లేఖనములు
హీలమన్ 14


14వ అధ్యాయము

క్రీస్తు జన్మించిన రాత్రియందు వెలుగును, ఒక క్రొత్త నక్షత్రమును సమూయేలు ముందుగా సూచించును—మనుష్యులను ఐహిక మరియు ఆత్మీయ మరణము నుండి క్రీస్తు విమోచించును—మూడు దినముల అంధకారము, బండలు పగులుట మరియు తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు ఆయన మరణమునకు సూచనలుగా ఉన్నవి. సుమారు క్రీ. పూ. 6 సం.

1 లేమనీయుడైన సమూయేలు వ్రాయబడలేని, అనేకానేక గొప్ప విషయములను ప్రవచించెను.

2 మరియు అతడు వారితో ఇట్లు చెప్పెను: ఇదిగో, నేను మీకు ఒక సూచననిచ్చుచున్నాను; ఇంకను ఐదు సంవత్సరములు గడిచిన తరువాత, అప్పుడు ఆయన నామమందు విశ్వసించు వారందరిని విమోచించుటకు దేవుని కుమారుడు వచ్చును.

3 ఆయన రాకడ సమయమున మీకు ఒక సూచనగా దీనిని నేను మీకిచ్చెదను; ఆకాశమందు గొప్ప వెలుగులు ఉండును, ఎంతగాననగా ఆయన రాకకు ముందు రాత్రియందు ఎట్టి చీకటి ఉండదు; మనుష్యులకు అది పగలువలె అనిపించును.

4 కావున రాత్రి లేకుండా ఒక పగలు మాత్రమే ఉన్నట్లు అక్కడ ఒక పగలు, ఒక రాత్రి మరియు ఒక పగలు ఉండును; ఇది మీకు ఒక సూచనగా ఉండును; ఏలయనగా సూర్యోదయమును, సూర్యాస్తమయమును కూడా మీరెరుగుదురు; కావున అక్కడ రెండు పగళ్ళు మరియు ఒక రాత్రి ఉండెనని వారు ఖచ్చితముగా తెలుసుకొనెదరు; అయినప్పటికీ ఆ రాత్రి చీకటిగానుండదు; అది ఆయన జన్మించుటకు ముందు రాత్రియైయుండును.

5 మీరు ఎన్నడూ చూచియుండని ఒక క్రొత్త నక్షత్రము ఉదయించును; ఇది కూడా మీకు ఒక సూచనయైయుండును.

6 ఇదియే అంతయూ కాదు, పరలోకమందు అనేకమైన సూచకక్రియలు మరియు ఆశ్చర్యకార్యములుండును.

7 మీరందరు నేలపై పడునంతగా విస్మయమొంది, ఆశ్చర్యపడుదురు.

8 మరియు దేవుని కుమారుని యందు విశ్వసించు వారందరు శాశ్వత జీవమును పొందుదురు.

9 అందువలన నేను వచ్చి, ఈ సంగతిని మీకు చెప్పవలెనని ప్రభువు తన దేవదూత ద్వారా నన్ను ఆజ్ఞాపించెను; నేను ఈ సంగతులను మీకు ప్రవచించవలెనని ఆయన ఆజ్ఞాపించియున్నాడు; పశ్చాత్తాపపడి, ప్రభువు మార్గమును సిద్ధపరచమని ఈ జనులకు ప్రకటించమని ఆయన నాకు చెప్పియున్నాడు.

10 లేమనీయుడనైన నేను, ప్రభువు నాకు ఆజ్ఞాపించిన మాటలు మీకు చెప్పియున్నందున, అవి మీకు వ్యతిరేకముగా కఠినముగా ఉన్నందున మీరు నాతో కోపముగానున్నారు; నన్ను నాశనము చేయుటకు కోరుచున్నారు మరియు నన్ను మీ మధ్య నుండి బయటకు గెంటి వేసియున్నారు.

11 అయితే మీరు నా మాటలు విందురని, మీ దోషములను బట్టి మీ కొరకు వేచియున్న దేవుని తీర్పులను మీరు విని తెలుసుకొందురని మరియు పశ్చాత్తాపము యొక్క షరతులను కూడా తెలుసుకొందురను ఉద్దేశ్యము నిమిత్తము నేను ఈ పట్టణ ప్రాకారములపైకి వచ్చియున్నాను.

12 మరియు దేవుని కుమారుడు, భూమ్యాకాశముల యొక్క తండ్రి, ఆది నుండి సమస్త వస్తువుల సృష్టికర్తయైన యేసు క్రీస్తు యొక్క రాకను గూర్చి మీరు తెలుసుకొందురని, ఆయన నామమందు విశ్వసించు ఉద్దేశ్యము నిమిత్తము ఆయన రాక యొక్క సూచనలను గూర్చి మీరు తెలుసుకొందురని నేను వచ్చితిని.

13 మీరు ఆయన నామమందు విశ్వసించిన యెడల, మీ పాపములన్నిటిని గూర్చి మీరు పశ్చాత్తాపపడెదరు, దాని ఫలితముగా మీరు ఆయన యోగ్యతల ద్వారా ఆ పాపములకు క్షమాపణ పొందెదరు.

14 ఇదిగో, ఇంకొక సూచనను నేను మీకిచ్చుచున్నాను, అది ఆయన మరణమును గూర్చిన సూచన.

15 ఏలయనగా రక్షణ వచ్చునట్లు ఆయన నిశ్చయముగా మరణించవలెను; మృతుల పునరుత్థానమును తెచ్చుటకై ఆయన మరణించుట ఆయనకు యుక్తమగును మరియు అవసరమైయుండును, తద్వారా మనుష్యులు ప్రభువు యొక్క సన్నిధికి తేబడగలరు.

16 ఈ మరణము పునరుత్థానమును తెచ్చును మరియు సమస్త మానవ జాతిని మొదటి మరణమైన ఆ ఆత్మీయ మరణము నుండి విమోచించును; ఏలయనగా ఆదాము యొక్క పతనము ద్వారా మనుష్యులందరు ప్రభువు సన్నిధి నుండి కొట్టివేయబడి, ఐహికమైన సంగతులు మరియు ఆత్మీయమైన సంగతులు రెండింటి విషయమై మృతులవలే పరిగణించబడిరి.

17 కానీ క్రీస్తు యొక్క పునరుత్థానము మానవజాతిని, అనగా సమస్త మానవజాతిని విమోచించును; మరియు వారిని ప్రభువు యొక్క సన్నిధికి తిరిగి తెచ్చును.

18 పశ్చాత్తాపపడు వారందరు నరికివేయబడరు, అగ్నిలో పడవేయబడరు అను పశ్చాత్తాపము యొక్క షరతును అది తెచ్చును; కానీ పశ్చాత్తాపపడని వారందరు నరికివేయబడుదురు, అగ్నిలో పడవేయబడుదురు; అక్కడ వారిపై తిరిగి ఒక ఆత్మీయ మరణము, అనగా రెండవ మరణము వచ్చును. ఏలయనగా, నీతికి సంబంధించిన వాటి విషయమై వారు తిరిగి కొట్టివేయబడిరి.

19 కావున పశ్చాత్తాపపడుడి, మీరు పశ్చాత్తాపపడుడి, లేని యెడల ఈ సంగతులను తెలుసుకొని వాటిని చేయకపోవుట ద్వారా శిక్షావిధికి లోబడుటకు మిమ్ములను మీరు అనుమతించుకొందురు మరియు మీరు ఈ రెండవ మరణమునకు తేబడుదురు.

20 కానీ ఇదిగో, ఆయన మరణము యొక్క సూచన అని మరియొక సూచనను గూర్చి నేను మీకు చెప్పినట్లుగా, ఆయన మరణమును అనుభవించు ఆ దినమందు సూర్యుడు చీకటియగును మరియు మీకు తన వెలుగునిచ్చుటకు తిరస్కరించును; చంద్రుడు మరియు నక్షత్రములు కూడా తిరస్కరించును; ఆయన మరణమును అనుభవించు సమయము నుండి మూడు దినముల పాటు అనగా, ఆయన మృతులలో నుండి తిరిగిలేచు సమయము వరకు ఈ భూముఖముపై ఎట్టి వెలుగు ఉండదు.

21 ఆయన ఆత్మను అప్పగించివేయు సమయమున అనేక గంటలపాటు అక్కడ ఉరుములు, మెరుపులు ఉండును; భూమి కంపించి వణుకును; ఈ భూముఖము పైనున్నవి, భూమి పైన మరియు క్రింద రెండింటనున్నవి, ఈ సమయమున మీరు గట్టివని ఎరిగినవి లేదా దానిలో అధికభాగము ఒక గట్టి బండలా ఉన్న రాళ్ళు పగులును.

22 అవి రెండుగా చీలును, తరువాత ఎప్పటికీ సమస్త భూముఖముపై, అనగా భూమిపై మరియు క్రింద రెండింట, అతుకులయందు, బీటలయందు మరియు విరిగిన ముక్కలయందు కనుగొనబడును.

23 అక్కడ గొప్ప తుఫానులుండును, అనేక పర్వతములు లోయవలె క్రిందకు పరచబడియుండును మరియు ఇప్పుడు లోయలని పిలువబడిన అనేక స్థలములు అతి ఎత్తైన పర్వతములుగా మారును.

24 అనేక రహదారులు పాడైపోవును మరియు అనేక పట్టణములు నిర్జనమగును.

25 అనేక సమాధులు తెరువబడి, వాటి మృతులను అప్పగించివేయును; అనేకమంది పరిశుద్ధులు అనేకులకు కనబడుదురు.

26 ఇదిగో, దూత నాతో ఈ విధముగా చెప్పెను; ఏలయనగా అనేక గంటలపాటు అక్కడ ఉరుములు, మెరుపులు ఉండునని అతడు నాతో చెప్పెను.

27 ఉరుములు, మెరుపులు మరియు తుఫాను ఆగినప్పుడు ఈ సంగతులు ఉండవలెనని, మూడు దినముల పాటు సమస్త భూముఖమును చీకటి కప్పవలెనని అతడు నాతో చెప్పెను.

28 ఈ సూచకక్రియలు మరియు ఈ ఆశ్చర్యకార్యములు ఈ భూముఖమంతటి మీద రావలెనని వారు విశ్వసించు ఉద్దేశ్యము నిమిత్తము, నరుల సంతానము మధ్య అవిశ్వాసమునకు ఎట్టి హేతువు లేకుండు ఉద్దేశ్యము నిమిత్తము, అనేకులు వీటికంటే ఇంకా గొప్ప సంగతులను చూచెదరని ఆ దూత నాతో చెప్పెను.

29 ఇది, విశ్వసించువారు రక్షింపబడి, విశ్వసించని వారిపై నీతియుక్తమైన తీర్పు వచ్చు ఉద్దేశ్యము నిమిత్తమైయున్నది; మరియు వారు శిక్షావిధి పొందినప్పటికీ, తమ స్వంత శిక్షావిధిని తమపైతామే తెచ్చుకొందురు.

30 ఇప్పుడు జ్ఞాపకముంచుకొనుడి, నా సహోదరులారా జ్ఞాపకముంచుకొనుడి, నశించు వారందరు తమకుతామే నశించుదురు; దుర్నీతిని జరిగించు వారందరు తమకుతామే జరిగించుదురు; ఏలయనగా, మీరు స్వతంత్రులు; మిమ్ములను మీరు నిర్వహించుకొనుటకు మీరు అనుమతించబడిరి; ఏలయనగా, దేవుడు మీకు జ్ఞానమును ఇచ్చియున్నాడు మరియు ఆయన మిమ్ములను స్వతంత్రులుగా చేసియున్నాడు.

31 మీరు మంచి చెడులను తెలుసుకొనునట్లు ఆయన మీకు ఇచ్చియున్నాడు, మీరు జీవము లేదా మరణమును కోరుకొనునట్లు ఆయన మీకు ఇచ్చియున్నాడు; మీరు మేలు చేసిన యెడల, మేలైన దానికి పునఃస్థాపించబడుదురు లేదా మేలైనది మీకు పునఃస్థాపించబడును; లేదా మీరు కీడు చేసిన యెడల, కీడైనది మీకు పునఃస్థాపించబడును.