2019
పరిచర్య చేయుట గురించి క్రిస్మస్ కథ మనకేమి బోధిస్తుంది
డిసెంబర్ 2019


పరిచర్య సూత్రములు, డిసెంబర్ 2019

క్రిస్మస్ కథ పరిచర్యచేయట గురించి మనకేమి బోధిస్తుంది

“సంవత్సరములో ఈ కాలము ప్రియమైనది. ఒక కీర్తన పాడండి; క్రిస్మస్ సమయం త్వరలోనే రాబోతుంది. యేసు పుట్టుక యొక్క నిజమైన కథ చెప్పుము, శిశువుగా ఆయన భూమిపైకి వచ్చెను” (“యేసు జననము యొక్క పాట,” పిల్లల పాటల పుస్తకము 52).

చిత్రం
ministering

Detail from Behold the Lamb of God, by Walter Rane

గొర్రెలు, గొర్రెల కాపరులు, పశువుల తొట్టెలు మరియు నక్షత్రములు హఠాత్తుగా ఒక క్రొత్త అర్థమునిచ్చే క్రిస్మస్ సమయము ఒక అద్భుత సమయము. మానవ చరిత్రలోనే అత్యంత ఆవశ్యకమైన సంఘటనలలో ఒకటైన యేసు క్రీస్తు పుట్టుక గురించి మళ్లీ చెప్పుటలో వారు ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అనేక కుటుంబాలు వారి గృహాలలో యేసు జననము యొక్క దృశ్యాలను ప్రదర్శిస్తారు. ఇతరులు ఆయన జన్మ యొక్క కథను చదవాలని అనుకొంటారు లేదా ఒక వేడుకలో పాల్గొంటారు. క్రీస్తు యొక్క అన్ని కథలవలే, ఆయన పుట్టుక యొక్క కథ కూడా పరిచర్య చేయుట గురించి, లోకములో వెలుగునింపుటకు ఆయన వెలుగును పంచుట గురించి మనం నేర్చుకొనే పాఠాలతో అది నిండియున్నది. “క్రిస్మస్ కథ ప్రేమ కథ” అని ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారులైన అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ అన్నారు.

“… క్రీస్తుయొక్క పుట్టుక గూర్చిన కథలలో, అప్పుడు, ఇప్పుడు ఆయనెవరో మనం చూచి, అనుభూతిచెందగలము. మార్గము వెంబడి అది మన భారాన్ని తేలిక చేస్తుంది. అది మనల్ని మనం మర్చిపోయి, ఇతరుల భారాన్ని తేలిక చేయడానికి మనల్ని నడిపిస్తుంది.”1

“సత్రములో వారికి స్థలము లేదు” (లూకా 2:7)

సత్రపువాడు రక్షకునికి స్థలమివ్వడంలో విఫలమయ్యెను కాని మనం ఆ పొరపాటు చెయ్యకుండా ఉండవచ్చు! మన సహోదర, సహోదరీలకు మన బల్లల వద్ద, మన గృహాలలో, మన ఆచారాలలో స్థలమివ్వడం ద్వారా మన హృదయాలలో రక్షకునికి స్థలమివ్వగలము. ఇతరులను కలుపుకోవడం ద్వారా అనేక కుటుంబ ఆచారాలను మధురమైనవిగా, మరింత మరపురానివిగా చేసుకోగలము. తమతో క్రిస్మస్ పండుగ జరుపుకొనుటకు ఎవరినైనా ఆహ్వానించుట డయానా మరియు ఆమె కుటుంబము యొక్క ఆచారము. ప్రతీ డిసెంబర్‌లో, ఎవరిని ఆహ్వానించాలా అని వారు చర్చించుకొని, నిర్ణయిస్తారు. 2 మీ కుటుంబము కూడా అటువంటి సాంప్రదాయాన్ని ప్రారంభించవచ్చును. మీరు పరిచర్య చేయుచున్న వారు బహశా ప్రియమైన క్రిస్మస్ పాటల్ని మీ కుటుంబముతో కలిసి పాడుటకు ఇష్టపడవచ్చును. మీ ప్రాంతములో తమ కుటుంబము లేనివారిని ఎవరినైనా మీ క్రిస్మస్ విందులో చేర్చుకోవచ్చును.

రక్షకుని పురస్కరించుకొనుటకు చేర్చుకొనుట అనే ఆయన మాదిరిని అనుసరించుట కంటే ఉత్తమమైన మార్గము ఏముంటుంది? “ఆయన వారందరిని తన వద్దకు రమ్మని మరియు తన మంచితనము నుండి పాలుపొందమని ఆహ్వానించుచున్నాడు; మరియు తన యొద్దకు వచ్చువానిని, నల్లవాడిని మరియు తెల్లవాడిని, దాసుని మరియు స్వతంత్రునిని, పురుషుని మరియు స్త్రీని, ఎవ్వరిని ఆయన కాదనడు. మరియు ఆయన అన్యులను జ్ఞాపకము చేసుకొనును; మరియు యూదుడు మరియు అన్యుడు వారిరువురు దేవునికి ఒకే రీతిగా ఉన్నారు.” (2 నీఫై 26:33). స్థలమివ్వండి మరియు చేర్చుకొనండి.

“ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండిరి.” (లూకా 2:8)

పసిబిడ్డయైన రక్షకుని పలుకరించువారిలో మొదటివారిగా ఉండుటకు గొర్రెల కాపరులు ఉంచబడినట్లుగా కనబడుతుంది. ప్రాచీన కాలపు ప్రవక్తలు యేసు క్రీస్తును “ఇశ్రాయేలు గొర్రెల కాపరి” అని (కీర్తనలు 80:1 మరియు “లోకమంతటికి గొర్రెల కాపరి” అని సూచించారు (1 నీఫై 13:41). “నేను గొఱ్ఱెల మంచి కాపరిని, నా గొఱ్ఱెలను ఎరుగుదును” అని క్రీస్తు స్వయంగా చెప్పెను ( యోహాను 10:14). రక్షకుని వలె గొర్రెలకాపరిగా ఉండుటకు, పరిచర్య చేయుటకు మన గొర్రెలను తెలుసుకొనుట మరియు కనిపెట్టుకొని యుండుట ముఖ్యమైన భాగము.

మిణుకు మిణుకుమనుచున్న దీపాలు, శృంగారభరితమైన అలంకారాలతో, క్రిస్మస్ సమయములో మనం దృష్టిసారించవలసింది చాలా ఉంది. కాని బహుశా మనం పరిచర్య చేయుచున్నవారిపై దృష్టిసారించి, మన స్వంత మందను కనిపెట్టుకొని యుండినప్పుడు ఈ కాలము యొక్క గొప్ప సౌందర్యాన్ని కనుగొనగలము. కనిపెట్టియుండుట అంటే ఒకరికి ఇష్టమైన విందును తెలుసుకొనుట లేదా ఒకరి ఆటవిడుపు ప్రణాళికలను అడుగుట కావచ్చును. స్పష్టంగా కనిపించేవి మరియు అంతగా కనిపించని ఇతరుల అవసరాలను చూచి, వాటిని తీర్చినప్పుడు మనం కనిపెట్టికొని ఉంటాము.

చెరిల్ హఠాత్తుగా తన భర్తయైన మిక్‌ను కోల్పోయినప్పుడు ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఆయన లేకుండా తన మొదటి క్రిస్మస్ సమీపిస్తుండగా, ఒంటరితనము ఎక్కువైయింది. అదృష్టవశాత్తు, ఆమె పరిచర్య చేయు సహోదరియైన షువానా ఉన్నది. షువానా మరియు ఆమె భర్త జిమ్, చెరిల్‌ను అనేక సెలవు దినాలలో విహారాలకు ఆహ్వానించారు. చెరిల్ యొక్క చిరిగిపోయిన కోటును గమనించి, దానికొరకు ఏదైనా చెయ్యాలనుకొన్నారు. క్రిస్మస్‌కు కొన్నిరోజుల ముందు, షువానా మరియు జిమ్ చెరిల్‌కు క్రిస్మస్ బహుమానాన్ని తీసుకొనివచ్చారు: అది ఒక అందమైన క్రొత్త కోటు. వెచ్చని కోటు కొరకు చెరిల్‌కి గల భౌతిక అవసరాలు మాత్రమే కాదు ఓదార్పు మరియు తోడు కొరకు ఆమెకు గల భావోద్రేక అవసరాలు కూడా వారికి తెలుసు. ఆ అవసరాలను వారు ఎంత ఉత్తమముగా తీర్చగలరో అంతవరకు తీర్చుటకు ముందుకు వచ్చారు మరియు మన మందను మనం కూడా ఏవిధంగా కనిపెట్టియుండవచ్చునో ఒక మంచి మాదిరిని మనముందుంచారు. 3

“ఆ గొఱ్ఱెల కాపరులు మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనిరి” (లూకా 2:15)

“ఇప్పుడు మనం వెళ్లెదము రండి” అనేది అఖండమైన ఆహ్వానము! ఆ గొర్రెల కాపరులు ఆ పర్వతారోహణ చేయుట ద్వారా తమ స్నేహితులు చాలా అలసిపోతారని ఊహించలేదు. వారు నిశ్శబ్ధంగా తమంతట తాము బేతెహ్లేము వెళ్ళలేదు. వారు సంతోషంగా ఒకరివైపు ఒకరు చూసి, “ఇప్పుడు వెళ్లెదము రండి!” అని చెప్పారు.

శిశువైన రక్షకుని వచ్చి చూడుమని మన స్నేహితులను మనం ఆహ్వానించలేకపోవచ్చును కాని మనతో సేవ చేయుట ద్వారా క్రిస్మస్ ఆత్మను (లేదా క్రీస్తు యొక్క ఆత్మను) అనుభూతి చెందమని మనం ఆహ్వానించవచ్చును. “క్రిస్మస్ ఆత్మను పెంచే మార్గము ఏమిటంటే మన చుట్టూ ఉన్న వారందరిని ఔదార్యముతో చేరుకొని, మనల్ని మనం సమర్పించుకోవడం” అని మాజీ యువతుల ప్రధాన అధ్యక్షురాలైన బోన్నీ ఎల్. ఆస్కార్సన్ చెప్పారు. 4 మీరు ఒక క్రొవ్వొత్తును పట్టుకొనియున్నట్లు ఊహించుకోండి. ఇతరులు మీ క్రొవ్వొత్తినుండి వచ్చు వెలుగును తప్పకుండా చూచి, దాని నుండి లాభం పొందవచ్చును, కాని మీ క్రొవ్వొత్తిని ఇతరుల క్రొవ్వొత్తి వెలిగించుటకు ఉపయోగించి, వారంతట వారు ఆ వెలుగును పట్టుకొనుటకు వారిని అనుమతించినప్పుడు వారు పొందే వెచ్చదనాన్ని ఊహించండి.

ఎవరైతే ఆయనను అనుసరిస్తారో వారు జీవపు వెలుగును కలిగియుంటారని క్రీస్తు స్వయంగా బోధించారు (యోహాను 8:12 చూడండి). ఆయనను అనుసరించి, వాగ్దానము చెయ్యబడిన వెలుగును ఆనందించుటకు ఒక మార్గము ఆయన వలె మనం సేవ చేయుట. కాబట్టి మీతో పాటు సేవ చేయుటకు ఇతరులను ఆహ్వానించుట ద్వారా ఆ వెలుగును పంచండి. ఏవిధంగా మీరు మరియు మీరు పరిచర్య చేసేవారు కలిసి సేవ చెయ్యగలరు? మీ ప్రియమైన ఆహారాన్ని కలిసి సిద్ధపరచవచ్చు లేదా ఎవరినైనా ఒక చిన్న బహుమతితో లేదాా వ్యాఖ్యానపు చీటీతో ఆశ్చర్యపరచవచ్చు. సేవ చేయుటకు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించుట ద్వారా వచ్చే వెలుగును మీరు కలిసి అనుభూతిచెందవచ్చును.

“వారు చూచి, యీ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.” (లూకా 2:17)

క్రీస్తు పుట్టుక యొక్క ఈ అద్భుతమైన వార్తను వారికి వీలైనంత ఎక్కువ మందితో పంచుకొన్నప్పుడు గొర్రెల కాపరుల యొక్క సంతోషకరమైన ఉత్సాహమును ఊహించుకొనుట సులభము. దూతల చేత ప్రకటించబడి, ప్రవచింపబడిన మెస్సీయ వచ్చెను. ఆయన ఇక్కడున్నారు! నిజానికి, రక్షకుని గూర్చి శుభవార్తను పంచుకొనుట యేసు జననము యొక్క పెద్ద ఇతివృత్తము. దూతలు పాడిరి. నక్షత్రము మార్గమును చూపెను. గొర్రెల కాపరులు ప్రచారము చేసిరి.

ఆ శుభవార్తను పంచి, రక్షకుని గూర్చి సాక్ష్యము చెప్పుట ద్వారా క్రిస్మస్ కథకు మన స్వరాలను కలుపవచ్చును. “మీ పరిచర్య ప్రయత్నాలలో రక్షకునికి ప్రాతినిధ్యం వహించు విశేషాధికారమును మీరు కలిగియుండగా, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘ఈ వ్యక్తితో లేదా కుటుంబముతో సువార్త వెలుగును నేనేవిధంగా పంచుకోగలను?’” అని ఉపశమన సమాజ ప్రధాన అధ్యక్షురాలు సహోదరి జీన్ బి. బింగం బోధించారు. “నేనేమి చెయ్యాలని ఆత్మ నన్ను ప్రేరేపించుచున్నది?”5

రక్షకుని మరియు ఆయన సువార్త యొక్క మీ సాక్ష్యమును మీరేవిధంగా పంచుకోవాలో తెలుసుకొనుటకు మీరు వెదకినప్పుడు, మీరు పరిగణించుటకు ఇక్కడ కొన్ని సలహాలు కలవు:

  • రక్షకుని గురించి మీ మనోభావాలను తెలియజేసే లేదా ఆయన గురించి మీరెందుకు కృతజ్ఞత కలిగియున్నారో వ్యక్తవరచే ఒక లేఖనాన్ని కనుగొనండి. మీరు పరిచర్య చేయువారితో దానిని పంచుకోండి.

  • ఒక మూలగ్రంథమును లేదా సాంఘిక మాంధ్య సందేశమును క్రిస్మస్ వీడియోతో పంపండి. ChurchofJesusChrist.org లో కొన్ని అద్భుతమైనవి కలవు!

  • క్రీస్తును జ్ఞాపకము చేయు ఒక ప్రత్యేక జ్ఞాపకము లేదా ఆచారము గూర్చి ఒక స్నేహితునితో చెప్పండి.

శిశువైన యేసే రక్షకుడని సుమెయోను, అన్నలకు సాక్ష్యము చెప్పినట్లుగానే, మీ సాక్ష్యము యొక్క సత్యము గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యము చెప్పునని విశ్వాసము కలిగియుండండి (లూకా 2:26, 38 చూడండి).

“[యేసు క్రీస్తు యొక్క] ఆగమనమును యదార్థముగా ఘనపరచుటకు, మన తోటివారిని జాలి, కరుణలతో ఆయనవలె మనం సమీపించాలి” అని పన్నెండుమంది అపొస్తలలు సమూహము యొక్క ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ చెప్పారు. “దీనిని మనం అనుదినం మాటల ద్వారా, చేతల ద్వారా చెయ్యగలము. మనం ఎక్కడ ఉన్నప్పటికి ఇది మన క్రిస్మస్ ఆచారము కావాలి - ఇంకొంచెం దయతో, మరింత క్షమాగుణముతో, తక్కువ తీర్పు తీర్చువారిగా, ఎక్కువ కృతజ్ఞత గలవారిగా, అవసరతలో ఉన్నవారికి మనకు సమృద్ధిగా ఉన్నదానిలో మరింత ఉదారముగా పంచుకొను వారిగా ఉండాలి.”6

వివరణలు

  1. హెన్రీ బి. ఐరింగ్, “Christmas Stories” (First Presidency Christmas devotional, Dec. 6, 2009), broadcasts.ChurchofJesusChrist.org.

  2. డయానా మెలినా అల్బర్నోజ్ డయాజ్, “Sharing Christmas,” Liahona, డిసెం. 2007, 17 చూడండి.

  3. చెరిల్ బోయ్‌ల్, “He Would Have Bought It for You,” Ensign, డిసెం. 2001, 57 చూడండి.

  4. బోన్నీ ఎల్. ఆస్కార్సన్, “Christmas Is Christlike Love” (First Presidency Christmas devotional, డిసెం. 7, 2014), broadcasts.ChurchofJesusChrist.org.

  5. జీన్ బి. బింగం, “Ministering as the Savior Does,” Liahona, మే 2018, 104.

  6. డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “Scatter Your Crumbs” (First Presidency Christmas devotional, డిసెం. 3, 2017), broadcasts.ChurchofJesusChrist.org.