“మిమ్మల్ని ఉత్తమంగా నిర్మించడం,” యౌవనుల బలము కొరకు, సెప్టె. 2021, 6–7.
సెప్టెంబరు 2021, యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము
నిర్మించడం మిమ్మల్ని ఉత్తమంగా
సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని నిర్మించడానికి ఐదు విధానాలు.
జూలియట్ పర్సీవల్ చేత వివరణలు
కర్ట్‌లాండ్ దేవాలయాన్ని నిర్మించమని ప్రభువు జోసెఫ్ స్మిత్‌ను ఆజ్ఞాపించినప్పుడు, దానిని ఎలా చేయాలని తనకుతానుగా ఆలోచించమని ఆయన అతడిని విడిచిపెట్టలేదు. విజయానికి దారితీసే ప్రణాళికను ఆయన బయల్పరిచారు.
“లోకరీతిగా కాకుండా ఈ మందిరము నిర్మించబడవలెను,” అని ప్రభువు ప్రకటించారు. “నేను చూపించు విధానములో అది నిర్మించబడవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 95:13–14). తరువాత ప్రభువు దేవాలయాన్ని ఎలా నిర్మించాలనే సూచనలు ఇచ్చారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 95:15–17 చూడండి).
అదృష్టవశాత్తూ, ప్రభువు మనకు దేవాలయాలను ఎలా నిర్మించాలనే దానికంటే ఎక్కువగా చూపారు. వీలైనంత ఉత్తమమైన వ్యక్తిగా కావడానికి మనకు సహాయపడే సూచనలను కూడా ఆయన మనకిచ్చారు. మనము వాటిని అనుసరించినప్పుడు, “లోకరీతిగా కాకుండా” ప్రభువు రూపొందించిన విధానములో మనం మన జీవితాలను నిర్మించుకుంటాము.
యేసు క్రీస్తుపై కేంద్రీకృతమైన సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని నిర్మించడానికి ఐదు విధానాలు ఇక్కడున్నాయి.
స్థిరమైన పునాదిని నిర్మించండి
ఏ భవనానికైనా ఒక స్థిరమైన పునాది ఆవశ్యకమని ఏ వాస్తుశిల్పి లేదా భవన నిర్మాతయైనా మీకు చెప్తారు. మన జీవితాల కొరకు ఉత్తమమైన పునాది “దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండ” (హీలమన్ 5:12) అని హీలమన్ బోధించాడు. ఆయన యొద్దకు వచ్చుట ద్వారా మరియు ఆయన బోధనలను అనుసరించుట ద్వారా మనము క్రీస్తును మన పునాదిగా చేసుకోగలము. మీ జీవితానికి క్రీస్తును పునాదిగా మీరెలా చేసుకుంటున్నారని మీరు భావిస్తున్నారు?
ఇతరులకు సేవ చేయండి
అప్పటి ప్రథమ అధ్యక్షత్వమందు రెండవ సలహాదారులైన అధ్యక్షులు డిటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ప్రకారం, మన జీవితాలను నిర్మించడానికి మరొక గొప్ప విధానం “మనం ప్రభువుకు సేవచేయడంలో మరియు మన చుట్టూ ఉన్నవారికి సేవచేయడంలో మన కాళ్ళపై మనం నిలబడినప్పుడు వస్తుంది.” 1 మీరు ఇతరులకు సేవ చేసినప్పుడు, యేసు చేసిన దానిని మీరు చేస్తున్నారు మరియు మరింతగా ఆయన వలె కావడాన్ని నేర్చుకుంటున్నారు. మీరు సేవ చేస్తున్న వారి జీవితాలను మాత్రమే మీరు దీవించరు, కానీ మీరు కూడా దీవించబడతారు.
క్రమమైన ప్రార్థన మరియు లేఖన అధ్యయన అలవాటును చేసుకోండి
సంతోషకరమైన జీవితాన్ని నిర్మించడానికి మరొక విధానం, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో సంబంధాన్ని నిర్మించడం. దానిని చేయడానికి గొప్ప విధానము ప్రార్థన మరియు లేఖన అధ్యయనము ద్వారానైయున్నది.
అధ్యక్షులు ఉఖ్‌డార్ఫ్ చెప్పారు: “దేవునితో మన సంబంధాన్ని బలపరచడానికి ఆయనతో ఒంటరిగా కొంత అర్థవంతమైన సమయం మనకు అవసరము. అనుదిన వ్యక్తిగత ప్రార్థన మరియు లేఖన అధ్యయనముపై ప్రశాంతంగా దృష్టిపెట్టడం… మన పరలోక తండ్రికి దగ్గరవడానికి మన సమయం మరియు ప్రయత్నాల యొక్క తెలివైన పెట్టుబడి అవుతుంది.”2
ప్రార్థన అనేది పరలోకమందున్న మన తండ్రితో సంభాషించేందుకు ఒక అవకాశము. ఆయన మనల్ని ఎరిగియున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు మరియు మన నుండి వినాలని కోరుతున్నాడు! మనం మనఃపూర్వకంగా ప్రార్థించి, మన కృతజ్ఞతలు తెలిపి, మనకవసరమైన వాటి కొరకు అడిగినప్పుడు, ఆయన వింటారు మరియు ఆయన స్వకాలములో, స్వంత విధానములో ఎల్లప్పుడూ జవాబిస్తారు.
లేఖన అధ్యయనము విషయానికి వస్తే, దానిని చేయడానికి ఒకేఒక సరైన విధానమంటూ ఏదీ లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు దానిని చేయడం! “ఆధ్యాత్మిక మనుగడకు దేవుని వాక్యంలో రోజువారీ నిమగ్నత చాలా ముఖ్యమైనదని” అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు. 3 ప్రతిరోజూ లేఖనాలతో సమయం గడపడం నిస్సందేహంగా విశ్వాసపూరితమైన, బలమైన జీవితాన్ని నిర్మించడానికి మీకు సహాయపడుతుంది.
మంచి చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించే వారు మీ చుట్టూ ఉండేలా చూసుకోండి
ఇతరులతో—ప్రత్యేకించి కుటుంబము మరియు స్నేహితులతో జతచేరమని, సంబంధాలను ఏర్పరచమని పరలోక తండ్రి మనల్ని కోరుతున్నారు. మనం సమయాన్ని గడిపే వారిచేత తరచూ మనం రూపొందించబడతాము. వారు సంఘ సభ్యులైనా, కాకపోయినా సువార్తను జీవించడానికి, ప్రభువు యొక్క ప్రమాణాలను పాటించడానికి మరియు మెరుగైన వ్యక్తిగా కావడానికి మీకు సహాయపడే వ్యక్తుల చేత మీరు చుట్టబడియుండాలి. అలాగే చేయడానికి మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీరు సహాయపడవచ్చు. నీతిపై మీ పునాదిని నిర్మించుకోవడానికి మీ స్నేహితులలో ఎవరు మీకు సహాయపడుతున్నారు?
మీ పునాదిని నిర్మించడంలో ఆనందాన్ని కనుగొనండి
ఆధ్యాత్మికంగా బలంగా ఉండి, ఆనందం కలిగియుండేలా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోగల ఇతర విధానాలు అనేకమున్నాయి, సంఘానికి వెళ్ళి సంస్కారములో పాలుపొందడం, నిబంధనలను చేసి పాటించడం మరియు జీవముతోనున్న ప్రవక్తల సలహాను అనుసరించడం వంటివి వాటిలో ఉన్నాయి.
వీటన్నిటికి శ్రమ మరియు సమయం అవసరమవుతాయని గుర్తుంచుకోవడం ముఖ్యము. ఎల్లప్పుడూ నిర్మించడం మరియు నేర్చుకోవడం చేయవలసియున్నది, కానీ మీరు దానిని ఒంటరిగా చేయనవసరం లేదు. ఆయన మరియు మీరు గర్వించగలిగేలా, మీకు ఆనందాన్ని తెచ్చేటటువంటి జీవితాన్ని నిర్మించడానికి మీరు చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతిరోజూ ప్రభువు మీకు సహాయపడతారు.
© 2021 by Intellectual Reserve, Inc. All rights reserved. అమెరికాలో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, September 2021 యొక్క అనువాదము. Telugu. 17473 421