2020
కుటుంబ చరిత్ర ద్వారా పరిచర్య
ఫిబ్రవరి 2020


పరిచర్య సూత్రములు, ఫిబ్రవరి 2020

కుటుంబ చరిత్ర ద్వారా పరిచర్య

చిత్రం
ministering

జాషువా డెన్నిస్ చేత వివరణ; నేపథ్య చిత్రము మరియు చాయాచిత్రము గెట్టీ ఇమేజెస్ నుండి

వారి కుటుంబ చరిత్ర విషయంలో ఒకరికి సహాయపడడమనేది పరిచర్య చేయడానికి ఒక శక్తివంతమైన విధానం. కుటుంబ కథలు మరియు వివరాలతో మీరు ఇతరులను వారి పూర్వీకులతో జతచేసినప్పుడు వారి హృదయాలలో ఉన్న ఖాళీలను నింపుతారు, కొన్నిసార్లు అవి ఉన్నాయని కూడా వారికి తెలియదు ( మలాకీ 4:5–6 చూడండి).

జీవితకాలం సంఘ సభ్యుడైనా లేక యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను ఎన్నడూ వినని వారైనా సరే, దేవుని పిల్లలందరు వారు ఎక్కడినుండి వచ్చారో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు.

క్రింది కథలలో నిరూపించబడినట్లుగా లోతైన మరియు శాశ్వత ముద్ర వేయడానికి ఎంతో కాలం పట్టదు.

30,000 అడుగుల వద్ద కుటుంబాన్ని కనుగొనుట

ఈ మధ్య ఇంటికి వెళ్ళే విమానంలో నేను స్టీవ్ ప్రక్కన కూర్చున్నాను, అతడు తన స్వంత కథలో కొన్ని భాగాలు నాతో పంచుకున్నాడు. అతడు ఉన్నత పాఠశాల నుండి పట్టా పొంది, 18 ఏళ్ళకే అమెరికా సైన్యంలో సమాచార నిపుణుడిగా చేరి, అమెరికా అధ్యక్షునికి సమాచార సహకారాన్ని అందిస్తూ వెంటనే వైట్ హౌస్ లో పనిచేయనారంభించాడు. 18 నుండి 26 ఏళ్ళ వరకు అతడు ఇద్దరు అమెరికా అధ్యక్షుల క్రింద పనిచేశాడు. అతని కథలు మనోహరంగా ఉన్నాయి.

“స్టీవ్,” “మీ పిల్లల కోసం నువ్వు ఈ కథలను వ్రాయాలి. మొదటిగా నీ దృష్టి కోణం నుండి వారు ఈ కథలు పొందాలి,” అన్నాను నేను. అతడు ఒప్పుకున్నాడు.

అప్పుడు అతని పూర్వీకుల గురించి అతనికి ఏమి తెలుసో అడగాలని ఆత్మ నన్ను ప్రేరేపించింది. తన తల్లిగారి వైపు స్టీవ్ కు చాలా తెలుసు, అందులో ఒకటి, 1860లో అమెరికా అధ్యక్షుని ఎన్నికల సమయంలో పల్లె ప్రాంతాలలో ప్రచారంలో ఉన్నప్పుడు అబ్రహాం లింకన్ గారితో తన కుటుంబం ఒకసారి భోజనం చేసిన కథ.

కానీ, అతని తండ్రి వైపు కుటుంబం గురించి అతనికి చాలా తక్కువగా తెలుసు. ఎక్కువగా తెలుసుకోవాలని అతడు కోరుకున్నాడు. నేను నా ఫోను తీసి, కుటుంబ శోధన యాప్ ను తెరిచాను. “స్టీవ్, మనం ఇప్పుడే మీ కుటుంబాన్ని కనుక్కోవచ్చు!”

విమానంలో ఉన్న వై-ఫై కు నా ఫోనును అనుసంధానము చేసాను. మేమిద్దరం చూడగలిగేలా నా ముందున్న బల్లమీద నా ఫోను పెట్టాను. మేము కుటుంబ వృక్షాన్ని శోధించాము. కొద్ది నిముషాల్లోనే మేమిద్దరం అతని ముత్తాత, ముత్తమ్మల పెళ్ళి ధృవపత్రాన్ని ఆశ్చర్యంతో చూసాము.

“అది వారే!” అన్నాడతను. “ఆమె ఇంటి పేరు నాకు గుర్తుకు వస్తోంది!”

ఉత్సాహపు ఆత్మ మా ఇద్దరి మీద కుమ్మరించబడింది. తరువాతి 45 నిముషాలు మేము అతనికి అంతగా తెలియని పూర్వీకుల చరిత్ర పైన పనిచేసాము. కొలరాడోలో కూడా ఈ శోధనను కొనసాగిస్తామని తనకి వాగ్దానం చేయమని అతడు నన్ను అడిగాడు. విమానం క్రిందికి దిగుతుండడంతో మేము మా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకున్నాము.

ఇక్కడ మేము గాలిలో 30,000 అడుగుల (9,145 మీ) ఎత్తులో ఎగురుతూ, నా చేయంత చిన్న సాధనంతో, 100 ఏళ్ళ క్రితం పెళ్ళైన ఒక పురుషుడు, ఒక స్త్రీ కోసం వెదకుతున్నాము, వారి గురించి అతనికి మరియు అతని కుటుంబానికి ఏమీ తెలియదు. ఆశ్చర్యం! కానీ మేము వారిని కనుగొన్నాం. కుటుంబాలు జతచేయబడ్డాయి. కథలు జ్ఞాపకం చేసుకోబడ్డాయి. సాంకేతికతకు మరియు సాధనాల కొరకు కృతజ్ఞతలు అనుభవించబడ్డాయి. ఇది అద్భుతానికి ఏమాత్రం తక్కువ కాదు.

జోనథన్ పెట్టీ, కొలరాడో, యు ఎస్ ఎ

క్రొత్త కుటుంబంతో చుట్టబడుట

20 ఏళ్ళకు పైగా మారియా అంత క్రియాశీలకంగా లేదు. కొన్ని నెలల క్రితం, జనాభా లెక్కలు మరియు ఇతర గ్రంథాల ద్వారా ఆమె కుటుంబం గురించి అన్వేషిస్తూ, తన ఇంటిలో ఆమెతో మేము కొన్ని గంటలు గడిపాము. ఒక సందర్భంలో ఆమె, “నా జీవితకాలమంతా తెలుసుకోలేనంత ఎక్కువగా నా కుటుంబం గురించి రెండు గంటలలో నేను తెలుసుకున్నాను!” అని బిగ్గరగా చెప్తూ కన్నీళ్ళ పర్యంతమైంది.

ఆమెతో మా సమయం ముగింపులో మేము, కుటుంబ వృక్షం యాప్ యొక్క నా చుట్టూ ఉన్న బంధువులు ఫీచర్ ను ఆమెకు పరిచయం చేసాము. నేను, నా భర్త మారియాకు దూరపు బంధువులమని అప్పుడు తెలిసింది. తాను ఇప్పటివరకు ఒంటరిదాన్నని అనుకున్నానని చెప్తూ ఆమె మళ్ళీ కన్నీళ్ళ పర్యంతమైంది. ఆ ప్రాంతంలో ఆమెకు కుటుంబం ఉందని ఆమెకెప్పుడూ తెలియలేదు. కొన్ని వారాల తర్వాత మరియా మా బిషప్పును కలిసింది. ఆమె ఇప్పుడు దేవాలయానికి వెళ్ళడానికి సిద్దపడుతోంది, ఆమె మా వార్డులో ఎంతోమంది “క్రొత్త” దాయాదులను కలుసుకుంది.

కారల్ రైనర్ ఎవరెట్, నార్త్ కరొలినా, యు ఎస్ ఎ

పరిచర్య కొరకు తయారీవిధానం

నేను పరిచర్య చేసే ఒక సహోదరియైన యాష్లీ మరియు నేను, ఇద్దరం మా అమ్మమ్మల నుండి వచ్చిన వంటల పుస్తకాలు కలిగియున్నాం. ఆమెది వాళ్ళ ముత్తమ్మ నుండి వచ్చినది, మరియు నాది మా అమ్మమ్మ గ్రీన్ వుడ్ చనిపోయిన తర్వాత నాకు వారసత్వంగా వచ్చిన ఆమె వంటల తయారీ పెట్టె నుండి నేను సమకూర్చిన పుస్తకం.

యాష్లీ మరియు నేను ఇద్దరం మా వంటల పుస్తకాల నుండి చెరొక వంటకాన్ని ఎంచుకొని, ఒక రోజు రాత్రి పని పూర్తయ్యాక వాటిని ప్రయత్నించడానికి ఒకచోట చేరాము. ఆమె ఒక తీపి వంటకాన్ని ఎంచుకుంది, కాబట్టి ముందుగా మేము దానిని చేసి, ఓవెన్ లో పెట్టాము. ప్రతి గ్రీన్ వుడ్ కుటుంబ విందులో ప్రధానమైన వంటకాన్ని నేను ఎంచుకున్నాను. మా వంటకాలను రుచిచూడడంలో యాష్లీ కూతురు ఆలిస్ మాకు సహాయపడింది. తీపి వంటకాన్ని పూర్తిగా తన పిల్లలే తినవద్దని కోరుకున్న యాష్లీ ముందుగానే తాను పరిచర్య చేసే సహోదరీల కోనం కొంత పంపించింది.

మా వంటల రాత్రిలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, మేము వంట చేస్తున్నప్పుడు సాధారణ పరిచర్య విషయాలు — ఆమెవి, నావి కష్టాలన్నిటి గురించి మేము మాట్లాడుకున్నాము. అంతేకాకుండా మేము మా అమ్మమ్మలు, అమ్మల గురించి కూడా మాట్లాడుకున్నాము, అది మా ఇద్దరి మనస్సులకు హత్తుకుంది.

జెన్నిఫర్ గ్రీన్ వుడ్, యూటా, యు ఎస్ ఎ

సహాయపడేందుకు నిర్దిష్టమైన విధానాలు

పరిచర్య చేయడానికి ఇంకే అవకాశము లేదనిపించినప్పుడు, ఆ అవకాశ ద్వారాలను కుటుంబ చరిత్ర తెరువగలదు. మీరు ప్రయత్నించగల కొన్ని ఆలోచనలు ఇక్కడున్నాయి.

  • కుటుంబ చరిత్ర కథలను, ప్రత్యేకించి ఫోటోలతో సరిపోల్చదగిన వాటిని నమోదు చేయడానికి మరియు ఆడియో రికార్డింగులను ఎక్కించడానికి సహాయం చేయండి.

  • మీరు ఒక బహుమతిగా ఇవ్వగలిగేలా ఒక ఫ్యాన్ చార్టును లేక ఇతర ముద్రింపదగిన కుటుంబ చరిత్ర పత్రాన్ని తయారుచేయండి.

  • వారికి నచ్చినట్లుగా దినచర్య పుస్తకాన్ని వ్రాయడం ద్వారా వారి స్వంత చరిత్రను సంగ్రహించడానికి విధానాలను బోధించండి. ఆడియో దినచర్య పుస్తకం? ఫోటో దినచర్య పుస్తకం? వీడియో లాగ్ లు? ప్రామాణిక దినచర్య ఆకృతులను ఇష్టపడని వారి కొరకు అనేక ఎంపికలున్నాయి.

  • పూర్వీకుల కొరకు విధులను చేయడానికి కలిసి దేవాలయానికి వెళ్ళండి. లేక వారు చేయగలిగిన వాటికంటే ఎక్కువ పేర్లు ఉన్నప్పుడు, వారి కుటుంబీకుల కొరకు విధులను చేస్తామని అడగండి.

  • కుటుంబ ఆచారాలను పంచుకోవడానికి సమకూడండి.

  • కలిసి కుటుంబ చరిత్ర తరగతి తీసుకోండి.