మన చిత్తాన్ని ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుకొనుట
మన జీవితంలో ప్రభువు చిత్తాన్ని అనుసరించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత విలువైన ముత్యాన్ని—పరలోక రాజ్యాన్ని మనం కనుగొనగలుగుతాము.
ఆ నిర్దిష్ట సందర్భంలో, “మంచి ముత్యాల” కోసం వెదుకుతున్న ఒక వర్తకుని గురించి యేసు చెప్పారు. వర్తకుడు తన శోధన సమయంలో, “గొప్ప వెలగల” దానిని కనుగొన్నాడు. అయితే, అద్భుతమైన ముత్యాన్ని సంపాదించడానికి, ఈ వ్యక్తి తన ఆస్తులన్నింటినీ అమ్మవలసిరాగా, అతను వెంటనే ఆనందంగా అమ్మేశాడు.
ఈ చిన్న మరియు ఆలోచనాత్మకమైన ఉపమానం ద్వారా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యంతో పోల్చబడిందని రక్షకుడు అందంగా బోధించారు, అది నిజంగా అన్నిటికంటే కోరగదిన అత్యంత విలువైన నిధి. ఆ విలువైన ముత్యాన్ని పొందేందుకు వర్తకుడు తక్షణమే తన ఆస్తినంతా అమ్మివేసాడన్న వాస్తవం, మనం మన మనస్సును, కోరికలను ప్రభువు చిత్తానికి అనుగుణంగా మార్చుకోవాలని మరియు దేవుని రాజ్యం యొక్క నిత్య దీవెనలను పొందడానికి మన మర్త్య ప్రయాణంలో మనం చేయగలిగినదంతా ఇష్టపూర్వకంగా చేయాలని స్పష్టంగా సూచిస్తుంది.
ఈ గొప్ప ప్రతిఫలానికి అర్హులు కావాలంటే, మనం ఖచ్చితంగా ఇతర విషయాలతోపాటు, స్వయం-కేంద్రీకృత ప్రయత్నాలన్నింటినీ పక్కనపెట్టి, ప్రభువు పట్ల పూర్తి నిబద్ధత నుండి మరియు ఉన్నతమైన, పరిశుద్ధమైన ఆయన మార్గాల నుండి మనల్ని అడ్డుకునే చిక్కులను తప్పించుకోవడానికి మన వంతు కృషి చేయాలి. అపొస్తలుడైన పౌలు ఈ పరిశుద్ధ ప్రయత్నాలను “క్రీస్తు మనస్సును కలిగియుండుట” అని సూచించాడు. యేసు క్రీస్తు ద్వారా ఉదహరించబడినట్లుగా, దీని అర్థం మన జీవితాల్లో “ఎల్లప్పుడూ [ప్రభువు]కు ఇష్టమైన కార్యములను [చేయడం]” లేదా కొంతమంది ఈ రోజుల్లో చెప్పినట్లు, “ప్రభువు సరైనదని భావించిన దానిని చేయడం.”
సువార్త భావంలో, “ఎల్లప్పుడూ [ప్రభువు]కు ఇష్టమైన కార్యములను [చేయడం]” అనేది ఆయన చిత్తానికి మన చిత్తాన్ని సమర్పించడానికి సంబంధించినది. రక్షకుడు తన శిష్యులకు బోధిస్తూ ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యతను ఆలోచనాత్మకంగా బోధించారు:
“నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.
“ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
“కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.”
తన చిత్తము తండ్రి చిత్తమందు ఉపసంహరించబడేందుకు అనుమతించడం ద్వారా రక్షకుడు తండ్రి చిత్తానికి తన చిత్తాన్ని సంపూర్ణంగా మరియు దైవికంగా సమర్పించగలిగారు. ఆయన ఒకసారి ఇలా చెప్పారు, “నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.” ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు ప్రాయశ్చిత్తం యొక్క బాధ మరియు వేదనల గురించి బోధిస్తూ, రక్షకుడు ఇలా అన్నారు:
“ఏలయనగా ఇదిగో, వారు పశ్చాత్తాపపడిన యెడల వారు శ్రమపడకుండునట్లు దేవుడనైన నేను అందరి కొరకు ఈ బాధలను భరించితిని; …
“ఆ శ్రమ అందరికంటే గొప్పవాడను అనగా దేవుడనైన నన్ను బాధ వలన వణకి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారి, శరీరము, ఆత్మ శ్రమపడునట్లు చేసెను—ఆ చేదు పాత్రను త్రాగకుండా వెనుదిరగాలని నేను అనుకొంటిని—
“అయినప్పటికీ, తండ్రికి మహిమ కలుగును గాక మరియు నేను త్రాగి, నరుల సంతానము కొరకైన సిద్ధపాటులను ముగించితిని.”
ఈ భూమిపై మనం నివసించే సమయంలో, పరలోక తండ్రికి వాస్తవంగా ఏమి తెలుసు, ఏది శాశ్వతంగా ఉత్తమమైనది మరియు ఆయన ప్రణాళిక ప్రకారం దేవుని పిల్లలకు ఖచ్చితంగా ఏది పని చేస్తుంది అని అర్థం చేసుకోవడానికి బదులుగా, మనం నిజమనుకున్నది, మనం ఉత్తమమని భావించేది మరియు మనకు పని చేస్తుందని అనుకొనే దానితో మనం తరచుగా పోరాడతాము. ఈ గొప్ప పోరాటం, ప్రత్యేకించి మన కాలానికి సంబంధించిన లేఖనాల్లో ఉన్న ప్రవచనాలను పరిగణించినప్పుడు చాలా క్లిష్టంగా మారవచ్చు: “అంత్యదినములలో … మనుష్యులు స్వార్థప్రియులు, … దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు.”
ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును సూచించే ఒక సంకేతం ప్రపంచంలో ప్రస్తుతం పెరుగుతున్న, చాలామంది చేత అవలంబించబడుతున్న ధోరణి, “ఏదేమైనా, నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను లేదా నాకు నచ్చింది చేస్తాను” అని నిరంతరం ప్రకటిస్తూ, ప్రజలు కేవలం తమపైతాము దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, వారు “తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసు క్రీస్తు కార్యములను చూడరు.” స్వీయ-కేంద్రీకృత ప్రయత్నాల్లో మునిగియున్న వారు, వ్యక్తిగత ప్రాధాన్యతలపై దృష్టికేంద్రీకరించే వారు లేదా దేవుని ప్రేమపూర్వక ప్రణాళికకు మరియు వారి పట్ల ఆయన చిత్తానికి తరచుగా సరిపోలని కొన్ని రకాల ప్రవర్తనలను సమర్థించాలనుకునే వారి చేత ఈ ఆలోచనా విధానం తరచుగా “ప్రామాణికమైనది” అని సమర్థించబడుతోంది. మన హృదయం మరియు మనస్సు ఈ ఆలోచనా విధానాన్ని స్వీకరించేలా చేస్తే, దేవుడు తన పిల్లల కోసం ప్రేమగా సిద్ధం చేసిన అత్యంత అమూల్యమైన ముత్యాన్ని—నిత్యజీవాన్ని పొందడంలో మనం ముఖ్యమైన అవరోధాలను సృష్టించుకోవచ్చు.
మన హృదయాలను, మనస్సులను క్రీస్తు యేసుపై కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తూ, మనలో ప్రతీ ఒక్కరు నిబంధన మార్గంలో వ్యక్తిగత శిష్యత్వ ప్రయాణంలో ప్రయాణించడం నిజమే అయినప్పటికీ, మన జీవితంలో ఈ రకమైన లౌకిక తత్త్వాన్ని అవలంబించడానికి శోధించబడకుండా మనం జాగ్రత్తగా, నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. “నిజాయితీగా క్రీస్తులా ఉండడమే ప్రామాణికంగా ఉండడం కంటే చాలా ముఖ్యమైన లక్ష్యం” అని ఎల్డర్ క్వింటిన్ ఎల్. కుక్ చెప్పారు.
నా ప్రియమైన స్నేహితులారా, మన స్వయం-సేవ ప్రయత్నాలకు బదులుగా మన జీవితంలో దేవుడే అత్యంత శక్తివంతమైన ప్రభావంగా ఉండాలని మనం ఎంచుకున్నప్పుడు, మన శిష్యరికంలో మనం పురోగతి సాధించవచ్చు మరియు మన మనస్సును, హృదయాన్ని రక్షకునితో ఏకం చేసే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. దానికి విరుద్ధంగా, మన జీవితంలో దేవుని మార్గం ప్రబలడానికి మనం అనుమతించనప్పుడు, మనం ఒంటరిగా విడువబడతాము మరియు ప్రభువు యొక్క ప్రేరేపిత మార్గదర్శకత్వం లేకుండా, దాదాపు మనం చేసేవి లేదా చేయని వాటన్నిటిని మనం సమర్థించవచ్చు. “నాకు నచ్చినట్లుగా నేను చేస్తున్నాను” అని చెప్పకపోయినా, సాకులు చెప్తూ మన స్వంత మార్గంలో పనులు చేయడం ద్వారా మనం ఆ విషయాన్ని వ్యక్తపరుస్తాము.
ఒకానొక సందర్భంలో, రక్షకుడు తన సిద్ధాంతాన్ని ప్రకటిస్తున్నప్పుడు, కొంతమంది వ్యక్తులు, ప్రత్యేకించి స్వీయ-నీతిమంతులైన పరిసయ్యులు, ఆయన సందేశాన్ని తిరస్కరించారు మరియు వారి వంశం దేవుని దృష్టిలో వారికి విశేషాధికారాలను ఇస్తుందని సూచిస్తూ, వారు అబ్రాహాము సంతానమని ధైర్యంగా ప్రకటించారు. ఆ మనస్తత్వం వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొనేలా మరియు రక్షకుడు బోధిస్తున్న వాటిని నమ్మకుండా ఉండేలా చేసింది. యేసు పట్ల పరిసయ్యుల ప్రతిస్పందన, వారి అహంకార వైఖరి రక్షకుని మాటలకు మరియు దేవుని మార్గానికి వారి హృదయాలలో చోటు లేకుండా చేసిందనడానికి స్పష్టమైన రుజువు. దానికి జవాబుగా, వారు అబ్రాహాము యొక్క నిజమైన నిబంధన సంతానమైతే, వారు అబ్రాహాము క్రియలను చేస్తారని, ప్రత్యేకించి అబ్రాహాము యొక్క దేవుడు వారి ముందు నిలబడి ఆ క్షణంలోనే వారికి సత్యాన్ని బోధిస్తున్నాడని పరిగణనలోకి తీసుకుంటారని యేసు తెలివిగా మరియు ధైర్యంగా ప్రకటించారు.
సహోదర సహోదరీలారా, మీరు చూడగలిగినట్లుగా, “నాకు నచ్చింది చేస్తాను” అని సమర్థించుకోవడం మరియు దానికి విరుద్ధంగా “ఎల్లప్పుడూ ప్రభువుకు ఇష్టమైనది” చేయడం అనేది మన కాలానికి మాత్రమే ప్రత్యేకమైన కొత్త ధోరణి కాదు. ఇది శతాబ్దాలు దాటిన పాత మనస్తత్వం మరియు తరచుగా జ్ఞానులను గ్రుడ్డివారిగా చేస్తుంది మరియు దేవుని పిల్లలలో అనేకమందిని గందరగోళానికి గురి చేసి, అంతమొందిస్తుంది. ఈ మనస్తత్వం, నిజానికి, విరోధి యొక్క పాత కుయుక్తి; ఇది నిజమైన మరియు నమ్మకమైన నిబంధన మార్గం నుండి దేవుని పిల్లలను జాగ్రత్తగా దూరంగా నడిపించివేసే మోసపూరిత మార్గం. జన్యుశాస్త్రం, భౌగోళిక శాస్త్రం మరియు శారీరక, మానసిక సవాళ్ళు వంటి వ్యక్తిగత పరిస్థితులు మన ప్రయాణాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ, నిజంగా ముఖ్యమైన విషయాలలో, మన జీవితం కోసం ప్రభువు సిద్ధం చేసిన నమూనాను అనుసరించాలా వద్దా అనేదానిని ఎంచుకోవడానికి మనకు స్వేచ్ఛ గల అంతర్గత స్థలం ఉంది. నిజంగా, “మనం జీవించవలసిన మార్గాన్ని ఆయన చూపారు మరియు ప్రతిది ప్రత్యక్షంగా [చూపబడింది].”
క్రీస్తు శిష్యులుగా, ఆయన తన మర్త్య పరిచర్య సమయంలో మనకు బోధించిన ప్రకారం జీవించాలని మనం కోరుకుంటాము. మనం ఆయన చిత్తాన్ని మరియు ఆయనకు ఇష్టమైనవన్నీ చేయాలని కోరుకోవడమే కాకుండా ఆయనను అనుకరించడానికి ప్రయత్నిస్తాము. మనము చేసిన ప్రతీ నిబంధనకు యథార్థంగా ఉండేందుకు మరియు “దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట” వలనను జీవించుటకు మనం ప్రయత్నించినప్పుడు, లోకం యొక్క పాపాలు మరియు తప్పులకు—తత్వశాస్త్రం మరియు ఆ అత్యంత విలువైన ముత్యాల నుండి మనల్ని దూరం చేసే సిద్ధాంతం యొక్క తప్పులకు బలి కాకుండా మనం రక్షించబడతాము.
దేవునిపట్ల అటువంటి ఆధ్యాత్మిక విధేయత క్రీస్తు యొక్క విశ్వాసులైన శిష్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే దాని చేత నేను వ్యక్తిగతంగా ప్రేరణ పొందాను, ఎందుకంటే వారు ప్రభువుకు నచ్చిన మరియు ఆయన దృష్టిలో సంతోషకరమైన పనులను చేయడానికి ఎంచుకున్నారు. సువార్తసేవకు వెళ్ళడం గురించి సందిగ్ధంగా ఉన్న ఒక యువకుడు సంఘములోని ఒక సీనియర్ నాయకుడు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని మరియు సువార్తికునిగా సేవ చేసిన పవిత్రమైన అనుభవాన్ని పంచుకోవడం విన్నప్పుడు, వెళ్ళి ప్రభువును సేవించడానికి అతను ప్రేరణ పొందడం గురించి నాకు తెలుసు.
ఇప్పుడు తిరిగి వచ్చిన సువార్తికునిగా ఉన్న ఈ యువకుడు తన మాటల్లో ఇలా అన్నాడు: “రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడి సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు, నా పట్ల దేవుని ప్రేమను నేను అనుభవించగలిగాను, ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలని నేను కోరుకున్నాను. నా భయాలు, సందేహాలు మరియు ఆందోళనలను లక్ష్యపెట్టకుండా నేను సువార్తసేవ చేయాలని ఆ క్షణంలో నాకనిపించింది. ఆయన పిల్లల కొరకు దేవుని ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఈ రోజు, నేను కొత్త వ్యక్తిని; ఈ సువార్త నిజమని మరియు యేసు క్రీస్తు యొక్క సంఘము భూమిపైన పునస్థాపించబడిందని నేను సాక్ష్యం కలిగియున్నాను.” ఈ యువకుడు ప్రభువు మార్గాన్ని ఎంచుకున్నాడు మరియు ప్రతీ విషయంలోనూ నిజమైన శిష్యునికి ఆదర్శంగా నిలిచాడు.
విశ్వాసం గల ఒక యువతి తాను పనిచేసిన ఫ్యాషన్ కంపెనీ వ్యాపార విభాగానికి సరిపోయేలా అసభ్యకరమైన దుస్తులు ధరించమని అడుగబడినప్పుడు తన ప్రమాణాలతో రాజీ పడకూడదని నిర్ణయించుకుంది. ఆమె శరీరం మన పరలోక తండ్రి నుండి వచ్చిన పవిత్రమైన బహుమానం అని మరియు ఆత్మ నివసించే ప్రదేశం అని అర్థం చేసుకోవడం వలన, ఆమె ప్రపంచంలోని ప్రమాణాల కంటే ఉన్నతంగా జీవించడానికి ప్రేరేపించబడింది. ఆమె యేసు క్రీస్తు యొక్క సువార్త సత్యం ద్వారా జీవించడాన్ని చూసినవారి విశ్వాసాన్ని పొందడమే కాకుండా, ఒక్క క్షణంపాటు ప్రమాదంలో పడిన తన ఉద్యోగాన్ని కూడా ఆమె కాపాడుకుంది. లోకానికి నచ్చిన దానికంటే ప్రభువు దృష్టిలో సంతోషకరమైన దానిని చేయడానికి ఆమె సుముఖత, కష్టమైన ఎంపికల మధ్య ఆమెకు నిబంధన విశ్వాసాన్ని ఇచ్చింది.
సహోదర సహోదరీలారా, మన రోజువారీ ప్రయాణంలో ఇలాంటి నిర్ణయాలను మనం నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటాము. మన జీవితంలో మనల్ని మనం దేవునికి సమర్పించుకునే సామర్థ్యానికి ఆటంకం కలిగించే శారీరక బలహీనతల ఉనికిని గుర్తించడానికి మరియు చివరికి మన స్వంత మార్గాన్ని కాకుండా ఆయన మార్గాన్ని అవలంబించాలని నిర్ణయించుకోవడానికి ఆగి, నిజాయితీగా, సౌమ్యమైన ఆత్మపరిశీలనను కొనసాగించడానికి ధైర్యంగా, సిద్ధంగా ఉన్న హృదయం అవసరం. మన శిష్యత్వానికి అంతిమ పరీక్ష, మన పాత స్వభావాన్ని వదులుకోవడానికి, కోల్పోవడానికి మరియు ఆయన చిత్తం మన చిత్తమయ్యేలా మన హృదయాన్ని, మన ఆత్మను దేవునికి సమర్పించడానికి మన సుముఖతలో కనుగొనబడుతుంది.
“ప్రభువుకు ఇష్టమైనది” మరియు “మనకు పనికివచ్చేది” రెండూ ఒకేలా మారే వాటిని మనం ఎల్లప్పుడూ చేయడం నుండి కలిగే ఆనందాన్ని మనం కనుగొన్నప్పుడు, మర్త్యత్వం యొక్క అత్యంత అద్భుతమైన క్షణాలలో ఒకటి సంభవిస్తుంది! నిస్సందేహంగా మరియు తిరుగులేకుండా ప్రభువు చిత్తాన్ని మన చిత్తంగా చేసుకోవడానికి ఘనమైన, వీరోచితమైన శిష్యత్వం అవసరం! ఆ ఉన్నతమైన క్షణంలో, మనం ప్రభువుకు అంకితం చేయబడతాము మరియు మన చిత్తాలను పూర్తిగా ఆయనకు అప్పగిస్తాము. అటువంటి ఆధ్యాత్మిక విధేయత, చెప్పడానికి అందమైనది, శక్తివంతమైనది మరియు రూపాంతరం చెందునది.
మన జీవితంలో ప్రభువు చిత్తాన్ని అనుసరించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత విలువైన ముత్యాన్ని—పరలోక రాజ్యాన్ని మనం కనుగొనగలుగుతామని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. మనలో ప్రతీఒక్కరం, మనం సిద్ధంగా ఉన్నప్పుడు, మన పరలోక తండ్రి మరియు రక్షకుడైన యేసు క్రీస్తుతో, “మీకు నచ్చినదే నాకు నచ్చుతుంది” అని నిబంధన విశ్వాసంతో ప్రకటించగలగాలని నేను ప్రార్థిస్తున్నాను. రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామములో నేను ఈ విషయాలు చెప్తున్నాను, ఆమేన్.