“18. యాజకత్వ విధులను మరియు దీవెనలను నిర్వహించడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“18. యాజకత్వ విధులను మరియు దీవెనలను నిర్వహించడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
“18.
యాజకత్వ విధులను మరియు దీవెనలను నిర్వహించడం
18.0
పరిచయం
విధులు మరియు దీవెనలు యాజకత్వ అధికారం చేత మరియు యేసు క్రీస్తు నామంలో నిర్వహించబడే పవిత్ర కార్యాలు. యాజకత్వ విధులు మరియు దీవెనలు దేవుని శక్తికి ప్రవేశం కల్పిస్తాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20 చూడండి).
విధులు మరియు దీవెనలు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తునందు విశ్వాసంతో మరియు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం క్రింద నిర్వహించబడాలి. అవి సరైన ఆమోదంతో (అవసరమైన చోట), అవసరమైన యాజకత్వ అధికారంతో, సరైన విధానంలో మరియు యోగ్యతతో పాల్గొనేవారిచే నిర్వహించబడుతున్నాయని నాయకులు నిర్ధారిస్తారు (18.3 చూడండి).
18.1
రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులు
యాజకత్వము రక్షణ మరియు ఉన్నతస్థితికి అవసరమైన సువార్త విధులను నిర్వహించే అధికారాన్ని కలిగి ఉంటుంది. జనులు ఈ విధులను పొందినప్పుడు దేవునితో పవిత్రమైన నిబంధనలు చేస్తారు. రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులు క్రింద ఇవ్వబడ్డాయి:
-
బాప్తిస్మము
-
నిర్ధారణ మరియు పరిశుద్ధాత్మ వరము
-
మెల్కీసెదెకు యాజకత్వమును అనుగ్రహించడం మరియు ఒక స్థానానికి నియమించడం (పురుషుల కోసం)
-
దేవాలయ వరము
-
దేవాలయ ముద్ర
నిబంధనలో జన్మించిన బిడ్డ 8 సంవత్సరాల వయస్సు కంటే ముందే మరణిస్తే, ఎటువంటి విధులు అవసరం లేదు లేదా నిర్వహించబడవు. ఒక బిడ్డ నిబంధనలో జన్మించకపోతే, అతనికి లేదా ఆమెకు అవసరమైన ఏకైక విధి తల్లిదండ్రులతో ముద్ర వేయబడడమే. రక్షకుని ప్రాయశ్చిత్తం కారణంగా, 8 ఏళ్లలోపు మరణించిన పిల్లలందరూ “పరలోకపు సిలెస్టియల్ రాజ్యములో రక్షింపబడతారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 137:10; మొరోనై 8:8–12 కూడా చూడండి).
18.3
ఒక విధిలో లేదా దీవెనలో పాల్గొనడం
ఒక విధి లేదా దీవెనను నిర్వహించేవారు లేదా అందులో పాల్గొనేవారు తప్పనిసరిగా అవసరమైన యాజకత్వ అధికారాన్ని కలిగి ఉండాలి మరియు యోగ్యులై ఉండాలి. సాధారణంగా, యోగ్యత యొక్క ప్రమాణం ఒక దేవాలయ సిఫారసును కలిగియుండడంతో సంబంధం కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఆత్మ మరియు ఈ అధ్యాయంలోని సూచనల ద్వారా మార్గనిర్దేశం చేయబడినట్లుగా, బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులు అవసరమైన యాజకత్వ స్థానాన్ని కలిగి ఉన్న తండ్రులు మరియు భర్తలను వారు పూర్తిగా దేవాలయానికి యోగ్యులు కాకపోయినా కొన్ని విధులను మరియు దీవెనలను నిర్వహించడానికి లేదా వాటిలో పాల్గొనడానికి అనుమతించవచ్చు. యాజకత్వమును కలిగియున్నవారు పరిష్కరించబడని తీవ్రమైన పాపాలు కలిగియున్నప్పుడు పాల్గొనకూడదు.
కొన్ని విధులను మరియు దీవెనలను నిర్వహించడానికి లేదా పొందడానికి వాటికి అవసరమైన యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్న అధ్యక్షత్వము వహించే నాయకుడి అనుమతి అవసరం (3.4.1 చూడండి). అవసరమైతే, అతను అధికారం ఇచ్చిన సలహాదారుని చేత అనుమతి పొందబడవచ్చు. క్రింది పటములను చూడండి. స్టేకు అధ్యక్షుల కొరకైన సూచనలు మిషను అధ్యక్షులకు కూడా వర్తిస్తాయి. బిషప్పుల కొరకైన సూచనలు శాఖాధ్యక్షులకు కూడా వర్తిస్తాయి.
రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను నిర్వహించడానికి లేదా పొందడానికి అనుమతి ఇవ్వడానికి ఏ నాయకులు తాళపుచెవులను కలిగి ఉన్నారు?
విధి |
తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు |
---|---|
విధి బాప్తిస్మము | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు బిషప్పు (8 ఏళ్ల పిల్లలకు మరియు మేధోపరమైన వైకల్యాల కారణంగా బాప్తిస్మము ఆలస్యమైన 9 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం) మిషను అధ్యక్షుడు (పరివర్తన చెందినవారి కోసం) |
విధి నిర్ధారణ మరియు పరిశుద్ధాత్మ వరము | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు బిషప్పు (8 ఏళ్ల పిల్లలకు మరియు మేధోపరమైన వైకల్యాల కారణంగా బాప్తిస్మము ఆలస్యమైన 9 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం) మిషను అధ్యక్షుడు (పరివర్తన చెందినవారి కోసం) |
విధి మెల్కీసెదెకు యాజకత్వమును అనుగ్రహించడం మరియు ఒక స్థానానికి నియమించడం (పురుషుల కోసం) | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు స్టేకు అధ్యక్షుడు |
విధి దేవాలయ వరము | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు |
విధి దేవాలయ ముద్ర | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు బిషప్పు మరియు స్టేకు అధ్యక్షుడు |
ఇతర విధులను మరియు దీవెనలను నిర్వహించడానికి లేదా పొందడానికి అనుమతి ఇవ్వడానికి ఏ నాయకులు తాళపుచెవులను కలిగి ఉన్నారు?
విధి లేదా దీవెన |
తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు |
---|---|
విధి లేదా దీవెన పిల్లలకు నామకరణం చేయడం మరియు దీవించడం | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు బిషప్పు |
విధి లేదా దీవెన సంస్కారము | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు బిషప్పు |
విధి లేదా దీవెన అహరోను యాజకత్వమును అనుగ్రహించడం మరియు ఒక స్థానానికి నియమించడం (యువకులు మరియు పురుషుల కోసం) | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు బిషప్పు |
విధి లేదా దీవెన పిలుపులలో సేవ చేయడానికి సభ్యులను ప్రత్యేకపరచడం | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు 30.8 చూడండి |
విధి లేదా దీవెన నూనెను ప్రతిష్ఠించుట | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు అనుమతి అవసరం లేదు |
విధి లేదా దీవెన రోగులకు సేవ చేయుట | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు అనుమతి అవసరం లేదు |
విధి లేదా దీవెన తండ్రి దీవెనలతో సహా ఓదార్పు మరియు ఉపదేశ దీవెనలు | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు అనుమతి అవసరం లేదు |
విధి లేదా దీవెన గృహాలను ప్రతిష్ఠించడం | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు అనుమతి అవసరం లేదు |
విధి లేదా దీవెన సమాధులను ప్రతిష్ఠించడం | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు సేవకు అధ్యక్షత్వం వహించే యాజకత్వ నాయకుడు |
విధి లేదా దీవెన గోత్రజనక దీవెనలు | తాళపుచెవులను ఎవరు కలిగియున్నారు బిషప్పు |
18.4
యుక్తవయస్సు రాని పిల్లల కోసం విధులు
(1) నిర్ణయంలో పాల్గొనడానికి చట్టపరమైన హక్కు ఉన్న తల్లిదండ్రులు లేదా (2) చట్టపరమైన సంరక్షకుల సమ్మతితో మాత్రమే యుక్తవయస్సు రాని ఒక బిడ్డ దీవించబడవచ్చు, బాప్తిస్మము తీసుకోవచ్చు, నిర్ధారించబడవచ్చు, యాజకత్వ స్థానానికి నియమించబడవచ్చు లేదా పిలుపులలో సేవ చేయడానికి ప్రత్యేకపరచబడవచ్చు.
18.6
పిల్లలకు నామకరణం చేయడం మరియు దీవించడం
పిల్లలు సాధారణంగా వారి తల్లిదండ్రులు నివసించే వార్డులో ఉపవాసము మరియు సాక్ష్యపు సమావేశంలో పేరు పెట్టబడతారు మరియు దీవించబడతారు.
18.6.1
దీవెన ఎవరు ఇస్తారు
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:70కి అనుగుణంగా మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న వారిచే నామకరణం చేయడం మరియు దీవించడం అనే విధి జరుగుతుంది.
బిడ్డకు పేరు పెట్టాలని మరియు దీవెన కావాలని కోరుకునే వ్యక్తి లేదా కుటుంబం బిషప్పుతో ఆ విధిని సమన్వయం చేస్తారు. వార్డులోని పిల్లలకు పేర్లు పెట్టడానికి మరియు దీవించడానికి అతడు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నాడు.
ఒక బిషప్పు మెల్కీసెదెకు యాజకత్వమును కలిగి ఉన్న తండ్రిని తన బిడ్డకు పేరు పెట్టడానికి మరియు దీవించడానికి అనుమతించవచ్చు, ఆ తండ్రి పూర్తిగా దేవాలయానికి అర్హుడు కానప్పటికీ అనుమతించవచ్చు (18.3 చూడండి). తమ స్వంత పిల్లలను దీవించడానికి తమనుతాము సిద్ధం చేసుకోమని బిషప్పులు తండ్రులను ప్రోత్సహిస్తారు.
18.6.2
సూచనలు
బిషప్రిక్కు ఆధ్వర్యంలో, మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు ఒక బిడ్డకు పేరు పెట్టడానికి మరియు దీవించడానికి వలయాకారంలో సమకూడుతారు. వారు తమ చేతులను శిశువు క్రింద ఉంచుతారు లేదా వారు తమ చేతులను పెద్ద పిల్లల తలపై తేలికగా ఉంచుతారు. అప్పుడు వారిలో ఒకరు మాట్లాడుతూ:
-
ప్రార్థనలో వలె పరలోక తండ్రిని సంబోధిస్తారు.
-
మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారం ద్వారా దీవెన నిర్వహించబడుతోందని పేర్కొంటారు.
-
బిడ్డకు పేరు పెడతారు.
-
బిడ్డను ఉద్దేశించి
-
ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా బిడ్డకు దీవెన ఇస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
Naming and Blessing of Children
18.6.3
Child Record Form and Blessing Certificate [బిడ్డ రికార్డు ఫారం మరియు దీవెన ధృవపత్రం]
పిల్లలు దీవెన పొందే ముందు, Child Record Form [బిడ్డ రికార్డు ఫారం] సిద్ధం చేయడానికి గుమాస్తా Leader and Clerk Resources [నాయకుడు మరియు గుమాస్తా వనరులు] (LCR) ని ఉపయోగిస్తాడు. ఆశీర్వాదం తర్వాత, అతను ఆ వ్యవస్థలో సభ్యత్వ రికార్డును సృష్టించి, Blessing Certificate [దీవెన ధృవపత్రం]ను సిద్ధం చేస్తాడు. ఈ ధృవపత్రం బిషప్పు చేత సంతకం చేయబడి, పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఇవ్వబడుతుంది.
సభ్యత్వ రికార్డు మరియు ధృవపత్రంలోని పేరు జనన ధృవీకరణ పత్రం, పౌర జనన నమోదు పట్టిక లేదా ప్రస్తుత చట్టపరమైన పేరుతో సరిపోలాలి.
18.7
బాప్తిస్మము
ఒక వ్యక్తి సంఘములో సభ్యునిగా మారడానికి మరియు పరిశుద్ధాత్మను పొందడానికి అధికారం ఉన్న వ్యక్తి చేత నీటిలో ముంచబడడం ద్వారా బాప్తిస్మము అవసరం. ఉన్నతస్థితిని కోరుకునే వారందరూ ఈ విధులను పొందడం ద్వారా రక్షకుని మాదిరిని అనుసరించాలి.
18.7.1
బాప్తిస్మము మరియు నిర్ధారణ కొరకు ఒక వ్యక్తికి అనుమతి ఇవ్వడం
18.7.1.1
రికార్డులో సభ్యులుగా ఉన్న పిల్లలు
బిషప్పు ఒక వార్డులో రికార్డులో ఉన్న8 ఏళ్ల సభ్యులకు బాప్తిస్మము ఇవ్వడానికి యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నారు. ఈ పిల్లలు వారి 8వ పుట్టినరోజున లేదా వెంటనే సహేతుకమైనట్లుగా బాప్తిస్మము పొందాలి మరియు నిర్ధారించబడాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:27 చూడండి). వీరు ఇప్పటికే సంఘ సభ్యత్వ రికార్డులలో ఉన్న పిల్లలు (33.6.2 చూడండి). వారికి 8 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, సువార్తను అంగీకరించడానికి మరియు బాప్తిస్మము పొంది, నిర్ధారించబడడానికి వారు ప్రతీ అవకాశాన్ని కలిగియుండేలా బిషప్పు చూసుకుంటారు.
బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు బాప్తిస్మము మరియు నిర్ధారణ కోసం పిల్లలను మౌఖికము చేస్తారు. 31.2.3.1 లో సూచనలు ఉన్నాయి.
బాప్తిస్మము మరియు నిర్ధారణ రికార్డును పూరించడం గురించిన సమాచారం కోసం, 18.8.3 చూడండి.
18.7.1.2
పరివర్తన చెందినవారు
మిషను అధ్యక్షుడు ఒక మిషనులో పరివర్తన చెందినవారికి బాప్తిస్మము ఇవ్వడానికి యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉంటారు. ఈ కారణంగా, పూర్తి-కాల సువార్తికులు పరివర్తన చెందినవారిని బాప్తిస్మము మరియు నిర్ధారణ కోసం మౌఖికము చేస్తారు.
18.7.2
బాప్తిస్మపు సేవలు
బాప్తిస్మపు సేవ సరళంగా, క్లుప్తంగా మరియు ఆధ్యాత్మికంగా ఉద్ధరించేదిగా ఉండాలి. ఇది క్రింది వాటిని కలిగి ఉండవచ్చు:
-
ప్రారంభ సంగీతం
-
సేవను నిర్వహిస్తున్న సోదరుని నుండి క్లుప్త స్వాగతం
-
ప్రారంభ కీర్తన మరియు ప్రార్థన
-
బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మ వరము వంటి సువార్త విషయాలపై ఒకటి లేదా రెండు సంక్షిప్త సందేశాలు
-
ఎంపిక చేసిన పాట
-
బాప్తిస్మము
-
బాప్తిస్మములో పాల్గొన్నవారు పొడి బట్టలు మార్చుకునే సమయంలో గౌరవప్రదమైన సమయం (ఈ సమయంలో కీర్తనలు లేదా ప్రాథమిక పాటలు వినిపించవచ్చు లేదా పాడవచ్చు)
-
రికార్డులో ఉన్న 8 ఏళ్ల సభ్యుల నిర్ధారణ; బిషప్పు నిర్ణయించినట్లయితే పరివర్తన చెందినవారి యొక్క నిర్ధారణ (18.8 చూడండి)
-
కావాలనుకుంటే, క్రొత్తగా పరివర్తన చెందినవారి చేత సాక్ష్యాలు పంచుకోబడడం
-
ముగింపు కీర్తన మరియు ప్రార్థన
-
ముగింపు సంగీతం
రికార్డులో ఉన్న బిడ్డ బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు, బిషప్రిక్కు సభ్యుడొకరు మరియు ప్రాథమిక అధ్యక్షత్వ సభ్యురాలు కుటుంబంతో కలిసి బాప్తిస్మపు సేవను ప్రణాళిక చేసి, షెడ్యూల్ చేస్తారు. బిషప్రిక్కు సభ్యుడొకరు సేవను నిర్వహిస్తారు. ఒకే నెలలో ఒకరి కంటే ఎక్కువమంది పిల్లలు బాప్తిస్మము తీసుకుంటే, వారు బాప్తిస్మపు సేవను పంచుకోవచ్చు.
రికార్డులో ఉన్న అనేకమంది పిల్లలు గల స్టేకులో, అనేక వార్డులకు చెందిన పిల్లలు ఒకే బాప్తిస్మపు సేవను పంచుకోవచ్చు. స్టేకు అధ్యక్షత్వ సభ్యుడు లేదా నియమించబడిన ప్రధాన సలహాదారుడు సేవను నిర్వహిస్తారు.
ఒక తండ్రి యాజకత్వము పొంది, స్వయంగా బాప్తిస్మము ఇచ్చే వరకు కుటుంబ సభ్యుల బాప్తిస్మమును ఆలస్యం చేయకూడదు.
బిషప్రిక్కు మార్గదర్శకత్వంలో, వార్డు మిషను నాయకుడు (ఒకరిని పిలిస్తే) లేదా వార్డులో సువార్త పరిచర్యకు నాయకత్వం వహించే పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు పరివర్తన చెందినవారి కోసం బాప్తిస్మపు సేవలను ప్రణాళిక చేసి, నిర్వహిస్తారు. వారు పూర్తి-కాల సువార్తికులతో సమన్వయం చేసుకుంటారు.
18.7.3
విధిని ఎవరు నిర్వహిస్తారు
బాప్తిస్మము యొక్క విధి ఒక యాజకుడు లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారి ద్వారా నిర్వహించబడుతుంది. బాప్తిస్మము ఇచ్చే వ్యక్తి తప్పనిసరిగా బిషప్పు (లేదా పూర్తి-కాల సువార్తికుడు బాప్తిస్మము ఇస్తున్నట్లయితే మిషను అధ్యక్షుడు) నుండి అనుమతి పొందాలి.
యాజకుడైన లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్న ఒక తండ్రిని తన బిడ్డకు బాప్తిస్మము ఇవ్వడానికి బిషప్పు అనుమతించవచ్చు, ఆ తండ్రి పూర్తిగా దేవాలయ యోగ్యత కలిగియుండనప్పటికీ అనుమతించవచ్చు (18.3 చూడండి). తమ స్వంత పిల్లలకు బాప్తిస్మము ఇవ్వడానికి తమనుతాము సిద్ధం చేసుకోమని బిషప్పులు తండ్రులను ప్రోత్సహిస్తారు.
18.7.4
విధిని ఎక్కడ నిర్వహించాలి
అందుబాటులో ఉంటే బాప్తిస్మపు నీళ్లతొట్టిలో బాప్తిస్మము ఇవ్వాలి. నీళ్లతొట్టి లేకపోతే, సురక్షితమైన నీటి కొలనును ఉపయోగించవచ్చు.
భద్రత దృష్ట్యా, నీళ్లతొట్టిని నింపుతున్నప్పుడు బాధ్యతాయుతమైన పెద్దలు తప్పనిసరిగా ఉండాలి మరియు అది ఖాళీ చేయబడి, శుభ్రం చేయబడి, సురక్షితంగా ఉంచబడే వరకు అక్కడే ఉండాలి. ప్రతీ బాప్తిస్మపు సేవ తర్వాత నీళ్లతొట్టిని వెంటనే ఖాళీచేయాలి. నీళ్లతొట్టి ఉపయోగంలో లేనప్పుడు తలుపులు తాళం వేయబడాలి.
18.7.5
దుస్తులు
బాప్తిస్మము ఇచ్చే వ్యక్తి మరియు బాప్తిస్మము పొందుతున్న వ్యక్తి తడిగా ఉన్నప్పుడు పారదర్శకంగా లేని తెల్లని దుస్తులను ధరించాలి. వరము పొందిన ఒక వ్యక్తి బాప్తిస్మము ఇస్తున్నప్పుడు ఈ దుస్తుల క్రింద దేవాలయ వస్త్రాన్ని ధరిస్తాడు. స్థానిక విభాగములు ఆదాయవ్యయాల అంచనా నిధులతో బాప్తిస్మపు దుస్తులను కొనుగోలు చేస్తాయి మరియు దాని ఉపయోగం కోసం డబ్బులు వసూలు చేయవు.
18.7.6
సాక్షులు
అధ్యక్షత్వం వహించే నాయకునిచే ఆమోదించబడిన ఇద్దరు సాక్షులు, ప్రతీ బాప్తిస్మము సరిగ్గా నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవడానికి గమనిస్తారు. పిల్లలు మరియు యువతతో సహా బాప్తిస్మము పొందిన సంఘ సభ్యులు సాక్షులుగా పని చేయవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 20:73 లో ఇవ్వబడినట్లుగా పదాలు సరిగ్గా పలుకబడనట్లయితే బాప్తిస్మమును పునరావృతం చేయాలి. వ్యక్తి యొక్క శరీరం, వెంట్రుకలు లేదా దుస్తులు పూర్తిగా మునగకపోతే కూడా దానిని పునరావృతం చేయాలి.
18.7.7
సూచనలు
బాప్తిస్మము యొక్క విధిని నిర్వహించడానికి ఒక యాజకుడు లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు:
-
బాప్తిస్మము పొందుతున్న వ్యక్తితోపాటు నీటిలో నిలబడతాడు.
-
వ్యక్తి యొక్క కుడి మణికట్టును అతని ఎడమ చేతితో పట్టుకుంటాడు (సౌలభ్యం మరియు భద్రత కోసం). బాప్తిస్మము పొందుతున్న వ్యక్తి తన ఎడమ చేతితో యాజకత్వమును కలిగియున్న వ్యక్తి యొక్క ఎడమ మణికట్టును పట్టుకుంటాడు.
-
తన కుడి చేతిని లంబకోణాకారంలో పైకెత్తుతాడు.
-
వ్యక్తి యొక్క పూర్తి పేరును పేర్కొంటూ, “యేసు క్రీస్తు చేత నియమించబడియుండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నేను నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆమేన్” (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:73) అంటాడు.
-
వ్యక్తిని తన ముక్కును కుడి చేతితో పట్టుకోమని చెప్తాడు (సౌలభ్యం కోసం); తర్వాత అతని కుడి చేతిని వ్యక్తి వెనుకభాగంలో ఉంచి, దుస్తులతో సహా వ్యక్తిని పూర్తిగా ముంచుతాడు.
-
వ్యక్తి నీటిలో నుండి పైకి రావడానికి సహాయపడతాడు.
Baptism of a New Member
18.8
నిర్ధారణ మరియు పరిశుద్ధాత్మ వరము
ఒక వ్యక్తి బాప్తిస్మము పొందిన తర్వాత, అతను లేదా ఆమె సంఘములో సభ్యునిగా నిర్ధారించబడి, హస్తనిక్షేపణం ద్వారా పరిశుద్ధాత్మను పొందుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:41; అపొస్తలుల కార్యములు 19:1–6 చూడండి). ఈ రెండు విధులు పూర్తి చేయబడి, సరిగ్గా నమోదు చేయబడిన తర్వాత ఆ వ్యక్తి సంఘములో సభ్యుడవుతాడు (యోహాను 3:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 33:11; 3 నీఫై 27:20 చూడండి).
బిషప్పు నిర్ధారణల నిర్వహణను పర్యవేక్షిస్తారు. ఎనిమిదేళ్ల పిల్లలు సాధారణంగా వారు బాప్తిస్మము పొందిన రోజే నిర్ధారించబడతారు. పరివర్తన చెందినవారు సాధారణంగా వారు నివసించే వార్డులో ఏదైనా సంస్కార సమావేశంలో, ముఖ్యంగా వారి బాప్తిస్మము తరువాతి ఆదివారం నాడు నిర్ధారించబడతారు.
క్రొత్త సభ్యులను పరిచయం చేసేటప్పుడు బిషప్రిక్కు సభ్యుడు 29.2.1.1 లోని మార్గదర్శకాలను అనుసరిస్తారు.
18.8.1
విధిని ఎవరు నిర్వహిస్తారు
మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియుండి, దేవాలయ యోగ్యులైన వారు మాత్రమే నిర్ధారణను చేయవచ్చు. ఏదేమైనప్పటికీ, మెల్కీసెదెకు యాజకత్వమును కలిగి ఉన్న తండ్రిని తన బిడ్డ యొక్క నిర్ధారణ కోసం వలయాకారంలో నిలబడడానికి బిషప్పు అనుమతించవచ్చు, ఆ తండ్రి పూర్తిగా దేవాలయ యోగ్యుడు కాకపోయినా అనుమతించవచ్చు (18.3 చూడండి).
కనీసం బిషప్రిక్కులో ఒక సభ్యుడు ఈ విధిలో పాల్గొంటారు. సువార్తికులు పరివర్తన చెందిన వ్యక్తికి బోధించినప్పుడు, బిషప్పు వారిని పాల్గొనమని ఆహ్వానిస్తారు.
18.8.2
సూచనలు
బిషప్రిక్కు ఆధ్వర్యంలో, మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది నిర్ధారణలో పాల్గొనవచ్చు. వారు తమ చేతులను వ్యక్తి తలపై తేలికగా ఉంచుతారు. అప్పుడు వారిలో ఒకరు మాట్లాడుతూ:
-
వ్యక్తిని అతని లేదా ఆమె పూర్తి పేరుతో పిలుస్తారు.
-
మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారం ద్వారా విధి నిర్వహించబడుతోందని పేర్కొంటారు.
-
ఆ వ్యక్తిని యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యునిగా నిర్ధారిస్తారు.
-
“పరిశుద్ధాత్మను స్వీకరించండి” అని పేర్కొంటారు (“పరిశుద్ధాత్మ వరమును స్వీకరించండి” అని కాదు).
-
ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా దీవెన ఇస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
Confirming a Recently Baptized Member
18.8.3
బాప్తిస్మము మరియు నిర్ధారణ రికార్డు మరియు ధృవపత్రము
రికార్డులో సభ్యుడైన బిడ్డను బాప్తిస్మము కోసం మౌఖికము చేయడానికి ముందు, ఒక గుమాస్తా Baptism and Confirmation Form [బాప్తిస్మము మరియు నిర్ధారణ ఫారంను] సిద్ధం చేయడానికి LCRని ఉపయోగిస్తాడు. బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు మౌఖికమును నిర్వహిస్తారు మరియు ఫారంపై సంతకం చేస్తారు. బాప్తిస్మము మరియు నిర్ధారణ తర్వాత, LCRలో పిల్లల సభ్యత్వ రికార్డును నవీకరించడానికి గుమాస్తా ఈ ఫారంను ఉపయోగిస్తాడు.
పరివర్తన చెందిన ఒకరిని బాప్తిస్మము కోసం ఒక పూర్తి-కాల సువార్తికుడు మౌఖికము చేసినప్పుడు, అతను ఏరియా బుక్ ప్లానర్ (ABP) యాప్‌ని ఉపయోగించి బాప్తిస్మము మరియు నిర్ధారణ రికార్డును పూరిస్తాడు. బాప్తిస్మము మరియు నిర్ధారణ తర్వాత, సువార్తికులు ఆ సమాచారాన్ని ABP లో నమోదుచేసి, కంప్యూటర్ ద్వారా దానిని వార్డు గుమాస్తాకు అప్పగిస్తారు. వార్డు గుమాస్తా LCRలోని సమాచారాన్ని సమీక్షించి, సభ్యత్వ రికార్డును సృష్టిస్తాడు.
సభ్యత్వ రికార్డును సృష్టించిన తర్వాత, ఒక గుమాస్తా బాప్తిస్మము మరియు నిర్ధారణ ధృవపత్రమును సిద్ధం చేస్తాడు. ఈ ధృవపత్రము బిషప్పు చేత సంతకం చేయబడి వ్యక్తికి ఇవ్వబడుతుంది.
సభ్యత్వ రికార్డు మరియు ధృవపత్రంలోని పేరు జనన ధృవీకరణ పత్రం, పౌర జనన నమోదు పట్టిక లేదా ప్రస్తుత చట్టపరమైన పేరుతో సరిపోలాలి.
18.9
సంస్కారము
సంఘ సభ్యులు విశ్రాంతిదినమున దేవుడిని ఆరాధించడానికి మరియు సంస్కారములో పాలుపంచుకోవడానికి సమావేశమవుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:75; 59:9; మొరోనై 6:5–6 చూడండి). ఈ విధి సమయంలో, రక్షకుడు తన శరీరమును మరియు రక్తాన్ని త్యాగం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవడానికి మరియు వారి పవిత్రమైన నిబంధనలను నూతనపరచుకోవడానికి వారు రొట్టె మరియు నీటిని తీసుకుంటారు (మత్తయి 26:26–28; జోసెఫ్ స్మిత్ అనువాదం, మార్కు 14:20–25; లూకా 22:15–20; 3 నీఫై 18; మొరోనై 6:6 చూడండి).
18.9.1
సంస్కారమును నిర్వహించడానికి అనుమతి
వార్డులో సంస్కారమును నిర్వహించడానికి యాజకత్వ తాళపుచెవులను బిషప్పు కలిగి ఉన్నారు. సంస్కారమును సిద్ధం చేయడం, దీవించడం మరియు అందించడంలో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా అతని నుండి లేదా అతని మార్గదర్శకత్వంలో ఎవరినుండైనా అనుమతి పొందాలి.
18.9.2
విధిని ఎవరు నిర్వహిస్తారు
-
బోధకులు, యాజకులు మరియు మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు సంస్కారమును సిద్ధం చేయవచ్చు.
-
యాజకులు మరియు మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు సంస్కారమును దీవించవచ్చు.
-
పరిచారకులు, బోధకులు, యాజకులు మరియు మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు సంస్కారమును అందించవచ్చు.
18.9.3
సంస్కారము కోసం మార్గదర్శకాలు
సంస్కారము యొక్క పవిత్ర స్వభావం కారణంగా, అది క్రమబద్ధంగా మరియు గౌరవప్రదంగా ఉండేలా యాజకత్వ నాయకులు జాగ్రత్తగా సిద్ధం చేయాలి.
సంస్కారాన్ని నిర్వహించే వారు తాము ప్రభువుకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని గ్రహించి, గౌరవప్రదంగా చేయాలి.
సంస్కారము అందించు విధానము సహజంగా ఉండాలి మరియు మితిమీరిన అధికారికంగా ఉండకూడదు.
సంస్కారము అనేది సంఘ సభ్యుల కోసం అయినప్పటికీ, ఇతరులు దానిలో పాలుపంచుకోకుండా నిరోధించడానికి ఏమీ చేయకూడదు.
18.9.4
సూచనలు
-
సంస్కారాన్ని సిద్ధం చేసేవారు, దీవించేవారు లేదా అందించేవారు ముందుగా తమ చేతులను సబ్బుతో లేదా ఏదైనా ద్రవంతో కడుక్కోవాలి.
-
బోధకులు, యాజకులు లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్నవారు సమావేశానికి ముందు ముక్కలుగా చేయని రొట్టెలు కలిగివున్న రొట్టెల పళ్ళెములు, శుభ్రమైన నీటితో ఉన్న కప్పులు కలిగివున్న నీటి పళ్ళెములు మరియు బల్లపై కప్పే శుభ్రమైన బట్టలు అక్కడ ఉండేలా చూసుకుంటారు.
-
వార్డు సభ్యులు సంస్కార కీర్తన పాడుతున్నప్పుడు, సంస్కారమును దీవించే వారు భక్తితో నిలబడి, రొట్టె పళ్ళెములను కప్పి ఉంచిన బట్టను తీసివేసి, రొట్టెలను చిన్న చిన్న ముక్కలు చేస్తారు.
-
కీర్తన తర్వాత, రొట్టెని దీవించే వ్యక్తి మోకాళ్లపై నిలబడి రొట్టె కోసం సంస్కార ప్రార్థనను చదువుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:77 చూడండి).
-
సంస్కార ప్రార్థనలు స్పష్టంగా, ఖచ్ఛితంగా మరియు గౌరవప్రదంగా పలుకబడేలా బిషప్పు చూసుకుంటారు. ఎవరైనా పదజాలంలో తప్పు చేసి తనను తాను సరిదిద్దుకుంటే, తదుపరి దిద్దుబాటు అవసరం లేదు. వ్యక్తి తన తప్పును సరిదిద్దుకోకపోతే, బిషప్పు దయతో ప్రార్థనను పునరావృతం చేయమని కోరతారు.
-
ప్రార్థన తర్వాత, యాజకత్వమును కలిగియున్నవారు గౌరవప్రదంగా రొట్టెను సభ్యులకు అందిస్తారు. అధ్యక్షత్వం వహించే నాయకుడు మొదట దాన్ని స్వీకరిస్తాడు, దాని తర్వాత క్రమము అవసరం లేదు. ఒకసారి ఒక పళ్లెమును సభ్యులకు అందజేస్తే, వారు దానిని ఒకరికొకరు అందించుకోవచ్చు.
-
వీలైనప్పుడు సభ్యులు తమ కుడి చేతితో తీసుకొంటారు.
-
రొట్టె సభ్యులందరికీ పంపబడినప్పుడు, సంస్కారమును అందించే వారు పళ్లెములను తిరిగి సంస్కార బల్ల వద్ద ఇస్తారు. సంస్కారమును దీవించేవారు రొట్టె పళ్లెములపై బట్టను కప్పుతారు మరియు నీటి పళ్లెములపై బట్టను తొలగిస్తారు.
-
నీటిని ఆశీర్వదించే వ్యక్తి మోకాళ్లపై నిలబడి నీటి కోసం సంస్కార ప్రార్థనను చదువుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:79 చూడండి). అతను ద్రాక్షారసము బదులుగా నీరు అనే పదాన్ని భర్తీ చేస్తాడు.
-
ప్రార్థన తర్వాత, యాజకత్వమును కలిగియున్నవారు భక్తితో సభ్యులకు నీటిని అందిస్తారు. అధ్యక్షత్వం వహించే నాయకుడు మొదట దాన్ని స్వీకరిస్తాడు, దాని తర్వాత క్రమము అవసరం లేదు.
-
నీటిని సభ్యులందరికీ పంపినప్పుడు, సంస్కారమును అందించే వారు పళ్లెములను తిరిగి సంస్కార బల్ల వద్ద ఇస్తారు. సంస్కారమును దీవించిన వారు పళ్లెములపై బట్టను కప్పుతారు మరియు సంస్కారమును దీవించినవారు, అందించిన వారు భక్తితో తమ స్థానాలకు తిరిగివెళ్తారు.
-
సమావేశం తరువాత, సంస్కారమును సిద్ధం చేసిన వారు శుభ్రం చేస్తారు, బట్టలను మడిచిపెడతారు మరియు ఉపయోగించని రొట్టెలను తీసివేస్తారు.
Blessing the Sacrament
18.10
యాజకత్వాన్ని అనుగ్రహించుట మరియు ఒక స్థానానికి నియమించుట
యాజకత్వంలో రెండు విభాగాలు ఉన్నాయి: అహరోను మరియు మెల్కీసెదెకు (3.3; సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1, 6 చూడండి). ఒక వ్యక్తికి యాజకత్వం ఇవ్వబడినప్పుడు, అతను ఆ యాజకత్వంలో ఒక స్థానానికి కూడా నియమించబడతాడు. ఈ యాజకత్వాలలో దేనినైనా అనుగ్రహించిన తర్వాత, ఒక వ్యక్తి ఆ యాజకత్వంలోని ఇతర స్థానాలకు మాత్రమే నియమించబడాలి.
18.10.1
మెల్కీసెదెకు యాజకత్వము
మెల్కీసెదెకు యాజకత్వాన్ని అనుగ్రహించడానికి, ఎల్డర్ మరియు ప్రధాన యాజకుని స్థానాలకు నియమించడానికి స్టేకు అధ్యక్షుడు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉంటారు. అయితే, సాధారణంగా ఈ నియామకముల కోసం బిషప్పు సిఫార్సులను చేస్తారు.
18.10.1.1
ఎల్డర్‌లు
యోగ్యమైన సహోదరులు మెల్కీసెదెకు యాజకత్వాన్ని పొందవచ్చు మరియు వారు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో ఉన్నప్పుడు ఎల్డర్‌గా నియమించబడవచ్చు. వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా, ఒక యువకుడు అతని 18వ పుట్టినరోజు తర్వాత వెంటనే ఎల్డర్‌గా నియమించబడాలని సిఫార్సు చేయబడాలా లేదా యాజకుల సమూహములో ఎక్కువ కాలం ఉండాలా అని బిషప్పు నిర్ణయిస్తారు.
ఈ నిర్ణయం తీసుకోవడంలో, బిషప్పు యువకుడు మరియు అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో మొదట సంప్రదింపులు జరుపుతారు. యోగ్యమైన పురుషులు 19 ఏళ్లలోపు లేదా కళాశాలకు వెళ్లడానికి, పూర్తి-కాల సువార్త సేవ చేయడానికి, సైన్యంలో సేవ చేయడానికి లేదా పూర్తి-కాల ఉద్యోగాన్ని అంగీకరించడానికి ఇంటి నుండి దూరంగా వెళ్ళే ముందు ఎల్డర్లుగా నియమించబడాలి.
ఇటీవల బాప్తిస్మము పొందిన పురుషులు 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఈ క్రింది వాటిని కలిగియున్న తర్వాత ఎల్డర్లుగా నియమించబడతారు:
-
అహరోను యాజకత్వమును పొంది, యాజకులుగా సేవ చేసినవారు.
-
సువార్త గురించి తగినంత అవగాహనను పెంపొందించుకున్నవారు.
-
తమ యోగ్యతను నిరూపించుకున్నవారు.
సంఘ సభ్యునిగా నిర్దిష్ట సమయం అవసరం లేదు.
18.10.1.2
ప్రధాన యాజకులు
పురుషులు స్టేకు అధ్యక్షత్వము, ఉన్నత సలహామండలి లేదా బిషప్రిక్కుకు పిలువబడినప్పుడు ప్రధాన యాజకులుగా నియమించబడతారు.
18.10.1.3
మౌఖికము చేయుట మరియు ఆమోదించుట
స్టేకు అధ్యక్షత్వము యొక్క అనుమతితో, మెల్కీసెదెకు యాజకత్వ నియామకముల రికార్డులో సూచించిన విధంగా బిషప్పు సహోదరుడిని మౌఖికము చేస్తారు. తర్వాత స్టేకు అధ్యక్షత్వ సభ్యుడు కూడా అతనిని మౌఖికము చేస్తారు. మిషను అధ్యక్షుడి అనుమతితో, జిల్లా అధ్యక్షుడు ఒక సహోదరుడిని ఎల్డర్‌గా నియమించడానికి మౌఖికము చేయవచ్చు (6.3 చూడండి).
18.10.2
అహరోను యాజకత్వము
అహరోను యాజకత్వమును అనుగ్రహించడానికి, పరిచారకుడు, బోధకుడు మరియు యాజకుడు స్థానాలకు నియమించడానికి బిషప్పు యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్నారు. యోగ్యమైన సహోదరులు సాధారణంగా క్రింది వయస్సులో ఈ స్థానాలకు నియమింపబడతారు, కానీ అంతకు ముందు కాదు:
-
వారికి 12 సంవత్సరాలు నిండే సంవత్సరం ప్రారంభంలో పరిచారకునిగా
-
వారికి 14 సంవత్సరాలు నిండే సంవత్సరం ప్రారంభంలో బోధకునిగా
-
వారికి 16 సంవత్సరాలు నిండే సంవత్సరం ప్రారంభంలో యాజకునిగా
బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు పరిచారకులుగా లేదా బోధకులుగా నియమించబడే వారిని మౌఖికము చేసి వారు ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకుంటారు. యాజకులుగా నియమించబడే సహోదరులను బిషప్పు మౌఖికము చేస్తారు.
యాజకత్వ నియామకము కోసం ఒక యువకుడిని మౌఖికము చేయడానికి ముందు, బిషప్రిక్కు సభ్యుడు యువకుడి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి అనుమతి పొందుతాడు. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నట్లయితే, అతను చట్టపరమైన సంరక్షకులైన తల్లి లేదా తండ్రి నుండి అనుమతి పొందుతాడు.
18.10.3
నియమింపబడకముందే ఆమోదానికి వ్యక్తిని సమర్పించడం
ఒక సహోదరుడు మౌఖికము చేయబడి, యాజకత్వ స్థానానికి నియమించబడడానికి యోగ్యుడిగా గుర్తించబడిన తర్వాత, అతను ఆమోదము కొరకు సమర్పించబడతాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 20:65, 67 చూడండి). ఎల్డర్లుగా లేదా ప్రధాన యాజకులుగా నియమించబడే సహోదరులు స్టేకు సమావేశ సర్వసభ్య సభలో స్టేకు అధ్యక్షత్వ సభ్యుని చేత సమర్పించబడతారు (జిల్లా అధ్యక్షుల కొరకు సూచనల కోసం 6.3 చూడండి). పరిచారకులు, బోధకులు లేదా యాజకులుగా నియమించబడే సహోదరులు సంస్కార సమావేశములో బిషప్రిక్కు సభ్యునిచే సమర్పించబడతారు.
ఆమోదమును నిర్వహించే వ్యక్తి సహోదరుడిని నిలబడమని అడుగుతాడు. అతను అహరోను లేదా మెల్కీసెదెకు యాజకత్వం (అవసరమైతే) అనుగ్రహించే మరియు సహోదరుడిని యాజకత్వ స్థానానికి నియమించే ప్రతిపాదనను ప్రకటిస్తాడు. తర్వాత అతను ప్రతిపాదనను ఆమోదించడానికి సభ్యులను ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు, ఒక సహోదరుడిని ఎల్డర్‌గా నియమించడానికి సమర్పించేందుకు, అతను ఈ క్రింది పదాలను ఉపయోగించవచ్చు:
“[పేరు] మెల్కీసెదెకు యాజకత్వాన్ని స్వీకరించి, ఎల్డర్‌గా నియమించబడాలని మేము ప్రతిపాదిస్తున్నాము. అనుకూలంగా ఉన్నవారు చేయి పైకెత్తి దానిని చూపవచ్చు. [క్లుప్తంగా విరామం ఇవ్వండి.] వ్యతిరేకించేవారు, ఏవరైనా ఉంటే, అదే విధంగా చూపించవచ్చు. [క్లుప్తంగా విరామం ఇవ్వండి.]”
మంచి స్థితిలో ఉన్న సభ్యుడు నియామకమును వ్యతిరేకిస్తే, అధ్యక్షత్వం వహించే నాయకుడు లేదా నియమించబడిన మరొక యాజకత్వ నాయకుడు సమావేశం తర్వాత అతనితో లేదా ఆమెతో ఏకాంతంగా సమావేశమవుతారు. సభ్యుడిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవడానికి నాయకుడు ప్రయత్నిస్తాడు. యాజకత్వ స్థానానికి నియమించబడకుండా ఆ వ్యక్తిని అనర్హునిగా చేసే ప్రవర్తన గురించి సభ్యునికి తెలుసేమో అతను తెలుసుకుంటాడు.
కొన్ని సందర్భాల్లో, ఒక సహోదరుడిని స్టేకు సమావేశములో సమర్పించే ముందు ఎల్డర్‌గా లేదా ప్రధాన యాజకునిగా నియమించాల్సి ఉంటుంది. ఇది జరిగినప్పుడు, అతను తన వార్డు సంస్కార సమావేశంలో ఆమోదం కోసం సమర్పించబడతాడు. అతను తదుపరి స్టేకు సమావేశములో నియామకమును ఆమోదించడానికి సమర్పించబడతాడు (పైన వివరించినట్లుగా ఆమోదం కోసం ప్రక్రియను స్వీకరించడం).
18.10.4
విధిని ఎవరు నిర్వహిస్తారు
స్టేకు అధ్యక్షుడు లేదా అతని ఆధ్వర్యంలో మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న ఒకరు ఒక వ్యక్తిని ఎల్డర్ స్థానానికి నియమించవచ్చు. మిషను అధ్యక్షుని అనుమతితో, జిల్లా అధ్యక్షుడు లేదా అతని ఆధ్వర్యంలో ఎవరైనా నియామకమును నిర్వహించవచ్చు (6.3 చూడండి). మెల్కీసెదెకు యాజకత్వము ఉన్నవారు మాత్రమే వలయాకారంలో నిలబడవచ్చు.
స్టేకు అధ్యక్షుడు లేదా అతని ఆధ్వర్యంలోని ప్రధాన యాజకుడు ఒక వ్యక్తిని ప్రధాన యాజకునిగా నియమించవచ్చు. ప్రధాన యాజకులు మాత్రమే వలయాకారంలో నిలబడవచ్చు.
మెల్కీసెదెకు యాజకత్వ స్థానానికి ఒక వ్యక్తిని నియమించిన వ్యక్తి దేవాలయానికి యోగ్యుడిగా ఉండాలి. స్టేకు అధ్యక్షుడు లేదా అతను నియమించిన ఎవరైనా తప్పనిసరిగా హాజరు కావాలి.
ఒక యాజకుడు లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్న ఒకరు ఒక సహోదరుడిని పరిచారకుడు, బోధకుడు లేదా యాజకుని స్థానానికి నియమించవచ్చు. అతను బిషప్పు ద్వారా అధికారం పొందియుండాలి. బిషప్పు లేదా అతను నియమించిన ఎవరైనా తప్పనిసరిగా హాజరు కావాలి.
అహరోను యాజకత్వ నియామకములో పాల్గొనడానికి, ఒక వ్యక్తి తప్పనిసరిగా యాజకుడైయుండాలి లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగి ఉండాలి.
యాజకుడైయున్న లేదా మెల్కీసెదెకు యాజకత్వమును కలిగియున్న ఒక తండ్రి తన కుమారుడిని పరిచారకుడు, బోధకుడు లేదా యాజకుడి స్థానానికి నియమించడానికి బిషప్పు అనుమతించవచ్చు, తండ్రి పూర్తిగా దేవాలయానికి యోగ్యుడు కాకపోయినా సరే (18.3 చూడండి). తండ్రులు తమ స్వంత కుమారులను నియమించేందుకు తమనుతాము సిద్ధం చేసుకోవాలని బిషప్పులు ప్రోత్సహిస్తారు.
18.10.5
సూచనలు
యాజకత్వమును అనుగ్రహించడానికి మరియు ఒక వ్యక్తిని యాజకత్వ స్థానానికి నియమించడానికి, ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది యాజకత్వ అధికారము కలిగియున్న వారు తమ చేతులను ఆ వ్యక్తి తలపై తేలికగా ఉంచుతారు. అప్పుడు వారిలో ఒకరు మాట్లాడుతూ:
-
వ్యక్తిని అతని పూర్తి పేరుతో పిలుస్తారు.
-
విధిని (అహరోను లేదా మెల్కీసెదెకు యాజకత్వము) నిర్వహించడానికి అతను వ్యక్తిగతంగా కలిగి ఉన్న అధికారాన్ని పేర్కొంటారు.
-
అహరోను లేదా మెల్కీసెదెకు యాజకత్వమును అనుగ్రహిస్తారు, అప్పటికే అనుగ్రహించకపోతే.
-
వ్యక్తిని అహరోను లేదా మెల్కీసెదెకు యాజకత్వములోని స్థానానికి నియమిస్తారు మరియు ఆ స్థానం యొక్క హక్కులు, శక్తులు మరియు అధికారాన్ని అందజేస్తారు.
-
ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా దీవెన ఇస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
ఒక వ్యక్తికి సముచితమైన యాజకత్వము అప్పటికే అనుగ్రహించబడిన తర్వాత, ఆ వ్యక్తిని యాజకత్వ స్థానానికి నియమించడానికి, నియామకమును నిర్వహించే వ్యక్తి 3వ దశను వదిలివేస్తారు.
Ordination to the Priesthood
18.10.6
నియామక రికార్డు మరియు ధృవపత్రము
అహరోను యాజకత్వములోని స్థానానికి నియమించబడడానికి ఒక సహోదరుడు మౌఖికము చేయబడే ముందు, ఒక గుమస్తా Aaronic Priesthood Ordination Record [అహరోను యాజకత్వ నియామక రికార్డును] సిద్ధం చేయడానికి LCRని ఉపయోగిస్తాడు. బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు మౌఖికమును నిర్వహిస్తారు మరియు అన్ని యోగ్యతా షరతులు నెరవేరినట్లయితే ఫారంపై సంతకం చేస్తారు.
నియామకము తర్వాత, బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు ఫారంను పూర్తి చేసి ఒక గుమస్తాకు ఇస్తారు. అతను LCRలో నియామకమును నమోదు చేస్తాడు మరియు నియామక ధృవపత్రమును సిద్ధం చేస్తాడు.
వ్యక్తి యొక్క ప్రస్తుత చట్టపరమైన పేరు నియామక రికార్డులో మరియు ధృవపత్రములో ఉపయోగించబడాలి.
18.11
పిలుపులలో సేవ చేయడానికి సభ్యులను ప్రత్యేకపరచడం
చాలామట్టుకు సంఘ స్థానాలకు పిలువబడిన మరియు ఆమోదించబడిన సభ్యులు ఆ స్థానంలో పనిచేయడానికి ప్రత్యేకపరచబడాలి (యోహాను 15:16; సిద్ధాంతము మరియు నిబంధనలు 42:11 చూడండి; ఈ చేతిపుస్తకములో 3.4.3.1 కూడా చూడండి). ప్రత్యేకపరిచే సమయంలో, వ్యక్తికి (1) పిలుపులో చర్య తీసుకునే అధికారం మరియు (2) ఆత్మ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన దీవెన ఇవ్వబడతాయి.
స్టేకు అధ్యక్షులు, బిషప్పులు మరియు సమూహ అధ్యక్షులు ప్రత్యేకపరచబడినప్పుడు అధ్యక్షత్వ తాళపుచెవులను అందుకుంటారు (3.4.1.1 చూడండి). అయితే, అధ్యక్షత్వములలో సలహాదారులతో సహా ఇతర పిలుపులలో సేవ చేయడానికి సభ్యులను ప్రత్యేకపరిచేటప్పుడు తాళపుచెవులు అనే పదం ఉపయోగించకూడదు.
18.11.1
ప్రత్యేకపరచడాన్ని ఎవరు నిర్వహిస్తారు
మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న వారి చేత ప్రత్యేకపరచడం నిర్వహించబడుతుంది. అతను తగిన యాజకత్వ తాళపుచెవులను కలిగి ఉన్న నాయకుడి నుండి అనుమతి పొందాలి. ప్రత్యేకపరచడాన్ని నిర్వహించడానికి అధికారం ఉన్నవారు 30.8 లో సూచించబడ్డారు. ఒక వ్యక్తి ప్రధాన యాజకునిగా ఉండవలసిన స్థానానికి నియమించబడినప్పుడు ఒక ఎల్డర్ స్వరముగా వ్యవహరించకూడదు లేదా వలయాకారంలో నిలబడకూడదు.
అధ్యక్షత్వం వహించే నాయకుడి ఆధ్వర్యంలో, మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది ప్రత్యేకపరచడంలో పాల్గొనవచ్చు. అధ్యక్షులు వారి సలహాదారుల ముందు ప్రత్యేకపరచబడతారు.
అధ్యక్షత వహించే నాయకుడు మెల్కీసెదెకు యాజకత్వాన్ని కలిగి ఉన్న భర్త లేదా తండ్రిని, అతడు పూర్తిగా దేవాలయానికి అర్హుడు కానప్పటికీ అతని భార్య లేదా పిల్లలు ప్రత్యేకపరచబడినప్పుడు వలయాకారంలో నిలబడడానికి అనుమతించవచ్చు (18.3 చూడండి).
18.11.2
సూచనలు
మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది తమ చేతులను వ్యక్తి తలపై తేలికగా ఉంచుతారు. అప్పుడు వారిలో ఒకరు మాట్లాడుతూ:
-
వ్యక్తిని అతని లేదా ఆమె పూర్తి పేరుతో పిలుస్తారు.
-
అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.
-
స్టేకు, వార్డు, సమూహము లేదా తరగతిలో పిలుపుకు వ్యక్తిని ప్రత్యేకపరుస్తారు.
-
వాటిని పొందవలసియుంటే వ్యక్తికి తాళపుచెవులను అనుగ్రహిస్తారు.
-
ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా దీవెన ఇస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
18.12
నూనెను ప్రతిష్ఠించుట
ఆలివ్ నూనెను రోగులకు లేదా బాధలో ఉన్నవారికి అభిషేకం చేయడానికి ఉపయోగించే ముందు మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్నవారు దానిని ప్రతిష్ఠించాలి (యాకోబు 5:14 చూడండి). ఇతర నూనెలను ఉపయోగించరాదు.
సభ్యులు ప్రతిష్ఠించబడిన నూనెను త్రాగకూడదు లేదా శరీరంలోని ప్రభావిత భాగాలపై పూయకూడదు.
18.12.1
విధిని ఎవరు నిర్వహిస్తారు
మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది నూనెను ప్రతిష్ఠించవచ్చు. వారు యాజకత్వ నాయకుడి నుండి అనుమతి పొందవలసిన అవసరం లేదు.
18.12.2
సూచనలు
మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న వారు నూనెను ప్రతిష్ఠించడానికి:
-
ఆలివ్ నూనె కలిగియున్న పాత్రను తెరిచి పట్టుకుంటారు.
-
ప్రార్థనలో వలె పరలోక తండ్రిని సంబోధిస్తారు.
-
అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.
-
నూనెను ప్రతిష్ఠిస్తారు (పాత్రను కాదు) మరియు రోగులను, బాధలో ఉన్న వారిని అభిషేకించడానికి, దీవించడానికి దానిని ప్రత్యేకపరుస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
Consecrating Oil
18.13
రోగులకు సేవ చేయుట
“హస్తనిక్షేపణం ద్వారా” రోగులకు సేవ చేయడం రెండు భాగాలను కలిగి ఉంటుంది: నూనెతో అభిషేకం చేయడం మరియు దీవెనతో అభిషేకానికి ముద్ర వేయడం. ప్రతిష్ఠించిన నూనె అందుబాటులో లేకుంటే, అభిషేకం లేకుండా మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారం ద్వారా దీవెన ఇవ్వబడుతుంది.
18.13.1
దీవెన ఎవరు ఇస్తారు
యోగ్యమైన మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్నవారు మాత్రమే రోగులకు లేదా బాధలో ఉన్నవారికి సేవ చేయగలరు. వారు యాజకత్వ నాయకుడి నుండి అనుమతి పొందవలసిన అవసరం లేదు. వీలైతే, మెల్కీసెదెకు యాజకత్వము కలిగి ఉన్న తండ్రి తన కుటుంబంలోని అనారోగ్య సభ్యులకు సేవ చేస్తాడు.
సాధారణంగా, మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది రోగులకు సేవ చేస్తారు. అయితే, ఒకరు అభిషేకం మరియు ముద్రణ రెండింటినీ చేయవచ్చు.
18.13.2
సూచనలు
మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరు నూనెతో అభిషేకం చేస్తారు. అతను:
-
వ్యక్తి తలపై ప్రతిష్ఠించిన నూనె చుక్క వేస్తారు.
-
వ్యక్తి తలపై తన చేతులను తేలికగా ఉంచి, వ్యక్తిని అతని లేదా ఆమె పూర్తి పేరుతో పిలుస్తారు.
-
అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.
-
రోగులను, బాధలో ఉన్నవారిని అభిషేకించడానికి మరియు దీవించడానికి ప్రతిష్ఠించబడిన నూనెతో అతడు అభిషేకం చేస్తున్నాడని పేర్కొంటారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
అభిషేకానికి ముద్ర వేయడానికి, మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది తమ చేతులను ఆ వ్యక్తి తలపై తేలికగా ఉంచుతారు. తర్వాత అభిషేకమును ముద్రవేసేవారు:
-
వ్యక్తిని అతని లేదా ఆమె పూర్తి పేరుతో పిలుస్తారు.
-
అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో అభిషేకానికి ముద్ర వేస్తున్నట్లు పేర్కొంటారు.
-
ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా దీవెన ఇస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
Administering to the Sick
18.14
తండ్రి దీవెనలతో సహా ఓదార్పు మరియు ఉపదేశ దీవెనలు
18.14.1
దీవెన ఎవరు ఇస్తారు
మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్నవారు కుటుంబ సభ్యులకు మరియు వారిని అభ్యర్థించే ఇతరులకు ఓదార్పు మరియు ఉపదేశ దీవెనలు ఇవ్వవచ్చు.
మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న తండ్రి తన పిల్లలకు తండ్రి దీవెనలను ఇవ్వవచ్చు. తల్లిదండ్రులు అవసరమైన సమయాల్లో తమ పిల్లలను తండ్రి దీవెనలు పొందమని ప్రోత్సహిస్తారు. వ్యక్తిగత ఉపయోగం కోసం తండ్రి దీవెనలు నమోదు చేయబడవచ్చు.
మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్నవారు ఓదార్పు మరియు ఉపదేశ దీవెన లేదా తండ్రి దీవెన ఇవ్వడానికి యాజకత్వ నాయకుడి నుండి అనుమతి పొందవలసిన అవసరం లేదు.
18.14.2
సూచనలు
ఓదార్పు మరియు ఉపదేశ దీవెన లేదా తండ్రి దీవెన ఇవ్వడానికి, మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది తమ చేతులను ఆ వ్యక్తి తలపై తేలికగా ఉంచుతారు. అప్పుడు వారిలో ఒకరు మాట్లాడుతూ:
-
వ్యక్తిని అతని లేదా ఆమె పూర్తి పేరుతో పిలుస్తారు.
-
మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారం ద్వారా దీవెన నిర్వహించబడుతోందని పేర్కొంటారు.
-
ఆత్మ మార్గనిర్దేశం చేసినట్లుగా దీవెన, ఓదార్పు మరియు ఉపదేశాలను ఇస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
18.15
గృహాలను ప్రతిష్ఠించడం
సంఘ సభ్యులు తమ ఇళ్లను మెల్కీసెదెకు యాజకత్వం యొక్క అధికారం ద్వారా ప్రతిష్ఠించవచ్చు.
18.15.2
సూచనలు
గృహమును ప్రతిష్ఠించడానికి మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న వారు:
-
ప్రార్థనలో వలె పరలోక తండ్రిని సంబోధిస్తారు.
-
అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.
-
పరిశుద్ధాత్మ నివసించగలిగే పవిత్ర స్థలంగా గృహమును ప్రతిష్ఠిచేస్తారు మరియు ఆత్మచేత మార్గనిర్దేశం చేయబడినట్లుగా ఇతర పదాలను పేర్కొంటారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
18.16
సమాధులను ప్రతిష్ఠించడం
18.16.1
సమాధిని ఎవరు ప్రతిష్ఠిస్తారు
సమాధిని ప్రతిష్ఠించే వ్యక్తి మెల్కీసెదెకు యాజకత్వాన్ని కలిగి ఉండాలి మరియు సేవను నిర్వహించే యాజకత్వ నాయకునిచే అధికారం పొందాలి.
18.16.2
సూచనలు
సమాధిని ప్రతిష్ఠించడానికి మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న వారు:
-
ప్రార్థనలో వలె పరలోక తండ్రిని సంబోధిస్తారు.
-
అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.
-
మరణించినవారి మృతదేహానికి విశ్రాంతి స్థలంగా శ్మశానవాటికను అంకితం చేసి, ప్రతిష్ఠిస్తారు.
-
పునరుత్థానము వరకు (తగిన చోట) ఆ స్థలం పవిత్రంగా ఉండాలని మరియు రక్షించబడాలని ప్రార్థిస్తారు.
-
కుటుంబాన్ని ఓదార్చమని పరలోక తండ్రిని అడుగుతారు మరియు ఆత్మచేత మార్గనిర్దేశం చేయబడిన ఆలోచనలను వ్యక్తపరుస్తారు.
-
యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.
సంఘ సభ్యుని మృతదేహాన్ని దహనం చేస్తే, అధ్యక్షత్వం వహించే నాయకుడు తన తీర్పును ఉపయోగించి బూడిదను ఉంచే స్థలాన్ని ప్రతిష్ఠి చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు.
Dedication of Graves
18.17
గోత్రజనకుని దీవెనలు
ప్రతీ యోగ్యమైన, బాప్తిస్మము పొందిన సభ్యుడు గోత్రజనకుని దీవెన పొందేందుకు అర్హుడు, అది పరలోక తండ్రి నుండి ప్రేరేపిత నిర్దేశాన్ని అందిస్తుంది (ఆదికాండము 48:14–16; 49; 2 నీఫై 4:3–11 చూడండి).
బిషప్పు లేదా నియమించబడిన సలహాదారుడు గోత్రజనకుని దీవెన పొందాలనుకునే సభ్యులను మౌఖికము చేస్తారు. సభ్యుడు యోగ్యుడైతే, మౌఖికము చేసేవారు గోత్రజనకుని దీవెన సిఫార్సును సిద్ధం చేస్తారు. అతను దానిని ChurchofJesusChrist.org లోని Patriarchal Blessing System ద్వారా సమర్పిస్తారు.
గోత్రజనకుని దీవెన సిఫార్సును జారీ చేసే వ్యక్తి, దీవెన యొక్క ప్రాముఖ్యతను మరియు పవిత్ర స్వభావాన్ని అర్థం చేసుకునేంత పరిపక్వత సభ్యుడికి ఉన్నదని నిశ్చయపరుస్తారు.
18.17.1
గోత్రజనకుని దీవెన పొందడం
ఒక సిఫార్సును పొందిన తర్వాత, సభ్యుడు గోత్రజనకుని దీవెన పొందడానికి సమయాన్ని ఏర్పాటు చేయడానికి గోత్రజనకుడిని సంప్రదిస్తారు. సమయమివ్వబడిన రోజున, సభ్యుడు ప్రార్థనా వైఖరితో మరియు ఆదివారం ధరించే దుస్తులు ధరించి గోత్రజనకుడి వద్దకు వెళ్లాలి.
ప్రతీ గోత్రజనకుని దీవెన పవిత్రమైనది, రహస్యమైనది మరియు వ్యక్తిగతమైనది. అందువల్ల, పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు హాజరవడం మినహా అది ఏకాంతంగా ఇవ్వబడుతుంది.
గోత్రజనకుని దీవెన పొందిన వ్యక్తి దాని మాటలను భద్రపరచాలి, వాటిని ధ్యానించాలి, ఈ జీవితంలో మరియు నిత్యత్వంలో వాగ్దానం చేసిన దీవెనలను పొందేందుకు అర్హులుగా జీవించాలి.
సంఘ సభ్యులు దీవెనలను పోల్చకూడదు మరియు సన్నిహిత కుటుంబ సభ్యులతో తప్ప వాటిని ఎవరితోను పంచుకోకూడదు. సంఘ సమావేశాలు లేదా ఇతర బహిరంగ సభలలో గోత్రజనకుని దీవెనలు చదవకూడదు.