లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 99


99వ ప్రకరణము

1832, ఆగష్టు 29న హైరం, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా జాన్ మర్డాక్‌కు ఇవ్వబడిన బయల్పాటు. జాన్ మర్డాక్—తన భార్య జూలియా క్లాప్ 1831 ఏప్రిల్‌లో మరణించిన తరువాత, తన పిల్లలు తల్లిలేనివారై, ఒహైయోలో ఇతర కుటుంబాలతో నివసించుచుండగా, యేడాదికి పైగా సువార్తను ప్రకటించుచుండెను.

1–8, జాన్ మర్డాక్ సువార్తను ప్రకటించుటకు పిలువబడెను, అతడిని స్వీకరించువారు ప్రభువును స్వీకరించి, ఆయన కనికరమును పొందెదరు.

1 ఇదిగో, నా సేవకుడైన జాన్ మర్డాక్‌నకు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—తూర్పు దేశములలో ఒక ఇంటి నుండి మరొక ఇంటికి, ఒక గ్రామము నుండి మరొక గ్రామమునకు, ఒక పట్టణము నుండి మరొక పట్టణమునకు వెళ్ళి హింస, దుష్టత్వముల మధ్య వాటి నివాసులకు నా నిత్య సువార్తను ప్రకటించుటకు నీవు పిలువబడితివి.

2 నిన్ను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నా పరిశుద్ధాత్మ నిరూపణలతో నా వాక్యమును ప్రకటించుటకు నీవు శక్తిని కలిగియుందువు.

3 చిన్న పిల్లవాని వలే నిన్ను చేర్చుకొనువారు నా రాజ్యమును పొందెదరు; వారు ధన్యులు, ఏలయనగా వారు కనికరమును పొందెదరు.

4 ఎవరైతే నిన్ను తృణీకరింతురో వారు నా తండ్రిచేత, ఆయన మందిరము చేత తృణీకరించబడుదురు; వారికి సాక్ష్యముగానుండుటకు నీవు మార్గము వెంబడి రహస్య ప్రదేశములలో నీ పాదములను కడుగుకొనవలెను.

5 ఇదిగో, తీర్పుతీర్చుటకు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నాకు విరోధముగా వారు చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని ఒప్పించుటకు నేను త్వరగా వచ్చుచున్నాను.

6 ఇప్పుడు నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నీ పిల్లలు పోషింపబడి, సీయోనులోనున్న బిషప్పు యొద్దకు దయతో పంపబడువరకు నీవు వెళ్ళుట యుక్తము కాదు.

7 కొన్ని సంవత్సరముల తరువాత నీవు నన్ను కోరిన యెడల, నీ స్వాస్థ్యమును పొందుటకు నీవు మంచి ప్రదేశమునకు వెళ్ళవచ్చును;

8 లేనియెడల నీవు తీసుకొనిపోబడువరకు నీవు నా సువార్తను ప్రకటించుటను కొనసాగించవలెను. ఆమేన్.