని నిబంధనలు … మృతుల పునరుత్థానము తరువాత ఎట్టి సామర్థ్యమును, వైశిష్ట్యమును లేదా బలమును కలిగియుండవు.”
పరిశుద్ధాత్మ వాగ్దానం చేత ముద్రవేయబడినప్పుడు, ఒక విధి, ప్రమాణం లేదా నిబంధన భూమి మీద మరియు పరలోకంలో బంధింపబడి ఉంటుంది. ఈ ముద్ర మర్త్య జీవితంలో షరతులతో కూడుకున్నది మరియు దుర్నీతి ద్వారా విచ్ఛిన్నం కావచ్చు లేదా కోల్పోబడవచ్చు.
పరిశుద్ధాత్మ ద్వారా ఈ ధృవీకరణ ముద్రను పొందడం సాధారణంగా ఒక్కసారిగా జరిగే సంఘటన కాదు; దానికి బదులుగా, మనం హృదయపూర్వకంగా మరియు నిలకడగా పశ్చాత్తాపపడి, మన నిబంధనలను గౌరవించి, మన హృదయాలను దేవునికి అప్పగించినప్పుడు, అది కాలక్రమేణా వస్తుంది. ఈ దీవెనను నీతిగా కోరడమే “మర్త్యత్వము యొక్క సవాలు,” అని అధ్యక్షులు ప్యాకర్ వర్ణించారు.
నా పాస్‌పోర్ట్ కథలోని వ్యక్తికి పరదేశంలోకి ప్రవేశించడానికి తన పాస్‌పోర్ట్‌లో అధికారిక ముద్ర అవసరమైనట్లే, మనలో ప్రతి ఒక్కరూ రక్షకుని సువార్త యొక్క నిబంధనలు మరియు విధులతో ముడిపడి ఉన్న నిత్య దీవెనలను పొందాలంటే, పరిశుద్ధాత్మ వాగ్దానం యొక్క ధృవీకరించే సాక్ష్యం మనకు అవసరం.
“దేవుని విధులన్నింటిని బట్టి నడుచుకొనుటకు” మరియు “కాలక్రమేణా” వాగ్దానం చేయబడిన దీవెనలన్నింటికీ హామీనిచ్చే ఆమోద ముద్రను పరిశుద్ధాత్మ వాగ్దానం ద్వారా పొందే పవిత్రమైన అవకాశాల కొరకు మనలో ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి.
ముద్ర విధి
ప్రభువు యొక్క మందిరంలో ఒక పురుషుడు మరియు స్త్రీ ముద్ర వేయబడటం అనేది రక్షకుని పునఃస్థాపించబడిన సువార్త యొక్క అత్యున్నతమైన నిబంధన మరియు విధి. ముఖ్యంగా, పరిశుద్ధాత్మ వాగ్దానం చేత ముద్రవేయబడే ముద్ర విధి యొక్క సిద్ధాంతపరమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అనేది, మరొక వ్యక్తి యొక్క ఎంపికలు విశ్వాసంతో నిబంధనను పాటించేవారికి నిత్య దీవెనలు అందకుండా చేయగలవా అనే లోతైన వ్యక్తిగత ప్రశ్నలను కొంతవరకు పరిష్కరించడానికి సహాయపడుతుంది.
ముద్ర విధిలో రెండు ప్రాథమిక మరియు సంబంధిత భాగాలు ఉన్నాయి: (1) వివాహంలో స్త్రీ పురుషుల నిత్య కలయిక—దీనిని పార్శ్వ ముద్రగా అర్థం చేసుకోవచ్చు—మరియు (2) భార్యాభర్తలను దేవుని నిత్య కుటుంబంతో ముద్రవేయడం మరియు అన్ని తరాల ద్వారా మానవాళిని అనుసంధానించడం—దీనిని నిలువు ముద్రగా అర్థం చేసుకోవచ్చు. విధిలోని రెండు అంశాలు అత్యంత కీలకమైనవి.
ఒక పురుషునికి, ఒక స్త్రీకి మధ్య దేవాలయంలో జరిగే వివాహ ముద్ర ద్వారా ఆశించిన మరియు ప్రార్థించిన ఫలితాలలో జీవితకాల ఆధ్యాత్మిక ఎదుగుదల, వైవాహిక అనురాగం, విశ్వసనీయత, మర్త్యత్వములోని అనిశ్చితులను మరియు సవాళ్లను అధిగమించడానికి కలిసి పనిచేయడం మరియు శాశ్వతమైన ఆనందం వంటివి ఉంటాయి.
కొన్నిసార్లు, దురదృష్టవశాత్తు, ఆశించిన మరియు ప్రార్థించిన ఫలితాలు రావు. జీవిత భాగస్వామి యొక్క పాపాలు, అవిశ్వాసం, వ్యక్తిగత మతభ్రష్టత్వం లేదా ఇతర ఇబ్బందులు కలహాలకు, దూరం కావడానికి, చివరికి విడాకులకు కూడా కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాలలో, విశ్వాసపాత్రుడైన జీవిత భాగస్వామి ఇలా అడగవచ్చు, “మరొక వ్యక్తి తన నైతిక కర్తృత్వమును అన్యాయంగా ఉపయోగించడం వల్ల, దేవుడు నాకు వాగ్దానం చేసిన దానిని నేను కోల్పోతానా?” ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కాదు!
జీవిత భాగస్వామి చేసే అయోగ్యమైన పనులు తప్పకుండా మరొక జీవిత భాగస్వామికి మరియు కుటుంబ సభ్యులకు హృదయ వేదనను, దుఃఖాన్ని కలిగిస్తాయి. అయితే, ఒక వ్యక్తి చేసే దుర్నీతి మరొక వ్యక్తికి దేవుడిచ్చే ప్రేమ, బలం మరియు దీవెనల ప్రవాహాన్ని అడ్డుకోలేదు లేదా నిరోధించలేదు. ప్రభువు యొక్క అనంతమైన మరియు శాశ్వతమైన ప్రాయశ్చిత్త శక్తి, ఆయనతో తమ నిబంధనలను నిలుపుకొని ఉండే ప్రతి వ్యక్తి విషయంలో, అన్ని సమయాలలో, ప్రతిచోటా, అన్నిటినీ జయించగలదు.
నిబంధనలను ఉల్లంఘించి, పశ్చాత్తాపపడని జీవిత భాగస్వామి, ముద్ర విధి యొక్క పార్శ్వ మరియు నిలువు అంశాలు రెండింటికీ, పరిశుద్ధాత్మ వాగ్దానం యొక్క ఆమోద ముద్రను తనకు తానుగా పొందే అవకాశాన్ని వదులుకుంటారు.
నిబంధనలను గౌరవించి, విశ్వాసంతో ముందుకు సాగే నమ్మకమైన జీవిత భాగస్వామి, ముద్ర విధి యొక్క నిలువు అంశం కొరకు పరిశుద్ధాత్మ వాగ్దానం యొక్క ఆమోద ముద్రను పొందడానికి మరియు దానికి సంబంధించిన ఇతర వ్యక్తిగత దీవెనలన్నింటినీ పొందడానికి యోగ్యులుగా ఉంటారు.
“దేవాలయంలో జరిగే వివాహం నిలవనప్పుడు ఇది ఎలా సాధ్యం?” అని మీరు అడగవచ్చు.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క బయల్పరచబడిన సిద్ధాంతం అటువంటి పరిస్థితులకు సంబంధించిన అన్ని వివరాలను మరియు సూక్ష్మాంశాలను ప్రస్తావించదు. వాగ్దానం చేయబడిన దీవెనలు ఎలా, ఎప్పుడు లభిస్తాయో నాకు ఖచ్చితంగా తెలియదు మరియు నేను వివరించలేను. కానీ వాగ్దానం చేయబడిన దీవెనలు లభిస్తాయని నాకు తెలుసు. మరొక వ్యక్తి తన నైతిక కర్తృత్వమును అన్యాయంగా ఉపయోగించడం వలన, విశ్వాసియైన ఏ శిష్యుడూ దేవుడు వాగ్దానం చేసిన ఏ నిత్య దీవెననూ అంతిమంగా కోల్పోడు.
రాజైన బెంజమిన్ యొక్క భరోసా ఇచ్చే సాక్ష్యంతో నేను ముగిస్తున్నాను: “దేవుని ఆజ్ఞలను గైకొను వారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా, ఇదిగో వారు ఐహికమైన, ఆత్మసంబంధమైన రెండిటి యందు అన్ని విషయాలలో ఆశీర్వదింపబడియున్నారు; వారు అంతము వరకు విశ్వాసముతో స్థిరముగా ఉండిన యెడల వారు పరలోకములోనికి చేర్చుకొనబడుదురు, దానిని బట్టి వారు దేవునితో ఎన్నడును అంతము కాని సంతోషము యొక్క స్థితిలో నివసించెదరు. జ్ఞాపకముంచుకొనుడి, ఈ విషయములు సత్యమని జ్ఞాపకముంచుకొనుడి; ఏలయనగా ప్రభువైన దేవుడు దానిని పలికియున్నాడు.“
రాజైన బెంజమిన్ యొక్క ప్రవచనాత్మక వాగ్దానం యొక్క సత్యాలను గూర్చి నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.