లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 8


8వ ప్రకరణము

1829 ఏప్రిల్, పెన్సిల్వేనియాలోని హార్మొనిలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఆలీవర్ కౌడరీకి ఇవ్వబడిన బయల్పాటు. మోర్మన్ గ్రంథము అనువదించబడుచున్న సమయములో, ప్రవక్త చదువుచుండగా వ్రాయుచున్న లేఖకునిగా సేవను కొనసాగిస్తున్న ఆలీవర్, అనువదించు బహుమానముతో దీవించబడాలని ఆశించెను. ఈ బయల్పాటును ఇచ్చుట ద్వారా ప్రభువు అతని విన్నపమునకు స్పందించెను.

1–5, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బయల్పాటు వచ్చును; 6–12, విశ్వాసము ద్వారా దేవుని మర్మములను గూర్చిన జ్ఞానము, ప్రాచీన గ్రంథములను అనువదించు శక్తి వచ్చును.

1 ఆలీవర్ కౌడరీ, నేను నీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, నీ దేవుడును నీ విమోచకుడునైన ప్రభువు జీవముతోడు, నా ఆత్మ ప్రత్యక్షత వలన మాట్లాడబడిన నా లేఖనము యొక్క ఆ భాగములను కలిగిన ప్రాచీన గ్రంథముల చెక్కడములను గూర్చిన జ్ఞానమును నీవు పొందెదవని నమ్మి, విశ్వాసముతో, నిజాయితీ గల హృదయముతో నీవు అడుగు సంగతులను గూర్చిన జ్ఞానమును నిశ్చయముగా నీవు పొందెదవు.

2 నేను నీ మనస్సులోను నీ హృదయములోను పరిశుద్ధాత్మ ద్వారా చెప్పెదను, అతడు నీ పైకి వచ్చి, నీ హృదయమందు నివశించును.

3 ఇదిగో, ఇదియే బయల్పాటు ఆత్మ; ఈ ఆత్మతోనే మోషే ఆరిన నేలపై ఎఱ్ఱసముద్రము గుండా ఇశ్రాయేలు సంతానమును తీసుకువచ్చెను.

4 కాబట్టి ఇది నీ బహుమానము; దీనిని ఉపయోగించుకొనుము మరియు నీవు ధన్యుడవు, ఏలయనగా ఇది నిన్ను నీ శత్రువుల చేతులలో నుండి విడిపించును, అట్లు కానియెడల వారు నిన్ను చంపి, నీ ఆత్మను నాశనము చేయుదురు.

5 ఓయీ, ఈ మాటలను జ్ఞాపకముంచుకొనుము, నా ఆజ్ఞలను పాటించుము. ఇది నీ బహుమానమని జ్ఞాపకముంచుకొనుము.

6 ఇది మాత్రమే నీ బహుమానము కాదు; నీకు మరియొక బహుమానము కలదు, అది అహరోను యొక్క బహుమానము; ఇదిగో, అది నీకు అనేక విషయములను చెప్పెను;

7 దేవుని శక్తి తప్ప మరే ఇతర శక్తి ఈ అహరోను బహుమానము నీతో ఉండునట్లు చేయలేదు.

8 కాబట్టి సందేహించకుము, ఇది దేవుని బహుమానము; దీనిని నీ చేతులతో పట్టుకొని, అద్భుతకార్యములను చేయవలెను; ఏ శక్తియు నీ చేతులలోనుండి దీనిని తీసుకొనలేదు, ఏలయనగా ఇది దేవుని కార్యము.

9 కాబట్టి, దీని ద్వారా నీకు చెప్పమని నీవు నన్నేమి అడిగినను, దానిని నేను నీకు అనుగ్రహించెదను, దానిని గూర్చిన జ్ఞానమును నీవు కలిగియుందువు.

10 విశ్వాసము లేకుండా నీవేమియు చేయలేవని జ్ఞాపకముంచుకొనుము; కాబట్టి విశ్వాసముతో అడుగుము. ఈ సంగతులను అపహాస్యము చేయకుము; నీవు అడుగకూడని వాటిని అడుగకుము.

11 దేవుని మర్మములు తెలుసుకొని, పరిశుద్ధమైన, దాచియుంచబడిన ఆ ప్రాచీన గ్రంథములన్నిటిని నీవు అనువదించి, వాటి నుండి జ్ఞానమును పొందునట్లు అడుగుము; నీ విశ్వాసమును బట్టి నీకది జరుగును.

12 ఇదిగో, నేనే దీనిని సెలవిచ్చితిని; మొదటి నుండి నీతో మాట్లాడినది నేనే. ఆమేన్.