2010–2019
ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో సహోదరీలు పాల్గొనుట
అక్టోబర్ 2018


ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో సహోదరీలు పాల్గొనుట

సంఘము యొక్క స్త్రీలైన మీకు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో సహాయము చేయుట ద్వారా భవిష్యత్తును ప్రభావితం చేయమని నేను ప్రవచనాత్మక మనవి చేస్తున్నాను.

నా ప్రియమైన, ప్రశస్తమైన సహోదరీలారా, మీతో ఉండుట అద్భుతమైనది. మీ గురించి, మీరు దీవించబడిన దైవికమైన సామర్థ్యమును గూర్చి నేను ఏవిధంగా భావిస్తున్నానో బహుశా ఇటీవల కలిగిన అనుభవము మీకు ఒక ఆలోచనను ఇచ్చును.

ఒకరోజు దక్షిణ అమెరికాలో ఒక సమూహముతో మాట్లాడుతూ, నా అంశము గురించి నేను చాలా ఉత్తేజితుడనై, ఒక ముఖ్యమైన క్షణములో, “10 పిల్లలకు తల్లిగా నేను దానిని చెప్పగలను. . .” అని చెప్పాను.” తరువాత నా సందేశమును ముగించుట కొనసాగించాను.

తల్లి అనే మాటను నేను చెప్పానని నేను గమనించలేదు. నా అనువాదకుడు, నేను పొరపాటున మాట్లాడానేమో అనుకొని, తల్లికి బదులుగా తండ్రి అని మార్చి చెప్పాడు, కాబట్టి సమూహానికి నాకు నేను తల్లిగా ప్రస్తావించుట ఎప్పటికి తెలియదు. కాని నా భార్య వెండీ దానిని విన్నది మరియు నా ప్రమేయము లేకుండా చెప్పబడిన పొరపాటుకు ఆనందించెను.

ఆ క్షణములో, కేవలం ఒక తల్లి మాత్రమే తీసుకొనిరాగల మార్పును – లోకంలో తీసుకొనిరావాలని నా హృదయంలోని లోతైన ఆపేక్ష---నా హృదయంలోనుండి గొప్ప భావావేశంతో వ్యక్తమయ్యింది. నా జీవిత కాలమందు, నేనెందుకు వైద్యుడు అగుటకు ఎంచుకొన్నానని నేను అడగబడిన ప్రతిసారి, నా సమాధానము ఎల్లప్పుడు ఒకటే: “నేను తల్లిగా ఉండుటకు ఎన్నుకో లేక పోయినందుకు.”

దయచేసి గమనించండి, తల్లి, అనే పదమును నేను ఎప్పుడు ఉపయోగించినా, ఈ జీవితంలో పిల్లలను కనిన లేదా దత్తత తీసుకొనిన స్త్రీల గురించి మాత్రమే నేను మాట్లాడుట లేదు. మన పరలోక తల్లిదండ్రుల యొక్క పెద్దవారైన కుమార్తెలు అందరి గురించి నేను మాట్లాడుచున్నాను. ప్రతీ స్త్రీ తన నిత్య దైవిక గమ్యము ద్వారా ఒక తల్లియై యున్నది.

కాబట్టి ఈ రాత్రి, 10 మంది పిల్లలకు—తొమ్మిదిమంది కుమార్తెలు, ఒక కుమారునికి తండ్రిగా, మరియు సంఘ అధ్యక్షునిగా, మీ గురించి---మీరెవరో, మీరు చేయగల సమస్త మేలు గురించి నేనెంత లోతైన భావన కలిగియున్నానో మీరు గ్రహిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. నీతిమంతురాలైన స్త్రీ చెయ్యగలిగిన దానిని ఎవ్వరూ చెయ్యలేరు. ఒక తల్లి యొక్క ప్రభావమును ఎవ్వరూ అనుకరించలేరు.

పురుషులు తరచుగా పరలోక తండ్రి మరియు రక్షకుని ప్రేమను ఇతరులకు తెలియజేయగలరు మరియు తెలియజేస్తారు. కాని స్త్రీలు దాని కొరకు ప్రత్యేక వరమును--దైవిక దీవెనను కలిగియున్నారు. ఎవరైన ఒకరు అతడు లేక ఆమెకు ఏది అవసరమో-ఎప్పుడు అవసరమో గ్రహించే సామర్థ్యమును మీరు కలిగియున్నారు. ఒకరి ఖచ్చితమైన అవసరతగల గడియలలో అతడు లేదా ఆమెను మీరు సమీపించగలరు, ఓదార్చగలరు, బోధించగలరు, బలపరచగలరు.

స్త్రీలు సంగతులను పురుషుల కంటే భిన్నముగా చూస్తారు, మరియు ఓహ్, మీ దృష్టికోణము మాకెంతో అవసరము! మీ స్వభావము మొదట ఇతరుల గురించి ఆలోచించుటకు, ఏ చర్యయైనా ఇతరుల యెడల ఎట్టి ప్రభావమును చూపించునో పరిగణించుటకు దారితీస్తుంది.

అధ్యక్షులు ఐరింగ్ సూచించినట్లుగా, మన మహిమగల తల్లి హవ్వ---మన పరలోక తండ్రి ప్రణాళికను గూర్చి తన అత్యంత ముఖ్యమైన అవగాహనతో ‘‘పతనము” అని మనం పిలిచే దానిని ఆరంభించెను. ఆమె తెలివైన, ధైర్యముగల ఎంపిక, దానిని సమర్ధించాలనే ఆదాము యొక్క నిర్ణయము, దేవుని యొక్క సంతోషకర ప్రణాళికను ముందుకు తీసుకొని వెళ్లెను. వారు మనలో ప్రతి ఒక్కరము భూమిపైకి వచ్చుటకు, శరీరాన్ని పొందుటకు, మర్త్యత్వమునకు ముందు జీవితములో, మనము చేసినట్లుగా, ఇప్పుడు యేసు క్రీస్తు కొరకు నిలబడుటకు మనము ఎంపిక చేస్తామని రుజువు చేయుటకు మనలో ప్రతీఒక్కరికీ సాధ్యపరిచారు.

నా ప్రియమైన సహోదరీలారా, మీరు ప్రత్యేక ఆత్మీయ వరాలను మరియు సహజమైన ధోరణులను కలిగియున్నారు. మీ ఆత్మీయ వరాలను--- అర్థము చేసుకొనుటకు, మీరు ఇంతకు ముందెప్పుడు చెయ్యని విధంగా వాటిని పెంపొందించుటకు, ఉపయోగించుటకు, విస్తరించుటకు మీరు ప్రార్థించాలని ఈ రాత్రి నా సమస్త పూర్ణ హృదయపు నిరీక్షణతో నేను మిమ్మల్ని బలంగా ప్రోత్సహిస్తున్నాను. ఆవిధంగా చేసినప్పుడు, మీరు ఈ లోకాన్ని మారుస్తారు.

స్త్రీలుగా, మీరు ఇతరులను ప్రేరేపిస్తారు మరియు ఇతరులు అనుకరించుటకు యోగ్యమైన ప్రమాణమును ఏర్పరుస్తారు. మన గత సర్వసభ్య సమావేశములో చేయబడిన రెండు ప్రధానమైన ప్రకటనల యొక్క నేపథ్యమును నేను మీకు ఇస్తాను. వాటిలో ప్రతిదానికి నా ప్రియమైన సహోదరీలైన మీరు ముఖ్యమైనవారు.

మొదటిది, పరిచర్య చేయుట. పరిచర్యచేయుటకు అత్యున్నతమైన ప్రమాణము మన రక్షకుడైన యేసు క్రీస్తు. సాధారణంగా, పురుషులకంటే స్త్రీలు ఆ ప్రమాణమునకు ఎల్లప్పుడు దగ్గరగా ఉంటారు. మీరు నిజంగా పరిచర్య చేయుచున్నప్పుడు, ఒకరు రక్షకుని ప్రేమను మరింతగా అనుభూతిచెందేలా వారికి సహాయము చేయుటకు మీ భావాలను మీరు అనుసరిస్తారు. నీతిమంతులైన స్త్రీలలో పరిచర్య చేయాలనే కోరిక స్వాభావికముగా ఉంటుంది. “ఈ రోజు నేనెవరికి సహాయము చేయాలని కోరుచున్నారు?” అని ప్రార్థన చేసే స్త్రీలను నేను ఎరిగియున్నాను.

ఇతరులను సంరక్షించుటకు ఉన్నతమైన, పరిశుద్ధమైన మార్గము గురించి ఏప్రిల్ 2018లో చేసిన ప్రకటనకు ముందు, కొంతమంది పురుషుల ధోరణి ఏమిటంటే వారి నియమించబడిన గృహబోధన “చేయబడింది” అని టిక్‌మార్కు పెట్టి తరువాత చెయ్యవలసిన పనిని కొనసాగించుట.

కాని, మీరు దర్శించి బోధించుచున్న ఒక సహోదరికి సహాయము కావాలని మీరు గ్రహించినప్పుడు, మీరు వెంటనే మరియు నెలంతా స్పందించారు. కాబట్టి, ఏవిధంగా మీరు దర్శించి బోధించారో అది పరిచర్యను పైకి హెచ్చించుటకు మమ్మల్ని ప్రేరేపించింది.

రెండవది, గత సర్వసభ్య సమావేశములో, మేము మెల్కీసెదెకు యాజకత్వ సమూహాలను కూడా పునర్నిర్మించాము. సంఘ పురుషులు వారి బాధ్యతలలో మరింత ప్రభావవంతముగా ఉండుటకు వారికి ఏవిధంగా సహాయపడాలని మేము ప్రార్థించినప్పుడు, ఉపశమన సమాజము యొక్క మాదిరిని మేము శ్రద్ధగా పరిగణించాము.

ఉపశమన సమాజములో, వివిధ వయస్సులలో, జీవిత దశలలో ఉన్న స్త్రీలు కలిసి సమావేశమవుతారు. జీవితము యొక్క ప్రతి దశ ప్రత్యేకమైన సవాళ్లను తెచ్చును, ఐనప్పటికి, మీరు ప్రతి ఆదివారము కలుసుకొని, అభివృద్ధి చెందుతూ, కలిసి సువార్తను బోధించుచు, లోకములో ముఖ్యమైన ప్రభావాన్ని కలిగియున్నారు.

ఇప్పుడు, మీ మాదిరిని అనుసరిస్తూ, మెల్కీసెదెకు యాజకత్వము కలిగినవారు పెద్దల కూటమి యొక్క సభ్యులు. ఈ పురుషులు 18 నుండి 98 (లేదా అంతకంటే ఎక్కువ) సంవత్సరాల మధ్యనున్న వయస్కులు, సమానముగా విస్తారమైన యాజకత్వము మరియు సంఘ అనుభవాలు కలిగియున్నవారు. ఈ సహోదరులు ఇప్పుడు బలమైన సహోదర అనుబంధాలను సృష్టించగలరు, కలిసి నేర్చుకొంటారు, మరియు ఇతరులను మరింత శక్తివంతంగా దీవిస్తారు.

గత జూన్‌లో సహోదరి నెల్సన్ మరియు నేను సంఘము యొక్క యువతతో మాట్లాడుట మీకు గుర్తుందా. తెరకు రెండువైపులా ఉన్న ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో సహాయపడుటకు ప్రభువు యొక్క యువత గుంపులో చేరమని వారిని మేము ఆహ్వానించాము. ఈ సమకూర్చుట “మిక్కిలి గొప్ప సవాలుతో కూడినది, గొప్ప హేతువు గలది, మరియు నేడు భూమిపైన మిక్కిలి గొప్ప కార్యము”!1

ఈ హేతువుకు స్త్రీలు ఎక్కువగా అవసరము, ఎందుకంటే స్త్రీలు భవిష్యత్తును ప్రభావితం చేస్తారు. కాబట్టి నేటి రాత్రి, సంఘము యొక్క స్త్రీలైన మీకు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో సహాయము చేయుట ద్వారా భవిష్యత్తును ప్రభావితం చేయమని నేను ప్రవచనాత్మక మనవి చేస్తున్నాను.

మీరెక్కడ ప్రారంభించగలరు?

నేను నాలుగు ఆహ్వానాలు ఇస్తున్నాను:

మొదట, మీ మనస్సులోకి ప్రతికూలమైన, మరియు అపవిత్రమైన ఆలోచనలు కలిగించు సోషల్ మీడియా మరియు మరేఇతర మీడియా నుండి పది దినముల ఉపవాసములో పాల్గొనమని నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. మీ ఉపవాస సమయములో ఏ ప్రభావాలను మీరు తొలగించాలో తెలుసుకొనుటకు ప్రార్థించండి. ఈ 10 దినాల ఉపవాసము యొక్క ప్రభావము మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీ అత్మను గాయపరుస్తున్న లోకపు ధోరణులనుండి విరామము తీసుకొన్న తరువాత మీరేమి గమనించారు? ఇప్పుడు మీ సమయాన్ని, మీ శక్తిని ఎక్కడ వెచ్చించాలి అనేదానిలో ఏదైనా మార్పు వచ్చిందా? మీ ప్రాధాన్యతలలో ఏవైనా----కేవలము కొంచెమైనా మారాయా? మీకు కలుగు ప్రతి భావాన్ని వ్రాసి, అనుసరించమని నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను.

రెండవది, ఇప్పటినుండి ఈ సంవత్సరాంతము వరకు మోర్మన్ గ్రంథమును చదవమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ జీవితమును నిర్వహించుకొనుటకు మీరు చేయు సమస్తముతో ఇది అసాధ్యమైనదిగా కనిపించవచ్చును, ఈ ఆహ్వానాన్ని మీ హృదయము యొక్క పూర్ణ ఉద్దేశముతో అంగీకరించిన యెడల, దానిని సాధించుటకు ఒక మార్గాన్ని కనుగొనుటకు ప్రభువు మీకు సహాయము చేయును. మరియు, మీరు ప్రార్థనా పూర్వకముగా అధ్యయనము చేసినప్పుడు, పరలోకములు మీ కొరకు తెరువబడునని నేను వాగ్దానము చేయుచున్నాను. హెచ్చింపబడిన ప్రేరేపణతో, బయల్పాటుతో ప్రభువు మిమ్మల్ని దీవించును.

మీరు చదివినప్పుడు, రక్షకుని గురించి తెలియజేయు లేదా సూచించు ప్రతీ వచనమును గుర్తించమని నేను మిమ్మును ప్రోత్సహించుచున్నాను. తరువాత, మీ కుటుంబాలు, స్నేహితులతో క్రీస్తును గూర్చి మాట్లాడుటకు, క్రీస్తుయందు ఆనందించుటకు, క్రీస్తును గూర్చి ప్రకటించుటకు ఉద్దేశ్యపూర్వకముగా ఉండండి. 2 ఈ విధానము వలన మీరును, వారును రక్షకునికి దగ్గరౌతారు. మార్పులు, అద్భుతకార్యములు కూడా సంభవించుట ప్రారంభమవుతాయి.

ఈ ఉదయము క్రొత్త ఆదివారపు ప్రణాళిక మరియు కుటుంబ-కేంద్రిత, సంఘ-సహాకార పాఠ్యప్రణాళిక గురించి ప్రకటన చేయబడింది. నా ప్రియమైన సహోదరీలారా, ఈ క్రొత్తదైన, సమతుల్యమైన, మరియు సమన్వయపరచబడిన సువార్త-బోధన ప్రయత్నము సఫలమగుటలో మీరు ముఖ్యమైనవారు. లేఖనముల నుండి మీరు నేర్చుకొనుచున్న దానిని మీరు ప్రేమించే వారికి బోధించండి. వారు పాపము చేసినప్పుడు రక్షకుని యొక్క స్వస్థపరచు, శుద్ధి చేయు శక్తిపై ఏవిధంగా ఆధారపడాలో వారికి బోధించండి. వారి జీవితాలలో ప్రతి దినము ఆయన బలపరచు శక్తిని ఒక ఆధారముగా ఎలా ఉపయోగించాలో వారికి బోధించండి.

మూడవది, క్రమముగా దేవాలయమునకు హాజరగు మాదిరిని ఏర్పరచండి. దీనికి మీ జీవితంలో కాస్త ఎక్కువ త్యాగము అవసరము కావచ్చు. ఆయన దేవాలయములో ఎక్కువ సక్రమమైన సమయము గడుపుట ఆయన దేవాలయములో మీరు దీవించబడియున్న యాజకత్వపు శక్తిని ఏవిధంగా వినియోగించుకోవాలో ప్రభువు మీకు బోధించుటకు అనుమతించును. దేవాలయానికి దగ్గరలో నివసించనివారు, దేవాలయాల గురించి లేఖనాలలోను, సజీవులైన ప్రవక్తల మాటలలోను ప్రార్థనాపూర్వకముగా అధ్యయనము చేయాలని నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఇంతకు ముందెన్నడు లేనివిధంగా దేవాలయాల గురించి ఎక్కువగా తెలుసుకొనుటకు, ఎక్కువగా అర్థము చేసుకొనుటకు, ఎక్కువగా అనుభూతి చెందుటకు కోరుము.

గత జూన్‌లో మన ప్రపంచవ్యాప్త యువత ఆరాధనలో, ఒక యువకుడు తన తల్లిదండ్రులు స్మార్ట్ ఫోనుకు బదులుగా, సాధారణమైన ఫోను ఇచ్చినప్పుడు మారిన అతడి జీవితము గురించి నేను మాట్లాడాను. ఈ యువకుని తల్లి నిర్భయముగల, విశ్వాసురాలైన స్త్రీ. తన కుమారుడు చేస్తున్న దారితప్పే ఎంపికలు అతడిని మిషను సేవ చెయ్యకుండా ఆపివేయగలవని ఆమె చూసింది. తన కుమారునికి ఏవిధంగా సహాయపడాలో తెలుసుకొనుటకు ఆమె దేవాలయములో ప్రార్థన చేసింది. తరువాత ఆమె ప్రతీ మనోభావాన్ని అనుసరించింది.

ఆమె ఇలా చెప్పింది: “నిర్థిష్టమైన విషయాలను పట్టుకొనుటకు నిర్దిష్టమైన సమయాలలో అతడి స్మార్ట్ ఫోన్‌ను పరిశీలించమని ఆత్మ నన్ను నడిపిస్తున్నట్లుగా నేను భావించాను. ఈ స్మార్ట్‌ ఫోన్లను ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు, కాని నేను ఎన్నడూ ఉపయోగించని సోషల్ మీడియా అన్నింటి ద్వారా ఆత్మ నన్ను నడిపించింది! తమ పిల్లలను కాపాడుటకు నడిపింపును కోరుచున్న తల్లిదండ్రులకు ఆత్మ సహాయము చేయునని నాకు తెలియును. [మొదట] నా కుమారుడు నా పైన ఆగ్రహము చెందాడు. . . . కాని కేవలం మూడు రోజుల తరువాత, అతడు నాకు కృతజ్ఞతలు తెలిపెను! అతడు వ్యత్యాసమును చూడగలిగెను.”

ఆమె కుమారుని ప్రవర్తన, వైఖరులు నాటకీయముగా మారాయి. అతడు ఇంటిలో మరింత సహాయకరముగా మారాడు, ఎక్కువ చిరునవ్వు చిందించెను, సంఘములో ఎక్కువ ఆసక్తిని చూపాడు. దేవాలయపు బాప్తీస్మములలో కొంతకాలము సేవ చేయుటకు అతడు ఇష్టపడెను మరియు తన మిషను కొరకు సిద్ధపడుచున్నాడు.

నా నాల్గవ ఆహ్వానము, ఉపశమన సమాజములో పూర్తిగా పాల్గొను వయస్సు గల మీకు ఇస్తున్నాను. ప్రస్తుత ఉపశమన సమాజ ఉద్దేశ వ్యాఖ్యానమును చదవమని నేను బలంగా ప్రోత్సహిస్తున్నాను. అది ప్రేరేపించును. అది మీ స్వంత జీవితములో మీ స్వంత ఉద్దేశ వ్యాఖ్యానమును పెంపొందించుటకు మిమ్మును నడిపించవచ్చు. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఉపశమన సమాజ ప్రకటనలో గల సత్యాలను అనుభవించమని కూడా మిమ్ములను నేను కోరుచున్నాను.3 ఫ్రేము కట్టించబడిన ఈ ప్రకటన ప్రథమ అధ్యక్షత్వము యొక్క కార్యాలయపు గోడపైన వ్రేలాడుతూ ఉంటుంది. దానిని చదివిన ప్రతి సారి నేను ఆనందంతో పులకరిస్తాను. అది మీరెవరో మరియు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో సహాయము చేయుటకు మీ పాత్రను నెరవేర్చుచుండగా ఈ నిర్థిష్టమైన సమయములో మీలో ఎవరు ప్రభువుకు అవసరమో వర్ణిస్తుంది.

నా ప్రియమైన సహోదరీలారా, మీరు మాకు కావాలి! “మీ బలము,మీ పరివర్తన, మీ దృఢ విశ్వాసము, నడిపించుటకు మీ సామర్థ్యము, మీ జ్ఞానము, మీ స్వరాలు”4 మాకు కావాలి. మీరు లేకుండా ఇశ్రాయేలీయులను మేము ఏమాత్రము సమకూర్చలేము.

నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ ఆవశ్యకమైన, జరూరైన కార్యములో సహాయము చేస్తున్నప్పుడు లోకమును విడిచిపెట్టుటకు కావలసిన సామర్థ్యముతో ఇప్పుడు మిమ్మల్ని దీవిస్తున్నాను. కలిసి మనము ఆయన ప్రియమైన కుమారుని రెండవ రాకడ కొరకు ఈ లోకాన్ని సిద్ధపరచుటకు మన పరలోక తండ్రి మనం ఏమి చెయ్యాలని కోరుచున్నారో సమస్తమును చేయగలము.

యేసే క్రీస్తు. ఇది ఆయన సంఘము. దీని గురించి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

వివరణలు

  1. Russell M. Nelson, “Hope of Israel” (worldwide youth devotional, June 3, 2018), HopeofIsrael.lds.org.

  2. 2 నీఫై 25:26 చూడండి.

  3. ఈ పత్రాల ప్రతులు ఆన్‌లైన్‌లో లభ్యమౌతున్నాయి. ఉపశమన సమాజ ఉద్దేశము వ్యాఖ్యానము కొరకు, lds.org/callings/relief-society. For the Relief Society declaration, see Mary Ellen Smoot, “Rejoice, Daughters of Zion,” Liahona, Jan. 2000, 111–14 చూడుము.

  4. Russell M. Nelson, “A Plea to My Sisters,” Liahona, Nov. 2015, 96; emphasis added.