లేఖనములు
మోషైయ 21


21వ అధ్యాయము

లింహై జనులు లేమనీయులచే దాడిచేయబడి ఓడించబడుదురు—లింహై జనులు అమ్మోన్‌ను కలుసుకొని పరివర్తన చెందుదురు—వారు అమ్మోన్‌కు ఇరువది నాలుగు జెరెడీయుల పలకలను గూర్చి చెప్పుదురు. సుమారు క్రీ. పూ. 122–121 సం.

1 లింహై మరియు అతని జనులు నీఫై పట్టణమునకు తిరిగి వెళ్ళి, దేశమందు మరలా సమాధానముతో నివసించుట మొదలుపెట్టిరి.

2 అనేకదినముల తర్వాత మరలా నీఫైయులకు వ్యతిరేకముగా లేమనీయులు కోపమందు పురిగొల్పబడి, దేశమును చుట్టుముడుతూ సరిహద్దులలోకి రాసాగిరి.

3 వారి రాజు లింహైతో చేసిన ప్రమాణమును బట్టి వారిని సంహరించుటకు వారు తెగించలేదు; కానీ వారిని చెంపల మీద కొట్టుచు వారిపై అధికారము చెలాయించిరి; వారి వీపులపై భారములు మోపి, మూగ గాడిదను తరుమునట్లు వారిని తరుముచుండిరి—

4 ఇదంతయు ప్రభువు యొక్క మాట నెరవేరునట్లు జరిగెను.

5 ఇప్పుడు నీఫైయుల శ్రమలు గొప్పవైయుండెను మరియు వారు లేమనీయుల నుండి తమను విడిపించుకొనగల మార్గమేదియు లేకుండెను, ఏలయనగా లేమనీయులు వారిని అన్నివైపుల నుండి చుట్టిముట్టిరి.

6 వారి శ్రమలను బట్టి జనులు రాజుతో సణుగుట మొదలుపెట్టి, వారికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు కోరిరి. వారు తమ ఫిర్యాదులతో రాజును తీవ్రముగా విసిగించినందున, వారి కోరికల ప్రకారము చేయుటకు అతడు వారిని అనుగ్రహించెను.

7 వారు మరలా సమకూడి తమ కవచములను ధరించి, తమ దేశము నుండి లేమనీయులను తరిమి వేయుటకు వారికి వ్యతిరేకముగా ముందుకుసాగిరి.

8 లేమనీయులు వారిని కొట్టి, వెనుకకు తరిమివేసి, వారిలో అనేకులను సంహరించిరి.

9 ఇప్పుడు లింహై జనుల మధ్య గొప్ప శోకము మరియు విలాపము కలిగెను, విధవరాలు తన భర్త కొరకు, కుమారుడు మరియు కుమార్తె తన తండ్రి కొరకు, సహోదరులు వారి సహోదరుల కొరకు శోకించుచుండెను.

10 దేశమందున్న అనేకమంది విధవరాండ్రు అనుదినము తీవ్రముగా దుఃఖించిరి, ఏలయనగా లేమనీయులను గూర్చి వారు తీవ్రముగా భయపడిరి.

11 వారి నిరంతర రోదనలు లింహై జనులలో మిగిలిన వారిని లేమనీయులకు వ్యతిరేకముగా కోపమునకు పురిగొల్పగా, వారు మరలా యుద్ధమునకు వెళ్ళి, అధిక నష్టమును ఎదుర్కొని వెనుకకు తరుమబడిరి.

12 వారు మరలా మూడవసారి కూడా వెళ్ళి, అదే విధముగా బాధపడిరి; మరియు సంహరింపబడని వారు నీఫై పట్టణమునకు తిరిగి వచ్చిరి.

13 వారి శత్రువుల కోరికల ప్రకారము వారు దాస్యపు కాడికి తమను లోబరచుకొనుచు, కొట్టబడుటకు తమను అప్పగించుకొనుచు, ముందు వెనుకలకు తరుమబడుచు భారముతో తమనుతాము ధూళివలె తగ్గించుకొనిరి.

14 వారు మిక్కిలి వినయముతో తమనుతాము తగ్గించుకొని దేవునికి బలముగా మొరపెట్టిరి; వారి శ్రమల నుండి ఆయన వారిని విడిపించునేమోయని దినమంతయు వారు తమ దేవునికి మొరపెట్టిరి.

15 ఇప్పుడు వారి దోషముల నిమిత్తము ప్రభువు వారి మొర వినుటకు ఆలస్యము చేసెను; అయినప్పటికీ ప్రభువు వారి మొరలను విని, వారి భారములు తేలిక చేయునట్లు లేమనీయుల హృదయములను మృదువుగా చేయసాగెను; కానీ వారిని దాస్యములో నుండి విడిపించుట సరియైనదని ప్రభువు తలంచలేదు.

16 వారు అంచెలంచెలుగా దేశమందు వర్ధిల్లుట మొదలుపెట్టిరి మరియు ఆకలితో బాధపడకుండునట్లు అధిక విస్తారముగా ధాన్యమును మందలను గుంపులను పెంచుట ప్రారంభించిరి.

17 ఇప్పుడక్కడ పురుషుల కంటే స్త్రీలు అధిక సంఖ్యలో ఉండిరి; కావున వారు ఆకలితో నశించిపోకుండునట్లు విధవరాండ్రు మరియు వారి పిల్లల పోషణ నిమిత్తము ప్రతి ఒక్కరు పాలుపంచవలెనని రాజైన లింహై ఆజ్ఞాపించెను; వారిలో అధికులు సంహరింపబడినందున వారు ఈలాగు చేసిరి.

18 లింహై జనులు సాధ్యమైనంతమట్టుకు సమూహముగా కలిసియుండి, వారి ధాన్యమును గొఱ్ఱెలమందలను కాపాడుకొనిరి.

19 మరియు తాను ఏదో విధముగా లేమనీయులకు పట్టుబడుదునేమోనన్న భయముతో తనతోపాటు భటులను తీసుకొనివెళ్ళనిదే పట్టణ ప్రాకారముల వెలుపల తాను క్షేమమని రాజు కూడా నమ్మలేదు.

20 అరణ్యములోనికి పారిపోయి లేమనీయుల కుమార్తెలను అపహరించి తమపై అట్టి గొప్ప నాశనము వచ్చునట్లు చేసిన ఆ యాజకులను వారు ఏదో విధముగా పట్టుకొనునట్లు దేశము చుట్టూ తన జనులు కావలికాయునట్లు అతడు చేసెను.

21 ఆ యాజకులను శిక్షించునట్లు వారిని పట్టుకొనుటకు వారు కోరియుండిరి; వారు రాత్రి యందు నీఫై దేశములోనికి వచ్చి తమ ధాన్యమును, అనేక విలువైన వస్తువులను తీసుకొనిపోయినందున వారి కొరకు రహస్యముగా కనిపెట్టుచుండిరి.

22 అమ్మోన్‌ మరియు అతని సహోదరులు దేశములోనికి వచ్చునంత వరకు కూడా లేమనీయులు, లింహై జనుల మధ్య ఎట్టి సమస్య లేకుండెను.

23 రాజు పట్టణ ప్రాకారము వెలుపల తన భటులతో ఉన్నప్పుడు అమ్మోన్‌ మరియు అతని సహోదరులను కనుగొనెను; వారిని నోవహు యొక్క యాజకులని తలంచి వారు పట్టుకొనబడి, బంధించబడి చెరసాలలో వేయబడునట్లు అతడు చేసెను. వారు నోవహు యొక్క యాజకులైయుండిన యెడల, వారు చంపబడునట్లు అతడు చేసియుండేవాడు.

24 కానీ వారు యాజకులు కారని తన సహోదరులని, జరహేమ్ల దేశము నుండి వచ్చియున్నారని కనుగొనినప్పుడు అతడు మహదానందముతో నింపబడెను.

25 ఇప్పుడు అమ్మోన్‌ రాకకు పూర్వము రాజైన లింహై జరహేమ్ల దేశమును వెదకుటకు కొద్దిమందిని పంపియుండెను; కానీ వారు దానిని కనుగొనలేక అరణ్యమందు తప్పిపోయిరి.

26 అయినప్పటికీ జనులు నివాసమున్న ఒక దేశమును, ఎండిన ఎముకలచే కప్పబడియున్న ఒక దేశమును, జనులు నివాసముండి నాశనము చేయబడిన ఒక దేశమును వారు కనుగొనిరి; అది జరహేమ్ల దేశమని తలంచి అమ్మోన్‌ రాకకు కొద్ది దినముల ముందు వారు దేశ సరిహద్దులలోనికి వచ్చి చేరి, నీఫై దేశమునకు తిరిగి వచ్చిరి.

27 మరియు వారు ఎవరి ఎముకలను కనుగొనియున్నారో ఆ జనుల వృత్తాంతమును వారితోపాటు తెచ్చిరి; అది ముడి లోహపు పలకలపై చెక్కబడియుండెను.

28 ఇప్పుడు అట్టి చెక్కడములకు అర్థము చెప్పగలుగునట్లు రాజైన మోషైయ దేవుని నుండి ఒక బహుమానమును కలిగియున్నాడని అమ్మోన్‌ ద్వారా తెలుసుకొనినప్పుడు లింహై మరలా సంతోషముతో నింపబడెను మరియు అమ్మోన్‌ కూడా సంతోషించెను.

29 అయినను వారి సహోదరులలో అనేకులు సంహరింపబడినందున అమ్మోన్‌ మరియు అతని సహోదరులు దుఃఖముతో నింపబడిరి.

30 రాజైన నోవహు మరియు అతని యాజకులు దేవునికి వ్యతిరేకముగా జనులు అనేక పాపములు, దోషములు చేయునట్లు చేసియుండిరని కూడా బాధపడిరి; అబినడై మరణమును గూర్చి కూడా వారు శోకించిరి; దేవుని బలము, శక్తిచేత మరియు అబినడై ద్వారా పలుకబడిన మాటలపై విశ్వాసము చేత దేవుని సంఘమును ఏర్పాటు చేసిన ఆల్మా మరియు అతనితో వెళ్ళిన జనులు వెడలిపోవుటను గూర్చి కూడా దుఃఖించిరి.

31 వారు ఎక్కడికి పారిపోయిరో వారెరుగనందున వారు వెడలిపోవుటను గూర్చి దుఃఖించిరి. వారు సంతోషముగా వారితో చేరియుండేవారు, ఏలయనగా దేవుడిని సేవించి ఆయన ఆజ్ఞలను పాటించుటకు వారు ఆయనతో ఒక నిబంధనలోనికి ప్రవేశించియున్నారు.

32 ఇప్పుడు అమ్మోన్‌ వచ్చినప్పటి నుండి రాజైన లింహై మరియు అతని జనులలో అనేకులు కూడా దేవుడిని సేవించి ఆయన ఆజ్ఞలను పాటించుటకు ఆయనతో ఒక నిబంధనలోనికి ప్రవేశించియున్నారు.

33 రాజైన లింహై మరియు అతని జనులలో అనేకులు బాప్తిస్మము పొందుటకు కోరిరి; కానీ దేవుని నుండి అధికారము కలిగినవారెవరు దేశమందు లేకుండెను. తాను అయోగ్యుడైన సేవకుడనని తలంచుచూ ఈ కార్యమును చేయుటకు అమ్మోన్‌ నిరాకరించెను.

34 కావున, ప్రభువు యొక్క ఆత్మ కొరకు కనిపెట్టుచూ వారు ఆ సమయమున తమను ఒక సంఘముగా ఏర్పాటు చేసుకొనలేదు. ఇప్పుడు వారు అరణ్యములోనికి పారిపోయిన ఆల్మా మరియు అతని సహోదరులవలే అగుటకు కోరిరి.

35 వారి పూర్ణ హృదయములతో దేవుడిని సేవించుటకు వారు సిద్ధముగా ఉన్నారని ఒక సాక్ష్యముగా ప్రమాణముగా వారు బాప్తిస్మము పొందుటకు కోరిక కలిగియుండిరి; అయినప్పటికీ వారు కాలయాపన చేసిరి; మరియు వారి బాప్తిస్మము యొక్క వృత్తాంతము దీని తరువాత ఇవ్వబడును.

36 ఇప్పుడు అమ్మోన్‌, అతని జనులు మరియు రాజైన లింహై, అతని జనుల యొక్క ఆలోచన అంతయు లేమనీయుల చేతులలో నుండి, దాస్యము నుండి తమను విడిపించుకొనుటకైయుండెను.