లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 95


95వ ప్రకరణము

1833, జూన్ 1న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. ఈ బయల్పాటు ఆరాధన, ఉపదేశము కొరకు ఒక మందిరము, ప్రభువు యొక్క మందిరము నిర్మించుటకు ఇవ్వబడిన దైవిక మార్గదర్శకముల కొనసాగింపు (ప్రకరణము 88:119–136 చూడుము).

1–6, ప్రభువు యొక్క మందిరమును నిర్మించుటలో విఫలమైనందుకు పరిశుద్ధులు గద్దింపబడిరి; 7–10, మహోన్నత స్థలమునుండి తన జనులను శక్తితో దీవించుటకు తన మందిరమును ఉపయోగించాలని ప్రభువు కోరుచుండెను; 11–17, ఆరాధన స్థలముగా, అపొస్తలుల యొక్క పాఠశాలగానుండుటకు ఆ మందిరము అంకితమియ్యబడవలెను.

1 నిశ్చయముగా తాను ప్రేమించు వారితో ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారి పాపములు క్షమించబడునట్లు నేను ప్రేమించువారిని కూడా నేను గద్దించెదను, ఏలయనగా శోధన నుండి వారి విడుదలకు గద్దింపు ద్వారా ఒక మార్గమును సిద్ధపరిచెదను మరియు నేను మిమ్ములను ప్రేమించితిని—

2 కాబట్టి, నా సముఖమున మీరు గద్దింపబడి, మందలించబడవలసిన అవసరమున్నది;

3 ఏలయనగా మీరు నా యెడల ఘోర పాపము చేసిరి, దానియందు నా మందిరనిర్మాణమును గూర్చి నేను మీకు ఇచ్చియున్న గొప్ప ఆజ్ఞను అన్ని విషయములలో మీరు పరిగణించలేదు;

4 సర్వశరీరులపైన నా ఆత్మను క్రుమ్మరించుటకు నా ఆశ్చర్యమైన కార్యమును నేను చేయునట్లు చివరిసారిగా నా ద్రాక్షతోటను శుద్ధిచేయుటకై నా అపొస్తలులను సిద్ధపరచుటకు నేను ఉద్దేశించిన సిద్ధపాటును పరిగణించలేదు—

5 కానీ ఇదిగో, నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా నేను పిలిచి, నియమించబడిన వారు అనేకులు మీ మధ్యనున్నారు, కానీ వారిలో కొందరే ఎన్నుకోబడిరి.

6 ఎన్నుకోబడని వారు ఘోర పాపము చేసిరి, దానియందు వారు మిట్టమధ్యాహ్నము అంధకారములో నడుచుచున్నారు.

7 ఈ హేతువుచేత మీ వ్రతదినమును ఏర్పాటుచేయాలని, తద్వారా మీ ఉపవాసములు, వేదన సైన్యములకధిపతియగు ప్రభువు—దాని భాషాంతరము ఆదియు అంతమును, మొదటి దిన సృష్టికర్త—చెవులలోనికి చేరునని నేను మీకొక ఆజ్ఞనిచ్చితిని.

8 నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, మీరు ఒక మందిరమును నిర్మించాలని నేను మీకొక ఆజ్ఞనిచ్చితిని, ఎందుకనగా ఆ మందిరములో నేను ఏర్పరచుకొనిన వారిని మహోన్నత స్థలమునుండి దీవించాలని నేను ఉద్దేశించితిని;

9 ఏలయనగా ఇది తండ్రి నుండి మీకు ఇవ్వబడిన వాగ్దానము; కాబట్టి యెరూషలేములో నా అపొస్తలులవలె మీరు నిలిచియుండాలని నేను ఆజ్ఞాపించుచున్నాను.

10 అయినప్పటికీ, నా సేవకులు ఘోర పాపమును చేసిరి; ప్రవక్తల యొక్క పాఠశాలలో కలహములు రేగెను; అది నాకు చాలా బాధాకరమైనది, కాబట్టి, గద్దింపబడుటకు వారిని నేను పంపివేసితినని మీ ప్రభువు చెప్పుచున్నాడు.

11 మీరు ఒక మందిరమును నిర్మించుట నా చిత్తమైయున్నదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా ఆజ్ఞలను పాటించిన యెడల దానిని నిర్మించుటకు మీరు శక్తిమంతులగుదురు.

12 మీరు నా ఆజ్ఞలను పాటించని యెడల, తండ్రి ప్రేమ మీతో కొనసాగదు, కాబట్టి మీరు అంధకారములో నడిచెదరు.

13 ఇప్పుడు ప్రభువు జ్ఞానము మరియు చిత్తము ఇదియే—లోకరీతిగా కాకుండా ఈ మందిరము నిర్మించబడవలెను, ఏలయనగా మీరు లోకరీత్యా జీవించాలని నేను ఆజ్ఞ ఇచ్చుట లేదు;

14 కాబట్టి, మీలో ముగ్గురికి నేను చూపించు విధానములో అది నిర్మించబడవలెను, ఇందు నిమిత్తము వారిని మీరు నిర్ణయించి, నియమించవలెను.

15 దాని పరిమాణము లోపలి ఆవరణములో యాభై ఐదు అడుగులు వెడల్పు, అరవై ఐదు అడుగులు పొడవు ఉండవలెను.

16 లోపలి ఆవరణము యొక్క దిగువ భాగము మీ సంస్కార అర్పణ కొరకు, మీరు బోధించుటకు, మీరు ఉపవాసముండుట కొరకు, మీ ప్రార్థన కొరకు, మీ యొక్క అత్యంత పరిశుద్ధ కోరికలను అర్పించుటకు నాకు అంకితమియ్యవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

17 లోపలి ఆవరణము యొక్క ఎగువ భాగము నా అపొస్తలుల యొక్క పాఠశాల కొరకు నాకు అంకితమియ్యవలెనని అహ్‌మాన్ కుమారుడు లేదా మరియొక మాటలో, ఆల్ఫా లేదా ఒమేగ అనగా మీ ప్రభువైన యేసు క్రీస్తు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.