లేఖనములు
ఈథర్ 1


ఈథర్‌ గ్రంథము

రాజైన మోషైయ దినములలో లింహై యొక్క జనుల ద్వారా కనుగొనబడిన ఇరువది నాలుగు పలకల నుండి తీయబడిన జెరెడీయుల వృత్తాంతము.

1వ అధ్యాయము

ఈథర్‌ యొక్క రచనలను, మొరోనై సంక్షేపము చేయును—ఈథర్‌ యొక్క వంశావళి ఇవ్వబడెను—బాబెలు గోపురము వద్ద జెరెడీయుల భాష తారుమారు చేయబడలేదు—వారిని ఒక శ్రేష్ఠమైన దేశమునకు నడిపించి, గొప్ప జనముగా చేసెదనని ప్రభువు వాగ్దానము చేయును.

1 ఇప్పుడు మొరోనై అను నేను, ఈ ఉత్తరపు దేశమందు ప్రభువు యొక్క హస్తము చేత నాశనము చేయబడిన ఆ ప్రాచీన నివాసుల యొక్క వృత్తాంతమునిచ్చుట కొనసాగించెదను.

2 ఈథర్‌ గ్రంథమని పిలువబడిన నా వృత్తాంతమును, లింహై యొక్క జనుల చేత కనుగొనబడిన ఆ ఇరువది నాలుగు పలకల నుండి నేను తీసుకొనుచున్నాను.

3 లోకము యొక్క సృష్టిని గూర్చి, ఆదామును గూర్చి, ఆ సమయము నుండి గొప్ప గోపురము వరకు గల వృత్తాంతమును మరియు ఆ సమయము వరకు నరుల సంతానము మధ్య ఏయే సంగతులు సంభవించెనో తెలియజేయు ఈ వృత్తాంతము యొక్క మొదటి భాగమును యూదులు కలిగియుండిరని నేను తలంచుచున్నాను.

4 కావున, ఆదాము యొక్క దినముల నుండి ఆ సమయము వరకు సంభవించిన సంగతులను నేను వ్రాయను; కానీ, అవి పలకలపై ఉండెను; వాటిని కనుగొనువాడు పూర్తి వృత్తాంతమును సంపాదించునట్లు శక్తి కలిగియుండును.

5 అయితే నేను పూర్తి వృత్తాంతమును ఇచ్చుట లేదు, కానీ గోపురము నుండి వారు నాశనము చేయబడు వరకు వృత్తాంతములో కొంతభాగమును ఇచ్చుచున్నాను.

6 మరియు ఈ విధముగా నేను వృత్తాంతమును ఇచ్చుచున్నాను. ఈ వృత్తాంతమును వ్రాసినది ఈథర్‌; అతడు, కోరియాంటర్‌ వంశస్థుడు.

7 కోరియాంటర్‌, మోరొన్‌ యొక్క కుమారుడు.

8 మోరొన్‌, ఈథెమ్ యొక్క కుమారుడు.

9 ఈథెమ్, ఆహా యొక్క కుమారుడు.

10 ఆహా, సేత్‌ యొక్క కుమారుడు.

11 సేత్‌, షిబ్లోన్‌ యొక్క కుమారుడు.

12 షిబ్లోన్‌, కామ్ యొక్క కుమారుడు.

13 కామ్, కోరియాంటమ్ యొక్క కుమారుడు.

14 కోరియాంటమ్, అమ్నిగద్దా యొక్క కుమారుడు.

15 అమ్నిగద్దా, అహరోను యొక్క కుమారుడు.

16 అహరోను, హర్తోమ్ కుమారుడైన హేత్‌ వంశస్థుడు.

17 హర్తోమ్, లిబ్ యొక్క కుమారుడు.

18 లిబ్, కిష్‌ యొక్క కుమారుడు.

19 కిష్‌, కొరొమ్ యొక్క కుమారుడు.

20 కొరొమ్, లేవి యొక్క కుమారుడు.

21 లేవి, కిమ్ యొక్క కుమారుడు.

22 కిమ్, మోరియాంటన్‌ యొక్క కుమారుడు.

23 మోరియాంటన్‌, రిప్లాకిష్‌ వంశస్థుడు.

24 రిప్లాకిష్‌, షెజ్ యొక్క కుమారుడు.

25 షెజ్, హేత్‌ యొక్క కుమారుడు.

26 హేత్‌, కామ్ యొక్క కుమారుడు.

27 కామ్, కోరియాంటమ్ యొక్క కుమారుడు.

28 కోరియాంటమ్, ఈమెర్‌ యొక్క కుమారుడు.

29 ఈమెర్‌, ఓమెర్‌ యొక్క కుమారుడు.

30 ఓమెర్‌, షూలే యొక్క కుమారుడు.

31 షూలే, కిబ్ యొక్క కుమారుడు.

32 కిబ్, జెరెడ్‌ కుమారుడైన ఓరిహా యొక్క కుమారుడు.

33 ప్రభువు జనుల యొక్క భాషను తారుమారు చేసి, వారు భూముఖమంతటిపై చెదరగొట్టబడవలెనని తన ఉగ్రతలో ప్రమాణము చేసిన సమయమున, గొప్ప గోపురము నుండి ఈ జెరెడ్‌, తన సహోదరుడు మరియు వారి కుటుంబములు, ఇతరులు కొంతమంది మరియు వారి కుటుంబములతోపాటు దూరముగా వచ్చెను; మరియు ప్రభువు వాక్కు ప్రకారము జనులు చెదరగొట్టబడిరి.

34 జెరెడ్‌ యొక్క సహోదరుడు భారీకాయుడు, శక్తిమంతుడైయుండి, ప్రభువు చేత మిక్కిలిగా అనుగ్రహింపబడిన వాడైయుండుట వలన అతని సహోదరుడు జెరెడ్‌ అతనితో ఇట్లు చెప్పెను: మనము మన మాటలను గ్రహించకుండా ఆయన మనలను కలవరపెట్టకుండునట్లు ప్రభువుకు మొరపెట్టుము.

35 మరియు జెరెడ్‌ యొక్క సహోదరుడు ప్రభువుకు మొరపెట్టగా, ప్రభువు జెరెడ్‌ మీద కనికరము చూపెను; కావున, ఆయన జెరెడ్‌ యొక్క భాషను తారుమారు చేయలేదు; జెరెడ్‌ మరియు అతని సహోదరుడు కలవరపెట్టబడలేదు.

36 అప్పుడు జెరెడ్‌, అతని సహోదరునితో ఇట్లనెను: మరలా ప్రభువుకు మొరపెట్టుము, బహుశా మన స్నేహితుల భాషను తారుమారు చేయకుండునట్లు, వారి నుండి ఆయన తన కోపమును త్రిప్పుకొనును.

37 మరియు జెరెడ్‌ యొక్క సహోదరుడు ప్రభువుకు మొరపెట్టగా, వారు కలవరపెట్టబడకుండునట్లు ప్రభువు వారి స్నేహితుల మీద, వారి కుటుంబముల మీద కూడా కనికరము చూపెను.

38 మరలా ఇట్లు చెప్పుచూ జెరెడ్‌ తన సహోదరునితో మాట్లాడెను: వెళ్ళుము మరియు ఆయన మనలను దేశము నుండి వెళ్ళగొట్టునేమో ప్రభువు నొద్ద విచారించుము, ఒకవేళ ఆయన మనలను దేశము నుండి వెళ్ళగొట్టినట్లయితే, మనము ఎక్కడికి వెళ్ళవలెనని ఆయనకు మొరపెట్టుము. బహుశా భూమిపైనున్న శ్రేష్ఠమైన దేశములోనికి ప్రభువు మనలను కొనిపోవునేమో ఎవరు ఎరుగుదురు? అటులైన యెడల, మనము దానిని మన స్వాస్థ్యముగా పొందునట్లు ప్రభువుపట్ల నమ్మకముగా ఉండెదము.

39 మరియు జెరెడ్‌ పలికిన దాని ప్రకారము, జెరెడ్‌ యొక్క సహోదరుడు ప్రభువుకు మొరపెట్టెను.

40 ప్రభువు, జెరెడ్‌ యొక్క సహోదరుడిని ఆలకించి అతనిపై కనికరము చూపి, అతనితో ఇట్లు చెప్పెను:

41 వెళ్ళుము, నీ మందలలో ప్రతిదానిలో మగ మరియు ఆడ రెండిటిని, ప్రతిరకమైన విత్తనమును, మీ కుటుంబములను, నీ సహోదరుడైన జెరెడ్‌ మరియు అతని కుటుంబమును, నీ స్నేహితులను, వారి కుటుంబములను, జెరెడ్‌ యొక్క స్నేహితులను, వారి కుటుంబములను కూడా సమకూర్చుము.

42 నీవు దీనిని చేసినప్పుడు, నీవు వారి ముందుండి ఉత్తరము వైపున ఉన్న లోయలోనికి నడిపించుము. అక్కడ నేను నిన్ను కలుసుకొందును మరియు భూమిపైనున్న దేశములన్నింటిలోకెల్లా శ్రేష్ఠమైన దేశములోనికి నేను నిన్ను నడిపించెదను.

43 అక్కడ నిన్ను, నీ సంతానమును నేను ఆశీర్వదించెదను; నీ సంతానము నుండి, నీ సహోదరుని సంతానము నుండి నా కొరకు సంతానమును పుట్టించెదను; మరియు నీతో వెళ్ళువారు ఒక గొప్ప జనమగుదురు. నీ సంతానము నుండి నా కొరకు నేను పుట్టించు జనము కంటే గొప్పదేదియు భూముఖమంతటిపై ఉండదు. సుదీర్ఘకాలము నీవు నాకు మొరపెట్టినందున, నేను నీపట్ల ఆ విధముగా చేసెదను.