లేఖనములు
మోషైయ 25


25వ అధ్యాయము

జరహేమ్ల వద్దనున్న ములెక్ వంశస్థులు నీఫైయులగుదురు—వారు ఆల్మా మరియు జెనిఫ్‌ యొక్క జనులను గూర్చి తెలుసుకొందురు—లింహై మరియు అతని జనులందరికి ఆల్మా బాప్తిస్మమిచ్చును—దేవుని సంఘమును ఏర్పాటు చేయుటకు మోషైయ ఆల్మాకు అధికారమిచ్చును. సుమారు క్రీ. పూ. 120 సం.

1 ఇప్పుడు రాజైన మోషైయ జనులందరు సమకూడునట్లు చేసెను.

2 అక్కడ ములెక్ వంశస్థుడైన జరహేమ్ల యొక్క జనులు మరియు అతనితో పాటు అరణ్యములోనికి వచ్చిన వారు ఉన్నంతగా నీఫై సంతానము లేదా నీఫై వంశస్థులైన వారు ఎక్కువమంది లేకుండెను.

3 మరియు అక్కడ లేమనీయులు ఉన్నంతగా నీఫై యొక్క జనులుగాని జరహేమ్ల యొక్క జనులుగాని లేకుండెను; వారి సంఖ్యలో సగము కూడా వారు లేకుండెను.

4 ఇప్పుడు నీఫై యొక్క జనులందరు, జరహేమ్ల యొక్క జనులందరు సమావేశమై రెండు సమూహములుగా సమకూడిరి.

5 అంతట మోషైయ తన జనులకు జెనిఫ్‌ యొక్క వృత్తాంతములను చదివి వినిపించెను మరియు చదువబడునట్లు చేసెను; వారు జరహేమ్ల దేశమును వదిలి వెళ్ళిన సమయము నుండి తిరిగి వచ్చిన సమయము వరకు జెనిఫ్‌ యొక్క జనుల వృత్తాంతములను అతడు చదివి వినిపించెను.

6 మరియు వారు జరహేమ్ల దేశమును వదిలి వెళ్ళిన సమయము నుండి తిరిగి వచ్చిన సమయము వరకు ఆల్మా, అతని సహోదరులు మరియు వారి శ్రమలన్నిటి వృత్తాంతమును కూడా అతడు చదివి వినిపించెను.

7 మోషైయ ఆ వృత్తాంతములను చదివి వినిపించిన తరువాత దేశమందు నిలిచియున్న అతని జనులు ఆశ్చర్యముతోను, విస్మయముతోను నింపబడిరి.

8 ఏలయనగా వారు ఏమి తలంచవలెనో ఎరుగకుండిరి; దాస్యము నుండి విడుదల పొందిన వారిని చూచినప్పుడు వారు మహదానందముతో నింపబడిరి.

9 లేమనీయుల చేత సంహరించబడిన తమ సహోదరులను గూర్చి తలచినప్పుడు వారు దుఃఖముతో నిండి, బాధతో కన్నీళ్ళు కార్చిరి.

10 మరలా దేవుని తక్షణపు మంచితనమును, లేమనీయుల చేతులలో నుండి, దాస్యము నుండి ఆల్మాను అతని సహోదరులను విడిపించుటలో ఆయన శక్తిని వారు తలచినప్పుడు వారు తమ స్వరములనెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి.

11 మరలా వారి సహోదరులైన లేమనీయులను గూర్చి, వారి పాపపు మరియు అపవిత్రపు స్థితిని గూర్చి తలచినప్పుడు, వారి ఆత్మల సంక్షేమము కొరకు వారు బాధతో, వేదనతో నింపబడిరి.

12 ఇప్పుడు లేమనీయుల కుమార్తెలను భార్యలుగా తీసుకున్న అమ్యులోన్‌ మరియు అతని సహోదరుల సంతానము తమ తండ్రుల ప్రవర్తనతో విసిగి, ఇకపై తమ తండ్రుల పేర్లతో పిలువబడుటకు కోరుకొనలేదు, కావున వారు నీఫై సంతానమని పిలువబడునట్లు మరియు నీఫైయులని పిలువబడిన వారి మధ్య లెక్కింపబడునట్లు తమపై నీఫై పేరును తీసుకొనిరి.

13 జరహేమ్ల యొక్క జనులందరు నీఫైయులతో లెక్కింపబడిరి, ఎందుచేతననగా నీఫై వంశస్థులకు తప్ప ఎవరికిని రాజ్యము అనుగ్రహింపబడియుండలేదు.

14 ఇప్పుడు మోషైయ తన జనులతో మాట్లాడి, వారికి చదివి వినిపించిన తరువాత, ఆల్మా కూడా జనులతో మాట్లాడవలెనని అతడు కోరెను.

15 వారు పెద్ద సమూహములుగా కూడి సమావేశమైనప్పుడు ఆల్మా వారితో మాట్లాడెను మరియు జనులకు పశ్చాత్తాపమును ప్రభువుపై విశ్వాసమును బోధించుచు ఒక సమూహము నుండి మరియొక దానికి వెళ్ళెను.

16 వారిని విడిపించినది ప్రభువేనని వారు జ్ఞాపకముంచుకొనవలెనని లింహై యొక్క జనులకు, అతని సహోదరులకు, దాస్యము నుండి విడిపింపబడిన వారందరికి అతడు ఉద్భోధించెను.

17 జనులకు ఆల్మా అనేక విషయములు బోధించి, వారితో మాట్లాడుట ముగించిన తరువాత, తాను బాప్తిస్మము పొందవలెనని రాజైన లింహై కోరుకొనెను; అతని జనులందరు కూడా బాప్తిస్మము పొందవలెనని కోరుకొనిరి.

18 కావున, ఆల్మా నీటిలోనికి వెళ్ళి వారికి బాప్తిస్మమిచ్చెను; తన సహోదరులకు మోర్మన్‌ జలముల యందు ఇచ్చిన ప్రకారము అతడు వారికి బాప్తిస్మమిచ్చెను; అతడు బాప్తిస్మమిచ్చిన వారందరు దేవుని సంఘమునకు చెందిరి; ఇది ఆల్మా యొక్క మాటలపై వారి విశ్వాసమును బట్టియైయుండెను.

19 ఇప్పుడు జరహేమ్ల దేశమంతటా అతడు సంఘములు స్థాపించునట్లు రాజైన మోషైయ ఆల్మాకు అనుగ్రహించెను; ప్రతి సంఘముపై యాజకులను, బోధకులను నియమించుటకు అతనికి అధికారమిచ్చెను.

20 ఇప్పుడక్కడ ఒక బోధకుని ద్వారా నిర్వహించబడలేనంతమంది జనులున్నందున లేదా ఒకే సమావేశమందు దేవుని వాక్యమును వారందరు వినలేనందున ఇది చేయబడెను.

21 కావున సంఘములు అని పిలువబడిన వివిధ సమూహములందు వారు తమనుతాము సమావేశపరచుకొనిరి; ప్రతి సంఘము తమ యాజకులను, తమ బోధకులను కలిగియుండి, ప్రతి యాజకుడు ఆల్మా చేత అతనికి చెప్పబడిన ప్రకారము బోధించెను.

22 ఆ విధముగా అక్కడ అనేక సంఘములున్నను అవన్నియు ఒకే సంఘము, అనగా దేవుని సంఘముగా ఉండెను; ఏలయనగా సంఘములన్నిటిలో పశ్చాత్తాపము, దేవుని యందు విశ్వాసము తప్ప మరేదియు బోధింపబడలేదు.

23 ఇప్పుడు జరహేమ్ల దేశమందు ఏడు సంఘములు ఉండెను. క్రీస్తు లేదా దేవుని నామమును తమపై తీసుకొనుటకు కోరిన వారు దేవుని సంఘములందు చేరిరి.

24 వారు దేవుని జనులని పిలువబడిరి. ప్రభువు తన ఆత్మను వారిపై క్రుమ్మరించగా వారు ఆశీర్వదింపబడి, దేశమందు వర్థిల్లిరి.