సర్వసభ్య సమావేశము
మిక్కిలి ప్రాముఖ్యమైన దానిని చేయండి
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


మిక్కిలి ప్రాముఖ్యమైన దానిని చేయండి

మన జీవితాలను యేసు క్రీస్తుపై కేంద్రీకరించినప్పుడు, మనం ఆత్మీయ బలం, సంతృప్తి మరియు ఆనందంతో దీవించబడతాము.

కొంతకాలం క్రితం, ఒక ప్రియమైన స్నేహితురాలు ఆమె వార్డులో ఒక స్త్రీని సందర్శించాలని ప్రేరేపించబడింది. ఆమె ఆ ప్రేరేపణను నిర్లక్ష్యము చేసింది, ఎందుకంటే ఆమెకు ఆ స్త్రీ గురించి తెలియదు మరియు ఆ ప్రేరేపణ ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆ ఆలోచన ఆమెకు వస్తూనే ఉంది కాబట్టి, ఆమె ప్రేరేపణ ప్రకారము చేయాలని నిర్ణయించుకుంది. త్వరలో చేయబోయే సందర్శన మూలంగా ఆమె అప్పటికే అసౌకర్యంగా ఉన్నందున, ఆ సహోదరి వద్దకు ఏదైనా తీసుకువెళ్ళడం తన ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుందని ఆమె నిర్ణయించుకుంది. ఖచ్చితంగా ఆమె ఖాళీ చేతులతో వెళ్ళలేదు! కాబట్టి ఆమె ఐస్‌క్రీమ్ డబ్బాను కొనుగోలు చేసింది మరియు ఇబ్బందికరంగా ఉంటుందేమో అని ఆమె భయపడిన ఆ సందర్శనను ప్రారంభించింది.

ఆమె ఆ స్త్రీ ఇంటి తలుపు తట్టిన కొద్దిసేపటికే ఆ సహోదరి తలుపు తెరిచింది. నా స్నేహితురాలు గోధుమరంగు కాగితపు సంచి‌లో ఐస్‌క్రీమ్‌‌ను ఆమెకు ఇచ్చింది మరియు వారి సంభాషణ ప్రారంభమైంది. ఆ సందర్శన ఎందుకు అవసరమో నా స్నేహితురాలికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ముందు వసారాలో వారు కలిసి కూర్చున్నప్పుడు, ఆ మహిళ తాను ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను వివరించింది. వెచ్చని వేసవి వాతావరణంలో ఒక గంట మాట్లాడిన తర్వాత, గోధుమరంగు కాగితపు సంచి నుండి ఐస్‌క్రీమ్ కరిగిపోవడాన్ని నా స్నేహితురాలు గమనించింది.

“అయ్యో, మీ ఐస్‌క్రీమ్ కరిగిపోతోంది!” అని ఆమె బిగ్గరగా చెప్పింది.

ఆ స్త్రీ మధురంగా స్పందిస్తూ, “ఫర్వాలేదు! నాకు పాలచక్కెర పడదు!” అని చెప్పింది.

ఒక కలలో, ప్రభువు ప్రవక్తయైన లీహైకి ఇలా చెప్పారు, “లీహై, నీవు చేసిన క్రియలను బట్టి నీవు ధన్యుడవు.” 1

యేసు క్రీస్తు శిష్యునిగా ఉండడమంటే కేవలం ఆశించడం లేదా నమ్మడం మాత్రమే కాదు. దానికి ప్రయత్నం, గమనము మరియు నిబద్ధత అవసరము. మనము “వినువారు మాత్రమైయుండక, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండి,”2 ఏదైనా చేయుట అవసరము.

కరిగిన ఐస్‌క్రీమ్ విషయంలో, ఏది మిక్కిలి ప్రాముఖ్యమైనది? ఐస్‌క్రీమా? లేదా నా స్నేహితురాలు ఏదైనా చేయడమా?

చాలా హృదయపూర్వకమైన ప్రశ్న అడిగిన ఒక ప్రియమైన యువతితో నాకు మధురమైన అనుభవం ఎదురైంది: “సహోదరి క్రేవన్, సంఘము గురించి ఏదైనా నిజమని మీకు ఎలా తెలుసు? ఎందుకంటే నేను ఏమీ భావించడం లేదు.”

సమాధానం చెప్పడానికి ముందు, నేను మొదట ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాను. “నీ వ్యక్తిగత లేఖనాల అధ్యయనం గురించి నాకు చెప్పు.”

“నేను లేఖనాలు చదవను” అని ఆమె జవాబిచ్చింది.

“మీ కుటుంబముతో కలిసి చదువుతావా? మీరందరు కలిసి రండి, నన్ను అనుసరించండి చదువుతారా?” అని నేను అడిగాను.

“లేదు” అని ఆమె చెప్పింది.

నేను ఆమె ప్రార్థనల గురించి అడిగాను: “నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది?”

“నేను ప్రార్థన చేయను” అని ఆమె జవాబిచ్చింది.

ఆమెకు నా సమాధానం చాలా సరళమైనది: “నువ్వు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే, నువ్వు ఏదో ఒకటి చేయాలి.”

మనం ఏదైనా నేర్చుకోవాలి లేదా తెలుసుకోవాలి అనుకునే వాటి విషయంలో ఇది నిజం కాదా? యేసు క్రీస్తు సువార్తలో చెప్పబడిన వీటిని చేయడం ప్రారంభించమని నేను నా క్రొత్త స్నేహితురాలిని ఆహ్వానించాను: ప్రార్థన చేయడం, అధ్యయనం చేయడం, ఇతరులకు సేవ చేయడం మరియు ప్రభువుపై నమ్మకం ఉంచడం. ఏమీ చేయనప్పుడు పరివర్తన రాదు. అడుగుట, వెదకుట మరియు తట్టుట ద్వారా తెలుసుకొనుటకు మనం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించినప్పుడు అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తుంది. అది చేయడం ద్వారా వస్తుంది.3

సిద్ధాంతము మరియు నిబంధనలలో, ప్రభువు అప్పుడప్పుడు, “అది ముఖ్యమైనది కాదు”4 అని చెబుతారు. కొన్ని విషయాలు ముఖ్యమైనవి కానట్లయితే లేదా తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నట్లయితే, మిక్కిలి ప్రాముఖ్యమైనవి తప్పనిసరిగా ఉండవచ్చని అది నన్ను ఆలోచింపజేస్తుంది. ఏదో ఒకటి చేయాలనే లేదా ఏదైనా చేయాలనే మన ప్రయత్నాలలో, “మిక్కిలి ప్రాముఖ్యమైనది ఏమిటి?” అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు.

వారు విక్రయిస్తున్న ఉత్పత్తులు మన సంతోషం లేదా శ్రేయస్సు కోసం అత్యవసరమని నమ్మించడానికి మనల్ని ఆకర్షించే ఆశతో ప్రకటనకర్తలు తరచుగా “అత్యవసరం” లేదా “తప్పక కలిగి ఉండాలి” వంటి నినాదాలను ఉపయోగిస్తారు. అయితే వారు విక్రయిస్తున్నది నిజంగా అత్యవవసరమా? మనం నిజంగా దానిని కలిగి ఉండాలా? అది నిజంగా ప్రాముఖ్యమైనదా?

గమనించదగిన కొన్ని ఆలోచనలు ఇక్కడున్నాయి. మిక్కిలి ప్రాముఖ్యమైనది ఏమిటి?

  • మన సోషల్ మీడియా పోస్ట్‌లకు ఎన్ని “లైక్‌లు” వస్తాయి అనేదా? లేదా మన పరలోక తండ్రి చేత మనం ఎంతగా ప్రేమించబడ్డాము మరియు విలువ ఇవ్వబడ్డాము అనేదా?

  • ఇటీవలి ధోరణిలో ఉన్న దుస్తులను ధరించడమా? లేదా నిరాడంబరంగా దుస్తులు ధరించడం ద్వారా మన శరీరాల పట్ల గౌరవం చూపించడమా?

  • ఇంటర్నెట్ శోధన ద్వారా సమాధానాలను కనుగొనడమా? లేదా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని నుండి సమాధానాలు పొందడమా?

  • ఇంకా అధికంగా కావాలా? లేదా మనకు ఇవ్వబడిన దానితో సంతృప్తి చెందుతున్నామా?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధిస్తున్నారు:

“పరిశుద్ధాత్మ మీ సహచరునిగా ఉంటే, మీరు మన సమాజాన్ని దెబ్బతీసిన ప్రముఖుల సంస్కృతిని సరిగ్గా చూడగలరు. మీరు మునుపటి తరాలు ఉన్నదాని కంటే ఎక్కువ తెలివిగా ఉండగలరు. …

“మిగతా ప్రపంచానికి ఒక ప్రమాణాన్ని నెలకొల్పండి!”5

శాశ్వతమైన ఆనందానికి నిజంగా అవసరమైన వాటిపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నం అవసరం. మన శాశ్వతమైన విలువలను మనం తప్పుదారి పట్టించడం, విలువైన సమయం, ప్రతిభ లేదా ఆధ్యాత్మిక బలాన్ని అప్రధానమైన విషయాలపై వృధా చేసేలా చేయడం తప్ప సాతాను ఇంకేమీ ఇష్టపడడు. మిక్కిలి ప్రాముఖ్యమైన వాటిని చేయకుండా మనల్ని దారి మళ్ళించే విషయాలను ప్రార్థనాపూర్వకంగా పరిశీలించమని నేను మనలో ప్రతీఒక్కరినీ ఆహ్వానిస్తున్నాను.

మా పెద్ద కుమారుని యొక్క మూడవ తరగతి ఉపాధ్యాయురాలు తన తరగతి విద్యార్థులకు “మీ మెదడును లోబరచుకోండి” అని బోధించారు. వారు తమ ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉన్నారని మరియు అందువల్ల వారు చేసే పనిని నియంత్రించగలరని ఆమె యొక్క యువ విద్యార్థులకు అది ఒక జ్ఞాపకార్థంగా ఉన్నది. నేను తక్కువ ప్రాముఖ్యమైన విషయాల వైపు మళ్ళుతున్నప్పుడు “నా మెదడును లోబరచుకోవాలి” అని నేను గుర్తు చేసుకుంటాను.

ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి ఇటీవల నాతో మాట్లాడుతూ, తరువాత పశ్చాత్తాపపడాలనే ప్రణాళికతో ఆజ్ఞలను విస్మరించడం సంఘములోని కొంతమంది యువతలో ప్రాచుర్యం పొందిందని చెప్పింది. “ఇది ఒక విధంగా గౌరవప్రదమైన బిరుదు,” అని నాకు చెప్పబడింది. “నిజమైన ఉద్దేశ్యంతో”6 వినయంగా పశ్చాత్తాపపడేవారిని ఖచ్చితంగా ప్రభువు క్షమిస్తూనే ఉంటారు. కానీ రక్షకుని యొక్క కనికరంగల ప్రాయశ్చిత్తాన్ని ఎప్పుడూ అలా అపహాస్యం చేసే విధంగా ఉపయోగించకూడదు. తప్పిపోయిన గొర్రె ఉపమానం మనకు తెలుసు. అయితే, దారితప్పిన గొర్రెను కనుగొనడానికి ఒక కాపరి మిగతా 99 గొర్రెలను విడిచిపెడతాడు. అయితే 99 మందిలో ఉండడానికి ఎన్నుకునే వారు, కలిసిమెలసి పనిచేస్తూ ఉండేవారు, తమ నిబంధనలను జీవించడానికి ఒకరికొకరు సహాయం చేసుకొనేవారు మంచి కాపరికి తెచ్చే ఆనందాన్ని మీరు ఊహించగలరా? విధేయత చూపడం అనేది జనాదరణ పొందిన విషయం అయితే ప్రపంచం లేదా మీ పాఠశాల లేదా మీ పని లేదా మీ ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? ఇది జీవితాన్ని పరిపూర్ణం చేయడం గురించినది కాదు—మనం ప్రభువుతో చేసిన నిబంధనలను జీవించడానికి మన వంతు కృషి చేస్తున్నప్పుడు పొందే ఆనందం గురించినది.

ప్రపంచం దేవుని గురించి మరింత సందేహాన్ని వ్యక్తం చేయడం వలన, గందరగోళం మరియు ఒత్తిళ్ళు పెరుగుతున్నందు వలన, ఇది మనం ప్రవక్తకు దగ్గరగా ఉండవలసిన సమయం. ఆయన ప్రభువుకు ప్రతినిధి గనుక మనల్ని ఏమి చేయమని ప్రోత్సహిస్తున్నారో, సలహా ఇస్తున్నారో మరియు అభ్యర్థిస్తున్నారో అవి మిక్కిలి ప్రాముఖ్యమైనవని మనం నమ్మవచ్చు.

ఇది అంత సులభం కానప్పటికీ, సరైన పని చేయడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుంది. ఒక యువతి తన పాఠశాలలో స్నేహితుల బృందంతో మాట్లాడుతున్నప్పుడు, సంఘ ప్రమాణాలను విమర్శించడం వైపు ఆ సంభాషణ మారడంతో ఆమె హృదయం క్షీణించినట్లు భావించింది. ఆమె మౌనంగా ఉండలేనని గ్రహించింది—ఆమె ఏదో ఒకటి చేయాలి. గౌరవప్రదంగా, ఆమె పరలోక తండ్రి యొక్క ప్రేమ గురించి మరియు తన పిల్లలను ఆశీర్వదించడానికి, రక్షించడానికి ఏవిధంగా ఆయన ఆజ్ఞలు ఇచ్చారనే దాని గురించి మాట్లాడింది. ఆమె ఏమీ చేయకుండా ఉండడం చాలా సులభం. కానీ మిక్కిలి ప్రాముఖ్యమైనది ఏమిటి? జనంలో కలిసిపోవడమా? లేదా “అన్ని సమయములలో, అన్ని విషయములలో, అన్ని స్థలములలో” దేవునికి ఒక సాక్షిగా నిలబడడమా? 7

పునఃస్థాపించబడిన యేసు క్రీస్తు సంఘము అంధకారము నుండి బయటకు వస్తున్నట్లయితే, మనం తప్పకుండా అంధకారము నుండి బయటకు రావాలి. నిబంధనను పాటించే స్త్రీలుగా, మనం తప్పకుండా మన క్రియల ద్వారా మరియు మన మాదిరి ద్వారా ప్రపంచమంతటా మన సువార్త వెలుగును ప్రకాశింపజేయాలి. మనము దేవుని కుమార్తెలుగా కలిసి దీన్ని చేస్తాము—11 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల 8.2 మిలియన్ల మంది మహిళా సైన్యము యొక్క పని సరిగ్గా ఇదే. యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడానికి, అవసరంలో ఉన్నవారి పట్ల శ్రద్ధ చూపడానికి, సువార్తను పొందమని ఇతరులను ఆహ్వానించడానికి మరియు నిత్యత్వము కొరకు కుటుంబాలను ఐక్యము చేయడానికి ప్రయత్నిస్తూ, రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యములో మనం పాల్గొన్నప్పుడు మనం ఇశ్రాయేలీయులను సమకూరుస్తున్నాము.8 యేసు క్రీస్తు సువార్త, చర్యచూపించే సువార్త మరియు ఆనందకరమైన సువార్త! మిక్కిలి ప్రాముఖ్యమైన వాటిని చేయగల మన సామర్థ్యాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. మనం ఏవిధముగా ఉండగలమని మన ప్రేమగల పరలోక తండ్రికి తెలుసో ఆవిధంగా ఉండడానికి మరియు అలా చేయడానికి కావలసిన ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని మన దైవిక వారసత్వం మనకు ఇస్తుంది.

ఈ సంవత్సరం యువత కొరకు ఇవ్వబడిన ఇతివృత్తము సామెతలు 3:5–6:

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.

“నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”

మన దగ్గర అన్ని సమాధానాలు లేకపోయినా ఆయన మనకు మార్గనిర్దేశం చేస్తారని నమ్ముతూ ముందుకు సాగడం ప్రభువును విశ్వసించడంలో కీలకమైన అంశం.

సహోదరీలారా, ఇది ఐస్‌క్రీమ్ గురించి కాదు. ఇది ఎక్కువ పనులు చేయడం గురించి కాదు. ఇది ప్రాముఖ్యమైన దానిని చేయడం గురించినది. ఆయన వలె మరింతగా మారడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క సిద్ధాంతమును మన జీవితాలలో అన్వయించడం గురించినది ఇది.

నిబంధన బాటపై స్థిరంగా ఉండడానికి మనం ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే, అంత ఎక్కువగా యేసు క్రీస్తునందు మన విశ్వాసం పెరుగుతుంది. మన విశ్వాసం ఎంతగా పెరుగుతుందో, అంత ఎక్కువగా పశ్చాత్తాపపడాలని మనం కోరుకుంటాం. మరియు మనం ఎంత పశ్చాత్తాపపడతామో, అంత ఎక్కువగా దేవునితో మన నిబంధన సంబంధాన్ని మనం బలపరుస్తాము. ఆ నిబంధన సంబంధం మనల్ని దేవాలయానికి ఆకర్షిస్తుంది, ఎందుకంటే దేవాలయ నిబంధనలను పాటించడం వలనే మనం అంతము వరకు సహిస్తాము.

మన జీవితాలను యేసు క్రీస్తుపై కేంద్రీకరించినప్పుడు, ప్రాముఖ్యమైన దానిని చేయడానికి మనం నడిపించబడతాము. మరియు మనం ఆత్మీయ బలం, సంతృప్తి, ఆనందంతో దీవించబడతాము! యేసు క్రీస్తు నామములో, ఆమేన్.