లేఖనములు
మోర్మన్ 9


9వ అధ్యాయము

క్రీస్తు నందు విశ్వసించని వారిని పశ్చాత్తాపపడమని మొరోనై పిలుపునిచ్చును—బయల్పాటులను ఇచ్చి, విశ్వాసులపై బహుమానములను మరియు సూచక క్రియలను క్రుమ్మరించి, అద్భుతములు చేయు దేవుని గూర్చి అతడు ప్రకటించును—అవిశ్వాసమును బట్టి అద్భుతములు నిలిచిపోవును—నమ్మినవారి వలన సూచక క్రియలు కనబడును—వివేకము కలిగి, ఆజ్ఞలను పాటించమని మనుష్యులు ఉద్భోధించబడుదురు. సుమారు క్రీ. శ. 401–421 సం.

1 ఇప్పుడు, క్రీస్తునందు విశ్వసించని వారిని గూర్చి కూడా నేను మాట్లాడుచున్నాను.

2 ఇదిగో, మీ దర్శనము యొక్క దినమందు మీరు విశ్వసించెదరా—ప్రభువు వచ్చునప్పుడు, భూమి ఒక గ్రంథపు చుట్టవలే చుట్టబడి, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవు ఆ గొప్ప దినమున, దేవుని గొఱ్ఱెపిల్ల యెదుట నిలుచుటకు మీరు తేబడు ఆ గొప్ప దినమున—అప్పుడు కూడా దేవుడు లేడని మీరు చెప్పెదరా?

3 మీరు ఇంకను క్రీస్తును తిరస్కరించెదరా లేదా దేవుని గొఱ్ఱెపిల్లను చూడగలరా? మీ దోషములను యెరిగియుండి, మీరు ఆయనతో నివసించగలరని తలంచుచున్నారా? ఆయన చట్టములను మీరు నిరంతరము దూషించిరి అను దోష జ్ఞానమును బట్టి మీ ఆత్మలు బాధింపబడుచుండగా, ఆ పరిశుద్ధునితో నివసించుట సంతోషకరముగా ఉండునని మీరు తలంచుచున్నారా?

4 ఇదిగో, నరకమందు శిక్ష పొందిన ఆత్మలతో మీరు నివసించుట కంటే, ఆయన యెదుట మీ మలినతను యెరిగియుండి ఒక పరిశుద్ధమైన, న్యాయవంతుడైన దేవునితో నివసించుటకు మీరు అధిక దుఃఖాక్రాంతులగుదురని నేను మీతో చెప్పుచున్నాను.

5 ఏలయనగా, దేవుని యెదుట మీ దిగంబరత్వమును, దేవుని మహిమను, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధతను చూచుటకు మీరు తేబడినప్పుడు, అది మీలో ఆరని అగ్ని జ్వాలను రగిలించును.

6 ఓ అవిశ్వాసులారా, ఆ గొప్ప అంత్యదినమున గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా కడుగబడి, కళంకములేక శుద్ధముగా, సుందరముగా మరియు తెల్లగా కనుగొనబడునట్లు ప్రభువు వైపునకు తిరుగుడి; యేసు నామమందు తండ్రికి బలముగా మొరపెట్టుడి.

7 మరలా, దేవుని బయల్పాటులను తిరస్కరించి, అవి ముగిసిపోయినవని, ఇక బయల్పాటులు, ప్రవచనములు, బహుమానములు, స్వస్థతలు, భాషలతో మాట్లాడుట మరియు భాషల యొక్క అనువాదములు లేవని చెప్పు వారితో నేను మాట్లాడుచున్నాను;

8 నేను మీతో చెప్పునదేమనగా, ఈ విషయములను తిరస్కరించువాడు క్రీస్తు యొక్క సువార్తను యెరుగడు; అనగా, అతడు లేఖనములను చదువలేదు; చదివిన యెడల, అతడు వాటిని గ్రహించలేదు.

9 ఏలయనగా దేవుడు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని, ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఛాయయైనను లేదని మనము చదువుట లేదా?

10 ఇప్పుడు చంచలత్వము, గమనాగమనము వలన కలుగు ఛాయ ఉన్న ఒక దేవుడిని మీరు ఊహించుకొనిన యెడల, అప్పుడు అద్భుతములు చేయని ఒక దేవుడిని మీరు ఊహించుకొనియున్నారు.

11 కానీ, అద్భుతములు చేయు దేవుడిని, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుడిని కూడా నేను మీకు చూపెదను; పరలోకములను, భూమిని మరియు వాటిలో ఉన్న వాటన్నిటినీ సృష్టించినది ఆ దేవుడే.

12 ఆయన ఆదామును సృష్టించెను మరియు ఆదాము ద్వారా మనుష్యుని పతనము వచ్చెను. మనుష్యుని పతనమును బట్టి, తండ్రి మరియు కుమారుడైన యేసు క్రీస్తు కూడా వచ్చెను; యేసు క్రీస్తును బట్టి మనుష్యుని విమోచన వచ్చెను.

13 యేసు క్రీస్తు ద్వారా వచ్చిన మమష్యుని విమోచనను బట్టి, వారు ప్రభువు సన్నిధిలోనికి తిరిగి తేబడిరి; ఈ విధముగా మనుష్యులందరు విమోచింపబడియున్నారు, ఏలయనగా క్రీస్తు యొక్క మరణము పునరుత్థానమును తెచ్చును, అది ఒక అంతము లేని నిద్ర నుండి విమోచనను తెచ్చును, ఒక బూరధ్వని చేయబడినప్పుడు ఆ నిద్ర నుండి మనుష్యులందరు దేవుని శక్తి ద్వారా లేపబడుదురు; ధనికులు పేదవారు ఇరువురు, ఐహిక మరణమైన ఈ మరణము యొక్క నిత్య బంధకము నుండి విడిపించబడి, విమోచింపబడి, ముందుకు వచ్చి, అందరు ఆయన న్యాయపీఠము యెదుట నిలిచెదరు.

14 అప్పుడు పరిశుద్ధుని తీర్పు వారిపై వచ్చును; మలినమైనవారు ఇంకను మలినముగా ఉందురు మరియు నీతిమంతులు ఇంకను నీతిమంతులుగా ఉందురు; సంతోషముగా ఉన్నవారు ఇంకను సంతోషముగా ఉందురు మరియు సంతోషముగా లేనివారు ఇంకను సంతోషముగా ఉండని సమయము వచ్చును.

15 ఇప్పుడు, అద్భుతములు చేయలేని దేవుడిని ఊహించుకొన్నవారలారా, నేను మిమ్ములను అడుగుచున్నాను, నేను చెప్పిన ఈ విషయములన్నియు జరిగినవా? అంతము వచ్చియున్నదా? ఇదిగో, అంతము రాలేదని, దేవుడు అద్భుతములను చేయు దేవునిగా ఉండుట మానివేయలేదని నేను మీతో చెప్పుచున్నాను.

16 దేవుడు చేసిన క్రియలు మన దృష్టిలో అద్భుతమైనవి కావా? అవును, దేవుని యొక్క అద్భుతకార్యములను ఎవరు గ్రహించగలరు?

17 ఆయన వాక్కు చేత పరలోకము మరియు భూమి సృష్టించబడుట, ఆయన వాక్కు యొక్క శక్తిద్వారా మనుష్యుడు నేలమంటి నుండి సృష్టించబడుట మరియు ఆయన వాక్కు యొక్క శక్తి చేత అద్భుతములు చేయబడుట ఒక అద్భుతము కాదని ఎవరు చెప్పెదరు?

18 యేసు క్రీస్తు అనేక గొప్ప అద్భుతములు చేయలేదని ఎవరు చెప్పెదరు? అపొస్తలుల చేత కూడా అనేక గొప్ప అద్భుతములు చేయబడెను.

19 అప్పుడు అద్భుతములు చేయబడిన యెడల, దేవుడు అద్భుతములను చేయు దేవునిగా ఉండుట మానివేసి, ఇంకను మార్పులేని జీవిగా ఎందుకు ఉన్నాడు? నేను మీతో చెప్పునదేమనగా—ఆయన మారడు; అటులైన యెడల, ఆయన దేవునిగా ఉండుట మానును; మరియు ఆయన దేవునిగా ఉండుట మానడు, ఆయన అద్భుతములను చేయు దేవుడైయున్నాడు.

20 ఆయన నరుల సంతానము మధ్య అద్భుతములు చేయుటను మానివేయుటకు కారణమేమనగా, వారు తమ విశ్వాసమందు క్షీణించి, సరియైన మార్గము నుండి తప్పిపోయి, ఎవరియందు వారు నమ్మకముంచవలెనో ఆ దేవుడిని ఎరుగకపోవుటయే.

21 ఇదిగో, నేను మీతో చెప్పునదేమనగా, దేనిని సందేహించక క్రీస్తునందు విశ్వసించువాడు, క్రీస్తు యొక్క నామమందు తండ్రిని ఏమి అడిగినను అది అతనికి అనుగ్రహింపబడును; మరియు ఈ వాగ్దానము, భూదిగంతముల వరకు అందరికి వర్తించును.

22 ఏలయనగా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు, నిలిచియుండవలసిన తన శిష్యులకు మరియు సమూహము వినుచుండగా తన శిష్యులందరికి కూడా ఈ విధముగా చెప్పెను: మీరు సర్వలోకములోనికి వెళ్ళి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి;

23 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును;

24 నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు; పాములను ఎత్తి పట్టుకొందురు; మరణకరమైనదేది త్రాగినను అది వారికి హానిచేయదు; రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు;

25 మరియు దేనిని సందేహించక, నా నామమందు విశ్వాసముంచు వానికి భూదిగంతముల వరకు కూడా నేను నా మాటలన్నిటిని స్థిరపరచుదును.

26 ఇప్పుడు, ప్రభువు యొక్క కార్యములకు వ్యతిరేకముగా ఎవరు నిలువగలరు? ఆయన మాటలను ఎవరు తిరస్కరించగలరు? ప్రభువు యొక్క సర్వోన్నత శక్తికి వ్యతిరేకముగా ఎవరు తిరుగబడెదరు? ప్రభువు యొక్క కార్యములను ఎవరు తృణీకరించెదరు? క్రీస్తు యొక్క సంతానమును ఎవరు తృణీకరించెదరు? ప్రభువు యొక్క కార్యములను తృణీకరించు వారలారా చూడుడి, ఏలయనగా మీరు ఆశ్చర్యపడి నశించెదరు.

27 ఓ, అప్పుడు తృణీకరించకుడి మరియు ఆశ్చర్యపడకుడి, కానీ ప్రభువు యొక్క మాటలను ఆలకించి, మీకు అక్కరలో ఉన్నవాటి కొరకు యేసు నామమున తండ్రిని అడుగుడి. సందేహించకుడి, కానీ విశ్వసించుచూ ఉండుడి, పూర్వకాలములందువలే మీ సంపూర్ణ హృదయముతో ప్రభువు యొద్దకు రండి మరియు ఆయన యెదుట భయముతోను, వణుకుతోను మీ స్వంత రక్షణను జరిగించుకొనుడి.

28 మీ పరిశీలనా దినములలో తెలివిగానుండుడి; సమస్త అపవిత్రత నుండి మిమ్ములను విడిపించుకొనుడి; మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగకుడి, కానీ మీరు ఏ శోధనకు లోబడక, సజీవుడగు సత్య దేవుడిని సేవించునట్లు కదిలింపబడని దృఢత్వముతో అడుగుడి.

29 అయోగ్యముగా మీరు బాప్తిస్మము పొందకుండా జాగ్రత్తపడుడి; అయోగ్యముగా క్రీస్తు యొక్క సంస్కారములో మీరు పాలుపొందకుండా జాగ్రత్తపడుడి; అన్ని విషయములు మీరు యోగ్యతతో చేయునట్లు జాగ్రత్తపడుడి మరియు సజీవుడగు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నామమందు దీనిని చేయుడి; మీరు దీనిని చేసి అంతము వరకు స్థిరముగా నున్నయెడల, మీరు ఎంత మాత్రము బయటకు త్రోసివేయబడరు.

30 ఇదిగో, మృతులలో నుండి మాట్లాడుచున్నట్లుగా నేను మీతో మాట్లాడుచున్నాను; ఏలయనగా, మీరు నా మాటలను కలిగియుందురని నేనెరుగుదును.

31 నా దోషమును బట్టి నన్ను లేదా అతని దోషమును బట్టి నా తండ్రిని లేదా అతని కంటే ముందు వ్రాసిన వారిని ఖండించవద్దు; కానీ, మా కంటే అధిక వివేకముగా ఉండుటను మీరు నేర్చుకొనులాగున ఆయన మా దోషములను మీకు తెలియజేసియున్నాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

32 ఇప్పుడు, సంస్కరింపబడిన ఐగుప్తీయుల భాష అని మా మధ్య పిలువబడిన అక్షరములలో మేము ఈ వృత్తాంతమును మా జ్ఞానమును బట్టి వ్రాసియున్నాము, అది మాకు అందించబడి, మేము మాట్లాడు విధానమును బట్టి మా చేత మార్చబడినది.

33 మా పలకలు తగినంత పెద్దవైయుండిన యెడల మేము హెబ్రీ భాషలో వ్రాసియుండేవారము; కానీ హెబ్రీ భాష కూడా మా చేత మార్పు చేయబడెను; మరియు మేము హెబ్రీ భాషలో వ్రాసియుండగలిగిన యెడల, మీరు మా వృత్తాంతములో ఎట్టి దోషమును కలిగియుండేవారు కారు.

34 కానీ, మేము వ్రాసిన విషయములను మరియు ఇతర జనులెవరూ కూడా మా భాషను ఎరుగరు అను విషయమును ప్రభువు ఎరుగును; ఇతర జనులెవరూ మా భాషను ఎరుగనందున, దాని అర్థము చెప్పుటకు ఆయన సాధనమును తయారు చేసియున్నాడు.

35 మరియు తమ విశ్వాసమందు క్షీణించిన మా సహోదరుల యొక్క రక్తము నుండి మా వస్త్రములను మేము విడిపించుకొనునట్లు ఈ విషయములు వ్రాయబడెను.

36 ఇదిగో, మా సహోదరులను గూర్చి మేము కోరిన ఈ విషయములు, ముఖ్యముగా క్రీస్తును గూర్చిన జ్ఞానమునకు వారు పునఃస్థాపించబడుట అనునది దేశమందు నివసించిన పరిశుద్ధులందరి యొక్క ప్రార్థనలను బట్టియైయున్నది.

37 మరియు వారి విశ్వాసమును బట్టి, వారి ప్రార్థనలకు జవాబివ్వబడునట్లు ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహించును గాక; ఇశ్రాయేలు వంశముతో ఆయన చేసిన నిబంధనను తండ్రియైన దేవుడు జ్ఞాపకము చేసుకొనును గాక; యేసు క్రీస్తు యొక్క నామమందు విశ్వాసముంచుట ద్వారా ఆయన వారిని నిత్యము ఆశీర్వదించును గాక, ఆమేన్‌.